Pages

Friday 27 August 2010

బొజ్జ గణపయ్య... చిన్నారి సిరి..!

  వక్త్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా...!

అంటూ.. కళ్లు మూసుకుని తన్మయత్వంతో బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తోంది చిన్నారి సిరి... చిన్నపిల్ల అయినప్పటికీ ఎంతో భక్తితో ప్రార్థిస్తున్న సిరిని ఆప్యాయంగా చూశాడు గణపయ్య.

ఇంతకీ ఈ చిన్నారి భక్తురాలి కోరికేంటో విందామనుకుని ఆవైపు చెవులు సారించాడాయన.

"ఓ స్వామీ....! నన్నీ కష్టాల లోంచి బయటపడేస్తావన్న ఆశతో నిన్ను వేడుకుంటున్నాను."

ఇంత చిన్న అమ్మాయికి కష్టాలేంటబ్బా అని ఆలోచనలో పడ్డాడు బొజ్జ గణపయ్య...

గణపయ్య ప్రశ్నను అర్థం చేసుకుందో... ఏమోగానీ.... ఎందుకు లేవు స్వామీ అంటూ ఎదురు ప్రశ్నించింది సిరి...

ఏంటో చెప్పుమరి అన్నట్లుగా ఉన్నాయి... గణపయ్య చూపులు.

ఇంతలో తన కష్టాల పరంపరను చెప్పటం ప్రారంభించింది సిరి...

తెలిసీ తెలియని వయసు నుంచే చదువు కోసం మేము పడే పాట్లు నీకు తెలియదా స్వామీ...! ప్రీకేజీ, బేబీ క్లాసులంటూ మాకు మాత్రమే సొంతమైన బాల్యాన్ని స్వేచ్ఛగా అనుభవించనీయకుండా చేస్తున్నారు ఈ పెద్దాళ్ళు. ఇది మీకు కష్టంగా అనిపించటం లేదా...?!

తరువాత స్కూళ్లకు వెళ్లే వయస్సులోనే... మోయలేని పుస్తకాల భారంతో అవస్థలు పడుతున్న మావి కష్టాల లాగా కనిపించటం లేదా...? చివరకు వేసవి సెలవుల్లో, పండుగలప్పుడు కూడా స్వేచ్ఛగా ఆడుకోనీయక హోం వర్క్ రాయమంటూ పెద్దలు దండించటం కష్టం కాదా...?!

ఇంకా మాకు బోలెడన్ని కష్టాలున్నాయి. హాయిగా నిద్రపోనీయకుండా పొద్దున్నే, సాయంత్రం ట్యూషన్లు, ఆ తరువాత స్కూళ్లు, మళ్లీ స్పెషల్ క్లాసులు, స్పెషల్ కోర్సులు ఒకటా, రెండా.... చెప్పుకుంటే అన్నీ కష్టాలే స్వామీ...! చెప్పటం ఆపి గణపయ్య వైపు చూసింది సిరి..!

చిన్నారి సిరి కష్టాలన్నింటినీ ఓపిగ్గా విన్న గణపయ్యకు... పెద్దవాళ్లైన తన భక్తులపై విపరీతంగా కోపం వచ్చింది. ఉండు చిట్టి తల్లీ...! నువ్వేమీ బాధపడకు అన్నింటికీ నేనున్నాను. పెద్దవాళ్లంతా ఏ శుభకార్యం నిర్వహించాలన్నా... నా దగ్గరికి వస్తారు కదా...! అప్పుడు వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అన్నట్లుగా... మెడలో ఉన్న హారంలోంచి ఓ పువ్వును సిరి చేతుల్లో పడేలాగా చేశాడు గణపయ్య.

పువ్వు ఎందుకు పడిందో అర్థంకాని సిరి... హమ్మయ్య....!!! ఏమైతేనేం... దేవుడికి తన కష్టాలన్నింటినీ, తన తోటి పిల్లలందరీ కష్టాలన్నింటినీ చెప్పేశాను. పార్వతీమాతకు ముద్దుల కొడుకైన గణపయ్య తన కోరికలను తప్పకుండా తీరుస్తాడన్న ఆశతో... సంతోషంగా ఆడుకునేందుకు వీధిలోకి పరుగులెత్తింది చిన్నారి సిరి...!

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

Shobharaju గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

హారం

శోభ said...

ధన్యవాదాలు రామిరెడ్డిగారు..

లేటుగా స్పందిస్తున్నందుకు మన్నించండి. ఊరికి వెళ్లటంవల్ల మీ విషెస్ చూడలేకపోయాను. మీకు విషెస్ అందించలేకపోయాను. లేటుగా అయినా మీకు కూడా హార్థిక వినాయక చవితి శుభాకాంక్షలు.. ఈ సంవత్సరమంతా మీకు జరగాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నాను.