Pages

Wednesday 11 December 2013

అప్పుడు కుట్టీ... ఇప్పుడు జెస్సీ...!!కుట్టీ అంటే... మేం పోగొట్టుకున్న బుజ్జి కుక్కపిల్ల అని నా బ్లాగ్ మిత్రులందరికీ తెలిసిందే. మరి ఈ కుట్టీ ఎవరని అనుకుంటున్నారా.. వచ్చేస్తున్నా అక్కడికే.

కుట్టీ జ్ఞాపకాలతో (కుట్టీ జ్ఞాపకాల్ని ఇక్కడ చూడండి) ఇక ఆ ఇంట్లో ఉండలేక.. కొన్నాళ్ల తరువాత పక్క వీధిలోని ఇంకో ఇంట్లోకి మారిపోయాం. ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్ వాళ్లు ఓవైపు, మేం మరోవైపు ఉండేవాళ్లం. బాల్కనీ మాత్రం ఇద్దరం ఉమ్మడిగా వాడుకునేవాళ్లం. తమిళం అంతంత మాత్రమే కాబట్టి.. ఓనర్ వాళ్లతో కాస్త దూరంగానే ఉండేదాన్ని. కానీ పాపం వాళ్లే ఆప్యాయంగా పలుకరించేవాళ్లు. మెల్లిగా వాళ్లతో స్నేహం మొదలైంది. నాకేం తెలుసు ఆ స్నేహం ఇంకో ఎడబాటుకు చేరువ అవుతోందని.

ఇంటి ఓనర్‌ మురుగేశన్ మేస్త్రీ. ఆయనకి ముగ్గురు పిల్లలు. కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుక్కి, పెద్ద కూతురికి పెళ్లిళ్లయ్యాయి. చిన్నమ్మాయి చదువుమానేసి ఇంట్లోనే ఉంటోంది. పెద్దమ్మాయి పేరు సరస్వతి. అందరూ సరసూ అనేవాళ్లు. చిన్నమ్మాయి విజయ... విజ్జీ. ఓనర్ కొడుకు బిడ్డ ప్రేమ్‌ని తమతోనే ఉంచుకుని చదివిస్తున్నారు.

సరసు నాకంటే పెద్దది కాబట్టి సరసక్క అనేదాన్ని. ఓనర్ దంపతుల్ని అమ్మా, అప్పా అని పిలిచేదాన్ని. విజ్జీని పేరుతోనే పిలిచేదాన్ని. కొన్నాళ్లకి వాళ్ల ఇంట్లో మనుషులుగా అందరికీ చేరువయ్యాం. ఎంతగా అంటే వాళ్ల బంధువులే కుళ్లుకునేంతగా.

నిజ్జంగా తమిళం ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే, అంతో ఇంతో చదవగలుగుతున్నానంటే.. ఇది వీళ్ల చలవే. తమిళం తప్పు తప్పుగా మాట్లాడుతుంటే వాళ్లు నవ్వుకుంటూ సరిదిద్దేవాళ్లు. ఆ ప్రేమ్ గాడైతే నన్ను ఎంతలా ఏడిపించేవాడో. కానీ పాపం వాడే నాకు అక్షరాలు నేర్పించాడు. ఒక్కోసారి వాళ్లు నవ్వుతుంటే ఉక్రోషంగా ఉండేది. ఆ ఉక్రోషంతోనే తమిళం బాగా నేర్చుకుని వాళ్లతో గడగడా మాట్లాడేయాలనే పట్టుదల కూడా వచ్చేసేది.

కాస్త తమాయించుకుని మళ్లీ నవ్వుతూ ఏదో మాట్లాడబోయి, మరేదో మాట్లాడి వాళ్ల ఇంట్లో నవ్వులు పూయించేదాన్ననుకోండి. కానీ నాకు లోలోపల వాళ్లు నాతో ఎంతగా ఆడేసుకుంటున్నారో చూడు అని ఏడుపొచ్చేది. అంతకంతకూ పట్టుదల పెరిగిపోయింది. ఎలాగైనా సరే నేర్చేసుకోవాలి అని.

