"ఏమీ కాదులే అనిపిస్తున్నా... మనసులో ఏదో ఒక మూలన భయం. ఆరేళ్లయింది కదా... మళ్ళీ ఇప్పుడెందుకు అలా జరుగుతుందిలే..." లాంటి అంతూ, పొంతూ లేని ఆలోచనలతో మొన్న రాత్రి కలతలోనే నిద్రపోయా. పొద్దున్నే మెలకువ వచ్చేసరికి అంతా ప్రశాంతంగా, రోజులాగే ఉంది. హమ్మయ్య...! ఏమీ జరగలేదు అన్న నిశ్చింతతో రోజువారీ పనుల్లో మునిగిపోయాను.
శనివారంనాడు ప్రజలంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకున్నారు కానీ ఏదో మూల కాస్తంత భయంతోనే ఉన్నారు. అయితే... ఓ ఆరేళ్ల క్రితం క్రిస్మస్ పండుగను సంబరంగా జరుపుకున్న వీరికి భయం ఆనవాళ్ళే లేవు. ఎందుకంటే, ఆ మరుసటి రోజున ఓ పెను ప్రళయం సంభవించి, తమ జీవితాలను అతలాకుతలం చేస్తుందన్న బెంగ వారికి లేదు కాబట్టి...!
సో.. మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందనే అనుకుంటాను. నేను చెప్పేది 2004లో కడలి విలయతాండవం చేసి సునామీగా విరుచుకుపడ్డ దుర్ఘటన గురించి. ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షినైన నేను ఆ జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకువచ్చే చిన్న ప్రయత్నం...!
ఆరోజు డిసెంబర్ 26వ తేదీ ఆదివారం. తెలతెలవారుతుండగా, బాగా నిద్రలో ఉండగానే మంచాన్ని ఎవరో కాస్త కదిలించినట్లు అనిపించినా మగతగా ఉండటంతో అలాగే నిద్రపోయాను. కానీ, మా ఆయన మాత్రం లేచి కూర్చుండిపోయారట. 7 గంటలకు నిద్రలేచి కాఫీ తాగిన తరువాత ఆయన మాంసం కొనుక్కొచ్చేందుకు బజారుకు వెళ్ళారు.
నేను ఇంట్లో పనుల్లో మునిగిపోయాను. ఇంతలో బయటినుంచి ఎవరివో అరుపులు, కేకలు... ఆదివారం కదా... జనాలు బాగా ఉత్సాహంగా ఉన్నట్లున్నార్లే అనుకుంటూ, అలాగే ఉండిపోయాను. అయితే మళ్ళీ అవే అరుపులు, కేకలు.. బయట బాల్కనీలోకి వచ్చే చూస్తే... "కడల్ పొంగుదు" (సముద్రం పొంగుతోంది) అంటూ ఉరుకులు, పరుగులతో పారిపోతున్నారు.
సముద్రం పొంగటం ఏంటబ్బా... అనుకుని చూద్దును కదా...! మా ఇంటి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు గుండా వందలాదిమంది జనాలు తడిచి ముద్దయిపోయి, చేతికి అందినదల్లా పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇంకాస్త పరికించి చూస్తే... ఇంటికి ఎదురుగా కాస్తంత దూరంగా, సముద్రానికి దగ్గరగా ఉండే పట్టినంబాక్కం బస్ డిపో నీటితో మునిగిపోవడంతో... బస్సులపైకి ఎక్కి హాహాకారాలు చేస్తోన్న జనాలు చేతులు పైకెత్తి నిల్చోనుండటం స్పష్టంగా కనిపించింది.
నాకయితే ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతలో ఆయన గుర్తొచ్చారు. అయ్యో..! ఇప్పుడెలా ఆయనకు విషయం తెలుసో, లేదో.. నా పరిస్థితి ఏంటి...? మాంసం కొట్టు దగ్గరున్నారో, ఇంకెక్కడికయినా వెళ్ళారో అంటూ కంగారు పడిపోయాను. నైటీలో ఉన్న నేను డ్రస్ కూడా మార్చుకోకుండా, పైన టవల్ కప్పుకుని ఇంటికి తాళం వేసి ఆయన కోసం పరుగులు పెట్టాను.
ఇంతలో నాకు ఎదురుగా ఆయన కూడా పరుగులు పెడుతూ వస్తూ కనిపించారు. ఇద్దరం ఇంటికి వచ్చి, ముఖ్యమైన కాగితాలు, నగలు, డబ్బు, రెండు జతలు బట్టలు ఓ చిన్న సంచిలో సర్దుకుని బాల్కనీలో నిల్చున్నాం. ఎదురుగా సముద్రం గాండ్రింపు, పెద్ద పెద్ద అలలు బాగా కనిపిస్తున్నాయి.
