ఆఫీస్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఒక సందులో కుయ్ కుయ్ అంటూ సన్నని మూలుగులు.
మెల్లిగా దగ్గరకెళ్లి చూస్తే ఆరు బుజ్జి బుజ్జి కుక్కపిల్లలు. అందులో రెండు నల్లవి. అన్నీ బొద్దుగా ఎంత ముద్దుగా ఉన్నాయో.
దగ్గరికి తీసుకోబోతే వాటి అమ్మ రానీలేదు. వాళ్ల అమ్మ మాకు ఫ్రెండే కానీ.. ఎందుకో తనకు మాపై నమ్మకం కలగలేదు.
చేసేదేంలేక ఇంటికి వెళ్లిపోయాం. మళ్లీ రెండో రోజు అదే తంతు. మూడో రోజుకి కానీ నమ్మలేదు మమ్మల్ని. పిల్లల్ని ముట్టుకోనిచ్చింది.
దగ్గరికి తీసుకుని ఒళ్లో పెట్టుకుని నిమురుతుంటే అదీ వచ్చి తనను కూడా నిమరమంటూ ఒరుసుకుంటూ పడుకునేది. అయితే కాస్త పక్కకు జరిగినా దానికి డౌట్. ఎక్కడ తన పిల్లల్ని తీసుకెళ్లిపోతారో అని. ఇది అర్థం చేసుకుని మేం కూడా దాని దగ్గరే ఉంటూ ఆ పిల్లల్ని ముద్దుచేసేవాళ్లం.
కొన్నాళ్లకి ఇక బాగా నమ్మకం కుదిరింది తల్లికి. మేం వాటి దగ్గరికి వెళ్లినా ఏమనేది కాదు. వాళ్లు మనవాళ్లే ఏం చేయరు అనుకుందో ఏమో అసలు పట్టించుకునేది కాదు. ఒక్కోసారి తనను దగ్గరికి తీసుకోవాలని బెట్టు చేసేది.
ఇలా సాగిపోతోంది చాన్నాళ్లుగా. చూస్తుండగానే పిల్లలు పెద్దవయ్యాయి. ఆరింటిలో ఒకదాన్ని ఎవరో తీసుకెళ్లిపోయారు. ఉన్న ఐదింటిలో అన్నింటితో చనువు ఉన్నా.. ఎందుకో ఆ నల్ల పిల్లలపై కాస్త ఎక్కువ ప్రేమే ఉండేది. ముందు దగ్గరైంది అవే అనేమో.
ప్రతిరోజూ రాత్రి ఒంటిగంట సమయంలో మేం అల్లంత దూరంలో వస్తున్నది గమనించి.. పరుగు పరుగున వచ్చి మమ్మల్ని అల్లుకుపోయేవి. పొద్దుటినుంచి పనికెళ్లి అప్పుడే ఇంటికి వచ్చే తల్లిదండ్రుల కోసం పిల్లలు పరుగెడుతూ వచ్చినట్లుగా అవి మాకోసం వస్తుంటే అనిపించేది.
వాటిని వీధి కుక్కల్లాగా ఎప్పుడూ చూల్లేదు. రోజూ వాటితో ఆడుకునేవాళ్లం.. వాటిలో ఏవైనా ఒకటి రెండు ఆ రోజు కనిపించకపోతే ఏమైనాయని అడిగేవాళ్లం. అచ్చం మనుషులతో మాట్లాడినట్టే వాటితో మాట్లాడేవాళ్లం.
నేనైతే కోప్పడేదాన్ని, అలిగేదాన్ని, అరిచేదాన్ని, కట్టె తీసుకుని బెదిరించేదాన్ని. నేను బెదిరిస్తుంటే ఏదో ఆట ఆడుతున్నాను అనుకుని అవి ఇంకా వెంటబడేవి. తిడుతున్నా, కొడుతున్నా(ఊరికే ఆట) పట్టించుకోకుండా ఇవేంటి ఇలా ఉన్నాయని ఎంత నవ్వుకునేవాళ్లం.
రోజూ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇలా ఉంటే.. ఇక ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు సాయంత్రం సమయంలో బాడీగార్డ్ ల్లాగా అటో రెండు, ఇటో మూడు వద్దంటున్నా వెంట వచ్చేవి. మెయిన్ రోడ్డులోకి వస్తే ఎక్కడ వెహికల్స్ కింద పడిపోతాయేమో అని రావద్దని ఎంత చెప్పినా వినవు. అలాగే వస్తాయి. మెట్లవరకూ వచ్చి తర్వాత ఆగిపోతాయి. రోజూ ఇదే తంతు.
మొన్న ఒకరోజు ఇంటికి వెళుతుండగా ఎప్పటిలా మాకోసం అవి పరిగెడుతున్నాయి. ఒక నల్లపిల్ల మాత్రం ఇసుకలో చల్లగా ఉందనుకుందేమో కునుకు తీసింది. ఇంతలో ఒక కారు ఆ దార్లో రావడం.. మేం చూస్తుండగానే వాడు దానిపై ఎక్కించేయడం క్షణాల్లో జరిగిపోయాయి.
