Pages

Friday, 25 March 2011

'పండు'టాకుల పాట..!!



ఇన్నాళ్లూ చలితో బిగదీసుకుపోయిన కోకిలమ్మ
గొంతు సవరించుకుని వేసవికి సన్నద్ధమవుతోంటే...

నేనేమీ తక్కువ తినలేదంటూ
కోకిలమ్మకు ఆశ్రయం ఇచ్చే చెట్లు కూడా
ఆకులన్నింటినీ రాల్చేసుకుని,
పచ్చని పెళ్లికూతురిలా, చిగుర్లు తొడిగి
వేసవికి చల్లటి స్వాగతం చెప్పేందుకు
బిరబిరా సృష్టికార్యాన్ని నెరవేరుస్తున్నాయి...

అంతకుముందుగా..
కోకిలమ్మ ఓ చెట్టుపై వాలి రాగాలు తీస్తోంటే...
గలగలమంటూ 'పండు'టాకులు చప్పుడు చేశాయి
ఓహో ఇదేంటి.. నా పాట కంటే,
వీటి చప్పుడే కమ్మగా ఉందే అనుకుంటూ
ఓ చెవి అటు పారేసింది కోకిలమ్మ

పండుటాకులున్న కొమ్మకు పక్కగా మరో కొమ్మ
ఆ కొమ్మకొక చిన్న రెమ్మ
ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు
చల్లగాలి జోలపాటతో నిద్దరోయిన దాన్ని
సూర్య కిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి...
ఒళ్లు విరుచుకుని కిలకిలమంటున్న చిగురుటాకును
సన్నగా, బాధగా 'పండు'టాకుల పాట తాకింది
పాటను విన్న చిగురుటాకు ఫక్కున నవ్వింది

దాంతో 'పండు'టాకులన్నీ ఇంకా గట్టిగా పాడసాగాయి
చిగురుటాకు కూడా మళ్లీ మళ్లీ నవ్వసాగింది
ఇంతలో ఓపిక నశించిన ఓ పండుటాకు...
"ఎందుకే ఆ మిడిసిపాటు" అంటూ
చిగురుటాకును నిలదీసింది..
మిడిసిపాటు ఎందుకుండదు..
నేనేమీ మీలా పసుపుపచ్చను కాదు...
నున్నగా నవనవలాడే పచ్చనాకును
ఇకపై పువ్వులు పూస్తాను..
పండ్లు కాస్తాను... అంటూ
ఆపకుండా చెప్పుకుపోతోంది పచ్చనాకు..

అలా చెబుతూ, చెబుతూ
ఇక ముందుకెళ్లటం సాధ్యంకాక...
ఓ చోట చటుక్కున ఆగిపోయింది...
వెంటనే పండుటాకులు అందుకున్నాయి
"ఏం ఆపేశావేం? కానీ...?" రెట్టించాయి
"మరీ.. మరీ..." గొణుక్కుంటోంది పచ్చనాకు...

తానూ ఏదో ఓరోజున 'పండు'టాకు
అవక తప్పదని అర్థమైంది 'పచ్చ'నాకుకు...
దాంతో మనసు భారంకాగా... తలవాల్చేసి,
పండుటాకులకేసి దీనంగా చూసింది
ఇందాకటిలా కాకుండా...
'పండు'టాకుల పాటలోని ఆర్తి
మనసుని పిండేయగా...
పండుటాకులను సగర్వంగా సాగనంపుతూ
సన్నగా పాటనందుకుంది...
ఇదంతా కళ్లారా చూసిన కోకిలమ్మ
పచ్చనాకుతో కలిసి కోరస్ ఇచ్చింది....!!!

25 comments:

జ్యోతి said...

beautiful.. చాలా బావుంది..

శోభ said...

ధన్యవాదాలు జ్యోతిగారూ.. నా బ్లాగులో మీది మొదటి కామెంట్ అనుకుంటా... :)

Anonymous said...

పండుటాకులు పచ్చనాకును ఎందుకు నిలదీసాయి. అలోచింపచేయటానికా? బాధపెట్టదానిక...?

శోభ said...

రెండూనూ.. ఆలోచింపజేయటంతోపాటు, ఎవరికైనా అలాంటి దశ ఒకటి ఉంటుందని గుర్తు చేయటం అనేదే నా కవిత ముఖ్య ఉద్దేశం. ఇక బాధ అంటారా వృద్ధాప్యానికి, మరణానికి బాధపడేవాళ్ళూ ఉంటారు.. అబ్బా ఈ దశ దాటుకుని చల్లగా వెళ్లిపోవాలని అనుకునేవాళ్ళూ ఉంటారు.. ఎవరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు..

Anonymous said...

థాంక్స్ పిన్ని.. సరిగ్గా చెప్పారు

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

శోభా బాగుంది..హాయిగా చల్లగా కొంతసేపు ఉద్యాన వనంలో విహరించినట్లుగా ఉంది...చిగురించడం..మురిసిపోవడం..పండిపోవడమేగా జీవితమంటే? ఈ నిజాన్ని ఎంత బాగా చెప్పావు డియర్! అభినందనలు!

శోభ said...

ధన్యవాదాలు జ్యోతక్కా...

SRRao said...

శోభ గారూ !
వసంతానికి స్వాగతం పలుకుతూనే భవిష్యద్దర్శనం చేయించారు. ధన్యవాదాలు.

శోభ said...

SRRao గారూ... మీ అభిమానానికి ధన్యురాలిని సర్.. :)

కనకాంబరం said...

