Pages

Friday, 29 October 2010

బ్యాక్ టు హోమ్...!

"అన్నీ మంచి శకునములే" అని మనసులో పాడుకుంటూ... కోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టాము. ఎంట్రన్స్‌లోనే ఓ లాయర్ ఏం కావాలమ్మా...! అంటూ ముందుకొచ్చాడు. ఫలానా సార్... అంటూ వివరాలు అవీ చెప్పేసరికి, నాతో రండని తీసుకెళ్లాడు.

కోర్టు ఇంకోవైపు ఎంట్రన్స్ వద్ద పాండీబజార్ పోలీస్ స్టేషన్ క్రైం డిపార్ట్‌మెంట్ పోలీసాయన ఉంటే.. అతడివద్దకు తీసుకెళ్లాడు ఆ లాయర్. వెళ్లగానే ఆ పోలీసాయనను చూస్తూ... అందరూ నాదగ్గరే బాగా ఇరుక్కుపోతారండీ అన్నాడు తమిళంలో. దానికో నవ్వు పారేసిన పోలీసాయన కేసు వివరాలను విని, లాయర్ చెప్పినట్లుగా చేయండమ్మా అన్నాడు.

అంటూనే... కాసేపలా పక్కకు వెళ్లి, మళ్లీ మా దగ్గరకు వచ్చారు. కెమెరా వాల్యూ ఎంత ఉంటుందని? ప్రశ్నించారు. మేము చాలా రోజులు క్రిందట కొన్నాము కాబట్టి, ఇప్పుడు 3 వేల రూపాయల విలువ చేస్తుందని చెప్పాము. ఇంతలో ఆ లాయర్ ఓస్ అంతేనా ఇంకేం అడుగుతాము.. అంటూ ఓ నిట్టూర్పు విడిచాడు. పోలీసాయన ఏదో పని ఉండి వెళ్తూ ఎలాగోలా చేయవయ్యా.. అని లాయర్‌కు చెప్పేసి వెళ్లిపోయాడు.

ఇంక ఆ లాయర్ ఫీజు విషయంలో మాతో బేరాలు మొదలెట్టాడు. ఓ రెండువేలు ఇస్తారా అని అన్నాడు. ఏంటి సార్..! మా కెమెరా 3 వేలు అయితే మీకు రెండువేలు ఇచ్చేయాలా..? ఏమైనా న్యాయంగా ఉందాండీ... అన్నాన్నేను. ఇంకేం చేయనమ్మా ఇంకా చాలా పనులు చేయాలి... మీకు కెమెరా ఊరికినే చేతికి రాదు కదా..! అన్నాడు.

ఆ లాయర్ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో.. మా అబ్బాయి ఫ్రెండుకు ఫోన్ చేయమని చెప్పగా అతడు అందుబాటులో లేడు. ఇంకేం చేయాలబ్బా...! అనుకుంటుండగా మా కొలీగ్ ఒకరు గుర్తొచ్చాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పగా... అయ్యో..! ముందే నాకు చెప్పి ఉంటే నేను చూసుకుందును కదా..! అన్నారు. సరే ఓ పది నిమిషాలు ఆగి ఫోన్ చేయండి నేను ఏమైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తానని చెప్పారు.

ఓ పావుగంట తరువాత ఫోన్ చేయగా... ఆయన తన లాయర్ ఫ్రెండు ద్వారా ఆ కోర్టులోనే ఉన్న మరో సీనియర్ లాయర్ వివరాలు, ఫోన్ నెంబరు ఇచ్చి ఆయన వద్దకు వెళ్ళమన్నారు. ఇందాకటి లాయర్‌కు మాకు తెలిసినవారు ఉన్నారండీ... మీ సహాయానికి కృతజ్ఞతలంటూ సెలవు తీసుకున్నాము.

ఆ సీనియర్ లాయర్‌ను కలువగా... ఆయన తెలుగు తెలిసిన తన జూనియర్ లాయర్‌ను పిలిచి కేసు వివరాలు చెప్పి ప్రొసీడ్ కమ్మని చెప్పి పంపించారు. సార్... ఇంక మా కెమెరాను తీసుకెళ్లిపోవచ్చా... అని అడిగాను ఆ తెలుగు లాయర్‌ను. అంత ఈజీగా ఎలా తీసుకెళ్తారమ్మా...! ఇంకా చాలా పనులున్నాయని అన్నారు. అప్పుడుగానీ మాకు తెలియదు మా కెమెరా మా చేతికి రావాలంటే ఇంకా మూడు, నాలుగు రోజులు పడుతుందని...

