రోజూ ఆరింటికి కాకపోయినా ఏడింటికైనా నిద్రలేచేసే బుద్ధిమంతురాలినైన నేను....
ఆ రోజు తెల్లారి... టైం ఎనిమిది అవుతోందన్న స్పృహ కూడా లేకుండా... గాఢనిద్రలో... కలల సలపరంతో విలవిలలాడుతుంటే... తలుపులు దబదబా బాదుతున్న చప్పుడు....
ఉలిక్కిపడి లేచి కూర్చొని టైం చూసి బావురుమంటూ లేచి తలుపుతీస్తే.. ఎదురుగా ముఖంనిండా నవ్వులు పులుముకుని... పక్కింటావిడ.
ఏంటండీ.. ఏమయ్యింది.. ఇంత టైం అయినా లేవలేదు. గుమ్మం బయటే పాలు, పేపర్.... కాకులు పాల కవర్‌ని ముక్కుతో పొడుస్తుంటే మిమ్మల్ని లేపాల్సి వచ్చిందని..... అడక్కుండానే గడగడా వివరణ ఇచ్చేసింది.
చాలా చాలా థ్యాంక్స్ అండీ.. మీరు లేపకపోతే కవర్ చిరిగిపోయి పాలన్నీ నేలపాలు అయ్యుండేవి. రాత్రి సరిగా నిద్రపోలేదు.. తెల్లారుజామున ఎందుకో బాగా నిద్రపట్టేసింది... అందుకే లేవలేకపోయానండీ.. పాలు కాకులపాలు కాకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా నా వివరణ ఇచ్చేశాను.
అలాగా.. ఇప్పటికే లేటయ్యింది పనులు చూసుకోండి అయితే.. నేనూ బాబును స్కూలుకి తయారు చేయాలి అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.
పాలు, పేపర్ తెచ్చి టేబుల్‌పై పెట్టి... సోఫాలో కూలబడుతూ.. నిద్ర లేవలేకపోయినందుకు కాసేపు నన్ను నేను తిట్టుకునే ప్రోగ్రాం పెట్టేసుకున్నా.....
పిచ్చిమొద్దూ అంత నిద్ర ఏంటే.... అయినా హాయిగా నిద్రపోయావా అంటే అదీ లేదు..... ఏవేవో పిచ్చి కలలు...
పిచ్చి కలలు.. గుర్తుకురాగానే..... అన్నట్టు హాయిగా మంచి కలల్లో జోగాడుతూ నిద్రపోయే పరిస్థితి కాస్తా పిచ్చి కలల్లోకి మారిపోడానికి కారణం ఏంటి చెప్మా.... ఆలోచనలో పడ్డాను.
ఇంకెవరు... ఉన్నారుగా మహానుభావులు.... అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్తే....
దిండును గట్టిగా కౌగలించేకుని నిద్రలో కలవరిస్తూ, పలవరిస్తూ వయ్యారాలు పోతున్న అతగాడ్ని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. చూడు ఎంత అమాయకంగా, ఏమీ ఎరగనట్టు ఎలా నిద్రపోతున్నాడో...
ఉన్నఫళంగా ఓ బకెటెడు నీళ్లు తెచ్చి మీద కుమ్మరించేయాలన్న ఆత్రం వచ్చేసింది. ఆవేశంతో అలా ఊగిపోతుంటే... నిద్రలో నన్నే కలవరిస్తున్న తనని చూడగానే చప్పున చల్లారిపోయి కూలబడ్డా. పాపం కదా అనిపించింది.
మళ్లీ అంతలోనే ఓ సందేహం. మెలకువగానే ఉండి తను నన్ను కూల్ చేయాలని వేసిన ఎత్తుగడ కాదుకదా అది అనిపించింది. మెల్లిగా దగ్గరికి వెళ్లి చూశా. లేదు నిజంగా నిద్రపోతున్నాడు. అరెరే నిజంగా కలవరిస్తున్నాడు. అయ్యో.. సందేహపడ్డాను కదా....
