"అది కాదే అమ్ములూ.. నా బంగారు కదూ... నే చెప్పేది కాస్త వినవే.."
"వూహూ నే వినను గాక వినను.. అయినా అన్నీ తెలిసి కూడా నిన్ను కట్టేసుకున్నాను చూడూ... నన్ను అనాలి"
"అన్నీ తెలుసా.. ఏం తెలుసు నీకు.. నువ్వు అంటున్నది నిజం కాదు.. ఒట్టి భ్రమ మాత్రమే.. నన్ను నమ్మవే అమ్ములూ..."
"ఎలా నమ్మాలి నిన్ను.. ఇలా నిద్రలో కూడా కలవరిస్తూ ఆ పేరును జపం చేస్తుంటే..."
"హవ్వా... నిద్రలోనా... నేనా... కలవరించానా... అందుకని నువ్వు దాన్ని గుర్తు పెట్టుకుని.. నాతో ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నావా.. ఇదేమైనా న్యాయమా తల్లీ..."
"ఎందుకు న్యాయం కాదు.. తమరు మాత్రం కలల్లో కూడా మర్చిపోలేని ఆ పేరుతో జపం చేస్తుంటే.. నేను చూసీ చూడనట్లూ, వినీ విననట్లూ పోవాలా..."
"ఇదెక్కడి గోలే... నేను ఏ పేరును కలవరించాను తల్లీ..."
"అదే తమరి గొప్పతనం.. అది కూడా నా నోటినుంచే వినాలనా... నాకెందుకు అంత భాగ్యం.. మీరే గుర్తు తెచ్చుకోండి"
వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ.. బలవంతపు నిగ్రహంతో "ఏం గుర్తులేదు మొర్రో అంటే వినకుండా.. పదే పదే విసిగిస్తావేంటి అమ్ములూ" అంటే..
"అన్నిసార్లు కలవరించి ఇప్పుడు గుర్తు లేదు అంటే మేం నమ్మాలా..."
ఓసి నీ యంకమ్మా... "ఏం కలవరించానో చెప్పమంటే చెప్పకుండా ఈ సాధింపు ఏంటే... ఇదే చివరాఖరు.. ఇక చెప్పకపోయావా.. ఇంకెప్పుడూ అడగను... నువ్వేమైనా మాట్లాడుకో నే బదులివ్వా" బెదిరిస్తే అయినా దార్లోకి వస్తుందని ప్రయత్నం..
అయినా వింటేగా...
"ఓసోస్... ఈ బెదిరింపులకు నే భయపడా... ముందు ఎవరా శాల్తీ చెప్పండి.."
ఇక లాభం లేదనుకుని మౌన వ్రతం ట్యాగ్ వేసేసుకుని కామ్‌గా ఉండిపోయా
ఊరుకుంటుందా... మౌనం అర్థాంగీకారం అనుకుందో ఏమో...
నా నుంచి నిజం రాబట్టేందుకు అలిగింది, అరిచింది, కోప్పడింది, బెదిరించింది, ఏడ్చింది, వెటకరించింది నా అమ్ములు.. ఏం చేసినా నే చెబితేగా...
అయినా ఏమైనా ఉంటేగా చెప్పేందుకు... నిజ్జంగా ఒట్టు అండి ఏమీ లేదు.. అసలు నేను నిద్రలో ఏం కలవరించానో కూడా గుర్తు లేదు నాకు..
ఏముందీ.. ఇక ఆ రోజు నుంచీ నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది.
లేచింది మొదలు, నిద్రపోయేదాకా రంగు రంగుల సీతాకోకలు ఇంట్లో తిరుగాడినట్లుగా ఎన్ని కబుర్లూ, ఎంత సందడి, ఎన్ని ముద్దులు, మరెన్నో మురిపాలు, అలకలు, అల్లర్లు........ ఇలా ఉండేది నా అమ్ములుకు నామీద సందేహం రానంతదాకా...
నామీద అనుమానం ఎప్పుడైతే వచ్చిందో అప్పట్నించీ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ లాగా అయిపోయింది నా పరిస్థితి.