తమిళం పిచ్చి ఎంతలా ముదిరిపోయిందంటే... ఎవరైనా తిట్టుకుంటుంటే, గొడవలు పడుతుంటే.. చాలా ఆసక్తిగా గమనించటం.. ఏం పదాలు వాడుతున్నారో నోట్ చేసుకోవడం.. తీరిగ్గా ఓనరమ్మ (అమ్మ) దగ్గర చేరిపోయి ఒక్కోటి ఆరాతీస్తూ అర్థాలు కనుక్కోవడం.. ఆమె నన్ను ఆటపట్టిస్తూనే తెలీని పదాలకి అర్థం చెప్పేది. అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే యాక్షన్ చేసి చూపించటమో, టీవీలో వస్తున్న సందర్భాల్ని చూపించటమో చేసేది.

కానీ అమ్మ దగ్గర నాకు అప్పుడు, ఇప్పుడూ నచ్చని ఒకే ఒక పదం.. నా పేరు. శోభ ఎంత అందమైన పేరు.. ఈ పేరుతో పిలవటం మీకు ఇష్టం లేదా అంటారేమో.. అలా పిలిస్తే నాకంటే సంతోషించేవాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా ఎప్పుడూ పిలవనే పిలవదు. నా పేరును ఎప్పటికప్పుడు ఖూనీ చేసేస్తూ... "సోఫా" అంటుంది. నన్ను పిలుస్తుందో సోఫాలో కూర్చోమంటోందో అర్థమయ్యేది కాదు నాకు. పిలుస్తోంటే పలకవేంటే అని తిట్టేది చాలాసార్లు.. అమ్మా నా పేరు సోఫా కాదు.. శోభ... అంటే ఆ.. అదుదా అనేది.

విషయం ఏంటంటే... తమిళంలో ప, ఫ, బ, భ... ఈ నాలుగు అక్షరాలకుగానూ ఒకే అక్షరం ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆ అక్షరాన్ని వాడుతుంటారు.. అలా నా అందమైన పేరు ఇలా ఖూనీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా సోఫా అంటే చాలు.. నాకు తెలీకుండా నేను పలికేస్తుంటాను చాలాసార్లు... తల్చుకుంటే నవ్వొస్తుంది.

ఆ కుటుంబంతో కలిసి ఉన్నన్ని రోజులు చెన్నై నగరం మొత్తం ఓ చుట్టు చుట్టేశానంటే నమ్మండి. గుళ్లు, గోపురాలు, చూడాల్సిన ప్రదేశాలు అన్నీ ఎడాపెడా తిరిగేశాను వాళ్లతో. మా ఆయన వీటన్నింటికీ దూరం సుమండీ. నేను మాత్రం ఆయన వచ్చినా, రాకపోయినా అమ్మావాళ్లతో కలిసి ఎగిరిపోయేదాన్ని.

అన్నట్టు చెప్పనేలేదు కదూ.. సరసు అక్క పుట్టింట్లోనే ఉంటోంది. తను గర్భవతి. కాన్పుకి రాలేదు తను.. భర్తతో ఏదో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. కొన్నాళ్లకి పండంటి బాబు పుట్టాడు తనకి. అప్పటిదాకా తమిళం నేర్చుకోవడం.. సిటీ మొత్తం తిరగడం నా వ్యాపకాలు. ఇక బాబుగాడు పుట్టాక ఇక వాడే లోకం. ఏ మాత్రం టైం దొరికినా వాడి దగ్గరే.

చిన్నచిన్ని చేతులు, కాళ్లు తాకుతూ... వాడి ప్రతి కదలికనూ ఆస్వాదిస్తూ ఎప్పుడూ వాడితోనే. ఎందుకో వాడిని చూస్తే నాకు కుట్టీ గుర్తొచ్చేది. అలా నాకు తెలీకుండానే నా మనసులో వాడికి "కుట్టీ" పేరును పెట్టుకున్నాను. వాడు కాస్త పెద్దయ్యాక ఆ పేరుతోనే పిలిచేదాన్ని.