పోన్లే బంగారూ.. నువ్వు అలాగే కలవరిస్తుండమ్మా.... నే మళ్లీ వస్తాలే... (మనసులో ప్రేమ పొంగుతుంటే...) కోపంగా ఉన్నాను కాబట్టి నా ప్రేమని అప్పుడు తనపై వ్యక్తం చేయలేక భారంగా అక్కడ్నించి కదిలా.
ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు ముగించుకుని వంటగదిలోకెళ్లి, పాలు స్టవ్‌పై పెట్టి.. టిఫిన్‌కి ఏం చేయాలి, లంచ్ ఎలా... అనుకుంటుంటే.. ఆ రోజు సెలవు కాదన్న విషయం అప్పటికిగానీ బోధపడలేదు.
అయ్యో... ఈ రోజు ఆఫీసు ఉంది కదా.. ఆదివారం అన్న మాయలో ఉన్నానేమో... అయినా వారాలు కూడా గుర్తెట్టుకోలేకపోతే ఎలానే తల్లీ... నా పరిస్థితికి నాకే చాలా కోపం వచ్చేసింది. అంతలోనే తనకి కూడా ఆఫీస్ ఉందన్న విషయం గుర్తొచ్చింది.
రోజూ అయితే నే ముందు లేచేసి, పాలు, టిఫిన్, స్నానం లాంటి పనులు చూసుకుని తనని లేపితే...
తనేమో తీరిగ్గా లేచి బెడ్ కాఫీ తాగి, పేపర్ చదివి, సిస్టమ్ ఆన్ చేసి మెయిల్స్ గట్రా చెక్ చేసుకుని ఆ తరువాత ఆరామ్‌గా బాత్రూంలోకి దూరిపోయి.. ఆపై టైం చూసుకుని ఉరుకులు పరుగులతో రెడీ అయి నన్ను తొందరచేసి ఎలాగోలా మా ఆఫీసులో నన్ను దించేసి, తను వెళ్లేవారు.
ఇవ్వాళ మేడంగారు.. అంటే నేనే... అలకలో ఉన్నాను కదా... అందుకే తనని లేపలేదు. లేకపోతే నన్ను అంతగా బాధపెడితే నేను అలకమానేసి ప్రేమగా వెళ్లి నిద్ర లేపుతానా..? అస్సలు కుదరదు. నేను లేపేది లేదు అంతే... ఇవేమీ తెలీని తను హాయిగా నిద్రోతున్నాడు. ఎప్పట్లా నేను వెళ్లి నిద్ర లేపుతాననే భ్రమలో ఉన్నాడేమో... నే వెళ్ల.. లేస్తే లేవనీ.. లేకపోతే లేదు..
కోపంగా ఉన్నా కదా.. అందుకే మా ఆఫీసుకి మాత్రమే ఫోన్ చేసి లేటుగా వస్తానని ఫర్మిషన్ తీసుకున్నా. మామూలు స్థితిలో అయితే తను లేవలేని సమయంలో నేనే వాళ్లాఫీసుకు ఫోన్ చేసి ఫర్మిషన్ చెప్పేసేదాన్ని. కానీ ఇవ్వాళ అలా చేయలేదు.
పనులన్నీ చక్కబెట్టేసి ఇద్దరికీ క్యారియర్లు సర్దేసి, కసికొద్దీ కాఫీ, టిఫిన్ లాగించేసి.... తీరిగ్గా పేపర్ ముందేసుకుని కూర్చున్నా.... కాసేపయ్యాక
టైం అవుతున్నా ఇంకా లేవడేం అనుకుంటూ బెడ్రూంలోకెళ్తే.. మళ్లీ సేమ్ కండీషన్‌లో తను.. ఈసారి మరీ చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు (అన్నీ చెప్పుకోలేం కదా- పరువు పోతుంది..). చిర్రెత్తుకొచ్చింది. ఇలా కాదు. ఉండు నీ పని చెబుతా అని బయటికి వచ్చి.. ఫోన్ రింగ్ చేస్తూ కూర్చున్నా. అటువైపు ఉలుకూ, పలుకూ లేదు. ఇహ ఇలా కాదు అనుకుని ల్యాండ్‌లైన్‌కి రింగ్ ఇచ్చా. అంతే ఒక్క కాల్‌కే గురుడు మేలుకున్నాడు.