ఇక జనాల సంగతయితే చెప్పనక్కర లేదు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని ఆ పరిస్థితిలో, ఆప్తులను కోల్పోయి తేరుకున్న మిగిలినవారు కట్టుబట్టలతో, రోదనలతో వేలాదిమందిగా మందవెల్లి బస్ డిపో వైపు పరుగులు తీస్తున్నారు. మేం ఆ పరిస్థితిని చూశాక కాళ్ళూ, చేతులూ ఆడటం లేదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో అలాగే నిల్చుండిపోయాం.
కరెంటు లేదు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. చుట్టూ ప్రపంచమంతా ఏం జరుగుతోందో, ఎందుకలా అయ్యిందో ఏమీ తెలియదు. ఇంతలో మావారి ఫ్రెండ్స్ నుంచి ఫోన్.. వాళ్ళు చెన్నైకి దూరంగా ఉండే వేరే బంధువుల ఇంటికి వెళ్తున్నారట, మీరు కూడా వస్తారా అని...? కానీ మా ఆయన ఎందుకోగానీ రానని చెప్పేశారు.
అలా నిల్చుని, గాభరాగా చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఒకామె బాగా తడిసిపోయి ఉంది. చంకలో చిన్నబిడ్డ, చేతితో ఇంకొక బిడ్డను పట్టుకుని గబగబా మెట్లు ఎక్కి మా బాల్కనీలోకి వచ్చి ఆగిపోయింది. కాసిన్ని మంచినీళ్లు ఇవ్వమని అడిగింది. నీళ్లు ఇచ్చాక కాస్త తేరుకున్న ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఏమయింది అని అడిగితే... తన ఇంకో బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోయిందని, తన భర్త కనిపించడం లేదని గుండెలు బాదుకుంటూ చెప్పింది.
ఆమెతో కలిసి ఏడవటం తప్పించి, ఏమీ చేయగలను. ఊరుకోమ్మా, మీ ఆయన వస్తాడులే అంటూ ఓదార్చాను. పిల్లాడికి కాస్తంత అన్నం పెట్టమని అడగటంతో పెట్టాను. నేను వీరిని ఇలా పరామర్శిస్తూ ఉన్నానో, లేదో మా ఆయన కనిపించటం లేదు. ఎప్పుడు కిందికి దిగి వెళ్ళిపోయారో, ఏమో... తెలియదు. కనిపించలేదు. ఇల్లు తాళం వేసి, ఏడుస్తూ ఆయన్ను వెతుక్కుంటూ అటూ, ఇటూ పరుగులెత్తాను.
మా ఇంటికి ఎదురుగా సముద్రానికి దగ్గర్లో ఉండే ఎయిర్‌టెల్ బిల్డింగ్స్ వైపు నుండి సైకిల్‌పై వస్తూ కనిపించారాయన. చూడగానే దగ్గరికెళ్లి బాగా తిట్టిపోశాను. నీళ్ళు ఎంతదాకా వచ్చాయో, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను. నీళ్ళు బిల్డింగ్స్‌కు ఇవతలదాకా నడముల్లోతు పైకే వచ్చేశాయి. నీళ్ళు బాగా వేడిగా, కుత కుత ఉడుకుతున్నట్లున్నాయని చెప్పాడు. "అయినా ఇంకా పెద్ద పెద్ద అలలు వస్తూనే ఉన్నాయి కదా.. నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా అలా వెళ్తే ఎలాగండీ" అంటూ ఆయన్ని కోపగించుకున్నాను.
ఎలాగోలా మళ్ళీ ఇల్లు చేరాము. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న జనాలను చూస్తూ... మా ఇంటిదాకా నీళ్ళు రావులే అనుకుంటూ అలాగే బాల్కనీలోనే ఉండిపోయాము. సాయంత్రం మూడు, నాలుగు గంటల దాకా జనాలు అలా పరుగులు పెడుతూ, ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. మా బిల్డింగ్‌లో కూడా జనాలంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. మేము, కింద ఇంట్లో ఒకరిద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు.
"మా ఆయనకు వైరాగ్యమో, ధైర్యమో చెప్పలేను కానీ... ఏదయితే అది అయింది. ఎంతమంది పోయారో తెలియదు. అయినా ఎవరూ, దేన్నీ ఆపలేము. మనము ఎక్కడికీ వెళ్ళవద్దు, ఇక్కడే ఉందాం.. ఏమీ జరగదులే" అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఎక్కడికీ వెళ్ళకుండా అలాగే ఉండిపోయాము. చీకటి పడింది. కరెంటు లేదు. చుట్టూ చిమ్మ చీకటి, జనాల గొంతు ఏ మూల కూడా వినిపించలేదు. సముద్రం గాండ్రింపు తప్ప మరే శబ్దమూ లేదు. భయం భయంగా ఆరోజు రాత్రి గడచిపోయింది.