సరేనండీ... ఇప్పుడేం చేయాలి మళ్లీ నేనే అడిగాను. మొదటగా పిటీషన్ ఒకటి తయారు చేయించాలి. ఈ పిటీషన్‌ను జడ్జి కూర్చోకముందే పొద్దుటిపూటే పెట్టేయాలి. ఇప్పుడు ఒంటిగంట అవుతోంది కాబట్టి ఇంక రేపు పొద్దున్నే వేయాలి. ఈరోజేం చేయలేం అన్నాడాయన. ఎంతో ఆశగా కెమెరాను తీసుకెళ్లొచ్చు అనుకుంటుంటే మళ్లీ రేపు కూడా రావాలా...? బాగా నీరసపడిపోయాను.

పిటీషన్ తయారీ పనులు గట్రా.. అన్నీ పూర్తి చేసుకుని రేపు పొద్దుటే వస్తామని చెప్పి లాయర్‌కు చెప్పి కోర్టునుండి బయటపడ్డాము. మరుసటిరోజు కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరై... పిటీషన్‌ వేసింది తానేనని, కెమెరా నాదేనని చెప్పాను. సరేనమ్మా..! ఇప్పుడు మీరు ఇంటికెళ్లిపోయి మూడు రోజుల తరువాత రండి... ఆరోజు కెమెరాను మీవెంట తీసుకెళ్లచ్చు అన్నాడు లాయర్.

మూడురోజుల తరువాత మళ్లీ కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరవగా.. ఆయన కెమెరాను నాకు హ్యాండోవర్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేశారు. హమ్మయ్య... అనుకుంటుండగా కాసేపు కూర్చొండి ఇదో వస్తానంటూ బయటికెళ్లి తిరిగొచ్చాడు లాయర్. మీ ఆర్డర్ టైప్ చేసినందుకు, రికార్డ్స్ వెతికిపెట్టినందుకుగానూ వాళ్లు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఓ రెండొందలు ఇవ్వండని అడిగారు.

అన్ని ఖర్చులకుగానూ ఆయనకు అప్పటికే డబ్బులు ముట్టజెప్పేశాను. మళ్లీ ఆయనలా అడిగేసరికి బిత్తరపోయాను. అదేంటండీ అప్పుడే డబ్బులిచ్చేశాను కదా..! మళ్లీ అడిగితే నేనెక్కడికి పోను అన్నాను. ఆయనలాగే ఉండిపోయేసరికి మావాడు పక్కకు పిలిచి మనం ఇవ్వకపోతే ఇంకాసేపు లేటవుతుంది, ఎందుకొచ్చిన గొడవ ఇచ్చేద్దామని చెప్పాడు. నేను సరేనన్నాను.

డబ్బు ఇవ్వగానే ఆయన ఎవరిదగ్గరకో పోయి, అన్నీ పేపర్లను రెడీ చేయించి పైన ఉండే ప్రాపర్టీ రూంకు తీసుకెళ్లాడు. అక్కడ వివరాలన్నింటినీ రికార్డు చేసే ఆయన... చివర్లో డబ్బు డిమాండ్ చేయగా మా లాయర్ నావైపు చూయించాడు. ఏమ్మా మాకు రాసినందుకుగానూ ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్నాడు. మొదట ఇవ్వనని బయటికి వచ్చేశాను.

అతను ఊరుకుంటాడా..? బయటికి నాదగ్గరికి వచ్చి నేనిప్పుడు జడ్జి దగ్గరకు సంతకం చేయించేందుకు వెళ్లాలి. అతను సంతకం చేస్తేనే మీకు కెమెరా ఇవ్వగలను అని గొణుగుతూ పక్కన నిల్చున్నాడు. నేను ఉండేకొద్దీ లేటవుతుందని చేసేదేం లేక అతనికి కొంత డబ్బు ఇవ్వగానే అతనెళ్లి సంతకం చేయించుకొచ్చి నన్ను లోపలికి పిలిచి కెమెరాను అప్పజెప్పాడు.