ఏమీ ఎరగనట్లు ఎప్పట్లా... నా పేరును చాలా ప్రేమగా, తియ్యగా, గోముగా పిలుస్తున్నాడు (మామూలుగా అయితే మురిసిపోతూ తన ఒడిలో వాలిపోయుండేదాన్నేమో..) ఇప్పుడు అలక, కోపం కదా... లోపల్నించి పొంగుకొస్తున్న ప్రేమకు అన్యాయంగా అడ్డుకట్ట వేస్తూ.. భింకంగా, ఏమీ వినపడనట్లుగా పేపర్లో తలపెట్టి కూర్చున్నా...
పిలిచి, పిలిచి.. నేను రాకపోయేసరికి కళ్లు నులుముకుంటూ మెల్లిగా హాల్లోకి వచ్చాడు. సోఫాలో నా పక్కన కూలబడుతూ.. ఏంట్రా బంగారూ.. పిలుస్తుంటే పలకవేం అంటూ దగ్గరికి జరగబోయాడు. (పాపం ఎంత ప్రేమగా దగ్గరికి వస్తున్నాడో చూడు... అలక తీసి గట్టుమీద పెట్టెయ్యవే అని మనసు రొద పెడుతున్నా.. దానికి బుద్ధి చెబుతూ..) ఏదో షాక్ కొట్టినట్లుగా లేచి నిలబడి...
ఇదుగో ఈ బంగారూ, గింగారూ ఏమీ వద్దు... నే అలిగానంతే... నువ్వేం దగ్గరికి రానక్కర్లే... వెళ్లి ప్లాస్క్‌లో కాఫీ ఉంది తాగేసి, హాట్‌బాక్స్‌లో టిఫిన్ ఉంది తినేసి, ఇదుగో నీ క్యారియర్ పట్టుకుని ఆఫీసుకెళ్లు... ఇవ్వాళ నేనే వెళ్తాలే.. అన్నా కోపంగా....
మా బంగారు కదూ, బుజ్జి కదూ... ఎందుకే అంత కోపం... నేను ఏమన్నానని... ఇంతలా సాధిస్తున్నావు అన్నాడు..
ఇదుగో.. నాకు ఇంకాస్త కోపం తెప్పించకు... ఏం అన్నాను అని అంత చిన్నగా అడుగుతావా... (ఇంతకీ ఏమన్నాడు.. అలకలో అసలు విషయం మర్చిపోయా)
ఏమన్నాను బంగారూ.. చెప్పు.. నాకు సరిగా గుర్తు లేదు.. అంటున్నాడు..
మామూలుగా అయితే అలా నిద్ర మత్తులో జోగుతున్న తనని బుజ్జగిస్తూ, ముఖాన్ని ముద్దుల వర్షంలో తడిపేస్తూ.. తన ముఖంలోని పసితనాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇవ్వాళ అలక అనే బెట్టుతో ఉన్నా కదా... తనని అస్సలు పట్టించుకోవట్లేదు.. పాపం ముఖం దీనంగా పెట్టి బ్రతిమలాడుతున్నాడు.
ఇంతలో "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే" అంటూ తన ఫోన్ గట్టిగా పాడుతోంది. బెడ్రూంలో ఉన్న సెల్ కోసం నిద్రమత్తు వదలని నా పతిదేవుడు పరుగున వెళ్లబోయి తూలిపడబోయాడు. అంతే ఒక్కసారిగా నా గుండె జారిపోయింది.