వాడు పుట్టినా కూడా సరసు అక్క భర్త రాలేదు. ఆమె ఎప్పుడూ ఆ దిగులుతోనే పిల్లాడిని సరిగా పట్టించుకునేది కాదు. నాకా వేరే వ్యాపకం అంటూ ఏం లేదు వాడిని చూసుకోవడం తప్ప. అలా లేచింది మొదలు నిద్రపోయేదాకా వాడే లోకం. కుట్టీ అమ్మా, నాన్న ఎవరు అంటే మమ్మల్ని చూపించేవాళ్లు వీధిలో అందరూ. సరసు అక్క దగ్గర కంటే మా దగ్గర ఉండటమే వాడికి ఇష్టం.

ముఖ్యంగా మా ఆయన బొజ్జమీద పడుకోవడం వాడికి ఎంత ఇష్టమో. లెక్కలేనన్ని రోజులు వాడు అలా నిద్రపోయేవాడు. వాడు చేసే అల్లరిని భరించలేక ఒక్కోసారి ఏమైనా అంటే మా ఆయన నామీద ఇంతెత్తున లేచేవారు. అలా ఎన్నిసార్లు వాళ్లిద్దరూ ఒక పార్టీ అయిపోయేవారో... అయినా ఆ పార్టీ ఓట్లన్నీ ఎప్పటికీ నాకే కదా అనే ధీమాతో అస్సలు లెక్కపెడితే కదా నేను.

ఒకసారి వాడికి విరేచనాలు పట్టుకున్నాయి. ఎంతకీ తగ్గడం లేదు. ఆస్పత్రిలో వాడితోనే ఉండిపోయి బాగైన తరువాతే ఇంటికి వచ్చాం. అప్పటి మా ఆదుర్దా చూసి అమ్మావాళ్లు ఎంతగా ఫీలయ్యారో.. పిల్లాడంటే ఎంత ప్రేమ మీకు.. త్వరలో మీక్కూడా బోలెడుమంది పిల్లలు పుడతారులే సోఫా.. అంటూ అమ్మ తలనిమురుతూ ఉండిపోయింది.

వాడితో చాలా చాలా జ్ఞాపకాలు.. సరసు అక్కకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకని వాడికి వాళ్ల అన్న కూతురి గౌన్ వేసి నా దగ్గరికి పంపింది. నేను ఎంత సంబరపడిపోయానంటే.. ఉన్నఫళంగా ఫొటో స్టుడియోకి పరిగెత్తి వాడితో ఫొటో తీయించుకున్నాను. ఇప్పటికీ ఆ ఫొటో భద్రంగా ఉంది.. ఉందని అనుకున్నానుగానీ.. ఈ మధ్య కనిపించకుండా పోయింది. తల్చుకుంటే ఎంత ఏడుపు వస్తుందో.

రోజు రోజుకీ వాడితో విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. అలాగే ఉండనిస్తే కాలం గొప్పదనం ఏముంటుంది. అందుకే అది మరో ఎడబాటును మాకు రుచి చూపించింది.

ఇన్నాళ్లూ సరసు అక్కకి దూరంగా ఉన్న తన భర్త.. రాజీపడి రాకపోకలు సాగించాడు. కొన్నాళ్లు గడిచాక ఇక మనింటికి వెళ్దాం పదా అంటూ అక్కని బయల్దేరదీశాడు. ఇంట్లోవాళ్లు సరేనన్నారు. సరసు అక్క భర్తది పల్లెటూరు. చెన్నై నుంచి చాలా దూరంలో ఉంటుంది. ఒకరోజంతా ప్రయాణం చేయాలని చెబుతుండేవాళ్లు.

అమ్మ, సరసు అక్క ఒకరోజు నన్ను పిలిచి.. కుట్టీ ఇక వాళ్ల ఊరు వెళ్లిపోతున్నాడు.. సోఫా ఎలా ఉంటావో ఏంటో అని బాధపడ్డారు. నాకైతే నోట మాట రాలేదు. అంటే కుట్టీ ఇక ఇక్కడ ఉండడా అని ఏడుపు తన్నుకొస్తోంది. తమాయించుకుని వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నా.