అప్పట్లో నిద్రలేచేటప్పుడు ఓ వెచ్చని బిగికౌగిలి ముద్దుతో రోజుకి స్వాగతం .. ఇప్పుడు నామీద కోపంతో భగభగ మండిపోయే నా అమ్ములూ సూర్యోదయానికి ముందే ఎర్రటి ఎండను తన ముఖంలోకి తీసుకొచ్చి మరీ రోజును స్వాగతిస్తోంది
నిజంగా ఆడోళ్లు కోపంలో కూడా చాలా అందంగా ఉంటారు. అందుకు నా అమ్ములూనే సాక్ష్యం. ఎంత ముద్దొస్తోందనీ. తను నన్ను కోపంగా నిద్ర లేపినా ఎర్రబడ్డ ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తనివితీరా ముద్దాడాలని ఎంత ఆశగా ఉందో... అయినా రాక్షసి.. తాకనిస్తేగా...
ప్రాణం ఉస్సూరుమనగా.. బేలగా నిద్ర లేవడం ఈ కొద్ది రోజుల్లో అలవాటైంది. కానీ ఇదెంత నరకంగా ఉందో చెప్పలేను.
ఈ పిల్లకి నామీద కోపం రాకముందు.. సారీ సారీ అనుమానం రాకముందు... కాఫీ తాగుతూ, పేపర్ ముందేసుకుని.. వార్తల్ని ఆమె విన్నా, వినకపోయినా.. దేశ రాజకీయాల దగ్గర్నించీ, ప్రాంతీయ ప్రారబ్దాల దాకా... ఒకటేమిటి అన్నీ చెప్పుకుపోతుండే నా నసని ఎంత ప్రేమగా భరించేదో... ఆహా, అలాగా, ఇలాగా అంటూ ఏ మాత్రం విసుక్కోకుండా హాయిగా నవ్వేసేది నా అమ్ములు..
ఇప్పుడు కాఫీ ఎంత చేదుగా ఉందో.. అమ్ములు పక్కన లేకుండా పేపర్ చదవాలా... తను వినకుండా నేనేం చదవను.. నాకేం ఒద్దు పో... పేపర్ పైనా, కాఫీ పైనా అలిగేసా.. ఓరకంట గమనిస్తూ ఏమీ ఎరగనట్టు వెళ్తోంది నా రాక్షసి.. నా అలక చూసైనా కరుగుతుందనుకుంటే ఊహూ.. ఒట్టి రాతిగుండె. కరిగితేగా...
ఇలా ఒకటేమిటి అన్ని పనుల్లోనూ సహాయ నిరాకరణ చేసేస్తోంది నా శ్రీమతి ఉరఫ్ అమ్ములు (నేను ముద్దుగా ఇలానే పిల్చుకుంటా). ఏం చేయను నిస్సహాయుడిని. తనకి అర్థం చేయించే, నమ్మించే తెలివితేటలు లేనివాడను. ఏమీ లేని దానికి ఏదైనా ఉంది అని ఒప్పుకుని దోషిగా నిలబడటం ఏంటో నాకు అర్థం కావటం లేదు.
అమ్ములూ.. అమ్ములూ.. నన్ను ఇలా అనాధను చేయకే.. నేనేం తప్పు చేయలేదే.. నా మాట వినవే.. నా బంగారు కదూ... అని ఎన్నిసార్లు బ్రతిమలాడినా.. తను మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది. నేను దాస్తున్నదేంటో చెప్పాల్సిందేనని. ఒట్టు ఏమీ లేదంటే నమ్మేదెవరు.
రోజులు ఇలా దొర్లుతున్నాయి..
ఓ రోజున ఉరుములు, మెరుపుల్లేని వర్షంలా ఊడిపడ్డారు మా అమ్మానాన్న.. అసలే పల్లెటూరి మాలోకాలు. మేం ఉన్న పరిస్థితి చూస్తే, ఎక్కడ నొచ్చుకుంటారో, కథను ఎక్కడ పెద్దగా చేస్తారో అని ఒకటే ఖంగారు నాకు.
అయినా వాళ్లకు అదేమీ తెలీకుండా జాగ్రత్తపడ్డాను. ఎప్పట్లా అమ్ములుతో ప్రేమగా ఉండేందుకు ట్రై చేశా. తను కూడా ఏమనుకుందో ఏంటో అమ్మావాళ్ల ముందు బాగానే ఉండసాగింది. ఆరోజు రాత్రి పడకగదిలో.. అమ్మావాళ్లకి విషయం తెలీకుండా మానేజ్ చేసినందుకు అమ్ములుకి థ్యాంక్స్ చెప్పాను.