మరుసటి రోజుగానీ విషయాలు తెలియలేదు. ఇండోనేషియా సముద్రంలో వచ్చిన భారీ భూకంపం వల్ల సునామీ వచ్చిందని, అందువల్లనే సముద్రం అతలాకుతలమై తీరప్రాంతాలపై విరుచుకుపడిందని తెలిసింది. సునామీ తరువాతి విషయాలు, జరిగిన ప్రాణ నష్టం అన్నీ మీ అందరికీ తెలిసిందే...!
ఆరోజు మా ఇంటి ఎదురుగా ఉన్న పట్టినంబాక్కం జాలర్ల కుటుంబాలే సునామీలో ఎక్కువగా నష్టపోయాయి. వందలాది మంది చనిపోయారు. పట్టినంబాక్కం చెరువులోనే దాదాపు 200 పైబడి శవాలను వెలికితీసినట్లు తరువాతి రోజు వార్తల్లో చూశాము. చెన్నై తీర ప్రాంతాలలో సంభవించిన సునామీ వల్ల ఎక్కువగా నష్టపోయిన ప్రాంతం పట్టినంబాక్కమే. ఇక్కడే ఎక్కువమంది చనిపోయారు, అప్పటి సీఎం, సోనియాగాంధీ లాంటి వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించి వెళ్ళారు కూడా...!
సునామీ వచ్చిన ఓ వారం రోజుల తరువాత మా ఇంటి పక్కనే ఉండే మైలాపూర్ మార్కెట్టుకు నేనూ, పక్కింటామె కలిసి కూరగాయలు కొనేందుకు వెళ్లాం. మా పక్కనే కూరగాయలు కొంటున్న ఒకామెకు ఎవరో వచ్చి, ఏదో చెప్పారు. అంతే ఆమె ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. ఏమైందని పక్కవాళ్లను ఆరాతీస్తే సునామీ రోజున తప్పిపోయిన తన కొడుకు శవం సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిందట. అది తెలిసే ఆమె అలా ఏడుస్తూ వెళ్లిందని చెప్పారు. ఆ తరువాత నెలా, రెండు నెలలదాకా శవాలు అలా బయటపడుతూనే ఉన్నాయి.
ఆ తరువాత సంఘటనలు, జ్ఞాపకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆనాటి దుర్ఘటనకు ఆనవాళ్లుగా జాలర్ల నివాసాలు విధ్వంసమై మొండిగోడలుగా మిగిలి పలుకరిస్తున్నాయి. సునామీలో నష్టపోయిన కుటుంబాల వారికి ఆయా ప్రభుత్వాలు ఎంతమేరకు సాయం చేసాయన్నది ఈనాటికీ సముద్రం ఒడ్డున బ్రతుకును వెళ్లదీస్తున్న జాలర్లను అడిగితే వారి దగ్గరనుంచీ కన్నీళ్లు, ఆగ్రహమే సమాధానాలుగా రాక మానవు. చేపలను బుట్టల్లో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్మే ఒకామెను నేను ఇదే విషయం అడిగితే...ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా.. మళ్లీ ఈ కడలితల్లే తమకింత తిండి పెడుతోందని, అన్నం పెట్టే అమ్మే ఓ దెబ్బ కొట్టిందని అనుకుంటాం తల్లీ అని అంది.
ఇక ఆ విషయాలను పక్కనబెడితే... ఈనాటికీ మేము అదే ఇంట్లో ఉన్నాము. సునామీ వచ్చిన మరుసటి సంవత్సరం ఉన్న భయం ఆ తరువాత, తరువాత కొద్ది, కొద్గిగా తగ్గిపోయింది. సునామీ మళ్లీ ఇప్పట్లో రాదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, ఆ భీతి మాత్రం ఇప్పటికీ లోలోపలే వెంటాడుతూనే ఉంది.
శిఖరం
20 hours ago
26 comments:
ఏం చెప్పాలో తెలీడం లేదండి :-( ఆ పరిస్థితులను ఊహించడానికే భయమేస్తుంది.
అప్పట్లో ఒక నెల రోజులు నన్ను వెంటాడింది.ఊహ తెలిసాక ఇదే ఘోరమైన విపత్తుగా నాకు అనిపించింది.ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఇంతలా కదిలిపోలేదు.సముద్రపు హోరు వింటుంటే ఇప్పటికి ఆ నాటి ఘోరం కళ్ళముందుమెదుల్తుందిమీ కుటుంబ సభ్యుల ధైర్యానికి అభినందించాల్సిందే .