ఏం చేయను సోఫా... ఎన్నాళ్లని పుట్టింట్లో ఉండను. ఎలాంటివాడైనా కానీ భర్తతో కలిసి ఉండటమే కదా నాకూ, అమ్మావాళ్లకు మంచిది అంది సరసక్క నా బాధని చూసి. బాధపడకు.. అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటుందిలే అని అమ్మ ఓదార్చింది.

వాడు రేపు ఊరెళ్తాడనంగా.. ముందు రోజు రాత్రి చూడాలి మా బాధ. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను నేను. మా ఆయన గుండెలమీద నిద్రపోతుండే వాడే గుర్తొచ్చేవాడు. ఆయనకి చాలా బాధగా ఉంది.. కానీ మౌనంగా ఉన్నాడు. నేను మాత్రం కంట్రోల్ చేసుకోలేక పోయాను.

వాడికేం తెలుసు.. హాయిగా నవ్వుతూ ఎప్పట్లా పరుగెత్తుకొస్తున్నాడు మా దగ్గరికి. వాళ్ల నాన్న దగ్గరికి అస్సలు పోతే కదా. అతను బలవంతంగా ఎత్తుకునేసరికి ఏడుపు అందుకున్నాడు. పిల్లాడిని ఏడిపిస్తూ తీసుకెళ్లటం ఎందుకు అనుకున్నాడో ఏంటో.. మళ్లీ మా దగ్గరికే ఇచ్చాడు. కాసేపు ఆడించి, సముదాయించి.. టాటా వెళ్తున్నారని చెప్పగానే వాడు సంతోషంతో వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లాడు.

చేతులు ఊపుతూ.. నవ్వుతూ వాళ్లూరికి వెళ్లిపోయాడు. తరువాత ఏవో పండగలు, పబ్బాలకి ఎప్పుడోగానీ వచ్చేవాళ్లు కాదు.

వాడు ఊరెళ్లిన తరువాత.. మేం ఇంట్లో ఉన్నామో, లేమో తెలీనంత మౌనంగా ఉండిపోయాం. వాడు గుర్తొస్తే ఏడ్చుకోవడం... బాధపడటం మినహా... ఒక్కోసారి మాపైన మాకే కోపం.. ఎవరికీ దగ్గర కాకూడదని.

"కుట్టీ" ఈ పేరుకి నాకూ చాలా దూరమేమో... ఆ విషయం తెలీక మళ్లీ వాడికి కుట్టీ అని పేరు పెట్టుకున్నాను. పేరు పెట్టుకున్నందుకో.. మరెందుకో... నాకు వాడు కూడా మిగలలేదు.. వాడి జ్ఞాపకాలు తప్ప.

అంతే ఇక ఆ ఇంట్లో ఉండలేకపోయాం... కాలం తన్నిన బంతిలా మళ్లీ ఇంకో మూలకి పడ్డాం.

కాలం అలా దొర్లిపోతోంది... మేమూ చెన్నె మూల మూలలకి దొర్లుకుంటూ వెళ్తూనే ఉన్నాం.. అలా ఓ మూలలో ఇప్పుడు...

కాలం గాయాలతో బండబారిపోయి.. అస్సలు ఎవ్వరినీ దగ్గరకి రానీయకుండా ఉండాలని బలంగా అనుకుంటూ... దగ్గర చేర్చుకోకుండా ఉండలేని బలహీనతతో మళ్లీ మళ్లీ కొన్ని బంధాలకి లోబడి పోవాల్సి వచ్చేది. అలా మావాడు "పిన్నీ, బాబాయ్" అంటూ మా జీవితాల్లోకి  చేరువయ్యాడు. ఈ బంధం బలహీనం అవకూడదనే ఆశతో బ్రతికేస్తున్నాం.. కానీ విధి వింత ఆటలో పావులం... ఆశ పడటమే మనవంతు.. అమలు చేయటం పైవాని వంతు. మావాడి ఆలనలో హాయిగా సేదదీరుతుంటే... ఇదుగో నేనున్నానంటూ అనుకోకుండా పలుకరించింది ఓ చిన్ని పిట్ట. తుర్రుమంటూ వచ్చేది, ఇల్లంతా నానా హంగామా చేసేసి మళ్లీ తుర్రుమనేది. ఉండేది కాసేపైనా ఆ అల్లరికి జీవితం అంతా ఫిదా అయిపోవాలనిపించేది. ఈ చిన్నిపిట్ట పేరు "జెస్సీ". పేరుకు తగ్గట్టే ఎంత ముద్దుగా ఉంటుందో... :)