పరుగున వెళ్లి పడిపోకుండా పట్టుకున్నా. తన ముఖం చూడాలి అప్పుడు. ముసిముసి నవ్వులు కలబోసిన ప్రేమతో... విచ్చుకున్న పువ్వులాంటి స్వచ్ఛమైన ఆ ముఖంలో ఓ వెలుగు.. ఆ క్షణంలో నాకు నచ్చిన ఆ బుజ్జి ముఖంలో ఓ గొప్ప నిశ్చింత. నన్ను పడిపోనీయకుండా నువ్వు ఎప్పుడూ నా పక్కన ఉంటావు అనే నిశ్చింతేమో అది.
తనని పడిపోనీయకుండా పట్టుకున్నానన్న అదే నిశ్చింత నాలో కూడా. అంతే ఒక్కసారిగా తనని అల్లుకుపోయా. ముద్దులతో ముంచెత్తేశా.. నా అలక ఇంత త్వరగా తీరుతుందని ఊహించని తను కూడా... ఓసి నా పిచ్చి బంగారూ... అంటూ నుదుటిపై వెచ్చని ముద్దొకటి ఇయ్యగానే సిగ్గులమొగ్గనైపోయా....
నిజం చెప్పొద్దూ...
అసలు నేను ఎందుకు అలిగానో ఎంత గుర్తు చేసుకుందామన్నా.. ఇప్పటికీ అస్సలు గుర్తుకు రావడం లేదు.....
(ఓ చిన్న చిలిపి ఊహకు అక్షర రూపమే ఈ పోస్టు..)
19 comments:
బాపు రమణల కథనం లా సరసమైన సంసారం లోని మురిపాలను మధుర భావనలను కొత్త పెళ్ళికూతురి అలకలను అద్భుతంగా చిత్రీకరించావు..చాలా బాగుంది తెలుగింటి ఆడపడచు అలకలు.....అనురాగ దాంపత్యపు మొలకలు...చక్కని ఓ చిలకా గోరింకలు
baagundi... baagundi
superb...chaalaa baagundi....@sri
wow super:-)
మీ రచన ఆనంద్ మూవీ లో 'యమునా తీరం సంధ్యా రాగం" ఆ పాటలా కమ్మగా వుంది...కోపం లో నైనా మగువలు భర్తలని ఎంత ప్రేమిస్తారో సున్నితంగా చెప్పారు...ఇంతకీ ఆ రాత్రి ఏమయ్యుంటుందో ...?
- బహుదూరపు బాటసారి
ఆ రాత్రి ఏమయ్యుంటుందో.. గుర్తుకు తెచ్చుకోకు...మళ్ళీ అలిగే అవకాశముంది... చిరుతగవులు అందమే..శృతిమించకూండా వుంటే సంసారంలో సంగీతాలే అనునయాలతో...పూర్తిగా చదివాను బావుందమ్మా!
- Kapila Ramkumar
simply superb ma....
చాలా ముచ్చటగా ఉంది..మగువ మనసు ఆద్యంతం..అక్షరాల్లో పొదిగితే ఇలా ఉంటుందేమో అనిపిస్తూ.....
"మాటేమొ పొమ్మందీ మనసేమో రమ్మందీ...మాటకు మనసుకూ మధ్యన తగవుందీ.."
పాటను మరీ మరీ గుర్తు చేస్తూ....శోభాజీ....చో....క్యూట్...అలక సైతం అతివకందమని నిరూపించినందుకు.....
మీనుండీ మరో డిఫరెంట్ రచన వైవిధ్యంగా ఉంది.ముఖ్యంగా ముగింపు నచ్చింది..ఎంచుకున్న భాషా శైలీ హాయిగా ఉన్నాయి.అభినందనలు శోభగారు
@ ఉదయ్ అన్నయ్యా..