నాక్కూడా ఏం చెప్పాలో తెలీట్లేదండీ! నిజంగా మీరప్పుడు ఎలా ఫీలయ్యుంటారో ఊహించడానికే చాలా బాధగా ఉంది. ఇంకా ఎంతమందిని ఎంత భయంకర జ్ఞాపకాలు వెంటాడుతున్నాయో! :(
వేణుగారూ, చిన్నిగారూ, మధురవాణిగారూ... సునామీ అనుభవాల గురించి విన్నా, చదివినా ఎవరి పరిస్థితి అయినా అంతే.. ముందు నోటమాట రాదు.. ఏం చెప్పాలో తెలియదు.. దూరంగా ఉండి విషయాలు తెలుసుకున్నవారి పరిస్థితే అలా ఉంటే.. దగ్గరే ఉండి జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూసినవారి పరిస్థితిని ఊహించాలంటేనే భయమేస్తుంది.
కళ్లముందే అయినవారిని, ఉన్న ఇళ్లను పోగొట్టుకుని కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడ్డవారిని.. శవాలనన్నింటినీ సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలను తల్చుకుంటేనే నాకు ఒంట్లో వణుకు వచ్చేస్తుంది.. అలాంటి భయంకరమైన అనుభవాలను నాలాంటి ఎందరికో మిగిల్చింది సునామీ... అది మళ్లీ రాకుడదని కోరుకోవటం మినహా ఇంకేం చేయగలం...
ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయె గాని తగ్గటం లేదండి. తలుచుకున్నప్పుడల్లా విపరీతమైన బాధనిపిస్తుంది. పాపం మీ ఇంటికొచ్చినావిడ ఏమయ్యిందండి.
జయగారూ... మా ఇంటికొచ్చిన ఆవిడ ఆ తరువాత ఏమయ్యిందో తెలియదండీ.. మా ఆయనను వెతుక్కుని తిరిగీ ఇంటికొచ్చేసరికి ఆవిడ మా ఇంటిదగ్గర లేదు. ఎక్కడికెళ్లిందో తెలియదు. ఆమెను అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు కాబట్టి ఆమెవరో తెలియదండీ..
చాలా చేదు ఙ్ఞాపకాన్ని పంచుకున్నారు :(
చదువుతున్నంతసేపూ మనసంతా అదోలా అయిపోయిందండీ. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేము కదా. ఏంటో మాటలు రావట్లేదు:(
అపర్ణగారూ... నిజంగా లైఫ్‌లో అదో పెద్ద చేదు జ్ఞాపకమేనండీ...
అక్క ఇప్పుడే మీ బ్లాగ్ గురించి రాద్దాం అని కూర్చుని మొత్తం చదువుతున్న ఈ పోస్ట్ నన్ను కంటతడి పెట్టించింది.
సునామీ అనే పదం వింటేనే నాకు బాధగా, మనసంతా అల్లకల్లోలంగా తయారవుతుంది శైలా.. ఆనాటి అనుభవాలు అలాంటివి. కలవరపెట్టడమేగాక, కంటతడి పెట్టిస్తాయి...
ప్రియమైన శోభ గారు,
నిన్న మీ ఆర్టికల్ చదివానండి. ఫోటోలు కూడా! కళ్లకు కట్టినట్లు వ్రాసారు. నాకు చాలా నచ్చింది. నిజంగా ధైర్యానికి మిమ్మల్నీ, రాజు గారినీ చెప్పుకోవాల్సిందేనండి. ఎందుకంటే - మరో అల వస్తుందో రాదో తెలీని స్థితి, వస్తే ఎంతటి అల వస్తుందో తెలియని స్థితి కదా? మొత్తంగా అసలేం జరిగిందో కూడా అప్పటికి గందరగోళంగానే ఉంటుంది. అయినా ఇంట్లోనే ఉండిపోయారంటే నిజంగా మీరిద్దరూ ధైర్యవంతులు! మీ ఆర్టికల్ చదివాక మా వారూ ఇదే మాట అన్నారు.
నిజానికి ప్రకృతి విలయతాండవం... విధ్వంసపూరితమూ, విషాదకరమూ అయినా, ఆ భీకర దృశ్యం చూడటానికి కూడా అదృష్టం ఉండాలండి. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడి విశ్వరూపం వంటిది.
"అనేక వేల ఉదరాలతో, బాహువులతో, ముఖాలతో ఉన్న నీ విశ్వరూపమును చూచి నాకు దిక్కులు తెలియకున్నవి. భయంతో శరీరం వణుకుతున్నది. ప్రభో! శాంతించి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించు" అంటాడు గీతలో అర్జునుడు.