పక్క పోర్షన్‌లో ఉండే లక్ష్మిగారు ఈ జెస్సీకి పెద్దమ్మ వరస. జెస్సీ అమ్మమ్మకి ఆపరేషన్ అయిన కారణంగా, జెస్సీ తల్లి డాక్టర్‌గా బిజీగా ఉన్న కారణంగా.. తనని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో.. రోజూ జెస్సీ నాన్న లక్ష్మిగారి దగ్గర వదిలి వెళ్లేవారు. రోజూ పొద్దున్నే రావడం.. రాత్రికి వెళ్లిపోవడం.. ఇదీ వరస. చాలా రోజులు నేను జెస్సీకి దగ్గర కాలేదు. కారణం తెలిసిందే.. దగ్గరైతే మళ్లీ బాధపడాల్సి వస్తుందనే.

ఒకరోజు బాల్కనీలోకి వెళ్తే పెద్దమ్మతో ఆ.. ఊ అంటూ కబుర్లు చెబుతోంది. నన్ను చూడగానే ఆంటీకి హాయ్ చెప్పమ్మా అంది లక్ష్మిగారు. హాయ్ చెప్పడమేకాదు నవ్వుతూ నామీదకి ఒంగిపోయింది. ఎత్తుకోకపోతే బాగుండదని అన్యమనస్కంగానే తీసుకున్నాను. నోట్లో రెండే రెండు పళ్లతో నవ్వుతూ హత్తుకుపోయింది జెస్సీ. అబ్బా... పాల వాసన గుప్పుమంది. కాసేపు అలాగే ఆడించి.. ఇచ్చేశాను. అంతటితో మనసు ఊరుకుంటేగా... కాసేపటి తరువాత కాళ్లు పక్కంటికే పరుగులు తీస్తుంటే.. ఇదీ వరస.. మళ్లీ పిచ్చి మొదలైంది.

నిజం చెప్పొద్దూ... నా కాళ్లు పక్కింటికి పరుగులు తీస్తే.. జెస్సీ వాళ్లింటో వదిలితే చాలు నేరుగా మా ఇంట్లోకి వచ్చేసేది. ఇక వచ్చినప్పటినుంచి ఇల్లంతా రణరంగమే. ఏ వస్తువూ ఒక చోట ఉండనీయదు. ఒకటే ఉరుకులు పరుగులు.. నాకైతే టైమే తెలిసేది కాదు. అది ఉన్నంతసేపు నాకు స్వర్గంలో ఉన్నట్టుండేది. ముద్దులు పెట్టేది.. కొరికేసేది. అలిగేది.. నువ్వు నాకు వద్దు పో అంటే ఏడుస్తూ హత్తుకుపోయేది.

కొన్నాళ్లకి ఎంత దగ్గరైపోయిందంటే.. అది ఒక రోజు రాకపోయినా నాకు పిచ్చి పట్టినట్టుగా ఉండేది. 14 నెలల ఆ పాప... ఇంట్లోకి వచ్చిందంటే చాలు సందడే సందడి. బెడ్ చూసిందంటే చాలు పైకి ఎక్కి.. అటూ ఇటూ పరిగెత్తేది. ముఖ్యంగా పల్టీలు కొట్టది. నాకైతే ఎంత భయం వేసేదో.. కానీ అది పల్టీలు కొట్టేసి హాయిగా నవ్వేసేది. తలమీదుగా ఒక్కసారిగా ఒళ్లంతా ఎత్తేసి అటువైపు పడేసేది.. ఎక్కడ మెడ పట్టేస్తుందో అని నా భయం.. కానీ అది అవేమైనా పట్టించుకుంటేగా...