"తమరి థ్యాంక్స్ మాకేం అక్కర్లే.. వాళ్లు నాకు అత్తామామలు.. అమ్మా నాన్నలతో సమానం. వాళ్లు బాధపడితే నాక్కూడా బాధగానే ఉంటుంది. అందుకే ఇలా..." అంది
అమ్ములుకు నా తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ.. తన మాటల్లో వ్యక్తమైన తీరు చూసి చాలా ముచ్చటేసింది. మనసులోనే తనకి థ్యాంక్స్ చెప్పుకున్నా.. ముద్దులాడేసా.. (థ్యాంక్సే ఒప్పుకోనిది.. ముద్దు ఒప్పుకుంటుందా).
కొన్నాళ్లుండి అమ్మావాళ్లు మళ్లీ ఊరెళ్లిపోయారు. వాళ్లకి ఏమీ తెలియకుండానే తిరుగు ప్రయాణం అయినందుకు హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నా...
ఏ ముద్దూ ముచ్చటా లేకుండా రోజులు అలా నిర్లిప్తంగా దొర్లుతున్నాయి.
దేవిగారూ.. కోపాన్ని, బెట్టును వదిలేట్టు లేరు.. ఏం చేయాలో తెలీని స్థితిలో నేను...
ఇక ఇలా కాదు అనుకుందో ఏమో.. ఓ రోజు ఆఫీసు నుంచి రాగానే.. నన్ను లాగి సోఫాలో కూర్చోబెట్టి.. "ఇదుగో ఆ పేరు ఏంటో నేను చెబుతా.. అది ఎవరో, నువ్వు నిద్రలో ఎందుకు కలవరించావో చెబుతావా?" కొద్దిగా రాజీ ధోరణితో అడిగింది అమ్ములు.
అయ్యగారికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. అసలే ఏం కలవరించానో గుర్తు లేని నాకు, ఆ పేరేంటో చెబితే అయినా గుర్తొస్తుందేమోనని నేనూ ఎదురుచూస్తున్నా.. ఇన్నాళ్లకి కావాల్సింది కాళ్లకి అడ్డంపడ్డట్టుగా చెబుతానంది. రాజీకి మార్గం కుదురుతోందన్న ఉత్సాహంలో..
"తప్పకుండా చెబుతా అమ్ములూ... చెప్పు చెప్పు..." తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా గిల్లాను..
"ఇదుగో ఇలా చేస్తే నే ఊరుకోను.. దూరంగా కూర్చో.. ఇప్పుడు చెప్పు... ఎవరు తను..?"
"అమ్మా తల్లీ.. నీకో దండం.. ఆ తను ఎవరో చెబుతాగానీ.. ముందు ఆ పేరు చెప్పు.."
"లాలస..."
"లాలసా..." ముఖంలో క్షణకాలం రంగులు మారిపోయాయి నాలో...
నాలో రంగులు మారటం చూసి నా భార్యామణి కన్ఫర్మ్ చేసేసుకుంటున్న దశలో... ఒక్కసారిగా పగలబడి నవ్వా.. నిజంగా అంత నవ్వు వచ్చింది నాకు.. ఇందుకోసమా ఈ పిచ్చిది నన్ను ఇన్నాళ్లుగా ఏడిపిస్తోంది అనుకుంటే నాకు కడుపు పగిలిపోయేంతగా నవ్వు..
సోఫాలో దొర్లి దొర్లి నవ్వుతున్నా... అమ్ములుకి ఓ వైపు కోపం, మరోవైపు అయోమయం...
నవ్వి, నవ్వి ఓపిక లేక తననే చూస్తూ ఉంటే.. ఉడుక్కుంటూ... ఇక చాలు ఇప్పుడైనా చెబుతావా లేదా... కోపంగా అడిగింది
"దేవీగారూ.. శాంతి... శాంతి.... ఓహ్.. శాంతి ఎవరు అని మళ్లీ అడగకే తల్లీ.. నీకు దండం పెడతానే.. శాంతి అంటే శాంతంగా విను అని అర్థం సరేనా.."
