నా చిన్నతనంలో ఐదేళ్లు ఉంటాయనుకుంటా...! వంద గడపలున్న మా ఊర్లో, ఒకరోజు ఏడుస్తూ పరుగులెడుతున్నాను. ముందు నేను, నా వెనకే మా అమ్మ.. ఆగవే తల్లీ..!! అంటూ కోపంగా వెంటబడుతోంది. నేనేమో ఆమెకు అందకుండా పరుగు తీస్తున్నాను.
ఎలాగోలా అమ్మ నన్ను పట్టుకునేసింది... ఊహూ.. నాకు వద్దమ్మా అంటూ ప్రాధేయపడుతున్నాను. "అది కాదే ఆడపిల్లకు అదుంటేనే అందం. లేకపోతే కోతిలాగా ఉంటావు" అంటూ గట్టిగా పట్టుకుంది. "అయినా ఫర్వాలేదు నాకొద్దు" అంటూ పెనుగులాడుతున్నాను. అమ్మ వినలేదు సరికదా, మా పిన్నమ్మను కూడా తోడు తీసుకుని పట్టుకుని... ఎలక ముల్లు (వెలగ చెట్టు ముల్లు)తో గట్టిగా కుట్టేసింది.
ఏం కుట్టేసిందబ్బా అనుకుంటున్నారా...! మరేం లేదండీ... మా అమ్మ నాకు ముక్కు కుట్టేసింది. "ఆడపిల్ల ముక్కుపుడక పెట్టుకుంటేనే చూసేందుకు అందంగా ఉంటుంది. లేకపోతే బాగుండదు" అని చెబుతూ.. అప్పట్లో మాఅమ్మ చాలా సార్లు నా ముక్కు కుట్టే ప్రయత్నాలు చేసి చేసీ... ఆరోజు ఎట్టకేలకు విజయం సాధించేసింది.
బాగా సలపరంగా ఉండటంతో ముక్కు పట్టుకుని... కుయ్యో... మొర్రో అంటూ అమ్మ వైపు కోపంగా, గుర్రుగా చూశాను. అమ్మ, మా పిన్నమ్మ మాత్రం అదేం పట్టించుకోకుండా నవ్వుతూ... ఎంత ముద్దొస్తున్నావే.! అంటూ ఇంటికి తీసుకెళ్లారు. మొదట కోప్పడినా, నొప్పిగా ఉంటుందేమో అని భయపడినా తరువాత చూడగా, చూడగా చాలా బాగుందనిపించింది.
కుట్టు గాయం ఆరిన తరువాత మా అమ్మమ్మ కొనిచ్చిన బంగారు ముక్కుపుడకను పెట్టుకున్న రోజున నా సంతోషం అంతా ఇంతా కాదు. ఆరోజు ముక్కు కుట్టద్దంటూ ఊరంతా పరుగులెత్తిన నేను, ముక్కుపుడకను పెట్టుకుని ఊరంతా కలియదిరిగి అందరికీ చూపించి మురిసిపోయిన విషయాలన్నీ ఇప్పుడు గుర్తొస్తే... భలే తమాషాగా ఉంటుంది.
నా ముక్కుపుడక సంగతిని కాసేపలా పక్కనబెడితే.... సాధారణంగా విదేశాలకు వెళ్ళి వచ్చిన భారతీయ స్త్రీలు (అందరూ కాదులేండి..), అక్కడి సంస్కృతిని బాగా వంటబట్టించుకుని, వంకర్లుబోతూ, మాతృభాషనే వచ్చీరానట్లు మాట్లాడే ఈరోజుల్లో... లండన్‌లో ఓ 13 ఏళ్ల అమ్మాయి ముక్కుపుడక పెట్టుకుని పాఠశాలకు వెళ్లేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట...!
ఆ వివరాల్లోకి వెళ్తే... భారతీయ సంప్రదాయంలో ఒక భాగంగా నిలిచిన ముక్కుపుడకను పెట్టుకుని స్కూలుకు వెళ్ళిన భారత సంతతికి చెందిన షన్నాన్ కన్నొల్లి అనే పదమూడేళ్ల చిన్నారిని స్కూలు యాజమాన్యం అడ్డగించింది. అంతేగాకుండా, ఇలా ముక్కుపుడక ధరించి రావటం స్కూలు నిబంధనలకు విరుద్ధమని, అది తీసేంతదాకా స్కూల్లోకి అడుగుపెట్టనిచ్చేది లేదంటూ ఆంక్షలు విధించింది.
దీంతో కన్నొల్లి స్కూలు యాజమాన్యంపై పోరాటానికి దిగగా, ఆమెకు బాసటగా బ్రిటన్‌లోని హిందూ కౌన్సిళ్ళన్నీ పూర్తి మద్ధతును, సహకారాన్ని అందించాయి. చివరకు ఈ విషయంలో సమతా మండలి కలగజేసుకోవడంతో ఎట్టకేలకు స్కూలు యాజమాన్యం దిగొచ్చింది. పాఠశాల పరిసరాల్లో ముక్కుపుడక ధరించవచ్చంటూ తన నిబంధనలను సడలించుకుంది.
భారతీయ సంప్రదాయాన్ని విదేశాల్లో సైతం కాపాడి, హిందూ సంప్రదాయానికి తలమానికగా నిలిచి, విజయం సాధించిన చిన్నారి కన్నొల్లికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం కదూ...!
ఈరోజుల్లో ఫ్యాషన్‌కు అలవాటు పడిన చాలామంది మహిళలు... ముక్కెర పెట్టుకునేందుకు కుట్టించుకున్న రంధ్రాలను సైతం పూడ్చేసుకుని అందంగా, ప్యాషన్‌గా కనిపించాలని తాపత్రయపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఎక్కడో విదేశాల్లో ఉంటూ కూడా భారత సంస్కృతి, సాంప్రదాయాలను వంటబట్టించుకున్న ఈ చిన్నారి పోరాటం... ఈనాటి ఫ్యాషన్ మహిళల కళ్లు తెరిపించాలని ఆశిద్దాం.
శిఖరం
1 day ago
0 comments:
Post a Comment