రెడీ అయ్యి ఎక్కడికైనా బయల్దేరుతుంటే తనూ రావాలని మారాం చేసేది. బండి చూస్తే అస్సలు వదలదు. బండ్లో వెళ్లాలని ఒకటే గొడవ చేసేసేది. ఒక్కోసారి మంచి మూడ్‌లో ఉంటే... నవ్వుతూ టాటా చెప్పటం.. ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం చేస్తుంది. బాల్కనీలోంచి కింద ఎవరు కనిపించినా టాటా చెప్పటం మర్చిపోదు. ఇలాంటి పిల్లతో రోజూ ఎలా గడుస్తోందో తెలీకుండా గడిచిపోయేది.

ఈ ముచ్చటా మూన్నాళ్లే. అన్నీ సవ్యంగా జరిగిపోతే జీవితం ఎందుకు అవుతుంది. జెస్సీ అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడటంతో... ఆ పిల్లని ఇక్కడికి తీసుకురావడం లేదు. నాకేమో ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించేది. జెస్సీతో ఉన్న చనువు.. వాళ్ల అమ్మా,నాన్నలతో లేకపోవడం వల్ల ఆ పిల్ల కోసం వాళ్ల ఇంటికి వెళ్లలేని పరిస్థితి. వాళ్లు ఉండేది ఒకే ఊర్లో అయినా చాలా దూరంగా ఉండేవాళ్లు. పోనీ దాంతో ఫోన్లో మాట్లాడుదాం అనుకున్నా.. ఇంకా మాటలురాని పిల్లతో ఏం మాట్లాడతాం.

జెస్సీ గురించి గుర్తుకురాగానే... ఎప్పుడో తను ఆడుకుంటుంటే అనుకోకుండా మొబైల్లో తీసిన ఫొటోలను చూసుకుని తృప్తి పడటం మినహా ఇంకేం చేయలేకున్నా ప్రస్తుతానికి. అయితే ఈ చిన్నారి దేవీ గారి గురించి అప్పుడప్పుడు వాళ్ల పెద్దమ్మ చెబుతూ ఉంటుంది.. వాళ్ల అమ్మమ్మ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అన్నీ అమ్మాయిగారి కబుర్లేనట. బాగా అల్లరిదైపోయిందని... బొమ్మల్ని ఒళ్లోపెట్టుకుని జోల పాడుతోందని.. ఇలా కబుర్లే.. కబుర్లు..

చూడాలి.. దేవీగారూ ఎప్పటికి కరుణిస్తారో.. అప్పటిదాకా ఈ బాధ తప్పదు... అయినా వచ్చినా కాసేపే కదా.. మళ్లీ తనవాళ్లతో తను వెళ్లిపోతుంది... నేను ఇలాగే జ్ఞాపకాలతో ఉండక తప్పదు.. అంతే...

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడుగక...

వాన కురిసి కలిసేది వాగులో
వాగువంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో.......

వద్దు వద్దనుకున్నా దగ్గరవకుండా ఉండలేని ఓ పెద్ద బలహీనతతో వేగుతూ బ్రతుకీడుస్తున్న ఈ జీవికి.... కుట్టీ... మరో కుట్టీ... చిన్నా.... జెస్సీ... ఆ తరువాత ఇంకెవరో... ?????


11 comments:

Unknown said...

chaduvuthuntey kalla mundhu aa drusyalu kaduluthunnayi...modalu pettaka na kallu chivari varaku parigettayi ekkada aagaledhu.....it's an art adhi kondharike sadhyam.....yadana pudi novels kuda anthey......meeru evaina novels rasara...links pampagalaru...

Abhnandhanalatho

Akash

Meraj Fathima said...

పిల్లలనీ, మూగ జంతువులనీ చేరదీసి అవి దూరం అయితే తట్ట్టుకోలేము, కానీ సున్నితమైన మనస్సులు ఏమూలో ఎవరినో ఒకరిని చేరదీస్తూనే ఉంటాయి.
సోఫా....:-) మీ సున్నిత మనస్సుకు ఇదో తార్కాణం.

Unknown said...

okalla gnaapakaalu dooram avvataaniki marokaru cheratam, malli vaallu vedana migalchatam idi maanava jeevana chakram... thiruguthune vuntundi... next baby or babu kosam wait chesthundandi... :) interesting post

veera murthy (satya) said...

ఇంత సహజంగా పోస్ట్ ద్వారా మనసు పంచుకోవడం ఎవ్వరివల్లా కాదేమో.