అంతటి యోధుణ్ణే భయోత్పాతానికి గురిచేసే విశ్వరూపాన్ని... భగవంతుడు చూపినా, ప్రకృతి చూపినా ఒకటే! నిజానికి సముద్రం మీద తుఫాను చూడాలని నాకు ఆశ! సముద్రమంటే నాకు బాగా ఆకర్షణ, అదే సమయంలో భయం కూడా!
నేను నేల మీది తుఫాను చూశాను 1991లో! అప్పటికి మా బ్యాటరీ ఫ్యాక్టరీలో ఉన్నాము. చుట్టూ తోట, పదివేల చదరపు అడుగుల పక్కా బిల్డింగ్ లో ఉన్నప్పటికీ.. ఊగిపోతూ కూలిపోతున్న చెట్లు, స్థంభాలు!
మా ఎదురుగా ఉన్న మరో ఫ్యాక్టరీ వాళ్ళ రేకుల షెడ్డు దాదాపు 3,000 చ. అడుగులుంటుంది. అంత పెద్ద పైకప్పు గాలిలో ఆకులా ఎగిరొచ్చి పడింది. చూస్తుండగా ఆలిండియా రేడియో స్టేషన్ వాళ్ళ టవర్ పేకమేడలా కుప్పకూలిపోయింది.
వర్షపు నీరు మేఘాల నుండి రాలేదు. సముద్రపు నీరులా ఉప్పగా ఉంది. సముద్ర తీరం నుండి మా ఫ్యాక్టరీ రేడియల్ గా 40కి.మీ.లు ఉంటుంది. అంత దూరం నుండి గాలి ఎగరేసుకున్న ఉప్పనీరు వర్షంలా కురిసింది. అసలా రాత్రి తెల్ల వారుతుందా అనిపించింది.
స్కూలు చదువుల్లో ఉండగా దివిసీమ ఉప్పెన తెలుసు. పాతిక వేల మంది దాకా చనిపోయారని అధికారిక లెక్కలు చెప్పినా, దాదాపు లక్షమందిని బలిగొన్న ఉత్పాతం అది!
ఏమైనా, సునామీని చూడటం అనేది అసాధారణమైన అనుభవం అనుకుంటాను నేను. మీరా వ్యాసం చాలా చక్కగా వ్రాసారు.
మా పాప గీతకు మీరు ముందే తెలుసండి. నిన్ననే మరో కథ వ్రాసింది. కొత్తపల్లి వాళ్ళు బొమ్మ ఇచ్చి, దానికి కథ వ్రాయమంటారు. లలిత (తెలుగు4కిడ్స్) గారు బొమ్మ ఇస్తారు. ప్రచురింపబడినాక మీకు లింకు పంపుతాను.
ఇప్పటి కింతే సంగతులండి. పేద్ద మెయిల్ వ్రాసేసాను! :)
ప్రేమతో,
ఆదిలక్ష్మి.
ఇవ్వాళ్లటి తేదీతో కామెంట్ పోస్ట్ అవటాన్ని చూసి కంగారు పడకండి. ఆదిలక్ష్మిగారు నాకు Thu, Oct 28, 2010 at 9:01 AM న పంపిన మెయిల్ ఇవ్వాళ గుర్తుకువచ్చి, తన జ్ఞాపకాలను పొందుపరచుకోవాలని నా పోస్టులో పదిలపర్చాను. అంతే... మిత్రులందరూ గమనించ ప్రార్థన.
Adi lakshmi garu ela vunnaru? hope she is recovering
అనానిమస్‌గారు.. ఆదిలక్ష్మిగారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారండీ. ఆమెకు భర్త పోయిన విషయం చెబితే తాను కూడా చనిపోతాననీ, ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామనీ అంటున్నారట. ఆమెని ఆమె సోదరులు, బంధువులు అనుక్షణం అంటిపెట్టుకుని చూసుకుంటున్నారు. కానీ, ఆమె ఎప్పుడు ఏం చేసుకుంటుందోనని చాలా భయంగా ఉంటున్నారు. ఆమె గురించి ఆలోచించే అందరి పరిస్థితి కూడా ఇదేనండి.
Thnaks for the update. Please keep posting the updates about her.(no where I can see the updates)
--Suman
తప్పకుండా సుమన్ గారు.. వీలైతే మీ ఈ-మెయిల్ ఐడీ ఇవ్వండి.. నాకు తెలిసిన విషయాలను మీకు నేరుగా మెయిల్ చేస్తాను.
నా మెయిల్ ఐడీ : shobharaju.b@gmail.com
నైస్ పోస్ట్..
శోభా రాజ్ !
