ఆఫీసుకెళ్లే దార్లో ఎప్పట్లాగే రోడ్డుపక్కగా ఉండే ఫ్లాట్‌ఫాంవైపు చూశాను. ఎప్పుడూ కనిపించే నడుం ఒంగిపోయిన ఓ మనిషి ఆరోజు కనిపించలేదు. ఆరోజే కాదు ఆ తరువాత ఓ నెల రోజులైనప్పటికీ ఆ మనిషి జాడే లేదు. పాపం ఏమై ఉంటుంది? అని అనుకోని రోజే లేదు.
ఆ దారి వెంబడి వెళ్తున్నప్పుడల్లా ఆ మనిషి గుర్తొస్తుంటాడు. అతడు నాకు కనిపించే ఆ స్థలం ఖాళీగా, బోసిగా, ఏదో లేని లోటుగా కనిపిస్తుంటుంది. అతనెవరో కాదు, ఫ్లాట్‌ఫాంపైన కూరగాయలను చిన్న చిన్న కుప్పలుగా పోసి అమ్మే ఓ ముసలాయన. కుటుంబ భారాన్ని ఎంతగా మోస్తున్నాడో ఏమో, అతడి నడుము భాగం కూడా అంతే భారంగా కింది ఒంగిపోయి ఉంటుంది.
ప్రతిరోజూ ఆఫీసు నుండి ఇంటికెళ్లేటప్పుడల్లా ఆ పెద్దాయన తన దగ్గర కూరగాయలు కొనుక్కోమని పిలిచేవాడు. ఒక్కోరోజు కొనుక్కోవడం, ఇంకో రోజు వెళ్ళిపోవడం చేసేదాన్ని. ఎప్పుడైనా బస్ ఛార్జీలకు చిల్లర దొరకకపోతే, పక్కనుండే పండ్ల షాపుల వారిని నేను అడుగుతుంటే, పెద్దాయన పిలిచి మరీ చిల్లర ఇచ్చేవాడు. ఒక్కోసారి అడగకపోయినా చిల్లర కావాలా అంటూ ఇచ్చేవాడు.
ఆ రోజు కూడా ఆఫీసు వదలి ఇంటికెళ్తున్నాం. నేనూ, మా అబ్బాయి బస్ కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాం. ఇంతలో ఒకటే అరుపులు వెనక్కి తిరిగి చూస్తే... ఆ పెద్దాయనతో ఓ పాతికేళ్ల కుర్రాడు ఏదో సీరియస్‌గా వాదిస్తున్నాడు. ఈ పెద్దాయన కూడా ఏమీ తగ్గడం లేదు. మాటకు మాట సమాధానం ఇస్తున్నాడు.
ఉన్నట్టుండి ఆ కుర్రాడు ఓ పెద్ద బండరాయి తీసుకుని పెద్దాయనపైకి ఉరికివచ్చాడు. అప్పటిదాకా కాస్త ధైర్యంగానే నిలువరించిన ఆ పెద్దాయన ఒక్కసారిగా భయపడిపోయి... వాడు ఏమైనా చేస్తాడో ఏమోనని గబగబా ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి పరుగెత్తుకుంటూ పోయాడు.
ఆ కుర్రాడు బండరాయితోనే పరుగెత్తుకుంటూ ముసలాయనను వెంబడించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరించటంతో రాయి కిందపడేసి నిల్చున్నాడు. హమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ, ముసలాయన తన చోటుకు తిరిగి వచ్చాడు. కానిస్టేబుల్ హెచ్చరికతో కాసేపు గమ్ముగా ఉన్న ఆ కుర్రాడు మళ్లీ ముసలాయన వద్దకు వచ్చాడు.
ఈసారి బెదిరింపుల్ని కట్టిపెట్టిన ఆ కుర్రాడు... ఓ 50 రూపాయలు లేదా కనీసం 20 రూపాయలైనా సరే ఇవ్వమని ముసలాయన్ను దీనంగా అడుక్కోవడం మొదలెట్టాడు. "నేను ఇవ్వను పోరా..! నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో" అంటూ గట్టిగా నిలబడ్డాడు ముసలాయన. చాలాసేపు అడుక్కున్న ఆ కుర్రాడు, పక్కనే కానిస్టేబుల్ కూడా ఉండటంతో ఇక డబ్బులు వసూలు చేసుకోవటం సాధ్యం కాదని అర్థం కావడంతో... ఆ ముసలాయనను బెదిరిస్తూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.
జరిగినదంతా చూస్తూ నిల్చున్న మాకు అతనెవరో సరిగా అర్థం కాలేదు. కాసేపటి తరువాత మెల్లిగా ముసలాయన వద్దకు వెళ్ళి.. "ఏం తాతా, ఎవరతను?" అని అడిగాను. "ఆ... ఏం చెప్పమంటావు తల్లీ..! వాడెవరో కాదు, నా కొడుకే. ఇంత వయసు వచ్చినా, పైసా సంపాదన లేదు. పైగా గాలి తిరుగుళ్ళు, త్రాగుడు. ఇందాక నా దగ్గరికి వచ్చి తాగేందుకు 50 రూపాయలు అడిగాడు. నేను ఇవ్వను అన్నందుకే ఇంతగా రాద్దాంతం చేశాడు. అష్టకష్టాలుపడి పెంచాను, ప్రయోజకుడై ఉద్ధరిస్తాడనుకుంటే ఈ రకంగా బాధపెడుతున్నాడు. చూశారు కదా..! ఎంత పెద్దరాయి ఎత్తుకున్నాడు కదా చంపేస్తానని, అంతేగాకుండా ఇంటికి రా తేల్చుకుంటానని బెదిరిస్తూ వెళ్ళాడు..." అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
తాత చెప్పినదంతా విన్న నాకు ఒక్కసారిగా ఇందాక చూసిన అతడి కొడుకుపైన అసహ్యం వేసింది. వయసుడిగిపోయిన ఈ వయసులో ఆ తాత కష్టపడి కుటుంబాన్ని నెట్టుకువస్తుంటే... ఇతగాడు బలాదూర్‌గా తిరగడమేగాకుండా, డబ్బులివ్వనందుకు కొట్టేందుకు వస్తాడా..? ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? అని మనసులోనే తిట్టుకుంటూ... "ఊరుకో తాతా.. అంతా సర్దుకుంటుంది.." అని చెప్పి మళ్ళీ బస్టాప్‌కు వచ్చేశా.
"బస్టాప్‌లో నిల్చొని బస్ కోసం చూస్తున్నామేగానీ... తాత గురించిన ఆలోచనలు మాత్రం వదలడం లేదు. ఎంత అన్యాయం... జన్మనిచ్చిన తండ్రినే చంపేస్తానంటూ ఎంత పెద్ద బండరాయి ఎత్తుకున్నాడో చూడు... ఇలాంటివారిని ఏం చేసినా పాపం పోదు. మనచుట్టూ ఇలాంటివాళ్ళు ఉన్నారు కాబట్టే, సినిమాల్లో అలాంటి పాత్రలు పెట్టి తీస్తున్నారని" కోపంగా మా వాడితో అన్నాను.
అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న మా అబ్బాయి అయితే ఒక్కసారిగా విరుచుకుపడుతూ... "నాకే గనుక అధికారం ఉంటే... ముందుగా ఇలాంటి వాళ్ళను, వయసుడిగిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలకు పంపించే వెధవలను షూట్ చేసి పారేస్తానమ్మా..!" అన్నాడు.
ఆ రోజు తరువాత తరచుగా తాత, కొడుకులు అలా రోడ్డుమీద వాదించుకోవటం చాలాసార్లు చూసినా ఏమీ చేయలేకపోయాము. ఈ మధ్యనే ఓ నెలరోజుల ముందు వర్షాలు విపరీతంగా కురిశాయి. రోడ్లు, ఫ్లాట్‌ఫాంలు నీళ్లతో నిండిపోవడంతో ఆ తాత కనిపించలేదు. వర్షాలు తగ్గిపోయి మామూలుగా అయినప్పటికీ... తాత జాడే లేదు.. ఇప్పటికి నెల రోజుల పైనే అయిపోయింది.
ఇంతకీ ఆ తాత... "బలాదూర్‌గా తిరుగుతున్న దుర్మార్గపు కొడుకు చేతిలో బలైపోయాడో? లేదా భారీవర్షాలను సైతం లెక్కచేయకుండా గోనెసంచి కప్పుకుని వ్యాపారం చేసుకునే ఆ పండు ముదుసలికి ఆరోగ్యం సహకరించటం లేదో, ఏమో తెలియదు గానీ.... ఆ తాత అంగడి లేని ఆ బస్టాప్ మాత్రం చాలా వెలితిగా కనబడుతోంది. రోజూ... బస్సు వచ్చే వరకు ఆ తాతను చూసే మా కళ్లకు ఆయన అక్కడున్నట్లే ఉంటోంది... కానీ... ఆయన మాత్రం లేడు. ఇంతకీ ఆ తాత ఏమయ్యాడో... ఏంటో?!
శిఖరం
20 hours ago
5 comments:
interesting... ilanti samgatanalu nedu mana samajamlo kokollalu...
Hope he is doing good.
అంతేకదండీ...
మనం రోజు చూసేవారు హటాత్తుగా కనబడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.వారితో మాట్లాడిన లేకపోయినా మనకి వారెవరో తెలిసిన లేకపోయినా ఏదో అనుబంధం అంతే
నిజమే శైలా... ఈనాటికీ నేను ఆవైపు వెళితే, నాకు తెలియకుండానే నా కళ్లు ఆ పెద్దాయన కోసం వెతుకుతుంటాయి.. అయినా ఆయన ఇప్పటిదాకా కనిపించలేదు.. కనిపిస్తాడో, లేదో తెలియదు...
Post a Comment