సున్నితత్వం ఓ మంచి గుణం ... దానికి సూక్ష్మత కలిస్తే అది గొప్పగుణంగా ఇంకా హితకారిగా మారుతుంది.

మీరు నిజంగా లక్కీ... మీ గతం పట్ల మీ మనోగతమంతా సహజమైనదే. ఆ పిల్లలు నిజంగా అదృష్టవంతులు. ప్రేమని అలాగే పంచండి. సహజంగా జరిగే మార్పులని ఒప్పుకొని ముందుకెళ్లండి.. మీరెంత త్వరగా సమాయత్తమౌతే అంత త్వరగా ఎదురుచూస్తున్నవారికి, అర్హులైన వారికి ప్రేమని పంచగలుగుతారు -satya

Anonymous said...

జీవితం లో మన ప్రమేయం లేకుండానే కొంతమంది ప్రవేశిస్తుంటారు. వారి నుంచి మనం కోరేదేమీ ఉండదు, ప్రేమిస్తాం, దగ్గరవుతారు, మనసులో ఇమిడిపోతారు, మరచిపోలేనంతగా, అదేం చిత్రమో దూరమైపోతారు చెప్పపెట్టక, అనేక కారణాలతో, మరచీపోతారు, ఎదురుగా ఉండీ మాటాడరు, ఇదో చిత్ర వధ. మనసు చాలా చిత్రమైనది, దీనిని అదుపులో ఉంచాలనుకుంటాం సాధ్యమా? సాధ్యమైతే ఈ తిప్పలెందుకూ?

శోభ said...

ఆకాశ్ గారూ...

నా బ్లాగ్ లోకి తొలిసారి మీ రాకకు స్వాగతం. పోస్ట్ నచ్చినందుకు చాలా సంతోషం.

నావెల్స్ రాసేంతగా ఇంకా ఎదగలేదండి.. కథలు రాసేందుకే సరిగా రావడం లేదు. ఇక నవలల సంగతి సరేసరి. ఒకవేళ రాస్తే తప్పకుండా మీకు పంపుతాను.. ధన్యవాదాలు.

శోభ said...

మేరాజ్ అక్కా...

సోఫా... మీ సున్నిత మనస్సుకు ఇదో తార్కాణం.. ఎంత బాగ చెప్పారు.. సున్నిత మనస్సు ఏమోగానీ.. మొదట్లో అలా పిలుస్తుంటే కోపం వచ్చేది.. కానీ ఇప్పుడలా అనిపించదు పాత జ్ఞాపకాలు గుర్తొస్తే... :(

శోభ said...

అభీ... నీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు... :)

శోభ said...

సత్యా...

సహజంగా జరిగే మార్పులని ఒప్పుకొని ముందుకెళ్లండి.. మీరెంత త్వరగా సమాయత్తమౌతే అంత త్వరగా ఎదురుచూస్తున్నవారికి, అర్హులైన వారికి ప్రేమని పంచగలుగుతారు.

ఇప్పటిదాకా జరిగింది అదే.. ఇక జరగబోయేది కూడా అదేనేమో... ఆ ప్రేమను పంచే ప్రేమమూర్తులు ఇంకే రూపంలో మా ముందుకు వస్తారో... :)

శోభ said...

కష్టేఫలి మాస్టారూ...

మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజం. అయినా కూడా ప్రేమించకుండా, ఎవర్నీ దగ్గర తీయకుండా ఉండలేని ఓ మానసిక స్థితి అది. జరిగేవి జరగక మానవు... మనం నిమిత్తమాత్రులం అని మనసుని ఊరడించుకోవడం మినహా ఏం చేయగలం.

Vijaya Ramireddy said...

వద్దు వద్దనుకున్నా దగ్గరవకుండా ఉండలేని ఓ పెద్ద బలహీనతతో వేగుతూ ముందుకు సాగుతున్న మీకు ... కుట్టీ... మరో కుట్టీ... చిన్నా.... జెస్సీ... ఆ తరువాత ఇంకెవరో ...??? మీ మాటలు కదిలించి వేస్తున్నాయి శోభా గారు.