Pages

Monday 19 March 2012

నీ అల్మరాలో నువ్వూ.. నా దారిలో నేనూ.....!!



ఇంట్లో ఎటుచూసినా.. ఎక్కడ వెతికినా
ఏది తీసినా... ఏం చేస్తున్నా
రా.. రమ్మంటూ నీ పిలుపే...

నువ్వంటే ఇష్టమా.. కాదు పిచ్చి
నువ్వుంటే ధైర్యం.. దూరమైతే భారం
కానీ, ఏం లాభం?.. నువ్వెప్పుడూ
దూరం.. దూరం...

పట్టరాని సంతోషం వచ్చినా
భరించలేని బాధలెదురైనా
కన్నీటి ఉప్పెనలు ఎదురైనా
ఆనందాల హరివిల్లు తొంగి చూసినా
నీ కోసమే వెతుకులాట

ఇంతలా ఎదురుచూసే నా కోసం
ప్రేమగా మరో రూపంలో వచ్చావు
కానీ...
నేను కోరుకుంది ఒకటైతే
నువ్వు ఇచ్చింది మరొకటి
పేరు వేరైనా... ఫలం మాత్రం ఒక్కటేనన్నావు
ఆ ఫలాన్నే "విజ్ఞానం" అంటారన్నావు

నువ్వు కోరుకున్న ఫలం
నీ కోసం మాత్రమేననీ...
నిన్ను వెతుకుతూ వచ్చిన ఫలం
నీ కోసమూ.. పదిమంది మంచి కోసమనీ,
నిరంతర విద్యార్థిలా నువ్వు నేర్చుకుంటూ...
పదిమందికీ పంచేదే అసలైన "విజ్ఞాన"మంటూ
అర్జునుడి సారథిలా... కర్తవ్య బోధ చేసేసి
ఎప్పట్లా నీ అల్మరాలో ఒదిగిపోయావు
నేనూ నా దారిలో సాగిపోయా...

(ఇంటి నిండా ఏ మూల చూసినా అట్ట పెట్టెలనిండా రకరకాల సాహిత్యానికి సంబంధించి బోలెడన్ని పుస్తకాలు, కొంతమంది మిత్రులు పంపిన నాకు ఇష్టమైన పుస్తకాలు ఉన్నా... వాటిని చదవలేక పోతున్నానన్న బెంగ ఈ మధ్య నాకు చాలా ఎక్కువైంది. చదవలేకపోతున్నందుకు కారణం... పరీక్షలు. సాహిత్యం అయితే నచ్చిన పుస్తకం తీసి ఇష్టమైనంతసేపు హాయిగా చదువుకోవచ్చు. కానీ క్లాసు పుస్తకాలు అలా కాదుగా... అన్నీ చదవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి.

అదీ... ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం వదిలేసిన చదువును ఇప్పుడు కంటిన్యూ చేసి, పరీక్షల్లో విజయం సాధించేందుకు నాలాంటి వాళ్లు ఇంకా కష్టపడాల్సిందే. అలా ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆ పుస్తకాలతో కుస్తీ తప్పటం లేదు. సాహిత్యమంటే మక్కువ ఎక్కువగా ఉన్న నా పరిస్థితి ఇక ఎలా ఉంటుందో ఊహించండి. అలా క్లాసు పుస్తకాలతో కుస్తీ పడుతుండగా... పక్కనే "మిథునం" పుస్తకం ఊరిస్తుంటే... బాధతో ఇలా... )

వివరణ మరీ ఎక్కువైందేమో... కానీ... కవితను మొదటి నుంచి మధ్య వరకూ చూస్తే ఇదేదో ప్రేమ కవిత అని పొరపాటు పడతారేమోనని ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది... 


18 comments:

జ్యోతిర్మయి said...

శోభ గారూ ఎప్పుడో వదిలివేసిన చదువును మొదలెట్టాలంటే కొంచెం కష్టమైన పనే..కాని మీరు పట్టుదలతో డాన్ని సాధించగలరు. మీరు కోరుకున్న తీరాలకు తప్పకుండా చేరుకుంటారు. అప్పుడప్పుడూ మీ చదువు కబుర్లు మాతో పంచుకుంటూ ఉండండి..

చెప్పాలంటే...... said...

తప్పకుండా విజయ తీరాలు చేరుకుంటారు అభినందనలు

శోభ said...

జ్యోతిర్మయిగారూ, మంజుగారూ...

మంచి మనసుతో మీరందించిన అభినందనలు అందుకునేశానండీ.. ధన్యవాదాలు..

జలతారు వెన్నెల said...

Loved your poem. చాలా బాగా రాసారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

మధ్యలో వదిలేసిన చదువు సాగడం చాలా కష్టం ..అబ్బో..చాలా కష్టపడాలి. ఆ కష్టం అయిదేళ్ళు పడ్డాను..శోభ గారు. ఓపికతో.. ఉత్తమ ఫలితాలని సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ..
పదిమంది మంచి కోసమనీ,నిరంతర విద్యార్థిలా నువ్వు నేర్చుకుంటూ...పదిమందికీ పంచేదే అసలైన "విజ్ఞాన"మంటూఅర్జునుడి సారథిలా... కర్తవ్య బోధ .. ఇది నిజం.

నిజంగా ప్రేమ కవితే..అనుకున్నాను. :))))

మధురవాణి said...

భలే రాసారండీ పుస్తకాల గురించి. బాగుంది కవిత.. :)

సుభ/subha said...