లాలస ఎవరంటే... లాలస.... లాలస... ఏదో ఆలోచిస్తున్నట్లు పెద్దగా ఫోజు పెట్టా.. (అక్కడేమీ లేదు)
"ఊరికే విసిగించకు.. చెప్పు ప్లీజ్..." కోపం, వేడుకోలు రెండూ కలగలిపిన మాటలా తను.. చూస్తే చాలా జాలేసింది.. పోన్లే ఇక ఏడిపించింది చాలనుకుని...
లాలస.. నేను కాలేజీ చదివే రోజుల్లో మా పక్కింట్లో ఉండేది.
తన సందేహం నిజమేనేమో అనుకుంటూ అమ్ములు నోట్లోంచి "కాలేజీ రోజుల్లోనా....?" అనే మాట
అవును కాలేజీ రోజుల్లోనే.. రోజూ నన్ను చూసి నవ్వేది.. నేను కూడా నవ్వేవాడిని.. వాళ్ల నాన్నమ్మ లేని టైం చూసి దగ్గరికి వెళ్లి ముద్దులాడేవాడిని కూడా.. వాళ్ల నాన్నమ్మ అంటే నాకు పడదు అందుకనే ఆవిడ లేని టైంలో వెళ్లేవాడిని.
ఛీ... ముద్దులాడేవాడివా.. ఎంత సిగ్గులేకుండా నాకే చెబుతున్నావు చూడు... ముఖం కందగడ్డలా మారిపోయింది అమ్ములుకి.
"సిగ్గు ఎందుకు అమ్ములూ.. తను ఎంత ముద్దుగా ఉండేదో.. ముట్టుకుంటే కందిపోయేంత తెలుపు. తను నవ్వితే ఎంత బాగుండేదో తెలుసా.." ఇంకాస్త ఉడికించాను.
"అవున్లే అన్నీ తెగించారు కాబట్టే.. ఇలా నాతోనే ప్రేమ కబుర్లు అన్నీ కట్టగట్టుకుని చెబుతున్నారు.. అంతేలే.. ఇవన్నీ తెలీని మా అమ్మానాన్నలు నీకు ఇచ్చి నా గొంతు కోశారు"
"అవునా.. అదేం లేదు అమ్ములూ.. నేను బంగారం.. ఏ తప్పూ చేయలేదు.. కేవలం లాలసను చూసి నవ్వేవాడిని, ముద్దులాడేవాడిని.. ఓసారి ఎత్తుకున్నాననుకో.. అంతేగానీ నేనేం చేయలేదు.. ఒట్టు..." వస్తున్న నవ్వును ఆపుకుంటూ బదులిచ్చా.
"తప్పు చేయలేదా.. నవ్వడం, ముద్దులాడటం, ఎత్తుకోవడం" ఇవన్నీ ఏంటి...? దుఃఖం తన్నుకొస్తుంటే.. గొంతు జీరబోయింది తనకి.. (తన పరిస్థితి చూస్తే ఇక నిజం దాచకూడదని అనిపించింది. సరే చెప్పేద్దా అనుకునేంతలో..)
మళ్లీ తనే... "అలాంటప్పుడు తననే పెళ్లి చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకుని నా జీవితం ఇలా చేశారు.." ఇంకో మాట మాట్లాడితే భోరున ఏడ్చేలా ఉంది తన పరిస్థితి. అలాగని నేను ఏమీ మాట్లాడక పోయినా ఊరుకునేలా లేదు.
"నేను కూడా అదే అనుకున్నా అమ్ములూ.. ఆఖరుకు వాళ్ల నాన్నమ్మ నాకు నచ్చకపోయినా వెళ్లి అడిగాను లాలసను నాకు ఇచ్చి పెళ్లి చేయమని.. వాళ్లెవరూ వినలేదు.. పైగా నన్నే తిట్టారు. తెలుసా..?" కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెప్పా
"అన్నారా.. అనుకున్నా... తమరు ఆ పని కూడా చేసి ఉంటారని.. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. తననే పెళ్లి చేసుకోండి. నే వెళ్తున్నా..." అంటూ ఏడుస్తూ.. సూట్ కేస్ సర్దేందుకు బయల్దేరింది నా కోమలి.