కెమెరాను నా చేతికి తీసుకుని ప్రాపర్టీ రూం క్లర్క్‌కు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి సంతోషంగా మా అబ్బాయి చేతికి కెమెరాను అందించాను. గబగబా కెమెరాను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న సెల్స్ వేసి చూస్తే... మంచి కండీషన్లోనే ఉంది. సార్ మనకు చాలా సాయం చేశారంటూ వెంటనే మావాడు లాయర్‌ను ఓ ఫోటో తీశాడు. లాయర్‌కు, సీనియర్‌ లాయర్‌కు థ్యాంక్స్ చెప్పి కోర్టు నుండి బయటపడ్డాము.

ఇదండీ నేను పోగొట్టుకుని ఎట్టకేలకు సాధించుకున్న మా బుల్లి కెమెరా కథ. పోగొట్టుకుని ఎలాగైనా తెచ్చేసుకున్నారు కదా...! అయినా మూడు, నాలుగు రోజులు ఆ కథను ఆపకుండా రాసేయాలా..? అనుకుంటున్నారా..?! మీకు చదివేందుకే అంత ఇబ్బందిగా ఉంటే... దాదాపు ఓ ఐదారు నెలలపాటు నేను పడ్డ కష్టం ఎలా ఉంటుందో ఆలోచించండి.

ఇంతకూ నేను పోగొట్టుకున్న కెమెరా... మేం కొన్నప్పటి ధర 10 వేల రూపాయలు కాగా... నేను దాన్ని తిరిగీ దక్కించుకునేందుకు మరో 2 వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వచ్చింది.

అయినా నేను ఈ కథ ద్వారా చెప్పదలచింది మాత్రం ఒక్కటే...! బయటికి వెళ్లేటప్పుడు మన వస్తువులపట్ల తగినంత జాగరూకతతో లేనట్లయితే... చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వస్తువును పోగొట్టుకున్నట్లయితే తిరిగీ దానికోసం ప్రయత్నించకండి.. ఒకవేళ ప్రయత్నిస్తే.. మేం ఎదుర్కొన్న కష్టాలు మీకూ తప్పవు.

(సమాప్తం)

6 comments:

Rishi said...

>>వస్తువును పోగొట్టుకున్నట్లయితే తిరిగీ దానికోసం ప్రయత్నించకండి..
:)

శిశిర said...

బాగుందండి. ముఖ్యంగా మన న్యాయస్థానాల్లో న్యాయం ఎలా జరుగుతుందో చాలా బాగా అర్ధమయింది. :)

జయంత్ said...

లంచం ఇవ్వడం నేరం అని అన్ని ప్రభుత్వా శాఖలు బాకా ఊదేవే కానీ, చిన్న చిన్న విషయాలకే లంచం ఇవ్వాల్సి వస్తుంది. యువ పార్టీ నాయకులు ఇలాంటి చోట్ల తిష్ట వేసి, జనాలకి సేవ చేయ్యచ్చు కదా...లేక సినీ అభిమాన సంఘాలో...జనాలు మెచ్చుకుంటారు...హీరో లకీ పేరు వస్తుంది..

శోభ said...

@ రిషిగారూ.. ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే ఇక దాని గురించి మర్చిపోవటమే మంచిదని మా కెమెరావల్ల మాకు తెలిసి వచ్చిన నిజం. అందుకే ప్రయత్నించవద్దని అన్నాను.

@ శిశిరగారూ.. టపా నిడివి పెద్దదవుతుందని చాలా విషయాలు తడమలేదండీ.. లేకపోతే ఇంకో రెండు పోస్టులు అవుతాయి.

@ జయంత్ గారూ మీరన్నది నిజమేనండీ.. కోర్టులో పనిచేస్తున్నవారు చివరికి పది, 20 రూపాయలకు కూడా ఎగబడ్డారంటే నమ్మండి. జడ్జి దగ్గర ఒక సంతకం చేయించేందుకు 50 రూపాయలు అడిగాడు. లేవన్నాను, పోనీ 20, 10.. ఇలా అడుగుతూ పోయాడు. లేవనేసరికి చివరికి టీ అయినా ఇప్పించండని వెంటపడ్డాడు.....

ravi said...

chaala baaga rasarandi. madhyalo vadileyakunda chivaridaka kashtapaddaru. Good job.

Unknown said...

అక్క! పోగొట్టుకున్నది దొరికింది కదా అయితే హ్యాపీ మరి