Pages

Friday, 20 August 2010

మానవత్వం ఇంకా బ్రతికే ఉంది...!

నిన్న మా అబ్బాయి స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి రావడం వల్ల బాగా ఆలస్యంగా పడుకున్నాము. ప్రయాణంలో బాగా అలసిపోవడం, ఒంట్లో కూడా కాస్తంత నలతగా ఉండటంతో బాగా నిద్ర పట్టేసింది. చూస్తే టైం 8.30. ఇంకేముందీ ఇంక అప్పట్నించీ ఒకటే ఉరుకులు, పరుగులు... టిఫిన్, స్నానం ఏదో అయ్యిందనిపించేసి గబగబా ఆఫీసుకు తయారై బయలుదేరాను.

అప్పటికే ఆలస్యమైపోయిందన్న కంగారుతో బస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో 12బి బస్ రావడంతో ఎక్కి, కిటికీ పక్కగా కూర్చున్నాను. ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేస్తుందేమోనని భయపడుతున్నా. అయితే ట్రాఫిక్ అంతగా లేదు. బస్ వేగంగానే కదులుతోంది.

పాండీ బజార్లో మాత్రం కాస్తంత ట్రాఫిక్ ఉంది. బస్ మెల్లగా కదుల్తోంది. నేను అలా పక్కగా చూస్తున్నాను. ఫ్లాట్‌ఫాంపై ఒక మధ్య వయసు ఆవిడ నడుస్తోంది. ఏమైందో ఏమో ఉన్నట్లుండి కింద పడిపోయి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటోంది. రెప్పపాటు క్షణంలో జరిగినదానికి నేను బిక్కచచ్చిపోయి చూస్తున్నా...! ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు.


ఆ క్షణంలో ఏం చేస్తున్నానో తెలీదు గానీ... అయ్యయ్యో...! అని అరిచి డోర్ వైపుకు కదిలాను. దిగేసి, ఆమెకు ఏదో ఒక సాయం చేయాలన్నదాంతో దిగే ప్రయత్నం చేశాను... అయితే సాధ్యం కాలేదు. ఇంతలో పక్కవాళ్లంతా బస్సు కదుల్తుంటే అలా దిగేస్తే ఎలా గమ్మా అని అరిచారు. పాపం కదండీ... ఆవిడ అలా కొట్టుకుంటోంది అని ఆమెవైపు చూశాను.

ఇంతలో ఓ నలుగురు కుర్రాళ్లు ఆమె దగ్గరికి పరుగెత్తికెళ్లి పక్కనే షాపులో వాటర్ బాటిల్ తీసుకుని, ఆమె ముఖంపై చల్లి, బండి తాళాలను చేతిలో పెట్టి, గట్టిగా పట్టుకుని ఒళ్లో పడుకోబెట్టుకున్నారు. ఒకరు చేతిని గట్టిగా పట్టుకుంటే, మరొకరు ఆమె తలను ఒళ్లో పెట్టుకుని కూర్చున్నారు.

అది చూసిన తరువాత కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆమెను వారు ఎలాగైనా కాపాడతారని అనుకుని సీట్లో కూర్చున్నాను. బస్ దూరమయ్యేదాకా ఆమెనే చూస్తూ కూర్చున్నాను.

బస్సు కదుల్తోంది. కానీ నా మనసు మాత్రం ఆమె దగ్గరే ఉంది. పాపం ఆమెకు ఎలా ఉందో..! ఎక్కడినుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తోందో... పాపం ఆమెకేమైనా అయితే ఇంట్లో వాళ్లకు ఎలా తెలుస్తుంది. వాళ్లు ఎంతగా బాధపడతారో అనుకుంటూ కూర్చున్నాను. ఇంతలో నా స్టాపింగ్ వచ్చేసింది. దిగేసి ఆఫీసుకు వచ్చేశాను.

కానీ ఆమెకు ఏమీ కాకూడదు. ఆమె ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలి అని మనసులో దేవుణ్ణి ప్రార్థించటం తప్ప మరేం చేయగలను చెప్పండి.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కుర్రాళ్లంటే కేవలం వేగం, దుడుకుతనం మాత్రమే కాదు. వారిలో కూడా సామాజిక బాధ్యత ఉందనేదానికి...పాండిబజార్‌లో ఆ మహిళను ఒళ్లో పెట్టుకున్న కుర్రాళ్లే నిదర్శనం. వీరిదే కదా రేపటి భవిష్యత్తు. ఏమంటారు...?