మీ అనుభవంలాంటిదే, నాదీనూ ,అది 1979 నవంబర్ 5 అని గుర్తు [కరెక్ట్ తేదీ గుర్తులేదు.] స్కూల్ నుండీవచ్చి వంటపూర్తిచేసి మేము సాయంకాలం షాపింగ్ కెళ్ళి బట్టలుకొనితెచ్చాము. తెల్ల పూల చీర బావుందని మావారుకొంటే అది ఇంటికివచ్చి కట్టానుకూడా.రాత్రి పిల్లలిద్దరికీ అన్నంపెట్టి మేమూ తిని పడుకున్నాం.అప్పుడు మేము కావలిలొ - [తుఫాన్ల పుట్టిల్లు] ఒక పెంకుటింట్లో అద్దెకు ఉండేవారం ,మా పాపకు 6ఏళ్ళూ, బాబుకు 4ఏళ్ళు వయస్సు. ఒక రాత్రి అయ్యాక వాన ప్రారంభమై ఝడివానగా , గాలివానగా మారి ఉధృతమైంది.కిటికీలూ తలుపులూ అన్నీమూసి నా పెంకుటిల్లుకావటాన బయటి గాలు ఉధృతికి గాలి దయ్యపు ఈలలు వేస్తూ భయపెట్టి విలయతాండవం చేస్తుండగా , తలుపులు గాలికి ఊగి ఘడిఊడి వచ్చేలాఉంది టేబుల్ తలుపులకు అడ్డుపెట్టి ఇద్దరమూ నెట్టిపట్టుకుని నిల్చున్నాము.ఏమీతెలీని పిల్లలు ఆమాయకంగా గాఢనిద్రలో ఉన్నారు . పైకప్పు పెంకులు గాలికి విమానంలా లేచి క్రిందకు పడుతున్నాయి.అవన్ని తలపై పడుతున్న భావన.భగవంతుని స్మరిస్తూ తలుపులు ఊడిరాకుండా గట్టిగా నెట్టిపట్టుకుని నిల్చునే ఉన్నాం.పెంకులన్నీ లేచి వాన లోపల పడటం, ఉరుములూ మెరుపులూ ఇంట్లోకే రావటం చూసి" భగవాన్ నేను 32సం కాలమన్నా బ్రతికాను, నాపిల్లలకు ఆయుర్దాయం ఇంతే ఇచ్చావా స్వామీ ! పోని నాప్రాణం తీసుకుని నాపిల్లలనూ , వాళ్ళను చూడను మావారినీ బ్రతికించు " అని కనిపించని దేవుని మనస్సులోనే ప్రార్ధిస్తూ ఉన్నాను.తుఫాన్ కావలి వద్ద తీరందాటే విలయ తాండవం అది.వానపడని ఒకే ఒక మూలకు మంచం నెట్టి నిద్రలో ఉన్న పిల్ల లిద్దరినీ దానిపై పడుకోబెట్టి దుప్పట్లుకప్పి ఇంట్లోకి వచ్చిన వాననీటిలోనే నిల్చుని నిజంగా మరణానికి ఎదురు చూస్తున్నట్లే ఎంత సేపు నిల్చుని ఉన్నామో తెలీదు , ఎంత రాత్రి గడిచిందోతెలీదు,లైట్లు లేవు ఉన్న ఒక్క బ్యాటరీలైట్ పిల్లలు లేస్తే భయపడకుండా వేయను దావి ఉంచాం. ఊగి ఊగి పెంకులన్నీ లేపి, ప్రాణాలను కడగట్టించి ఎప్పుడు వాన గాలీ ఆగాయోతెలీదు , అలసిపోయి పిలల్లపక్కన చెరోవేపూ నడుంవాల్చాం . ఎంతసేపైందో తెలీదు , ఎవరోవచ్చి తలుపులు బాదు తుంటే మెలకువ వచ్చింది. తలుపు సందుల్లోచీ ఎండపొడపడుతున్నది.లేచి కళ్ళునులుముకుంటూ తలుపుతీయగానే ఒక గుంపు బయట నిల్చుని వింతగా మాఇంట్లోకి చూస్తూ " మీరంతా బ్రతికే ఉన్నారా? పైన ఒక్క పెంకూలేదు ! ఎలా బ్రతికి ఉన్నారు ? అని అడిగారు. అదంతా భగవంతుని దయతప్ప వేరేంకాదు .పిల్లలను పడుకోబెట్టిన మూలతప్ప ఇంటిపై మరెక్కడాపెంకులేలేవు. ఆసంఘటన గుర్తు వస్తే గుండే జలదరిస్తుంది ఇప్పటికీ. అదంతా గుర్తు వచ్చిన ఉద్వేగం , అంతే , నీతో పంచుకోవాలనిపించి ఇదంతా వ్రాయించింది శోభా!.
చాలా వ్రాశానా? క్షమించాలి
ఆదూరి.హైమవతి.