అయ్యో.. తను వెళ్లిందంటే నీ పని అంతేరా రామ్.. నా అంతరాత్మ నన్ను హెచ్చరించగా... ఇక తనని ఏడిపించింది చాలనుకుని.. నేనూ బెడ్‌రూంలోకి దూరా..
ముక్కు చీదుకుంటూ బట్టలు సర్దుకుంటోంది నా భార్యామణి.
ప్రేమగా దగ్గరికి తీసుకోబోయా. విసిరి కొట్టింది. మళ్లీ వెళ్లా.. మళ్లీ అలానే చేసింది.. చివరికి ఇలా కాదని బలవంతంగా గట్టిగా హత్తుకున్నా... ఏమనుకుందో ఏమో కామ్‌గా ఉండిపోయింది.
"ఓసి పిచ్చి అమ్ములూ... లాలసను పెళ్లి చేసుకోవాలంటే... ఇంకో 15 ఏళ్లకు పైగానే ఆగాలే.." అన్నా
"15 ఏళ్లా..."
"అవును. తనకి ఇప్పుడు ఓ ఆరేళ్లుంటాయేమో. పక్కింట్లో ఉండే రామాయమ్మగారి మనవరాలు లాలస. చాలా ముద్దుగా ఉండేది. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ రామాయమ్మ మనవరాల్ని తాకనిచ్చేది కాదు. చివరికి ఓసారి లాలసను పెళ్లి చేసేసుకుంటా ఇచ్చేయండి అని కూడా అడిగాను. ఓరి భడవా.. ఏంటా మాటలు అంటూ చీవాట్లు పెట్టింది తెలుసా..?!" అంటూ అమ్ములుకి కంప్లైంట్ చేశా.
"వింటోంది.. కలో.. నిజమో.. తెలీని స్థితిలో అమ్ములు.."
"నిజం అమ్ములూ... నీకో విషయం తెలుసా... మనకి కూడా అలాంటి పాప పుడితే ఎంత బాగుంటుందో.. ఈ విషయం నేను చాలాసార్లు మనసులో అనుకున్నా. అదే అలా కలవరింతలో బయటికి వచ్చిందేమో..?!"
"విషయం అర్థమవగానే.. అమ్ములును చూడాలి.. ఆ కళ్లల్లో సంతోషం.. నేను ఎప్పటికీ తన వాడినే అన్న ఆనందం.. అయ్యో మాటల్లో చెప్పలేను. తన ముఖంలో అప్పుడు కనిపించిన భావాలను ఫ్రేమ్ చేయటం అస్సలు సాధ్యం కాదు.. అన్ని రకాల భావాలు ఒక్కసారిగా తనలో...."
అంతే అల్లుకుపోయింది తను.. తరువాత తను చేసింది.. నేను లాలస గురించి చెప్పింది తల్చుకుని పడి పడీ నవ్వింది.. ఇందాక బాధతో కన్నీళ్లు కార్చిన నా అమ్ములు కళ్లు.. ఇప్పుడు నవ్వి నవ్వి ఆనందబాష్పాలతో నిండిపోయాయి...
అలా నవ్వి నవ్వి అలసిపోయి.. చెప్పలేనంత నమ్మకంతో నాగుండెలపై వాలిపోయి, కలతల్లేని నిద్రలోకి హాయిగా జారుకుంది.
తన అనుమానం అనుమానమేగానీ, నిజం కాదనీ అర్థం చేయించటంతో నాక్కూడా ఎక్కడలేని ప్రశాంతత ఆవహించినట్లు అనిపించింది.
నా గుండెలపై హాయిగా బజ్జున్న అమ్ములు తలను నిమురుతూ... ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు...!!!
(అనుమానం అంటూ రాకూడదు.. ఒకవేళ వచ్చినా దాన్ని మొగ్గలోనే తుంచేయాలి. అలా చేసినప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. _ ఈ కథనం కూడా సరదాగా రాసిందే, ఎవరినీ ఉద్దేశించి కాదని మనవి.. )
15 comments:
"వినరా సూరమ్మ కూతురు మొగుడా..." పాటను గుర్తుకు తెచ్చిందండి మీ ఈ టపా..నాకు మీరు రాసిన విధానం చాలా నచ్చిందండి.
శోభ గారు, ఎంత అలవోకగా అల్లేస్తారండి ఇలాంటి చక్కని కథల్ని.