అనారోగ్యంతో ఉన్నవారు రోజువారీ పనులలో భాగంగా బయటికి వెళ్లి, అక్కడ అనుకోకుండా పడిపోతే ఎన్ని సమస్యలొస్తాయి ఇంట్లోవాళ్లు ఎంతగా కంగారు పడతారో, వాళ్లు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎంతగా ఎదురుచూస్తారో నాకు అనుభవపూర్వకంగా తెలుసు.

పాండీబజార్లో పడిపోయిన "మహిళ"లాగే... మా "నాన్న"కు కూడా ఫిట్స్ ఉన్నాయి. ఆయన కూడా ఏదో ఒక పనిమీద బయటికి వెళ్లినప్పుడు సడన్‌గా రోడ్లోనే ఫిట్స్‌తో పడిపోవడం... అక్కడ ఉన్న ఎవరో ఒకరు సాయం చేసి ఇంటికి చేర్చడం మామూలైపోయింది.

ఇప్పుడు కూడా ప్రతిరోజూ ఆయన కోసం ఇంట్లోవాళ్లందరం భయపడుతూనే ఉంటాము. అందుకనే సాయం లేకుండా ఆయన్ను ఎప్పుడూ బయటికి పంపే ప్రయత్నం చేయము. ఒకవేళ ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినప్పుడే ఆయనకు ఫిట్స్ రావడం యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది.

రోడ్డుమీద ఏం జరుగుతున్నా పట్టించుకోని ఈ ఉరుకులు పరుగుల కాలంలో... కళ్లముందు పడిపోయిన వారిని కాపాడి, సహాయం చేసి ఇంటికి చేర్చే వారికి రెండు చేతులెత్తి నమస్కరించడం తప్ప మరేం చేయగలం చెప్పండి. అలాంటివారిని చూసినప్పుడల్లా నాకు... ఈ లోకంలో ఇంకా మానవత్వం చావలేదనిపిస్తుంది... కాదంటారా....?!

(ఆగస్టు 22, 2008 11:58:00న రాసిన పోస్టు ఇది)...

2 comments:

పరిమళం said...

మానవులున్నంత కాలం మానవత్వం ఉంటూనే ఉంటుంది కాకపొతే యుగ ధర్మ రీత్యా నిష్పత్తిలో తేడా రావచ్చు కాని పూర్తిగా మానవత్వం చచ్చిపోదండీ ...మనలో నమ్మకం చచ్చిపోకుండా చూసుకోవాలి అంతే !ఆ నలుగురికీ వారిలోని మానవత్వానికి ప్రణమిల్లాలి.

శోభ said...

ధన్యవాదాలు పరిమళంగారూ...

మీరు చెప్పింది నిజమే..

(అదలా ఉంచితే మీరు నన్ను గుర్తుపట్టారా? బ్లాగు.కామ్‌లో కారుణ్య బ్లాగు రాస్తోంది నేనే. ఈ మధ్యకాలంలో బ్లాగు.కామ్ నిర్వహణ సరిగా లేని కారణంగా ఆ బ్లాగును బ్లాగ్ స్పాట్‌కు తరలించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఇందులో అదే పేరుతో ఓపెన్ చేశాను.

అలాగే బ్లాగు.కామ్‌లో లేని నా పోస్టులు కొన్నింటిని కూడా మొదట ఇందులో పెట్టి, ఆ తరువాత ఒక్కొక్క పోస్టును ఇందులోకి మార్చాలని అనుకుంటున్నాను. అలా మొత్తం మార్చిన తరువాత ఈ బ్లాగునే నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాను.

ఇకపోతే ఇందులో ఇప్పుడు పెట్టిన పోస్టులు విరజాజుల పరిమళం అనే నా మరో బ్లాగులోని పోస్టులని గమనించగలరు.

ఇకపై ఈ నా బ్లాగును ఫాలో అవుతారని ఆశిస్తూ..