దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం మాట... ఉన్న ఊరును, కన్నవారిని విడిచి మావారితో కలిసి బ్రతుకుదెరువుకోసం చెన్నై మహానగరానికి వచ్చిన రోజులవి... అప్పట్లో భాష తెలీక ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో... చుట్టూ తెలుగువాళ్లే ఉన్నప్పటికీ.. వాళ్లు తెలుగు మాట్లాడితే తప్ప తెలుగు తెలిసినవాళ్లని తెలీనంతగా తమిళానికి అలవాటుపడిపోయారని అర్థమయ్యేందుకు చాలా రోజులే పట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడాలన్నా, ఏం అడగాలన్నా సంకోచం.. మొహమాటం.. ఒకరకమైన భీతి..
పచారీ కొట్టుకు, కూరగాయల షాపుకు వెళ్లినా... ఏం వస్తువు కావాలో దాన్ని చేత్తో చూపించి అది కావాలి, ఇది కావాలి అంటూ సైగలతో అడగటం అలవాటైపోయింది. ఆ తరువాత మెల్లిగా ఏంగే, పోంగే, వాంగే, ఎన్నాంగే, అదు ఎవళవు, ఇదెవళవు.. అంద బస్ ఎంగే పోగుమ్, ఇంద బస్ ఇంగే నిక్కిమా.... లాంటి చిన్న చిన్న పదాలు నేర్చుకున్న తరువాత కాస్తంత ధైర్యం వచ్చేసింది.
అయితే ఆ ధైర్యం వచ్చేందుకు చాలా రోజులే పట్టింది. మొదట్లో ఇరుగు, పొరుగువాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయ్యేది కాదు, మనమేం చెబుతున్నామో వాళ్లకీ అర్థం అయ్యేది కాదు. మనకంటూ సొంతవాళ్లు ఇక్కడెవరూ లేరే, మనకంటూ ఎవరూ లేకపోతే ఎలా అని దిగులుగానే కాలం వెళ్లదీయసాగాము. ఇల్లు, పని తప్ప మరోదాని జోలికి పోకుండా గుట్టుగా ఉండటానికి అలవాటుపడిపోయాం... "నీకు నేనూ, నాకు నువ్వూ" లాగా... నేనూ, మా ఆయన, ఇల్లు, పని.. వేరే లోకమే లోకుండా......
పచారీ కొట్టుకు, కూరగాయల షాపుకు వెళ్లినా... ఏం వస్తువు కావాలో దాన్ని చేత్తో చూపించి అది కావాలి, ఇది కావాలి అంటూ సైగలతో అడగటం అలవాటైపోయింది. ఆ తరువాత మెల్లిగా ఏంగే, పోంగే, వాంగే, ఎన్నాంగే, అదు ఎవళవు, ఇదెవళవు.. అంద బస్ ఎంగే పోగుమ్, ఇంద బస్ ఇంగే నిక్కిమా.... లాంటి చిన్న చిన్న పదాలు నేర్చుకున్న తరువాత కాస్తంత ధైర్యం వచ్చేసింది.
అయితే ఆ ధైర్యం వచ్చేందుకు చాలా రోజులే పట్టింది. మొదట్లో ఇరుగు, పొరుగువాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయ్యేది కాదు, మనమేం చెబుతున్నామో వాళ్లకీ అర్థం అయ్యేది కాదు. మనకంటూ సొంతవాళ్లు ఇక్కడెవరూ లేరే, మనకంటూ ఎవరూ లేకపోతే ఎలా అని దిగులుగానే కాలం వెళ్లదీయసాగాము. ఇల్లు, పని తప్ప మరోదాని జోలికి పోకుండా గుట్టుగా ఉండటానికి అలవాటుపడిపోయాం... "నీకు నేనూ, నాకు నువ్వూ" లాగా... నేనూ, మా ఆయన, ఇల్లు, పని.. వేరే లోకమే లోకుండా......
అదుగో అలాంటి పరిస్థితుల్లోనే "మీకు నేను కూడా తోడు" అంటూ వచ్చేసింది "కుట్టి". పక్కింటి ఇంజనీర్ గోపీ అతని ముస్లిం శ్రీమతి వహీదా ముద్దు ముద్దుగా పెంచుకుంటున్న బుజ్జి కుక్కపిల్లే కుట్టి (ఈ పేరు మేమే దానికి పెట్టుకున్నాం). పక్కింట్లో ఉంటున్నందుకు అది మాతో అప్పుడప్పుడూ సావాసం చేసేది. ఆ మధ్యనే లవ్ మ్యారేజ్ చేసుకున్న వహీదా దంపతులు సాయంత్రాలు, సెలవు రోజుల్లో విహారానికి వెళ్లేటప్పుడు కుట్టిని మా దగ్గరే వదిలి వెళ్లేవాళ్లు.. ఒక్కోసారి మీ దగ్గరే ఉంచుకోమని అభ్యర్థించేవాళ్లు.
అనువాదాలు, ఫ్రూఫ్ రీడింగ్‌ల భారంతో ఉండే మా ఆయనకు, ఇంటి పనుల ఒత్తిడితో ఉండే నాకు... దగ్గరకు రానిచ్చే మనిషి ఎవరయినా ఫర్వాలేదు నమ్మేస్తాను అన్నట్లుండే కుట్టీకి ఎలాగైతేనేం పొత్తు కుదిరేసింది. ఆ పొత్తు ముదిరి పాకానపడి గోపీ వాళ్ల ఇంట్లో ఉండేకంటే, మా ఇంట్లో ఉండేందుకే అది ఇష్టపడేది. మద్రాసులో మాకెవరూ లేకపోవడం, ఒకవేళ ఎవరితోనయినా మాట్లాడదామంటే భాష సమస్య, తెలుగోళ్లు అని తెలిస్తే తమిళమోళ్లు ఎక్కడ మోసేస్తారో అనే భయం మాలోంచి పోని ఆ టైంలో..... మీకు నేనున్నానంటూ మా ఇంట్లో కాలు పెట్టింది కుట్టి.
చిన్నప్పటినుంచీ సహజంగానే పిల్లి, కుక్క కనిపిస్తే చాలు నన్ను నేనే మర్చిపోయేదాన్ని.. అలాంటిది కుట్టి వస్తే కాదంటానా.. సో.. ఆ రకంగా నాకో మంచి తోడు దొరికేసింది. కుట్టి అలా మాకు ఎంత దగ్గరయ్యిందంటే... మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటే మా మధ్యలో దూరి మరీ పడుకునే రాజసాన్ని దక్కించుకుంది. దాన్ని ఎక్కువగా ముద్దు చేస్తే నెత్తికెక్కుతుంది, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి అని గోపీ దంపతులు చెబుతున్నా మా చెవులకు ఏ మాత్రం ఎక్కేవి కావు.
అలా రోజులు గడుస్తున్నకొద్దీ చిన్న చిన్న సమస్యలు తలెత్తసాగాయి. ఆదిమ జంతు జీవనంతో తెగతెంపులు చేసుకున్న మాకూ, తన జాతి లక్షణాలను ఏమాత్రం మార్చుకోని కుట్టీకి మధ్య తగవులు మొదలయ్యాయి. శుభ్రత అంటే ఇష్టపడే నాకూ, ప్రాణం పోయినా సరే నా అలవాట్లు మానుకోనుగాక మానుకోను అని హఠం పట్టిన ఆ కుట్టిపిల్లదానికి ఓ శుభముహూర్తంలో తగవు ముదిరింది.
మధ్యలో పడుకోబెడితే బుద్ధిగా ఉండాల్సిందిపోయి.. సైలెంట్‌గా ఎక్కడపడితే అక్కడ పాస్ పోసేసేది.. మా మధ్యలో పడుకుంటే వెచ్చగా ఉండే సుఖానికి, స్వేచ్ఛగా ఇది తన ఇల్లు అనుకునే గర్వం తోడయ్యిందో ఏమోగానీ... కొన్నాళ్లకు ఆ రెండోది కూడా కానిచ్చేయటం మొదలెట్టేసింది. అప్పటికీ ఊరుకున్నా.. ఎక్కడపడితే అక్కడ కానిచ్చేయటం చేయసాగింది.
ఏదో పోనీలే.. మాకూ తోడు లేదు, దానికీ తోడు లేదు..యజమానులు తమ షికారు యావలో దాన్ని పట్టించుకునే సమయంలేదు. పాపం మనదగ్గరయినా ఉంటుంది అని జాలి చూపించి మరీ ఆహ్వానిస్తే ఇలా చేస్తుందా అని నాకు ఒకటే కోపం. మా ఆయనకేం పోయింది శుభ్రం చేసుకోవాల్సింది నేనే కదా. దాన్ని నేనేమయినా అంటే మాట పడనిచ్చేవారు కారు. పోనీ దాన్ని ఎక్కడయినా కాస్త దూరంలో కట్టేద్దాము అనుకుంటే మద్రాసులో సగటు మనిషి అద్దె ఇళ్లు మనుషులకే సరిపోవు ఇక పిల్లులకు, కుక్కలకు వేరే విరామ స్థలాలు అంటే మాటలా. బయటికి తీసుకెళ్దామా అన్నా కూడా ఇబ్బందే.
మొత్తంమీద కుట్టి విశ్వరూపం ఇలా కొత్తకోణంలో కనిపించడంతో దానికి, నాకూ మధ్య అగాథం కొద్ది కొద్దిగా పెరగడం మొదలుపెట్టింది. అసలు పాస్ పోయటమే వద్దనుకుంటే ఇక రెండోదానికి కూడా సిద్ధపడిపోయిందే పిల్లది అంటూ మొదట్లో కసుర్లు, విసుర్లు మొదలయ్యాయి. ఒకటో పనికి దిగీదిగకముందే గట్టిగా అరవడం, తర్జనితో బెదిరించడం, చూపులతోటే భయపెట్టడం. ఊహూ.. అసలే తోకవంకరది. ఇలాంటి బుడ్డబెదిరింపులకు అది లొంగుతుందా.. నీ పని నీది నా పని నీది అనిపించేలా తన పని తాను కొనసాగించిందది.
ఇక ఓపిక నశించిపోయి ఇష్టం లేకపోయినా, బాధ కలిగినా చేసేదేం లేక చురుగ్గా దెబ్బలు మొదలెట్టేశాను. హాయిగా నిద్రపోతున్నప్పుడో, అన్నం తింటున్నప్పుడో, విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడో అది ఒకటీ, రెండు కానివ్వడం ప్రతిఫలాన్ని వెంటనే అందుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. అయితే ఏ చర్యకైనా, కార్యానికైనా, పరిణామానికైనా ఒక ఆదీ, ఒక అంతమూ ఉంటాయి కదా.. ఒకరోజు అది కూడా సంభవించింది.
ఆ కుక్కపిల్లకు ఆ రోజు దెబ్బలు తినాలని రాసి ఉందో (?) లేక విచక్షణా రహిత కోపం పనికిరాదని నాకు రుజువు కావాలని ఉందో కాని, ఆ రోజు దానికి దెబ్బలు పడ్డాయి. ఇంట్లో కూర్చుని డిటిపి పని చేసుకునే పరిస్థితి కదా... మధ్యాహ్నం తిండి తిప్పల తర్వాత కాస్సేపు నిద్రించే అలవాటు వచ్చేసింది మాకు. అలా మాగన్నుగా నిద్రపోతున్నప్పుడు అది తన పని కానిచ్చేసింది. తన స్వేచ్ఛ ఇతరుల నిద్రకు సైతం భంగం కలిగిస్తుందని పాపం దానికి తెలియదాయె.
ఇంకేముంది అన్ని రోజుల కోపం, అణచి పెట్టుకుని ఉన్న కోపం నాలో పెల్లుబుకి వచ్చింది. ఏం చేస్తున్నానో కూడా తెలియని ఆవేశంతో ఆ పిల్లదానికి ఒకటే దెబ్బలు. ఎక్కడ తగులుతాయో అని చూసుకోకుండా చేతితో బాదేశాను. కుయ్యో కుయ్యో అని మొత్తుకున్న కుట్టి... చివరకు దెబ్బల స్థాయి మోతాదు మించిందేమో.. అరవడం కూడా ఆపివేసి కూలబడిపోయింది.
అన్నాళ్లుగా దాన్ని తప్పు చేస్తోందని కొట్టడం సరికాదని చెబుతూ వచ్చారు మా ఆయన. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో కుక్కలను పెంచనే కూడదని, పెంచితే దాని స్వేచ్ఛను మనం అరికట్టలేమని, దెబ్బలతో అస్సలు అరికట్టకూడదని పదే పదే చెబుతూ వచ్చినా నేను వినలేదు. అదలా దెబ్బతిని ప్రాణం తీసుకుంటే తర్వాత దాని యజమానుల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే భయం ఆయనలో కోపంగా మారి, నన్ను నానా మాటలూ అనేశారు.
ముందే చెప్పానుగా, కుక్కపిల్లపై అతి ప్రేమ వద్దని, ఉన్నా దాన్ని మన పక్కలో పడుకోబెట్టుకోవద్దని, పక్కనే పడుకోబెట్టుకుంటే దాని ఫలితాలను అనుభవించక తప్పదని, రెండు రకాల స్వేచ్ఛలు ఒకే ఇరుకుగదిలో ఇమడవని, ఎక్కడ అతి ప్రేమ ఉంటుందో అక్కడ అతి ద్వేషం పొంచుకుని కూర్చొని ఉంటుందని, జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదని... ఇలా వరుసగా తిట్ల దండకం ప్రారంభించారు.
పాపం... అది తప్పెక్కడ జరిగిందో తనకే తెలీని స్థితిలో దెబ్బల బాధ తట్టుకోలేక నోటిమాట లేక ముడుచుకు పోయింది. నా ప్రేమ వికటిస్తే దానికి దెబ్బలేమిటి? మామూలుగా అయితే మాటకు మాట ఇవ్వడంలో, బంతిని రివర్స్ చేయడంలో ఆయనకే మాత్రం తీసిపోని నేను, నా తప్పును గ్రహించిన స్థితిలోనో... లేక అంత అమానుషంగా పిల్లదాన్ని బాదిన చర్యకు నాపై నాకే కోపం కలిగిందో కానీ... ఆ రోజు మాత్రం బిక్కచచ్చిపోయి నోటి మాట లేకుండా చూస్తూండి పోయాను. (అన్నాళ్లుగా అంత సైలెంట్‌గా జీవిస్తూ వచ్చిన మేం ఆరోజు ఎందుకు అలా అంత పెద్ద ఘర్షణకు దిగామని మా ఇరుగింటి పొరుగింటి వారు రోజుల తరబడి చర్చ పెట్టుకున్నారట. కుక్క బాధలు, కుక్కతో సంబంధంతో వచ్చే బాధలు వాళ్లకేం తెలుసు మరి)
తిట్ల దుమారం ముగిసింది. తిట్టినవారు, తిట్లు తిన్నవారు, దెబ్బలు తగిలించుకున్నవారు అంతా సద్దులేకుండా ఉండిపోయాం. దుమారం రేగి వెలిసి పోయినట్లయింది. ఎవరికి వారు మౌనంగా తలదించుకుని చూస్తుండిపోయాం. పాపం అది తల దించి నీరసంగా పడుకునిపోయింది. ఎంతగా భయపడిపోయిందంటే అది కళ్లుమూసుకుని కూడా వణుకుతోంది. దాని తల్లే దగ్గర ఉంటే అది అన్ని దెబ్బలు తినేదా.. ఎవరైనా దాని మీద పడితే దాని తల్లి ఊరుకుని ఉండేదా... కాస్తంత కనికరం కూడా నాకు లేకపోయిందే అని ఒకటే బాధ... తరువాత ఏడుపూ ముంచుకొచ్చాయి.
నేనూ, ఆయనా ఇద్దరం మూగగా దానికేసి చూస్తూ గోడకు చారగిలబడి కూర్చుండిపోయాం. మెల్లగా దాని కళ్లలో నీళ్లు.. చుక్క చుక్కగా కారుతూ కన్నీళ్లు.. ఇక తట్టుకోవడం నా వల్ల కాలేదు. భోరుమంటూ దాన్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్లిపోయాను. దాన్ని శుభ్రం చేసి, గుండెలమీద పడుకోబెట్టుకుని జోకొడుతూ ఓదార్చాను. దాని కళ్లలోకి చూస్తూ నేనూ.. నా కళ్లలోకి చూస్తూ అది.. ఎంతసేపు గడిపామో తెలీదు.
ఆరోజునుంచి ఆ కుట్టిపిల్ల తిట్లు పడలేదు. దెబ్బలు తినలేదు. నమ్మి మా యింట్లోకి వచ్చిన అది ఇలా చావుదెబ్బలు తిన్నాక, తిరిగీ మమ్మల్ని నమ్మడానికి దానికి అయిదారురోజులు పట్టింది. మౌనంగానే తిరిగి సావాసం చేశాం. మరింతగా దానికి తిండి పెట్టడం. ఒక ఉత్పాతం తర్వాత తిరిగి ఏర్పడిన మా కొత్త సంబంధంలో మార్పులు వాటికవే చోటుచేసుకున్నాయి.
మా హద్దులు మేం దాటలేదు. దాని హద్దులు అది దాటలేదు. ప్రకృతి పిలుపు వంటి సందర్భాల్లో అది అసాధారణంగా ప్రవర్తించే తీరును ముందే పసిగట్టి దానికో చోటు కేటాయించేవాళ్లం. మరోవైపు అది సైతం మళ్లీ దెబ్బలు తినకూడదు అనే కండిషన్‌కి గురయిందో ఏమో, ఒకటీ రెండూ పనుల వ్యవహారం ముగించుకోవలసిన పరిస్థితుల్లో అలెర్టయిపోయి పక్కకు వెళ్లిపోవడం నేర్చేకుంది.
మనిషికోసం, మద్రాసు జీవితంలో మాట్లాడేవారి కోసం మేం పడ్డ తపనకు ఫలితంగా ఆ కుక్కపిల్లతో మాకేర్పడిన అనుబంధం ఆపై ఎక్కువ రోజులు సాగలేదు. ఓ ఇరవై రోజుల తర్వాత దాని యజమానులు గోపీ, వహీదాలు వేరే ఇంటికి మారిపోయారు. వారితో పాటు కుట్టి కూడా. అయితే ఆ ఇరవై రోజుల్లో మా అనుబంధం తిరిగి ఎంతగా అల్లుకుపోయిందంటే....అది పక్కింట్లోని యజమానుల వద్దకు వెళ్లడానికే నిరాకరించేది. అన్ని వేళలా మా దగ్గరే...
ఒక పిడుగుపాటు తర్వాత మామధ్య జరిగిన నెలకొన్న సంబంధం మనిషికి జంతువుకు మధ్య సంబంధ బాంధవ్యాలను నూతన స్థాయికి తీసుకువెళ్లింది. దానికి మేం... మాకు అది...దానికి సంతోషం కలిగినప్పుడల్లా మా ముఖంలో కళ్లు పెట్టి చూస్తుండిపోయేది. మేమూ దాన్ని అలాగే పొదివి పట్టుకునేవాళ్లం.. అది శాశ్వతం కాదు అనే విషయం దానికి తెలీలేదు. కానీ, ఒక అద్దె ఇంటినుంచి మరో అద్దె ఇంటికి మారవలసిన నగర జీవితం అనుబంధాలను, పరిచయాలను తగిన హద్దుల్లోనే ఉంచుతుందని మాకు త్వరలోనే అర్థమైంది.
అలా ఇరవైరోజులు గడిపిన తర్వాత వాళ్లు ఇల్లు ఖాళీ చేసి కొత్త మజిలీకి వెళ్లిపోయారు. వెళుతూ తాము చేరుతున్న కొత్త ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వస్తామని కొత్త ఇంటికి తీసుకు పోతామని చెప్పారు. అయితే ఏమైందో కాని వాళ్లు నెలరోజులుగా ఈ వైపు తిరిగి చూడలేదు.. కుక్కపిల్ల జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కలుక్కుమనేది మాకు.
మాకంటూ ఎవరూ లేని, మేం మనసు విప్పి మాట్లాడలేని మా తొలి మద్రాసు జీవితంలో ఆప్తబంధువులా మా ఇంట అడుగుపెట్టిందది. ఒక బాధాకరమైన అనుభవం అనంతరం, జంతువుకు, మనిషికి తరతరాలుగా అల్లుకుపోతూ వస్తున్న అమృత క్షణాలను ఇరువైపులా ఆస్వాదించాం. కానీ, ఎవరికెవరు ఈ లోకంలో.... అని ఓ సినీ కవి అన్నట్లుగా అది మా జీవితం నుంచి తప్పుకుంది. దాని ప్రమేయం, మా ప్రమేయం లేని పరిస్థితుల్లో అది దూరమైంది. మెరుపులా వచ్చి మెరుపులాగే మాయమైంది. అది ఎలా ఉందో, ఏం చేస్తోందో, వహీదా దంపతులు తమ నూతన దాంపత్య జీవితంలోని సుఖాలను వెతుక్కుంటూ వారు ముందులాగే దాని ఆలనా పాలనా సరిగా చూడకుండా వదిలేశారేమో. రకరకాల శంకలు మాకు.
ఒక రోజు ఉరుములు మెరుపులు లేని వానలా ఊడిపడ్డది వహీదా.... దాదాపు నెలరోజులు తర్వాత...మా యింటి కొచ్చింది. కొత్త ఇంటి చిరునామా ఇచ్చి రేపు ఉదయం తప్పక రావాల్సిందిగా ఆహ్వానించింది. రాగానే ఆమెను అడిగిన ప్రశ్న... కుట్టి బాగుందా....? దానికామె ...కొత్త ఇంటిలో చేరాం.. అపార్ట్మెంట్ అది. కానీ ఇది ఇల్లంతా పాడు చేస్తోంది. అందుకే ఇంట్లోనే ఒకచోట కట్టేశాం.... అంది. ఎక్కడో కాస్త బాధ.. కాని బయటపడకుండా రేపు తప్పక వస్తామని చెప్పాము. కాస్సేపుండి ఆమె వెళ్లిపోయాక కుట్టి అక్కడ పడుతున్న బాధలను మావిగా ఫీలయ్యాం....ఏదేమైనా అది వాళ్ల కుక్క..వాళ్ల పెంపకం. అంతే అని సరిపెట్టుకున్నాం. కుట్టి కోసమైనా సరే ఎలా ఉందో ఓసారి చూసివద్దాం అని బయలుదేరాలనుకున్నాం.
ఆ మరుసటి రోజు... ఉదయాన్నే.... 8 గంటల వేళ వహీదా ఇచ్చిన చిరునామా పట్టుకుని వాళ్ల అపార్ట్‌మెంట్‌కు వెళ్లాం. వహీదా తలుపుతీసింది. లోపలకు అడుగుపెట్టాం. కుట్టికోసం మా కళ్లు వెతకసాగాయి...హాల్లో ఒకచోట తాడుతో కట్టేసిన కుట్టి. మా ఇద్దరికీ దిగ్ర్బాంతి...అది మా కుట్టీనేనా..మేం పెంచిన కుట్టీనా ఇది... బక్క చిక్కిపోయి, ఎముకలు బయటకు కనపడుతూ...శవాకారంలో.... మాకేసి చూస్తోంది..గుర్తు పట్టేసింది.
అప్పుడో కేక...కంఠనాళం చించుకుపోయేంత గట్టిగా.. ఎక్కడ శక్తిని దాచుకుని ఉందో...అది ఎగిరిన ఎగురుకు తాడు పట్మని తెగింది. అదే ఊపున మా వైపు దూకింది. ఎగిరి మమ్మల్నికరుచుకుపోయింది. బిత్తరపోయి చూస్తున్నాం... అది చూస్తోంది. వాసన పడుతోంది. కళ్ళలో కళ్లు పెట్టి మరీ.....ఏడుస్తోంది.. ఆనందంతో, శోకంతో... మనిషి పొడ అప్పుడే చూసినట్లుగా... తప్పిపోయిన ఆత్మబంధువులను అప్పుడే కలుసుకున్నట్లుగా...బుల్లెట్ వేగంతో తోక తిప్పుతూ...
ఏం చేయాలో మాకు పాలుబోవడం లేదు. దీన్నేనా కొట్టింది... దీన్నేనా తిట్టింది...దీన్నేనా దూరం పెట్టబోయింది.... పూర్వ జన్మపై మాకు నమ్మకం లేకపోయినా, కాని ఇది ఏ జన్మ సంబంధం...ఎవరు కల్పించిన బాంధవ్యం...మా చేత తిట్లు తిన్న ఆ చిన్నపిల్ల, ఘోరంగా దెబ్బలు తిన్న ఆ తల్లిలేని పిల్ల... మేం ఏం చేసినా సహించి క్షమించివేసిన ఆ ఆదిమ జంతువు... జీవితాంతం మర్చిపోని పాఠం నేర్పుతూ మమ్మల్ని నాకుతోంది. వాసన చూస్తోంది...
నాగరికతకు అనాగరికతకు వార చెరిగిపోయిన ఆ అనిర్వచనీయ క్షణాల్లో ఒక శోకాగ్ని మమ్మల్ని దహించివేసింది.. అది జంతు, మానవ బంధాన్ని కదిలించివేసిన స్నేహాగ్ని. అది తన కన్నీళ్లతో, చుంబనంతో, వాసనతో, మా సమస్త పాపాలను కడిగివేసిన దివ్యాగ్ని... కొద్ది రోజులు దానికి అన్నం పెట్టాం...అక్కున చేర్చుకున్నాం.... పక్కన పడుకోబెట్టుకున్నాం.. అంతకు మించి మేం ఏమీ చేయలేదు దానికి. ఈ మాత్రానికే అది తన రుణం ఇలా తీర్చుకుంది. పసిపిల్ల అని కూడా చూసుకోకుండా హింసించిన మా ఘోరాపరాధాన్ని అది ఇలా మన్నించింది. నిండుమనసుతో మమ్మల్ని క్షమించింది...
సమస్త విలువలూ నా చుట్టూ గిర్రున తిరుగుతున్నాయి. ప్రశ్నిస్తూ, వెక్కిరిస్తూ, నిలదీస్తూ.... విశ్వాసం అనే విలువను ఓ శునకం మానవజాతికి రుచిచూపిన దివ్యక్షణాలవి.. ఒక కుక్క పిల్ల మనిషి పట్ల చూపించిన ఔన్నత్యం అది... మనిషి తోటి మనిషిపై ఇలాంటి విశ్వాసం చూపగలడా? మనిషి తోటి మనిషిని ఆ పసిదానిలాగా విశ్వసించగలడా? ఆ పసిదానిలాగా చేసిన మేలును గుర్తుపెట్టుకోగలడా?
పునఃకలయికతో తడిసి ముద్దయిన ఆ అమర క్షణాలనుంచి బయటపడి విషయం కనుక్కుంటే తెలిసింది. ఆ కుక్కపిల్ల ఎందుకు అంత శవాకారంలా తయారయ్యింది అంటే... మూడు పూటలా తిండి పెడితే అది ఎక్కడంటే అక్కడ హాల్లో రెండోది కానిచ్సేస్తోందట. ఇక్కడ చరిత్ర మనకు గుర్తుకు రావటం లేదూ... బానిసలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ పనిపట్ల అలక్ష్యం వహిస్తారో అని బానిస యజమానులు వారిని ఒంటిపూట భోజనంతో రాతి గుహల్లో బంధించేవారని చదువుకోలేదూ మనం..
తన ప్రేమ కోసం తల్లిదండ్రులనే వదులుకుని హిందువుతో సహజీవనం కోసం మద్రాసుకు వచ్చేసిన వహీదా... ఒక ప్రాణికి జీవితం కల్పించడం అనే దృష్టితో కాక...ఒక స్టేటస్ కోసమే కుక్కపిల్లను పెంచుకోవడం ప్రారంభించిన వహీదా... తనకు దురుద్దేశాలు లేకపోయినా... కుక్కపిల్లకూ స్వేచ్ఛ ఉంటుందని, జాతి సహజాతాలు దానిపై పనిచేస్తుంటాయని గ్రహించని సగటు మనిషి వహీదా... ఇంటిని అశుభ్రపరుస్తోందన్న అన్యాయపు మిషతో దాన్ని బంధించటమే కాదు...తిండి కట్టిపెట్టి మాడ్చి మరీ దాన్ని శవాకారంగా చేసేసింది.
ఇది వహీదా తప్పు కాదు...ఇది ముస్లిం మహిళ తప్పు అంతకంటే కాదు.. ఇది మనుషుల తప్పు.. జంతువుల స్వేచ్ఛను గుర్తించని మనిషి తప్పు... నువ్వు జంతువును ప్రేమించదలిస్తే, పెంచదలిస్తే.. జంతుజీవితపు అలవాట్లను కూడా ప్రేమించాలి.. దాని "అనాగరిక" లక్షణాలను ప్రేమించాలి. జంతు సంస్కృతి, మనుషుల సంస్కృతి రెండూ ఎప్పటికీ ఒకటిగా ఉండవన్న ఎరుకతో ప్రేమించాలి.
ఇది తెలియనప్పుడు మనుషులు వహీదాలాగో.. అలాంటి మరో మనిషిలాగో.. మాత్రమే ఉంటారు. లోపాలను, లేదా లోపాలు అని మనం భావిస్తున్న వాటితో సహా మనుషులను లేదా జంతువులను అన్ని కోణాలనుంచి మనం ప్రేమించలేకపోతే మనం జంతువునూ అర్థం చేసుకోలేం, మనిషినీ ప్రేమించలేం... లోపాన్ని మనం ప్రేమించలేకపోతే... ఆ లోపాన్ని మనం నివారించే వైపుగా అడుగు వేయలేం..
ఆ కుక్కపిల్లను తన నమ్మకాల ప్రకారం శవాకారంగా మార్చిన వహీదా...అచిరకాలంలోనే తన దాంపత్య జీవితాన్ని రద్దు చేసుకోవలసిన విపత్కర స్థితిలో కూరుకుపోయింది. కుక్క పిల్ల ఉసురు తగిలిందని కాదు. భర్త ఆఫీసులో తోటి సహ ఉద్యోగినులతో చనువుగా ఉంటున్నాడని అనుమానంతో మొదలైన ఆమె దాంపత్య జీవితం అది కేవలం అనుమానమో లేదా సత్యమో మాకు తెలియని విపత్కర పరిణామాల వెల్లువలో కూరుకుపోయి...తిరిగి తాను వదిలిపెట్టేసిన తల్లిదండ్రుల వద్దకే చేరింది. జంతువైనా, మనిషైనా భరించాల్సిన సామాజిక సంక్షోభాల యుగం కదా ఇది...
ఆ తర్వాత వాళ్లు, వాళ్లతో పాటు ఆ కుక్క ఏమైపోయారో ఇప్పుడెలా ఉన్నారో మాకు తెలీదు. మద్రాసు నలుమూలలా అద్దె ఇళ్లు మారుతూ జీవితం ఎలా తంతే ఆ వైపుకు పరుగెడుతూ ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తూ వచ్చిన మాకు తర్వాత వారి విశేషాలు తెలీవు..
ఒకటి మాత్రం నిజం వాళ్లు ఉంటారు. గోపీ, వహీదా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. కలిసో, విడిపోయో... కానీ...
మా కుట్టీ ఇప్పుడు ఎక్కడుందో.. అస్సలు... ఉందో లేదో...
పదిహేడు సంవత్సరాల క్రితం ఇది ముగిసిపోయినా... ఇప్పుడే జరిగినట్లు.. కుట్టి మమ్మల్ని ఇంకా వాసన చూస్తున్నట్లు... కళ్లల్లోకి తొంగిచూస్తున్నట్లు...ఆనందంతో తోక తిప్పుతున్నట్లు... మా మధ్యనే తిరుగాడుతున్నట్లు అనిపిస్తూనే ఉంటోంది....
పదిహేడు సంవత్సరాల క్రితం ఇది ముగిసిపోయినా... ఇప్పుడే జరిగినట్లు.. కుట్టి మమ్మల్ని ఇంకా వాసన చూస్తున్నట్లు... కళ్లల్లోకి తొంగిచూస్తున్నట్లు...ఆనందంతో తోక తిప్పుతున్నట్లు... మా మధ్యనే తిరుగాడుతున్నట్లు అనిపిస్తూనే ఉంటోంది....
46 comments:
ఋణానుబంధ రూపేణ పశుపత్నీసుతాలయా అని ఊరికే అన్నారా పెద్దలు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో బంధం కుదురుతుందో, ఎప్పుడు ఎలా ఎందుకు ఎక్కడ ఎవరివల్ల తెగిపోతుందో అంతా పైవాడి నిర్దేశానుసారమే. ఐనా ఒక్కోసారి మనుషులే పశువుల కన్నా హీనంగా మారిపోతారు. ఇంత ప్రేమను పొందిన ఈ బుల్లికుక్కపిల్ల ఎక్కడో ఆనందంగా ఉంటుందనే మీరు భావించుకోవాలి. (దాని అసలు యజమాని మానవత్వంపై నమ్మకం పెట్టుకోవడం కాస్త కష్టమే అయినా)
పూర్ణప్రజ్ఞాభారతి
pragnabharathy.blogspot.in
అక్క ! మీ కుట్టి గురించి చదివాక మనసంతా బాధతో నిండిపోయింది.
అయితే ఒక విషయం చెప్తాను...కుక్కలకి చెప్తే అర్ధం చేసుకుంటాయి. మా మిక్కికి చిన్నప్పటినుంచి ప్రకృతి పిలుపు కి బయటకి వెళ్ళాలి అనినేను చెప్పేదాన్ని
కొన్ని రోజులకే అది నేర్చుకుంది.
మా మిక్కే నే కాదు చాలావరకు కుక్కలు అన్నీ అంతే కొంచం మనం ఓపికగా నేర్పాలి.
మీరు అన్నట్టు అవి చూపించే ప్రేమ ముందు మనం వాటికి ఎంత చేసిన తక్కువే అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
కుక్కల్ని పెంచుకోవడం మాత్రం స్టేటస్ కోసం కాదు వాటి మీద తిరిగి ప్రేమని చూపించగలిగితేనే పెంచుకోవాలి.
అనుబంధాలు మనుష్యులకైనా, జంతువులకైనా ఒకటే ! అందులోనూ విశ్వాసం గల జంతువుగా పేరు బడ్డ కుక్కల గురించి చెప్పనే అక్కరలేదు. కుట్టితో అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించావు శోభమ్మా !అభినందనలు.
ఈ టపా చాలా చాలా బావుంది. చాలా ఆర్ద్రంగా వ్రాసారు. ఇండియాలో మాతో సఖ్యంగా వున్న పిల్లితో మాకు వుండిన అనుబంధం గుర్తుకువచ్చింది. అది మా పెంపుడు పిల్లి కాదు కానీ మాతో ఓ అత్మీయ బంధువులా తిరిగేది. ఓ రోజు కనిపించకుండా పోయింది - మళ్ళీ తిరిగి రాలేదు. పిల్లులని కొట్టి తినే ఏదో జాతి దానిని పట్టుకెళ్ళి వుంటారని మా అమ్మ బాగా చింతించింది.
కుక్కలకంటూ ఒక స్వర్గం ఉంటే ఆ కుక్క కూడ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను..
కుక్క కరుచుకుపోయింది అంటే ఏమిటి ?.. దేన్నైనా నోట కరుచుకుందా ?
touching!
మీ రచనలెప్పుడూ ఆర్ద్రతకి చిరునామాగ ఉంటాయి శోభాజీ. మళ్ళి మరొక కదిలించి కరిగించిన రచన.మీకలం సిరాలో ఇంకుతోపాటు వేసే ఆ ఇంగ్రీడియెంట్స్ పేర్లేమెటో చెప్తారా? చాలా కాలం గుర్తుండిపోయే రచన....అభినందనలు
శోభ గారు..హృదయం ద్రవించింది. కుట్టి ని మీరు తెచ్చేసుకోవాల్సింది అనిపించింది.
anduke..., nenu pets ku dooram... vaati attachment, love, visvaasam ku nenu sariponemo... ani...
పూర్ణప్రజ్ఞాభారతి గారూ...
మీరన్నది అక్షర సత్యం.. మా బుల్లి కుక్కపిల్ల ఇప్పుడు పెద్దదై ఎక్కడో ఓచోట సంతోషంగా ఉంటుందనే అనుకుంటూ బ్రతికేస్తున్నామండీ.. ఒకవేళ ఉండకపోయినా ఏమీ చేయలేం.. కానీ దాని జ్ఞాపకాలు మాత్రం మమ్మల్ని ఎప్పటికీ వదిలిపోవు..
శైలూ...
కుక్కలకు చెబితే అర్థం చేసుకుంటాయి... ఓపికగా నేర్పాలి అంతే.. నువ్వన్నది నిజమే.. కానీ.. దానిపై చేయి చేసుకున్న తరువాతే నాకా విషయం అర్థమైంది.. అది నా దగ్గర దెబ్బలు తిన్నాకే అలా చేయకూడదని అర్థం చేసుకుందేమో.. ఆ తరువాత ఎప్పుడూ అలా చేయలేదు.. నిజంగా దాన్ని కొట్టిన విషయం గుర్తొస్తే ఇప్పటికీ నాకు మనసు మనసులో ఉండదు.. చాలా బాధగా ఉంటుంది.
SRRao బాబాయ్...
అనుబంధాలు మనుష్యులకైనా, జంతువులకైనా ఒక్కటే... నమ్ముకున్న మనుషులు ఏదో ఒక సందర్భంలో మోసం చేసే అవకాశం ఉందేమోకానీ... విశ్వాసానికి మారుపేరైన కుక్కలు మాత్రం ఎప్పటికీ మోసం చేయవు..
శోభమ్మా. చాలా చక్కగా హృదయాన్ని ఆవిష్కరిస్తూ వివరించావు.... విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క ఎందుకు అనేకమందికి ప్రేతిపాత్రమైన పెంపుడు జంతువు అని అర్థం అయినట్టు చెప్పావు. నేనొక సారి సెమినార్ లో మనుష్యుల్ని పెంచుకోవడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో కుక్కని కూడా పెంచుకోగలమా అని సరదాగా అంటే ఒక ఆయన ఒక సారి పెంచుకొని చూడండి సార్ మీ స్టేట్ మెంట్ మార్చుకుంటారు అని చాలా బాధ పడ్డాడు. నాతో పాటు nlp త్రైనిన్గ్ తీసుకున్న చంపక అనే బ్యాంకాంగ్ అమ్మాయి తన పెంపుడు కుక్క చనిపోయిందని దిగులుతో నెల రోజులుగా మంచాన పడ్డానని రాస్తే ఇదేంటి అనుకున్న. సమాధానం నీ బ్లాగ్ లో దొరికింది......నిజమే ఎవరో అన్నట్టు మనం emotional fools..
శరత్‌గారూ..
పెంపుడు జంతువులతో ఆత్మీయత వాటితో అనుబంధంగల వారికే ఎక్కువగా తెలుస్తుంది. మీ ఇంట్లో మాదిరిగానే మా ఇంట్లోనూ ఓ పిల్లి ఉండేది. మా తమ్ముడికీ దానికీ అనుబంధం ఎక్కువ. చాలా ఏళ్లు మాతోనే ఉండిన అది, ఓ రోజున కనిపించకుండా పోయింది.
మీ అమ్మగారిలాగే మా అమ్మ... బాగా నున్నగా, ఆరోగ్యంగా ఉన్న దాన్ని ఎవరో కోసుకుని తినేశారు వాళ్ల చేతులు పడిపోను అని తిడుతూ బావురుమంది. మా తమ్ముడైతే ఎంతగా ఏడ్చాడో..
వాడు ఆరోజునుంచి అస్సలు పిల్లుల్నే దగ్గరికి తీయటం మానేశాడు.. చాలా సంవత్సరాల తరువాత ఓ నెల రోజుల క్రితం మళ్లీ ఓ బుల్లి పిల్లి మా ఇంట్లోకి అడుగుపెట్టింది. దాని ఆటలు అంతా ఇంతా కాదు.. మా అమ్మా, అదీ ఇప్పుడు దోస్తులు... దానితో బంధం పెరిగేకొద్దీ, ఎక్కడ దూరమౌతుందోనన్న బాధ కూడా మా అమ్మకు ఎక్కువగానే ఉందని చెప్పిందీమధ్య.
సింహంగారూ...
మీ మంచి మనసుకు జోహార్లు.. కానీ... మా కుట్టి ఇంకా బ్రతికే ఉంటుందని అనుకుంటున్నాం...
కుక్క కరుచుకుపోయింది అంటే.. దేన్నో కరుచుకుపోయిందని కాదండీ.. మమ్మల్ని చూసిన ఆనందంలో మామీదకి వచ్చి కూర్చుంది అని, ఒళ్లోకి వచ్చి పడుకుందని.. చెప్పడం ఆ మాటలోని ఉద్దేశ్యం... అర్థం చేసుకోగలరని అనుకుంటున్నా..
@ బాలు గారూ.. ధన్యవాదాలు
@ వాసుదేవ్గారూ.. నా కలం సిరాలో ఇంకుతోపాటు వేసే ఆ ఇంగ్రీడియెంట్స్ పేర్లు... మీ అందరికీ తెలిసినవేనండీ.. ప్రత్యేకించి ఏమీ లేదు.. చాలా కాలం గుర్తుండిపోయే రచన అన్నారు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
వనజగారూ...
ఓ సందర్భంలో వహీదాను కుట్టిని మాకు ఇచ్చేయమని అడిగానండీ.. కానీ తను అమ్మో.. అది నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న దాన్ని ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పేసింది. వాళ్లు ఇల్లు మారిన తరువాత, దాని పరిస్థితి చూసి మాకు ఇచ్చేయమని అడిగేద్దాం అనుకున్నా, ఆమె ఇస్తుందన్న ఆశలేక ఊరుకున్నాం..
మిర్చ్ బజ్జీగారూ...
జంతువులను పెంచుకుంటే కదండీ... వాటికి మనం సరిపోతామో, లేదో తెలిసేందుకు... ఓసారి ఓ బుల్లి పిల్లినో, కుక్కనో.. పెంచి చూడండి.. ఆ తరువాత మీ అభిప్రాయం మారిపోతుంది... :)
ఉదయ్ అన్నయ్యా...
సెమినార్లో "ఒకసారి పెంచుకుని చూడండి మీ స్టేట్మెంట్ మార్చుకుంటారు" అంటూ ఆయన మీకు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఇక బ్యాంకాంగ్ అమ్మాయి దిగులుతో మంచాన పడటంలోనూ అతిశయోక్తి ఏమీ లేదు.. వాటితో అటాచ్మెంట్ కలిగితే.. మర్చిపోవటం అంత సులభం కాదు..
ఇక్కడ మీకో విషయం చెప్పనా...
మా చిన్నాన్న కూతురు మంజుకు చిన్నప్పటినుంచి కుక్కలంటే ప్రాణం. బోయకొండ గంగమ్మ దర్శనానికి వెళ్తుంటే కొండపైన చిన్న కుక్కపిల్ల కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి బంటి అని పేరుపెట్టి పెంచుకుంది. బాగా పెరిగి పెద్దయిన బంటి ఓరోజు, తాడు తెంచుకుని రోడ్డుపైకి ఆడుకుంటూ పరిగెత్తింది. ఇంట్లోవాళ్లు ఎవరూ గమనించలేదు. రోడ్డుపై ఆడుకుంటున్న అది రోడ్డు దాటే క్రమంలో ట్రాక్టర్ కింద పడిపోయింది. వెనుక రెండుకాళ్లూ నడుము ఛిద్రమై రోడ్డు పక్కన పడివున్న దాన్ని మా చిన్నాయన చూసి ఏడ్చుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లినా బ్రతకటం సాధ్యం కాదన్నారు. ఇంటికి తీసుకొచ్చాక సాయంత్రంగా అది చనిపోయింది. ఇంట్లోవాళ్లు దానికి మనిషి చనిపోతే ఎలా దహన సంస్కారాలు చేస్తారో, అలా దానికి చేశారు. ఇప్పటికీ బంటి పేరెత్తితే చాలు ఇంట్లోవాళ్ల కళ్లలో నీళ్లు రాక మానవు... మూగజీవాలతో అనుబంధం ఉన్న ప్రతి హృదయం పరిస్థితీ ఇంతే....
నిజమే మనం ఎమోషనల్ ఫూల్స్మే.. కానీ.. అందులోనే ఎంతో సంతృప్తి ఉందన్నయ్యా..
sobhaa manava sambandhalu antoo manam kevalam manushula madhyane ani vivaristamu kanee eppudu gurtu pettukovalsinavi jeeva sambandhalu...ilanti oka lucy anedi n=maa atta garintlo naku shayanga undedi adi valla pempudu kukkainaa naa badha kanneellu anne daniki ardha m ayyedi daddy vaste edo cheppadaniki praytninchedi bahusa nee kuthuru enni badha lu paduthundo telusuko anemo...appudu nenemee cheppedanni kadu mounanaga digamingi bathikedanni...ee anubandhalu chitramainavi sumaa ....manchi manasutho ardrangaa nuvveppudu edanna rastavu anduke no words to comment only compliment...lots of love amma
అమ్మా... మీ అనుభవం వింటుంటే బాధగా ఉంది. అదే సమయంలో ఆ కుక్క మీపై చూపించిన ప్రేమకు సలాం చేయాలనిపిస్తోంది.. మీరన్నట్లు అనుబంధాలు చిత్రమైనవే... కానీ కొన్ని అనుబంధాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఆ అనుబంధాలు గుర్తుకొస్తేనే.. మన మది ఒడి నిండిపోతుంది వాటి ప్రేమలాగే....
ఆ కుక్కని మీరు తెచ్చేసుకుని ఉంటారేమో అన్న ఆశతో చదివాను. ఎంత పని చేశారు శోభ గారూ?
ఎంత బాధ వేసిందంటే దొంగతనంగానైనా కుట్టిని మీరు తెచ్చేసుకుని ఉండవలసింది అనిపించింది. స్టేటస్ కోసం పెంచుకునే వాళ్ళు పెద్ద బాధ కూడా పడరు. మరో బెటర్ జాతి కుక్కని తెచ్చుకుంటారంతేగా!
Liked it very much.
శోభ గారూ..
కుక్కలకి ఉదయాన్నే బయటకు తీసుకెళ్ళటం అలవాటు చేస్తే ఇంట్లో ఒకటి, రెండు చెయ్యవు. ఒకవేళ అలా చేస్తున్నాయి అంటే వాటికి ఏదైనా అనారోగ్యం ఉండి ఉండాలి లేదా మన దృష్టి వాటిమీద పడటంకోసం అయినా అయ్యుండాలి. అనారోగ్యమూ లేదు, మనం ప్రేమగానూ చూస్తున్నాం అయినా చేస్తున్నాయంటే కచ్చితంగా వాటిని బయటకు తీసుకెళ్ళే వేళలు పాటించట్లేదని అర్థం. మా యింట్లోనూ పదిహేనేళ్ళుగా కుక్కల్ని పెంచుతున్నాం. వాటిని పెంచటములో మెళకువలన్నీ దాదాపు ఒంటబట్టేశాయి!!
Arun Chandra Gaddipati (Blog World)
Shobha Raju garu...
nenu edee complete ga chadavanu kaanee eesaari mee blogpost matram poortiga chadivanu.
Srinivas Iduri (Facebook)
heart touching madam. kukkalante naku chala istham, idi chaduvutunte naa eduruga jariginatle vundi. idi chaduvutoo ayyo anukunnanu, endukante kukkalani poorthi ga manaki anukulamga penchukovachchu. oka vakyam nachchindi...."nuvvu jantuvulani premincha dalisthe, pencha dalisthe........." nijame adi.
Chandrasekhar Kanchi (Facebook)
super andi Shobha Raju garu.. mukhyamga maavana sambandhaalanu kalagalipi raayatam just awesomely true
Sai Padma (Facebook)
Mahadevi ni gurtuku techaaru shobha garu.. lovely touching writeup...
Jayasree Naidu (Facebook)
touching lines Madam..
Kumar Varma Kayanikorothu (Facebook)
మనసు పిండే రచన శోభా జీ....ఒక్కసారి మా రామూ గాడు గుర్తొచ్చాడు....అంటే మా పెంపుడు కుక్క....మా మదర్ తో పాటు పూజ చెసేవాడు...పాలు పంచదార,పెరుగన్నమే తినేవాడు...ఓ గురువారం అమ్మతో పాటు పూజ చేసి....నైవేద్యం పెట్టిన పాలు తాగి....చనిపోయింది....
"ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడుగక...."
ఏంటో ఈ అనుబంధాలు...అన్నోన్ మీట్స్....వెల్ నోన్ డిపార్ట్స్....తప్పవేమో....
Padma Sreeram (Facebook)
@ సుజాతగారూ...
కుట్టీని తెచ్చేసుకుంటే బాగుండేదని చాలాసార్లే అనిపించింది కానీ.. ఆ సాహసం చేయలేకపోయాం.. మీరన్నట్లు స్టేటస్ సింబల్ కోసం పాకులాడే వాళ్లకు ఇంకోటి దొరక్కపోయుండేది కాదు.. ఏమయితేనేం బంగారంలాంటి కుట్టిని దూరం చేసుకున్నాం.
@ Indyan Minerva గారు.. ధన్యవాదాలండీ.
@ అచంగగారూ...
అప్పటికి కుట్టి మా దగ్గరికి వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి, ఆ మెలకువలు వంటబట్టలేదు.. అందుకే పాపం దానికి దెబ్బలు తప్పలేదు.. ఆ తరువాత అర్థమైనా, అది మా దగ్గర లేదు.. మా దురదృష్టం అంతే...
@ శ్రీనివాస్ ఈడూరి గారు ధన్యవాదాలు సర్..
@ చంద్రశేఖర్ కంచి గారూ ధన్యవాదాలండీ.
@ సాయి పద్మగారూ, జయశ్రీ నాయుడుగారూ.. పోస్టు మీకు నచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్.
@ కుమార్ వర్మగారూ మీకు కూడా ధన్యవాదాలు.
@ పద్మా శ్రీరాం గారూ... మీ రామూ గురించి చదువుతుంటే మనసు చెమ్మగిల్లుతోంది. దానికి ఎంత భక్తో కదూ.. పూజచేసి, నైవేద్యం పెట్టిన పాలు తాగి చనిపోవడం.. అంతకంటే అదృష్టం దానికేముంటుంది.
"అన్నోన్ మీట్స్... వెల్ నోన్ డిపార్ట్స్ తప్పవేమో..." మీ మాటలు అక్షర సత్యాలు.
శోభ గారూ, పోస్ట్ బాగా కదిలించింది.. బాధపడుతూ, మధ్యమధ్యలో దాటేస్తూ చదివాను. మా పిల్లలు కాక నాకో బిడ్డ ఉంది. పిల్లలేదో పేరు పెట్టారు కానీ, నేను పాపాయని పిలుస్తాను.
ఏ రోజుకారోజే , ఇంటికి రాగానే వచ్చావా, వచ్చావా అంటూ పలకరిస్తుంది ... . కుట్టికి వ్యతిరేకం. ఎన్నో సార్లు చెప్పాను ఆపుకోవక్కర్లేదు. కావాలంటే చేసెయ్యి అని. అయినా సరే ఆపుకుంటుంది ఎంత లేటైనా సరే రోడ్డు మీదకి వెళ్ళేవరకూ .
కుట్టి తో మీ అనుబధం హృదయాన్ని కదిలించింది. మూగ జీవాలు వాటికన్నా గొప్ప జీవి అని మనిషితో పెంచుకునే అనుబంధాన్ని మనుషులూ గుర్తించి గుర్తుపెట్టుకోవటం శోచనీయం. మనిషి మనిషినే కొద్ది సంవత్సరాల పాటు చూడకపోతే గుర్తు రాని కాలం...మూగ ప్రాణులకి భగవంతుడిచ్చిన వరం...మరచిపోని అనుబంధం!
చందూ గారూ...
మీ పిల్లలు కాకుండా మీకు మరో బిడ్డ ఉందని మీరు రాసింది చూస్తుంటే.. ఆ బిడ్డ ఎవరో, ఆ బిడ్డపై మీకుండే మమకారం ఎలాంటిదో అర్థమవుతోంది. అలాంటి బిడ్డ మీకు ఉన్నందుకు, మీలాంటి తండ్రి తనకు దొరికినందుకు ఎంత అదృష్టమో కదూ..?!
చిన్ని ఆశగారూ...
మనిషినే కొద్ది సంవత్సరాలపాటు చూడకపోతే గుర్తు రాని కాలంలో.. మూగ ప్రాణులు అలా గుర్తు పెట్టుకోవడం వాటికి భగవంతుడిచ్చిన వరమే.. మీరన్నది నిజం.
vaatini tinna ventane byta tippali.modata kadupu ninda petti ventane tippali.bytekkado kanichchestayi. ika roju ade place ki teste akkade kanistai.vatiki vaste arichi maree bytiki teeskellamantai.
శోభ గారూ,
బాధ కలిగించే విషాలు చదవడం కష్టం, ఆ పైన వ్యాఖ్య వ్రాయడం ఇంకా కష్టం నాకు. వ్యాఖ్యలు చూసి కొంత విషయం తెలుస్తుంటే అలా దాటేస్తూ వచ్చాను. ఒక రోజు పూర్తిగా చదివాను. ఇక్కడ అసలు విషయం గురించి అందరూ మాట్లాడారు. నా కొసరు అభిప్రాయాలు:
మనకి చెప్పేవారు చాలా అవసరం అని తెలిసింది ఈ టపా వల్ల. మీకు దొరికినట్టు తెలిసేలా చెప్పే వారు ఆమెకీ దొరికి ఉంటే బావుండుననిపించింది. పిల్లల పెంపకంలో కూడా ఒక్కో సారి తల్లిదండ్రులం సంయమనం కోల్పోతుంటాం. అది చెయ్యి దాటిపోవడానికి కొన్ని క్షణాలు చాలు. అక్కడే మనకి support కావాలి. మిగతా (emotional and moral)సపోర్ట్ ఉన్నప్పుడు మనం చేసేది తప్పు అని చెప్పగలిగే వారు కూడా మనకి support ఇచ్చే వారే.
ఇంకో విషయం పెంపుడు జంతువులతో నా అనుభవం. నిజానికి ఏమీ లేదని చెప్పాలి. చాలా చిన్న వయసులో పక్షులనీ, కుందేళ్ళనీ, మేకపిల్లలనీ చూసి పెంచుకోవాలనో లేక వాటితో ఆడుకోవాలనో ఏదో సరదా ఉండేది. పెద్దౌతున్న కొద్దీ ఒక జీవి బాధ్యత మనం తీసుకోవడం అంత సులభం కాదని అర్థమయ్యింది. మా అమ్మమ్మ చెప్పిన కొన్ని కథల ప్రభావమూ ఉండి ఉండవచ్చు. చిలకని పంజరంలో పెడితే ఆ కష్టం మనకి తెలిసేలా చెయ్యడానికి దేవుడు మనం జైలుకెళ్ళేలా చేస్తాడని చెప్పేది. అలాగే ఎన్నో పిల్లల కథలు నిర్బంధంలో పక్షులు సంతోషంగా ఉండవని చెప్పే కథలు చదివిన ప్రభావమూ అవ్వచ్చు.
స్నేహితులు కొందరిళ్ళలో కుక్కులు పెంచుకున్నా నేను ఎక్కువ దగ్గర కాలేకపోయాను వాటికి.
ఇప్పుడు పిల్లలు కుక్కని పెంచుకోవాలని అడుగుతుంటారు. నాకేమో మనసొప్పదు. మా ఎదురింటి వాళ్ళు పెంచుకునే కుక్కపిల్లతో తప్పనిసరిగా స్నేహం చేసుకోవల్సిన పరిస్థితి. లేకపోతే రోజూ బస్ స్టాప్ దగ్గర నాకు ఇబ్బంది కదా. మా చిన్నబ్బాయి ఎంత ఇష్టప్డ్డా నన్ను చూసేమో మరి ద్గ్గరికెళ్ళడానికి జంకే వాడు. అందుకోసం కూడా అలవాటు చేసుకున్నాను. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నా సంగతేమో కానీ ఆ కుక్క నాతో ఏదో అనుబంధం ఏర్పర్చుకుంటున్నట్లనిపిస్తోంది. రోజూ సాధారణంగా మేము వచ్చాక వాళ్ళు వస్తారు బస్ స్టాప్‌కి. అలాంటిది ఒక రోజు మేము తర్వాత వెళ్ళేసరికి నన్ను చూసి ఆ కుక్క excitedగా అటూ ఇతూ పరిగెత్తింది. ఈ రోజు చల్ల గాలి వీస్తోందనో ఏమో మరి (మరి ఇంకా చల్లటి రోజుల్లో ఇలా ప్రవర్తించలేదు), వచ్చి నన్ను ఆనుకుని snuggle అవ్వడానికి ప్రయత్నించింది. ఈ విషయాలు ఆలోచిస్తుంటే మీ టపా గుర్తుకు వచ్చి ఇక్కడ చెప్పాలనిపించింది.
ఇంతా వ్రాశాక్ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే నాలాగా ఎక్కువ attachment చూపించని వారినుండి కూడా ప్రేమను ఆశిస్తాయి జంతువులు, అలవాటైతే అనిపించింది. అందుకని వాతిని పెంచడం అంటే పిల్లని పెంచినటే. క్రమశిక్ష్ణ కొంత బోలెడంత స్వేచ్ఛ ఇవ్వాలి వాటికి. నేను ఎప్పటికీ పెంపుడు జంతువులని ఇంట్లో ఉంచుకోలేనేమో. కానీ పెంచుకునే వారి పట్ల అవగాహన పెరుగుతోంది. ఇంతా వ్రాశాక నాకు అనిపిస్తున్నది ఏమిటంటే నాలాగా ఎక్కువ attachment చూపించని వారినుండి కూడా ప్రేమను ఆశిస్తాయి జంతువులు, అలవాటైతే అనిపించింది. అందుకని వాటిని పెంచడం అంటే పిల్లలని పెంచినట్టే. కొంత క్రమశిక్షణ అలవాటు చేసి బోలెడంత స్వేచ్ఛ ఇవ్వాలి వాటికి. నేను ఎప్పటికీ పెంపుడు జంతువులని ఇంట్లో ఉంచుకోలేనేమో. కానీ కొన్ని రకాల్ పెంపుడు జంతువులని పెంచుకునే వారి పట్ల సదభిప్రాయం ఏర్పడుతోంది.
లలితగారూ..
మీ సుదీర్ఘ వ్యాఖ్య చాలా ఆలోచింపజేసింది. "నాలాగా ఎక్కువ attachment చూపించని వారినుండి కూడా ప్రేమను ఆశిస్తాయి జంతువులు, అలవాటైతే అనిపించింది. అందుకని వాటిని పెంచడం అంటే పిల్లలని పెంచినటే. క్రమశిక్ష్ణ కొంత బోలెడంత స్వేచ్ఛ ఇవ్వాలి" మీరన్నది నిజమే.
కొన్నిరకాల జంతువులను పెంచుకునేవారిపట్ల సదభిప్రాయం కలుగుతోందని అన్నారు. చాలా సంతోషం లలితగారూ.. నా పోస్టు ద్వారా మీకు అలాంటి అభిప్రాయం కలిగినట్లయితే మరింత సంతోషిస్తాను.
ఈ టపా చాలా చాలా బావుంది. కుట్టితో అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించావు.....
ధన్యవాదాలు డేవిడ్ గారూ...
adbhutam sobha garu .inthakante cheppataniki naku matalu ravatam ledu
@chvgupta గారు ధన్యవాదాలండీ.
nice shobha gaaru heart touching ga undi
ధన్యవాదాలు జా గారు..
మనిషికి , జంతువుకు మధ్య అనుబంధాన్ని చక్కగా వివరించారు. అంత నిశితంగా పరిశీలించి అధ్బతంగా హత్తుకుపోయేటట్లు అక్షర రూపం కల్పించి మాకు అందించారు శోభా గారు. మీ కుట్టి ఇప్పుడు ఇదే భూమిమీద ఒక మనిషి జన్మ తీసుకొనే ఉంటుంది (ఇది జరిగి 20 , 25 ఇయర్స్ అయింది కాబట్టి) ; అది కాదు కాదు అతడు /ఆమె ఇప్పుడు పుట్టి ఇక్కడే వుండే అవకాశం ఉంటుంది. వొకవేల మీ అదే కుట్టి కనుక మీకు ఇప్పుడు మానవ రూపంలో తారసపడితే. మీకు దాన్ని చూసినప్పుడు ఎదో ఒక అనుబంధంతో కూడిన ఆత్మీయత గుర్తుకొస్తుంది (అలాగే దానికి కూడా) . ఆత్మ బంధాలు అంటే అవే.
Post a Comment