ప్రతిరోజూ ఏదో ఒకటి రాద్దామనుకుంటూనే ఉన్నా, కాస్తంత బిజీగా ఉండటం వల్ల ఏ రోజుకారోజు అలా వాయిదా పడుతూనే ఉంది. ఈరోజు మాత్రం కాస్తంత తీరిక చేసుకుని... రెండు రోజులుగా నా మనసులో మెదలుతోన్న ఒక విషయం గురించి నాలుగు మాటలు రాయాలనే ఈ ప్రయత్నం...
ప్రతిరోజూ మేం ఆఫీసుకు వెళ్లే బస్సు ఎక్కాము. రోజులాగే ఆరోజు కూడా ఓ చిరునవ్వుతో కూడిన పలకరింపు ఒకటి ఎదురైంది. ఆ పలకరింపులోని చిరునవ్వులో ఏ మాత్రం తేడా లేదు గానీ, మనిషిలోనే ఏదో తేడా ఉంది. అదేంటో తెలియటం లేదు, కానీ తేడా మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఓ మధ్య వయస్కుడైన ఆ వ్యక్తి మేం ప్రతిరోజూ వెళ్లే బస్సులో కండక్టర్. సహజంగా చాలా మంది కండక్టర్లకులాగా చిరాకుపడే మనస్తత్వం కాదు అతడిది. ఎప్పుడూ నిండు కుండలాగా, తొణకని చిరునవ్వుతో, శాంతమూర్తిలాగా, ప్రశాంతంగా.. తనపని తను చేసుకుపోతుంటాడు.
ప్రతిరోజూ బస్సులో వెళ్తున్న మమ్మల్ని ఎన్నిరోజుల నుండీ గమనిస్తున్నాడో ఏమో ఆయన.. ఒకరోజు మేము బస్సెక్కి కూర్చుని డబ్బు ఇవ్వకుండా, స్టాఫింగ్ చెప్పకుండానే టిక్కెట్లు ఇచ్చేసి వెళ్లిపోయాడు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేమూ ప్రతిరోజు తనను చూస్తున్నప్పటికీ ఆ ఇంతమంది ఎక్కుతూ, దిగుతూ ఉంటారు.. మేమెందుకు ఆయనకు గుర్తుంటాం అనుకున్నాం. కానీ ఆయన దానికి భిన్నంగా ఓ చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్లిపోయాడు.
ఇక అప్పట్నించీ ఆయనతో మాకు పరిచయం ఏర్పడింది. బస్సెక్కగానే ఓ చిరునవ్వుతో కూడిన పలకరింపు, మాలో ఏ ఒక్కరు రాకపోయినా వాళ్లెమయ్యారు అంటూ కాస్తంత పరామర్శ మామూలైపోయింది. ఆరోజు కూడా పలకరింపు, పరామర్శ అయిన తరువాత ఆయనలో ఏదో తేడా ఉందే అనుకుంటూ నేను, మా అబ్బాయి ఆలోచనలో పడిపోయాము.
కాసేపటి తరువాత ఆ... గుర్తొచ్చిందమ్మా..! ఆయన చేతికి ఉండే లావాటి బ్రాస్‌లెట్ లేదు. చేయి బోసిగా ఉంది. అలాగే మెడలో ఉండే లావాటి బంగారు చైన్లు కాస్తా సన్నగా ఉన్నాయి... అన్నాడు మావాడు. అప్పుడు నేను మళ్లీ వెనక్కి తిరిగి ఆయన్ని చూసి, నిజమేరా..! అన్నాను.
ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవడం అటుంచి, ఆయనంటే మాకు కూడా కాస్తంత ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఎందుకంటే, ప్రతిరోజూ సిటీ బస్సుల్లో తిరుగుతున్నప్పుడు రకరకాల కండక్టర్లను చూశాము. విసుక్కునేవారిని, చిరాకు పడేవారిని, వెకిలిగా ప్రవర్తించే వాళ్లను ఇలా చాలామందిని చూశాం. కానీ వాళ్లందరికంటే కాస్తంత భిన్నంగా, శాంతంగా కనిపించే ఈయనంటే మాకు కొంచెం అభిమానం ఏర్పడింది.