భాగుంది శోభాజీ! వసంతాగమనం... అద్భుత విన్యాసం ....చక్కని వ్యక్తీకరణ.....keep it up...శ్రేయోభిలాషి (Kanakaambaram)...నూతక్కి.

శోభ said...

@ నూతక్కి గారూ ధన్యవాదాలు సర్.. గురూజీ.. మీ కామెంట్ చూసి చాలా రోజులైంది.. మీరు లేని తెలుగు సాహితీ వలయం బోసిపోయినట్లుగా ఉంది.. ఇలా మీ స్పందన చూడటం చాలా సంతోషాన్నిస్తోంది. థాంక్యూ వెరీ మచ్ సర్..

గిరీష్ said...

చిన్నప్పుడు ఋతువులు పాటం చదివినట్టు ఉంది అండి.
నాకు డౌట్ మీరు కవయత్రి నా? నిజం చెప్పండి లేక పొతే పోలీసు కంప్లైంట్ ఇస్తా.. :)
ఖచ్చితం గా ఇది తెలుగు పాఠ్య పుస్తకం లోకి చేరే అవకాసం, అర్హత ఉన్న టపా.
Thanks for a very nice post.
jyothirmayi prabhakar గారు కూడా బాగా చెప్పారు.

Anonymous said...

baagundi freind

శోభ said...

గిరీష్‌గారూ.. ఓ రెండేళ్లనుంచీ నా భావాలను, అనుభూతులను అక్షరాల్లో పెట్టి ఇలా మీ అందరిముందూ ఉంచుతున్నాను. కవయత్రి అంత పెద్ద పదం నాకు వర్తించదేమో..? :)

మీ అందరి అభిమానానికి ధన్యురాల్ని. మీ అభిమానం, ఆదరణ కలకాలం ఇలాగే ఉండి పోవాలని కోరుకుంటూ.. పోస్టు నచ్చినందుకు నెనర్లు...

శోభ said...

పేరు రాయటం మర్చిపోయిన ఫ్రెండ్‌కు నా పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు... :)

vaartha said...

challa bhagundi kavitha
=
puvvu nela raluthundi chiru navvutho kayai vupuri postunnaga ani sabarapadipothu
pandutaku annthae pranamposuni chettuku nanae eruvunukada ani muchata paduthundi
mruthvu ankuntudi prathisari
nenu odiputhanna nemitabba ani
=
manchi kavitha, manchi alochana

శోభ said...

vaartha గారూ నా కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ..

bangaRAM said...

vayasunu minchina parinithitho rasavamma shobha.prastutha vyavastalo jarugutunna yadarda parisithinni kallaku kattinattu rasavu.chalabagundi.kavitvamlo english pada prayogalu lekunda chudamma.vere chota choice ane dani badulu empikalu ante bagundemo aalochinchu thalli.

శోభ said...

bangaRAM బాబాయ్‌గారూ... నా కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

నిన్న సాహిత్య నిధిలో నేను పోస్టు చేసిన "చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా" అనే కవితలో "జీవితం అంటే ఛాయిస్‌ల మయం" అంటూ రాసింది వాస్తవమే. అది రాసేటప్పుడు నేను కూడా ఇంగ్లీష్ పదం లేకుంటే బాగుండేది అనుకున్నా కానీ ఎందుకో అలాగే పెట్టేశాను.

మీరు చెప్పిందే నిజం బాబాయ్‌గారూ.. ఛాయిస్‌లకు బదులుగా ఎంపికలు అని ఉంటే చాలా బాగుండేది. ఎంతో అభిమానంతో మీరు చేసిన సూచనను తప్పకుండా అంగీకరిస్తున్నాను. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను..

మరోసారి మీకు ధన్యవాదాలు.

కంచర్ల said...

శోభాయమ్మా!
మీ " పండు" టాకుల పాట చూసాను. చాలా బాగుంది. పాతరోజులు, ఒకప్పటి రచయిత(త్రు)లు గుర్తుకు వచ్చారు.
యిలాంటి కవితలు చదివి చాలా రోజులయింది. ఒకరిద్దరు..రాస్తున్నారనుకోండి. పాత తరానికి కొత్తదనంగా ఊపిరిపోసావ్....పోస్తున్నావ్.
రెండేళ్లకే ముచ్చటగా ముప్పైమూడు వసంతాల పండుటాకులా పండినావమ్మా!
అందుకే వందనాలమ్మా! అభివందనాలు!!...
- కంచర్ల సుబ్బానాయుడు.

శోభ said...

కంచర్లగారూ... నిండు మనసుతో మీరు అందించిన అభినందలకు ధన్యురాల్ని.. మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ... ధన్యవాదాలు..

గిరీష్ said...

కాస్త ఆలస్యంగా,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి శ్రీ ఖరనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి.

శోభ said...

ధన్యవాదాలు గిరీష్‌గారూ...

మీకు కూడా ఆలస్యంగానే తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు (నేను కూడా ఊర్లోలేను.. వారం రోజులపాటు అమ్మ దగ్గరికి వెళ్లి, అక్కడే ఉగాది జరుపుకుని ఏఫ్రిల్ 5న తిరిగి వచ్చాను)

veera murthy (satya) said...

సాగనంపే వారు కూడా సాగి పోయె వారే!
తోడొచ్చేవాతు కూడా ఓచోట ఆగిపోయేవారే!
ఎవరికెంతవరకూ ఎమౌతామో తెలియకున్నా...
కలిసున్నామన్న సోయినిచ్చేది కోరస్సే!

బాగుంది!!

శోభ said...

తమ్ముడు సత్యా... థ్యాంక్యూ.....