మేం పరిగెత్తుకుంటూ వెళ్లేలోపు అది బాధతో విలవిలలాడుతూ.. పక్కనే ఆపి ఉంచిన కారు కిందకి వణికిపోతూ వెళ్లి దాక్కుంది. ఆ కారువాడు ఆగకుండా వెళ్లిపోయాడు. తిడుతున్నా పట్టించుకోకుండా.
ఆ కారు దగ్గరికి వెళ్లి ఎంతగా పిలిచినా.. కాలు పట్టి లాగినా అది రాలేదు. తల వంచుకుని అక్కడే ఉండిపోయింది. వణికిపోతోంది. చాలాసేపు అక్కడే ఉన్నాం. దాన్ని లాగి దెబ్బ ఎక్కడ తగిలిందో చూసి ఏమైనా చేద్దాం అని ఎంత ప్రయత్నించినా అది అవకాశం ఇవ్వలేదు. చేసేదేం లేక ఉసూరుమనుకుంటూ ఇంటికి వెళ్లాం.
రోజూ అయితే ఏవి వచ్చినా రాకుండా ఈ రెండు నల్లపిల్లలు మాత్రం గేటుదాకా వచ్చి అక్కడ కాసేపు ఆడుకుంటేగానీ మమ్మల్ని లోపలికి పోనిచ్చేవి కావు. ఆరోజు ఒకటే వచ్చింది. బాధగా అలాగే వెళ్లాం.
మరుసటి రోజు దెబ్బ తగిలిన దాని కోసం వెతికాం. కనపడలేదు. వాటితో ఉన్నవాటిని అడిగాం. అవి చెప్పలేదు. రెండు రోజులపాటు కనపడలేదు అది. ఎక్కడైనా ఉందేమో అనుకున్నాం.
కానీ.. నిన్న సాయంత్రం చెత్తకుండీ పక్కన ఒళ్లంతా ఈగలు, చీమలతో ఆ బుజ్జిది. చూడగానే కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. అక్కడే ఉండి కళ్లనీళ్లు పెట్టుకుంటే దార్లో వచ్చేపోయే వాళ్లంతా విచిత్రంగా చూస్తున్నారు. (వాళ్లకేం తెలుసని.. ప్రతిరోజూ అందరూ నిద్రపోతున్న రాత్రి వేళల్లో మా స్నేహం కొనసాగిందని.. ప్రేమను ఇచ్చి పుచ్చుకున్నామనీ) ఓ వైపు ఆఫీసుకు టైం అవుతోంది.
అదే మావూర్లో అయి ఉంటే.. ఆ బుజ్జిదాన్ని తీసుకెళ్లి మంచిగా సాగనంపేదాన్ని. కానీ.. ఈ పట్నవాసంలో, అద్దెకొంపల్లో ఉంటున్న మనకు అది సాధ్యమా.. ఏడ్చుకుంటూ అలాగే వచ్చేశా.
వాష్ రూంలోకి వెళ్లి ఎంతగా ఏడ్చానో.. ఆ పసిది ఎన్నిసార్లు నా ఒళ్లో ఆడుకుందో.. ఎన్ని ఆటలు ఆడిందో. మెత్తగా, ఒత్తుగా జుట్టుతో ఎంత బావుండేదో.. చివరికి అలా రోడ్డుమీద దిక్కులేకుండా వదిలేయాల్సి వచ్చిందని నన్ను నేనే తిట్టుకున్నాను.
ఇప్పుడు ఒక నల్లపిల్లే మాకోసం వస్తోంది.. మిగతావి కూడా వచ్చినా. అది లేని లోటు లోటే. ఎంత అమాయకంగా వచ్చేదో.. నేను పట్టించుకోకపోతే చున్నీ లేదా డ్రస్ నోటితో పట్టుకుని లాగేది. లేకపోతే కాళ్లు గట్టిగా పట్టుకునేది.
చాలా జ్ఞాపకాలు.. ఆ బుజ్జిదానితో..
బాధ తట్టుకోలేక ఇలా రాస్తున్నాను.
మనుషుల ప్రాణాలకే గ్యారంటీ లేని రోజులు ఇవి. ఇక వీధిలో ఎవరైనా దయతలిస్తే బతికే వీధి కుక్కల ప్రాణాలకు గ్యారంటీ ఎక్కడిది.
అయితే ఒక విన్నపం.. ఎవరైనా.. కార్లు, లేదా ఇతర వెహికల్స్ నడిపేటప్పుడు ఇలాంటి మూగజీవాలను కూడా కాస్త పట్టించుకోండి. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయవద్దు. నోరులేని ఆ మూగజీవుల్ని చంపేయొద్దు. ప్లీజ్...😩😩😩
(ఆ పిల్లలన్నిటితో ఫొటో ఒకటి తీసుకున్నా అవి బాగా చిన్నప్పుడు. కానీ ఫొటో ఎక్కడో మిస్ అయిపోయింది.. 😢😢😢)