ఇక మా వాడికయితే... ఆయన చిరునవ్వు, శాంత స్వభావం అన్నింటికంటే... ఆయన వేసుకునే బంగారు నగలు (చైన్, బ్రాస్‌లెట్, ఉంగరాలు) అంటే భలే ఇష్టం (మా వాడికి కూడా కాస్త బంగారు నగల పిచ్చిలెండి). బస్సెక్కగానే ఆయన్ని పలకరించటం, దిగేటప్పుడు టాటా చెప్పి దిగటం వాడికి బాగా అలవాటు.
ఆ కండక్టర్ చేయి ఆరోజే కాదు, మరికొన్ని రోజుల దాకా కూడా బోసిగానే ఉంది. మెడలో చైన్లు కూడా మెల్లి, మెల్లిగా రెండు కాస్తా ఒకటైంది. ఒకరోజు మా వాడు బాధపడుతూ... పాపం ఏం కష్టమొచ్చిందో, ఏంటో కదమ్మా...! నగలను తాకట్టు పెట్టడమో, అమ్మటమో చేసి ఉంటాడాయన.. అన్నాడు.
అవును. కష్టాలు మనుషులకు కాక, మాన్లకు వస్తాయా చెప్పు... కష్టాలు ఎవరికైనా సహజమే.. ధర్మరాజు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు కదా నాన్నా అన్నాను. అది సరే అమ్మా..! ఆయన ఆర్థికంగా ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థమవుతోంది. అయినా కూడా ఆయనలోని నవ్వు ఏ మాత్రం మారలేదు కదమ్మా..! అంటూ ఆ కండక్టర్ వైపు ఆప్యాయంగా చూశాడు మావాడు.
అవును నాన్నా...! నగలు, డబ్బు, ఆస్తిపాస్తులు, సంపద అన్నీ ఈరోజు మన దగ్గర ఉంటాయి. రేపు మనతో ఉంటాయో, ఉండవో చెప్పలేము. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఏమోగానీ... ఎప్పటికీ మారని ఆభరణమూ, మనతో ఎల్లకాలాల్లోనూ అట్టిపెట్టుకుని ఉండేది మన నవ్వే కదా...! నిజంగా నవ్వును మించిన ఆభరణం మనిషికి మరొకటి అవసరమా అనిపిస్తుంది ఆయనను చూస్తే...!!
శిఖరం
1 day ago
12 comments:
Interesting
Thank u very much Sir...
బాగా చెప్పారు. కనీసము ఇవాళ ఒక్క రోజైనా మరిన్ని దరహాసాభరణాలు వేసుకోవటానికి ప్రయత్నిస్తాను.
బాగా చెప్పారు.
:)
నవ్వు బంగారు ఆభరణాల కంటే గొప్పనే అనుభవాన్ని చక్కగా రాశారు. నా మొదటి బ్లాగు నవ్వుపైనే రాశా. ఎవ్వరెంతగా, ఎన్ని విధాల ఏడ్చినా నవ్వుకోసమేగదా... ఈ కొని తెచ్చుకునే ఏడ్పులెందుకంటారు..?
తెలుగుయాంకిగారూ, శ్రీకాంత్‌గారూ, వేణుగారూ, రాజ్‌కుమార్‌గారూ.. మీ అందరికీ ధన్యవాదాలు.. :)
తప్పకుండా శోభ ఎదుటి మనిషిని చూడగానే ముఖం చిట్లించుకునే ఈ రోజుల్లో అంత మంచి మనిషికి ఆభరణాలకంటే ఆయన చిరునవ్వు చూడగానే చెరగని ముద్ర వేస్తుంది మన మనసులో. మనం ఎంత చిరాకుగా, కోపంగా ఇంటినుండి బయల్దేరినా అదిగో ఆ చిరునవ్వే మన మూడ్ ని పూర్తిగా మార్చేస్తుంది ఇక ఆ రోజంతా మనని చికాకు పరిచే విషయాల గురించి ఆలోచన కూడా రాదు మనకి. చాలా మంచి పోస్ట్ శోభ.
దుర్గా.. థ్యాంక్ యూ రా...
nice one..
smile is a curve which sets the things straight..
గిరీష్‌గారూ.. థ్యాంక్సండీ..
Post a Comment