ఎప్పుడు ఏం రాసినా...
ఆ అక్షరాలన్నీ ప్రేమగా
నీ చేతి స్పర్శలాగే
నువు ప్రేమగా తలనిమిరినట్లే
తడుముతుంటాయి
ఎప్పుడు ఎటు చూసినా...
ప్రతి దిక్కులోనా పలుకరించే
నీ నవ్వులాగే
నువు ఏనుగు అంబారీ ఎక్కించినట్లే
కళ్లు నిండుతుంటాయి
ఎప్పుడు ఏం చేసినా...
ప్రతి పనిలోనూ తోడునిలిచే
నీ వాత్సల్యంలాగే
నీ భుజంపై ఎక్కి కూర్చున్నట్లే
జ్ఞాపకాలు పులుముకుంటాయి
ఎప్పుడు ఏం తింటున్నా...
ప్రేమనంతా ముద్దలుచేసిచ్చే
నీ మమకారంలాగే
నువు తెచ్చిచ్చే అప్పచ్చుల్లాగే
కడుపు నింపుతుంటాయి
ఎప్పుడు నిదరోయినా
'అమ్మణ్ణీ' అనే నీ పిలుపులాగే
గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే
నీ ఆప్యాయతా పాటలాగే
చల్లని నీ ఒడిలో సేదదీర్చే
లాలిపాటలాగే
నీ బొజ్జపై అమాయకంగా బజ్జున్న
రోజుల్లాగే
జోల పాడుతుంటాయి...
[పుట్టినప్పటినుంచీ ప్రతి క్షణం తోడునీడగా, పెద్ద ఆసరాగా నిల్చిన నాన్న ఇవ్వాళ భౌతికంగా లేకపోయినా... నా ప్రతి పనిలోనూ మానసికంగా ఎప్పుడూ తోడుగా ఉంటున్నారు. నా వందో పోస్టును ఆయన అంకితం చేయటం అనేది ఈ లోకంలో నాకు లభించే గొప్ప గౌరవం.
నిజం చెప్పాలంటే ఇన్ని పోస్టులు రాస్తానని, రాయగలనని అనుకోలేదు. ఏం రాసినా చదివి, వెన్నుతట్టి, విమర్శించి, ప్రోత్సహించిన పాఠక దేవుళ్లందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు... ఇలాగే కలకాలం ఆదరిస్తారని ఆశిస్తూ... మీ కారుణ్య]
12 comments:
అభినందనలు శోభ గారు. వందో టపా మీ నాన్నగారికి అంకితమివ్వడం నాకు చాలా నచ్చింది.
శోభ గారూ,
"నాన్న" జ్ఞాపకాలే పదాలుగా చేసిన మీ వందో టపా కి అభినందనలు!
భౌతికంగా వీడినా జ్ఞాపకాల్లో మనతోనే జీవిస్తారు తలిదండ్రులు కడదాకా.
నాన్న గారి బొమ్మ మీ ప్రయత్నమేనా?
అనుభూతితో కూడిన భావత్మక మైన ఆలోచనలకి వెన్నుదన్ను గా మేమూ మీతోనే స్పందిస్తూ వస్తున్నాం ....
ఆలొచింప చేయడం తప్పని సరి చేయడమే ఏ రచనల వెనుకైనా ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం...
అందులో మీరు కృతకృత్యులైనారనే చెప్పాలి....
వందో టపా శుభాకాంక్షలతో...
-సత్య
అభినందనలు!
అభినందనలు శోభ గారూ :)
ధన్యవాదాలు జ్యోతిర్మయిగారు... టపా నాన్నకు అంకితం ఇవ్వటం కంటే తృప్తి ఈ లోకంలో నాకు మరోటి లేదండి..
ఇంతకీ కవిత ఎలా ఉందో చెప్పనేలేదు... :)
ధన్యవాదాలు చిన్ని ఆశగారూ...
నాన్న జ్ఞాపకాలే పదాలు.. మీ సహానుభూతికి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి..
బొమ్మ నేను గీసింది కాదండి... నాకు అంత సీన్ లేదు.. గూగులమ్మ ఇచ్చిందే..
చిన్నప్పటినుంచీ బొమ్మలు గీయాలంటే భలే ఆసక్తి. కానీ నిజం చెప్పొద్దూ.. ఇప్పటికీ ఓ ఒక్కటీ సరిగా గీసిన పాపాన పోలేదు.. ఎంత ట్రై చేసినా నాకు రావటం లేదు.. :(
మా ఆయనపై కోపం వస్తే మాత్రం... ఆయన్ని పిచ్చి పిచ్చి బొమ్మల్లో చెక్కేస్తుంటాను... :)
ఆయన మరీనూ... కోపం ఎలాగోలా పోవాలి కదా.. వూ కానీయ్ అంటారు.. ఇదండీ వరస... :)
సత్యగారూ.... మీ అభినందన ఎంతో ఉత్సాహాన్నీ, ప్రేరణను ఇస్తోంది. మీలాంటివారి ఆదరణే ఇలా రాసేందుకు సహకరిస్తోంది.. అందుకనే థ్యాంక్స్ అనే మాట చిన్నదవుతుంది..
కృతజ్ఞతాభివందనాలు..
పద్మార్పితగారూ..
సుభగారూ...
మీ అభినందనల్ని అందుకునేశానండీ....
అందరూ అభినందనలతోనే కడుపు నింపేస్తారా.. లేక కవిత ఎలా ఉందో చెబుతారా...?! :)
ఎప్పటి లాగే మీ వందో పోస్ట్ కూడా "మీ నాన్న గారి జ్ఞాపకాలతో" మమ్మల్ని ముంచెత్తింది...వంద పోస్ట్ లు పూర్తి చేసుకున్న మీకు అభినందనలు శోభ గారు
మనస్ఫూర్తి ధన్యవాదాలు డేవిడ్గారూ...
ఎన్ని వందల టపాలు రాసినా , 'నాన్న' కు సరిపోవు
Post a Comment