అప్పుడు మేము చన్నై వెళ్ళేము కొద్ది రొజుల తర్వాత మా ద్రైవెర్ మురళీ ని ఎప్పుడూ అడగని నేను బీచ్ కి తీసుకెల్తావా అన్నా అంతే అస్సలు ఎకడికైనా వస్తానమ్మ కనీ బీచ్ కి వద్దు తీసుకె్ళ్ళను మా అంటూ తన తమిళ యాస లో ఖచ్చితంగా చెఫ్ఫేడు. తన స్నెహితుని కుటుంబం తన కళ్ళెదురుగానె సునామీ పాలైందట అందుకే బీచ్ చూస్తే నాకు అసహ్యం అమ్మా అంటూ ఎద్డ్చేసాడు ....నేను విశాఖ లో బీచ్ పక్కనె ఉన్న ఎ.ఎం.జి. బి.ఇ.డి .కాలెజ్ లొ పని చెసెదాన్ని అప్పుడు మరుసటి రోజు ప్రమాదమని సెలవి చ్చెసాము మధ్యలో వార్నింగులు విని ..్పాపం వెరే ఊళ్ళనుండి వచ్చిన పిల్లలు సముద్రం దగ్గర హాస్టల్ లో ఉండెవారు పాపం ఎక్కడికెళ్ళాలో తెలియక బిక్క మొహం పెట్టుకున్నారు ...ఇప్పటికీ ్బాధేస్తుంది తలచుకుంటే ....శోభా ఆ ్వేదనా సంద్రం వర్ననాతీతం అమ్మా...ప్రేమతో ..జగతి
శోభ గారూ...సునామీ గురించి మీరు రాసినంత ప్రత్యక్షానునుభవం ఇక్కడ వైజాగ్ లో నాకు లేకపోయినా, ఆ రోజు నేను కూడా మావారి కోసం చాలా గాభరా పడ్డాను. మావారు సెంట్రల్ స్కూల్లో టీచరు. సునామీ వచ్చేనాటికి ఆయన భీమిలీ ఐఎన్ ఎస్ కళింగా స్కూల్లో పని చేస్తున్నారు. వాళ్ల స్కూల్ కి ఎదురుగానే మహా సముద్రం. డిసెంబర్ 26 ఆదివారం...ఆవేళ సెలవే ఐనప్పటికీ ఆయన ఏదో స్పెషల్ డ్యూటీ ఉందని పొద్దున్న 6 గంటలకే వెళ్లిపోయారు. తెల్లవారుజామునే లేచి వంట చేసి ఆయనకి క్యారేజీ కూడా ఇచ్చేశాను. ఆయన వెళ్లాక ఆ రోజు సండే సెలవే కదా అని (అప్పటికి నేను లీడర్ పేపర్ లో చేస్తున్నాను) మళ్లీ పడుకున్నాను. 6.30 కి మా పెద్దమ్మాయి అమ్మా...నాకు ఏదో వణుకులా వచ్చింది...అంటూ తనకి ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఇప్పుడు కూడా వణుకు వస్తోందా అంటే, లేదమ్మా...ఒక్కసారి వచ్చి తగ్గిపోయిందంతే...అంది. ఐతే అది దానికి ఒంట్లో బాగాలేకపోవడం కాదనీ వచ్చింది భూకంపం అనీ తర్వాత కాస్సేపటికే తెలిసింది. మా బిల్డింగ్ లో పై ఫ్లోర్లలో ఉన్న వాళ్లంతా కిందకి దిగి వచ్చెస్తూ మమ్మల్ని ఇంకా ఇంట్లోనే ఉన్నారేమిటని అడిగాక మాకు సంగతి తెలిసింది. భూకంపం అని మేము గ్రహించనందుకు కూడా మేం కంగారు పడలేదు. నవ్వుకున్నాం. మాకు తెలిసింది చాలా తక్కువ. అంచేత మావారి కోసం కూడా గాభరా పడలేదు. ఐతే ఆ తర్వాత కాస్సెపటికే సునామీ వార్తలు రక రకాలుగా మొదలయ్యాయి. మా ఇంటికి సముద్రం చాలా దూరం. అంచేత ఏ భయమూ లేదు. కాని మావారో??? ఆయన అక్కడి నించి క్షేమంగా బైట పడి ఇంటికి రావాలి కదా...ఇంక వరుసగా నేనూ పిల్లలూ ఆయనకి ఫోన్ లు మొదలెట్టాం. ఆయన ముందు వెంటనే దొరికారు. ఇక్కడ మాకేమీ లేదు...గాభరా పడకండి పని ఐపోగానే వచ్చేస్తాను అన్నారు. ఐనా మాకు భయం...క్షణ క్షణానికీ సముద్రం పొంగిపోతోందంటూ వార్తలొస్తున్న కొద్ది మేం ఆయనకి ఫోన్ లు చెయ్యడం ఎక్కువైంది. ఆయన ఒక్కోసారి వెంటనే దొరికేవారు. ఒక్కోసారి లైన్ ఎంతకీ దొరికేది కాదు. అలాంటప్పుడు చూడాలి మా భయం....ఏమైతేనేం... మధ్యాహ్నానికల్లా ఆయన వచ్చేశారు...కాని సునామీ భూకంపం వార్తలు...పుకార్లు మాత్రం మర్నాడు రాత్రి దాకా తగ్గలేదు. ఆ పెను విలయం తలచుకుంటే ఇప్పటికీ న గుండె మెలి తిప్పినట్టుంటుంది.
@ Raj గారు ధన్యవాదాలండీ.
@ హైమవతి అమ్మా....
మీ అనుభవం చదువుతుంటే నిజంగా ఒళ్లు గగుర్పొడుస్తోంది. సునామీ బీభత్సాన్ని మేం కాస్త దూరం నుంచీ చూశామేకానీ, దాని బాధితులం కాము. కానీ మీరు స్వయానా అనుభవించిన ఓ భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు.
నిజంగా మీ అనుభవాన్ని చదివిని ఎవరి మనసైనా మూగవోతుంది. అంత పెద్ద ఆపదలో కూడా మీరు నిబ్బరంగా ఉంటూ, దేవుడిపై భారం వేసి పిల్లల్ని కాపాడుకున్నారంటే.. ఆ భగవంతుడే తల్లిదండ్రుల రూపంలో మన దగ్గర ఉన్నాడనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదు.
అంతటి గండం నుండి గట్టెక్కిన మీరు ఇన్నేళ్ల తరువాత ఆ జ్ఞాపకాలను ఎంతో ఉద్వేగపూరితంగా పంచుకున్నారు. అందుకు నేనే కృతజ్ఞతలు చెప్పాలి. పెద్దవారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా....
ధాత్రి అమ్మా...
సునామీ తరువాత... కుటుంబాలకు, కుటుంబాలను.. భార్యకు భర్తను, భర్తకు భార్యను, భార్యా భర్తలకు పిల్లలను... ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది మందిని తన కడుపులోకి లాక్కున్న సముద్రాన్ని చూడాలంటేనే ఎంతగానో భయం వేసేది.
అసలు ఓ రెండు మూడేళ్లదాకా అటువైపు వెళ్లాలంటేనే ఒంట్లో వణుకు వచ్చేసేది. స్నేహితుడి కుటుంబాన్ని తనతో తీసుకెళ్లిన సముద్రాన్ని చూస్తే మీ డ్రైవరుకు కోపం రావడం సహజమే. మీరన్నట్లుగా సునామీని తల్చుకుంటే ఆ ఆవేదన వర్ణనాతీతం..
గాయత్రిగారూ...
సునామీ గురించి ప్రత్యక్షానుభవం కలలో కూడా ఎవరికీ వద్దండి. ఆ వేదన భరించలేనిది. రాక్షస అలల తాకిడికి పెద్ద పెద్ద బిల్డింగులే తలొంచితే, ఇక మనుషులెంత చెప్పండి.
ఎంత వేగంగా అలలు వచ్చాయో, అంతే వేగంగా వెనక్కి వెళుతూ.. వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలోని సమస్తాన్ని తమతోపాటు సముద్రంలోకి లాక్కెళ్లాయి. వందలాది మందిని సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు హృదయవిదారకం. అవన్నీ తల్చుకుంటేనే మనసంతా అదోలా అయిపోతోంది.
వైజాగ్ తీర ప్రాంతం కూడా సునామీ ఉధృతికి గురైందే. అయినప్పటికీ మీవారు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం సంతోషించదగ్గ విషయం.
సునామీ పెను ఉపద్రవాన్ని మాత్రం తల్చుకుంటే ఎవరికైనా ఎప్పటికైనా మనసు మెలిపెట్టినట్లే ఉంటుందండీ.. ఇది నిజం.
No Words to say,
I have collected so many paper clippings regarding the Tsunami-04, seen so many fearful and deadly news and photos. this post makes me to recollect all those incidents.
@ అనానిమస్ గారూ..
సునామీ మాట ఎలాంటివారినైనా కదిలించేదే. సునామీ అనే మాట వింటేనే మొదటగా కాసేపు వణికిపోతానండి. అంతలా భయపడిపోయానంటే నమ్మండి. నా జీవితంలో అంతలా భయపెట్టిన సంఘటన మరోటి లేదు.. ఇప్పటికీ, ఎప్పటికీ భరించలేని బాధను ఇచ్చిన పెను దుర్ఘటన అది.. :(
Post a Comment