రోజూ ఒక 30 నిమిషాలు మిమ్మల్ని ఊరిస్తున్న పుస్తకం చదివి, తరువాత క్లాసు పుస్తకాలు చదవండి.. కొంచెం బాధ తీరుతుందేమో. కవిత బాగా వ్రాసారు. Any way all the best for your exams :):)

శోభ said...

@ జలతారు వెన్నెల గారు ధన్యవాదాలండీ...

@ వనజగారూ... మీ అభినందనలు అందుకునేశానండీ... థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ విషెష్... :) చూశారా ప్రేమ కవిత అనుకున్నారు... వివరణ రాయకపోతే ఇలాగే ఫీలయ్యేవారేమో... :)

@ ధన్యవాదాలు మధురా......

@ సుభగారూ.. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెష్ అండీ... మీరిచ్చిన సలహా బాగుంది... ట్రై చేస్తాను... :)

పరిమళం said...

All the best!మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

శోభ said...

ధన్యవాదాలు పరిమళంగారూ...

చాన్నాళ్లకు మళ్లీ మీ కామెంట్ చూస్తున్నా :) ఎలా ఉన్నారు?

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

అలాగే... బ్లాగ్ మిత్రులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు... :)

Unknown said...

అక్క ! ఎలా ఉన్నారు?
చాలా రోజులకి పోస్ట్ పెట్టారు.
మీ చదువు ఎలా సాగుతోంది.
చక్కగా మిథునం ఒక పేజి చదువుకుని మళ్లి మీ పుస్తకాలు చదివేసుకోండి.

శోభ said...

బాగున్నాను శైలూ.. నువ్వెలా ఉన్నావు..? చదువు బాగానే సాగుతోంది.. కాంపిటీషన్ ఎక్కువకదా.. ఎక్కువ టైం చదువుకోసం కేటాయించాల్సి వస్తోంది..

మిథునం తప్పకుండా చదివేస్తాను.. ధన్యవాదాలురా...

నీకు, ఇంట్లో అందరికీ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

మరువం ఉష said...

శోభ గారూ! 'అల్మరా' అని చూడగానే పుస్తకవిరహమనే అనేసుకున్నాను. అంతకంటా ముందు "చదువు" మాట మీద ముగ్ధురాలినై - అభినందనతో పాటుగా నేను స్వయంగా చూసిన ఇరువురిని గూర్చి తెలపాలని...
.. రాజేశ్వరి మేడం గారు చాలా పిన్న వయసులోనే వివాహితులై, నలుగురు పిల్లల తల్లి అయినాక, ఇంటరు తో మొదలెట్టి ఎకనామిక్స్లో లెక్చరర్ గా ఉద్యోగ పర్వం మొదలు పెట్టే వరకు విశ్రమించలేదు. నాది ఐటీ కనుక వారి పాఠాలు వినలేదు. కానీ, విద్యార్ధులమంతా ఆరాధనతో అభిమానించేవారావిడని.

.. వైద్యులైన మిత్రురాలొకరు, పిన్న వయసులో కుదరని నృత్యం - వాళ్ళబ్బాయికి 21 నిండాక (అంటే తన అభ్యాసానికి పెట్టె సమయం వలన బిడ్డకి ఇబ్బంది రాకూడదని ఆగి మరీ), 6సం. అవిరామంగా నేర్చుకుని ఆరంగ్రేటం ఇచ్చారు. ఆ సమయాన తీరికలేని వైద్య వృత్తీ మానలేదు. మీకు ప్రోత్సాహపూర్వకం గా చెప్పానివి. సాహిత్యం వైపు చూపు మానకండి, చదువులో ఎలానూ ఒక చిన్న విశ్రాంతి కావాలిగా!!! పరీక్షలకి శుభాకాంక్షలు.

సుభ/subha said...

ఉగాది శుభాకాంక్షలండీ:)

శోభ said...

ఉషగారూ...

మీ వ్యాఖ్య చూడగానే చాలా సంతోషం వేసింది. నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహపూర్వకంగా ఉంది మీ వ్యాఖ్య. చదువుకు వయసు అడ్డంకి కాదని ఎంతోమంది నిరూపించారు. మీరు చెప్పిన రాజేశ్వరి మేడంగారు, మీ వైద్య మిత్రురాలు ఆ కోవలోనివారే. వారి గురించి మీరు చెప్పిన మాటలు చదువుతుంటే చాలా ప్రోత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి.

సాహిత్యంవైపు చూపు మానకుండా.. చదువుకు విశ్రాంతి దొరికినప్పుడు ఆ సమయాన్ని వాడుకోమన్నారు. తప్పకుండా ఉషగారు... మీ సూచనను పాటిస్తాను.

ఎంతో అభిమానంగా, ప్రోత్సాహాన్నిస్తూ మీరు చెప్పిన విషయాలు ఎప్పటికీ మర్చిపోను.. ధన్యవాదాలండీ..

శోభ said...

సుభగారు... ధన్యవాదాలండీ..

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు... :)

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఉన్న మీ గమ్య మత్యంత "ఉన్నతమ్ము"
గనుక , మీదారి పొడవునా కలిసి నడిచి ,
తుదకు విరహమును బాపి ,సంతోష మొదవ
అల్మరా లోని "అతడు" మీ కంది వచ్చు

శోభ said...

@ వెంకట రాజారావు మాస్టారూ..

పద్యరూపంలో అద్భుతంగా చెప్పారు సర్.. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు.