Pages

Tuesday, 22 January 2013

నా జీవితపు శిల్పీ...!!!



నా శరీరంలోని ఒక్కో అంగానికి
సరికొత్త నిర్మాణాన్ని..
భిన్నమైన కదలికల్ని ఇచ్చిన
నా జీవితపు శిల్పీ...

మర్చిపోయి ఇచ్చావో
చూసేందుకు బాగుండదని మలిచావో
పొరపాటున కళ్లను చెక్కావు
కానీ అవి...
నువ్వు చూపే ప్రపంచాన్నే చూడాలి
ఆ ప్రపంచం అంతా నువ్వై ఉండాలి

నా జీవితపు శిల్పీ...
నీ చేతుల్లో రూపుదిద్దుకున్న
కదిలే శిల్పంలా
నీ కనుసన్నల్లో మసలుకుంటే చాలా..?
మరి నా మనసు మాట..?
ఇదెక్కడి విచిత్రం...
శిల్పానికి మనసెందుకేంటి?
చెప్పినట్టల్లా వింటే చాలదా..?!

నా జీవితపు శిల్పీ...
కళ్లను ఇచ్చావు..
చూపునూ ఇచ్చావు.. కానీ
నువ్వు చూపిందే ప్రపంచమన్నావు
మనసు వద్దే వద్దన్నావు
నోటి రూపం నువ్వు దిద్దిందేగా
అయినా మాటలెందుకులే
ఆడించే తలనిచ్చావుగా

అదేంటో...
అమ్మ ఒళ్లోంచి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు
నేను అందరిలాంటి మనిషినే
నా చూపులోనూ, మాటలోనూ
నవ్వులోనూ, నడకలోనూ.. స్వేచ్ఛ
అమ్మంత స్వచ్ఛమైన ప్రేమ
అంతే స్వచ్ఛంగా దొరికేది

నమ్మి నీ వెంట పంపినప్పుడు కూడా
నేను మనసున్న మనిషినే..
ఎప్పుడు మార్చబడ్డానో
ఎప్పుడు మార్చుకున్నావో
నువ్వు శిల్పివయ్యావు
నువ్వు చెప్పినట్టల్లా ఆడే
శిల్పాన్ని నేనయ్యాను

కళ్లుండీ చూడలేనితనం
చెవులుండీ వినలేనితనం
నోరుండీ మాట్లాడలేనితనం
మనసుండీ లేని తనం
ఇదీ ఒక జీవితమేనా...???


23 comments:

Anonymous said...

its excellent work.. expected a lot more from you.. best of luck

Anangi Balasiddaiah said...

adbutamga undi...swecha leani maguva manasuni addam pattaru

తెలుగమ్మాయి said...

వావ్...సూపర్

ఫోటాన్ said...

వావ్, మాటల్లేవు... చాలా బాగుంది :)

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగుంది.. శోభాగారు. మంచి వ్యక్తీకరణ

శోభ said...

మానసిక వేదనకు పరాకాష్ట.. చాలా బాగుంది శోభ గారు...

- Meraj Fathima

(https://www.facebook.com/profile.php?id=100004380941182)

శోభ said...

చాలా హృద్యంగా రాశారు

- సుదర్శన్

(https://www.facebook.com/sudarshanproductions)

శోభ said...

చాలా బాగుంది శోభా రాజు గారు.. నా పాత ఫెంటో ఒకటి గుర్తు చేశారు..

నేను కుడా శిల్పినే
స్వాభిమానమే ఉలి, మానవత్వమే సుత్తి
నన్ను నేను చెక్కుకుంటూ...

- మాధురి

(https://www.facebook.com/profile.php?id=1353098280)

శోభ said...


"కళ్లను ఇచ్చావు..
చూపునూ ఇచ్చావు.. కానీ
నువ్వు చూపిందే ప్రపంచమన్నావు
మనసు వద్దే వద్దన్నావు
నోటి రూపం నువ్వు దిద్దిందేగా
అయితే మాటలెందుకులే
ఆడించే తలనిచ్చావుగా..."

wow...wow...shobagaaru chalaa baagaa raasaaru

- బహుదూరపు బాటసారి

శోభ said...

" నా జీవితపు శిల్పీ...
నీ చేతుల్లో రూపుదిద్దుకున్న
కదిలే శిల్పంలా
నీ కనుసన్నల్లో మనసుకుంటే చాలా..?
మరి నా మనసు మాట..?
ఇదెక్కడి విచిత్రం...
శిల్పానికి మనసెందుకేంటి?
చెప్పినట్టల్లా వింటే చాలదా..?!.."

challa baaga vrasaaru,"

- వెన్నెల వెలుగులు

(https://www.facebook.com/svs.vennela)

శోభ said...

నువ్వు చూపే ప్రపంచాన్నే చూడాలి
ఆ ప్రపంచం అంతా నువ్వై ఉండాలి...కళ్లుండీ చూడలేనితనం
చెవులుండీ వినలేనితనం
నోరుండీ మాట్లాడలేనితనం
మనసుండీ లేని తనం
ఇదీ ఒక జీవితమేనా...???...శోభ గారూ!..మీరు చెప్పేది నిజమే...ఒక రాయి సరి అయిన శిల్పి చేతిలో పడితే అది సుదరశిల్పమే కాదు జీవన శిల్పం అవుతుంది...అందమైన శిల్పం...సరైన రక్షకుడి చేతిలో పడితే జీవితాంతం సంరక్షించ బడుతుంది...మీ కవితలో చూద్పిన వేదన చాలా బాగుంది...అభినందనలు... @శ్రీ

శోభ said...

నా జీవితపు శిల్పీ...
కళ్లను ఇచ్చావు..
చూపునూ ఇచ్చావు.. కానీ
నువ్వు చూపిందే ప్రపంచమన్నావు
మనసు వద్దే వద్దన్నావు
నోటి రూపం నువ్వు దిద్దిందేగా
అయితే మాటలెందుకులే
ఆడించే తలనిచ్చావుగా...

బలమైన వస్తువు.బలమైన కవిత. నడిపిన పధ్ధతి, చెప్పిన తీరు బాగున్నాయి. ఒకానొక ప్రతిఘటన స్వరం.

- కవి యాకూబ్

(https://www.facebook.com/kaviyakoob)

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

కళ్లుండీ చూడలేనితనం
చెవులుండీ వినలేనితనం
నోరుండీ మాట్లాడలేనితనం
మనసుండీ లేని తనం
ఇదీ ఒక జీవితమేనా...???...
ఎంత బాగా రాసావంటే....మాటల్లేవు శోభా..ఎక్సలెంట్ !!

sunamu said...

This is a delicately handled poem. Can I use it for translation?

శోభ said...

@ Anangi Balasiddaiah

@ Pratap

@ తెలుగమ్మాయి

@ ఫోటాన్

@ వనజ వనమాలి

@ Meraj Fathima

@ సుదర్శన్

@ మాధురి

@ బహుదూరపు బాటసారి

@ వెన్నెల వెలుగులు

@ శ్రీ

@ కవి యాకూబ్

@ జ్యోతిర్మయి మళ్ల

@ Sunamu

గార్లకు మనఃపూర్వక ధన్యవాదాలు. నా పదాలు మిమ్మల్నందరినీ ఆకట్టుకున్నందుకు సంతోషంతో మాటలు రావటం లేదు. ఇలాగే మీ ప్రోత్సాహంతో నా కలానికి కూసింత శక్తినివ్వాలని కోరుకుంటూ.. బోలెడన్ని థాంకులు.. :)

శోభ said...

@ Sunamu గారు...

ఇది నా స్వంత కవిత. మీరు అనువాదం కోసం వాడుకోనా అని అడిగారు.. ఏ భాషలోకి అనువదిస్తారు, ఎక్కడ పబ్లిష్ చేస్తారు.. అనే విషయాలు చెప్పగలరా...?!

sunamu said...

I want to translate it into english and post it in my blog:
teluguanuvaadaalu.wordpress.com.

శోభ said...

@ Sunamu గారు...

ఓకే సర్.. మీరు అనువాదించి, పబ్లిష్ చేసుకోగలరు.. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు...

ధన్యవాదాలు..

Padmarpita said...

Superb....

శోభ said...

పద్మగారూ... థ్యాంక్యూ :)

nsmurty said...

Sobha garu,
Please find your poem in translation in my blog:http://teluguanuvaadaalu.wordpress.com/
thank you for the opportunity.
with best regards

శోభ said...

మూర్తి గారు .. నమస్తే సర్..!

మీ తెలుగు అనువాదాలు బ్లాగ్‌లో నా కవితకూ చోటు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న నా కవిత్వ పాపాయిని ఇంగ్లీషు భాషలోకి అనువదించి, తెలుగు కవిత్వాన్ని మరింతమందికి పరిచయం చేసే దిశగా మీరు చేస్తున్న కృషికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.

ఎంతోమంది కవులను, కవిత్వాన్ని మీ కలం ద్వారా ప్రత్యేకించి బ్లాగుద్వారా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

మీ కృషి ఇలాగే కలకాలం కొనసాగాలని, మరెంతోమందికి మీ బ్లాగులో చోటు లభించాలని కోరుకుంటూ.. ధన్యవాదాలతో.. శెలవు.

Karunya said...

తను చెక్కిన శిల్పం కదా హక్కులన్నీ తనవేననేమో.....