ఈ కోణంలో నేను రాసిన తొలి రచనే బాపు-రమణల కథనాన్ని గుర్తుకు తెచ్చేలా ఉందనడం.. నిజంగా పెద్ద కాంప్లిమెంట్ వచ్చినట్లే...! ధన్యవాదాలు.. :)
@ లాహిరి (శ్రీనివాసరావు) గారు.. నా ఈ పోస్టు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు..
@ పద్మార్పిత గారు.. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్..
@ షామిలి డియర్.. థ్యాంక్యూ రా
@బహుదూరపు బాటసారి గారూ...
ఆ రాత్రి ఏదో చిన్నపాటి వాగ్యుద్దం :) జరిగిందండీ.. అప్పుడు ఈ అమ్మాయిగారు ఎందుకోగానీ అలకపాన్పు ఎక్కారు.. దానికోసం తెల్లారి లేచి సాదిద్దామనుకుంది. పాపం అలా వాళ్లాయన ప్రేమకి ఢమాల్ అని పడిపోయింది.. :) :) :)
@ కపిల రాంకుమార్ గారూ..
పోస్టు ఆద్యంతం చదివినందుకు, మీకు ఈ పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు.
@ పద్మా శ్రీరాం గారూ...
మీ కామెంట్ సూపర్ అండి. ఎంత చక్కగా కామెంటారు.
మగువ మనసు ఆద్యంతం.. అక్షరాల్లో పొదిగితే ఇలా ఉంటుందేమో అనిపిస్తూ... అండటూ మీ కామెంట్లోని ఈ అక్షరాలకి, చో.. క్యూట్ అంటూ మీరు ముద్దు చేసినందుకు ఐ యామ్ సో హ్యాపీ..... :)
థ్యాంక్యూ వెరీ మచ్ పద్మగారు...
@ వాసుదేవ్ జీ..
మీకు ముగింపు నచ్చినందుకు, నా భాషను మెచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు..
ఎప్పుడూ తియ్యగా ఉండ కుండా కాస్త కా్రాల గారాలూ, అలకల మిరియాలూ, కూడా ఉంటే నే ప్రెమైక జీవనం ....బాగుంది తల్లీ ప్రేమతో ...జగతి
"ఉన్నఫళంగా ఓ బకెటెడు నీళ్లు తెచ్చి మీద కుమ్మరించేయాలన్న ఆత్రం వచ్చేసింది. ఆవేశంతో అలా ఊగిపోతుంటే... నిద్రలో నన్నే కలవరిస్తున్న తనని చూడగానే చప్పున చల్లారిపోయి కూలబడ్డా. పాపం కదా అనిపించింది....
అందమైన భావం వన్నెల వెన్న తత్వం
అభినందనలు శోభా రాజశేఖర్!"
- చంద్రశేఖర్ వేములపల్లి
@ ధాత్రి అమ్మకు,
@ చంద్రశేఖర్ వేములపల్లి వారికి.. ధన్యవాదాలు
baagundi
భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు ఎలా వుండాలో మంచి శైలీతో హృదయాన్ని హత్తుకునేలా వ్రాసావు శోభ చెల్లాయి. నాకు బలే నచ్చేసింది. మీ వదిన కూడా నీ కథలో హీరోయిన్ లాంటిదే. నాతో ఎంత చిరాకు పడుతుందో అంత ప్రేమిస్తుంది. ఇంకా మంచి మంచి ఇతివృత్తాలు నీ కలం నుండి జాలువారాలని ఆశిస్తున్నాను.
చాలా బాగుంది శోభా..కధనం ఎక్సలెంట్! ఇంతకీ ఆమె ఎందుకలిగిందో మరి!
@ పుక్కళ్ల సోదరా...
నా కథనం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.. మా వదినమ్మ నా కథనంలోని హీరోయిన్ లాగే ఉంటారా... గుడ్.. అయితే మీ ఇంట్లో ప్రతిరోజూ సందడే. ఓ రోజు వచ్చేస్తాను ఉండండి.. మీ సందడిని చూసేందుకు... :)
@ జ్యోతక్కా... ధన్యవాదాలు
Post a Comment