@ జలతారు వెన్నెలగారు
@ పద్మార్పితగారూ
@ చిన్నిగారూ..
అందరికీ లాలస కథ నచ్చినందుకు బోలెడన్ని థాంకులు :)
జలతారు వెన్నెల గారు చెప్పినట్లు ఆ పాట గుర్తొచ్చినా అది క్షణికమే...సంసార సరిగమలన్నీ హుందాగా చిత్రించిన తీరు..భర్త పట్ల ఇల్లాలి పొజెసివ్ నెస్, సంసారంలో చిలిపి సరసాలు సైతం హుందాగా వ్యక్తి(అక్షరీ)కరించిన నీ భావ పరిణతి నీ రచనలన్నిట్లోనూ కనపడుతుంటుంది...నైస్ బంగారూ....ఏకత్వమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఒడిసిపట్టినట్లున్నావ్ రా....సో క్యూట్..:)
జలతారు వెన్నెలగారు చెప్పినట్లు ఆ పాట గుర్తొచ్చినా అది క్షణికమే..ప్రతి పదంలో..ప్రతి భావంలో పరిణతి..భర్తపట్ల ఇల్లాలి పొజెసివ్ నెస్ బాగా ప్రస్ఫుటమయ్యేలా రచనా శిల్పాన్ని తీర్చి దిద్దావు. సంసారంలో సరిగమలు,చిలిపి సరసాలు హుందాగా అక్షరీకరించిన నీ కలానికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ....నీ సోదరి...
@ పద్మక్కా..
సంసారంలో చిన్న చిన్న అల్లర్లు, చిలిపి తగాదాలు, అలకలు, నిట్టూర్పులు, ఓదార్పులు,.. ఇవన్నీ ఉంటేనే కదా అందం.
కానీ ఈనాటి యాంత్రిక జీవనంలో ఇలాంటి ఫీలింగ్స్‌కి చోటు ఎక్కడుంది. లేచింది మొదలు, నిద్రపోయేదాకా ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్ అనేదే ఉండని జీవితాలు మనవి.
ఎప్పుడైనా కాస్త విరామం చిక్కితే.. చూసి హాయిగా ఆనందిస్తూ, లోలోపల దాగివున్న చిన్ని చిన్ని ఫీలింగ్స్‌ను బయటికి తెచ్చి సేదతీరాలనే ఈ కథనం ద్వారా నా ప్రయత్నం.. మీ అందరికీ ఇది నచ్చింది అంటే నా ప్రయత్నం ఎంతో కొంత సఫలమైనట్లే...!
సంసారంలో అనుమానం అన్నదానికి బీజం పడ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కళ్ళకి కట్టినట్టు చెప్పారు...అద్భుతంగా ఉంది అక్కయ్యా
Too good Shobha gaaru :)I just love it.
Thanks a lot Shamili Dear And Priya gaaru.. :)
లాలస మీ రచన చాలా సరళంగా చేస్తూనే భార్యా భర్తల మద్య వుండే సున్నితమైన్ ప్రేమాను రాగాలు , ముఖ్యంగా భార్య కుండే ప్రేమతో కూడిన చిన్న అనుమానం ...రమ్యం గా వర్ణించారు ..కధలో మెలిక ముందుగానే ఊహించిందే ..కాని చివరలో మనకి ఇలా0టి పాపా వుంటే బావుంటుంది అని అమ్ములుతో భర్త అంటాడు ..అక్కడ నేను ఫిదా అయ్యాను ...శోభ గారు మనసుకి హత్తుకుంది మీ రచన.
బహుదూరపు బాటసారిగారు...
మనఃపూర్వక ధన్యవాదాలు..
చాలా బాగుంది శోభ గారు, ఈ టపా చదివినిన తరువాత .... నాకు మాత్ర౦ వీలైన౦త త్వరగా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది... కానీ అమ్ములు లా౦టి భార్య దొరికితే జీవితం మధురమే...
- అంజి బాబు (https://www.facebook.com/veeranjaneyulu1)
@ మరెందుకు ఆలస్యం అంజిబాబుగారు...
త్వరగా ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి... ఈ టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
lalasa chala bagundandi. kani chaduvutunnattuga ledu. choostunnattuga vundi.
@chvgupta గారు ధన్యవాదాలండీ.
Post a Comment