Pages

Monday, 4 February 2013

ఇల్లాలికి నా (ప్రేమ) లేఖ....!!


"మనసంతా నువ్వే" ముఖచిత్రం గ్రూపులో ప్రేమలేఖల పోటీకి గానూ.. నేను రాసిన లేఖ ఇదుగో... :-)

బుజ్జమ్మా....

ఓయ్ దొంగపిల్లా... బుజ్జమ్మా అనే పిలుపు చూడగానే ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నావు కదూ..? నాకు తెలుసులే... మన స్నేహం తొలినాళ్లలో నీ పేరు పెట్టి పిలిచేందుకే మహా ఇబ్బంది పడిపోయిన నేను.. మనం ఒక్కటైనాక ప్రేమగా బుజ్జీ, బుజ్జమ్మా అంటుంటే నీకెంత సంబరమో.. నీకు తెలీదుకానీ నాక్కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలా పిలుస్తుంటే... 

నువ్ ఊరెళ్లగానే....... ఫోన్లు, మెసేజ్‌లు, ఈ మెయిళ్లు ఇవన్నీ ఇప్పట్లో రొటీనే కదా.. కాస్త వెరైటీగా మనం అందరం ఎప్పుడో మర్చిపోయిన లెటర్లో అందంగా అల్లిన అక్షరాల మాలల్ని పేర్చి నీకు బహుమతిగా అందిస్తే.... ఓహ్.. ఊహే భేషుగ్గా ఉంది.. దాన్ని నిజం చేద్దామని పెన్నూ, పేపర్‌తో సిద్ధమై.. మెల్లిగా సిరాని అక్షరాల్లో ఒలికిస్తూ మెుదలెట్టిన నీ శ్రీవారి ప్రేమలేఖ ఇదుగో....

అన్నట్టు లేఖ అనగానే.. మన మొదటి ప్రేమలేఖ గుర్తొస్తోంది బుజ్జీ. ఎన్నో రోజులు చూపులతోనే యుద్ధం చేసీ చేసీ అలసి సొలసిపోయిన మనం.. ఆనంద్‌గాడి పెళ్లిలో నవ్వుతూ హాయ్ చెప్పుకుంటూ మాటలు కలిపినప్పటి దృశ్యం ఇంకా నా కళ్లముందే కదలాడుతోంది. మాట్లాడేందుకు ఎంత కష్టపడ్డాం.. అతి కష్టంమీద హాయ్ మాత్రమే చెప్పుకున్నాం కదా.. వాడి పెళ్లి అయ్యేంతదాకా పొడి పొడి మాటలు మనమధ్య దోబూచులాడినా.. వీడలేక వీడిపోతున్నప్పుడు మాత్రం లెటర్ రాస్తావుగా అని మాత్రం అనగలిగా. కళ్లతోనే సరేనంటూ కంటినిండా నీటితో నువ్వు వెళ్తుంటే, ప్రాణమే నను వీడి వెళ్తున్నంతగా ఎంతలా విలవిల్లాడాను.

అప్పటినుంచీ మొదలు ఎప్పుడు నీ లెటర్ వస్తుందా అని... రోజులు గడుస్తున్నా నీనుంచి సమాధానం లేదు. రోజూ నీటి పంపు దగ్గర, శీనుగాడి షాపు దగ్గర చూపులతో మాట్లాడుతున్నా, నీ లేఖ రాని దిగులు మాత్రం ఎంతగా ఉండిపోయిందో. నువ్వు మాత్రం ఏమీ తెలీనట్లు చిన్నగా నవ్వుతూ జారుకునేదానివి. నిజం చెప్పనా.. నీ నవ్వు చూస్తుంటే, నాకు మరేమీ అడగాలని అనిపించేది కాదు.

అలా రోజులు గడుస్తుంటే.. ఓ రోజున అంకుల్... అంకుల్..... అక్క ఇది నీకు ఇమ్మంది అంటూ చేతిలో పెట్టి తుర్రున జారుకుంది ఓ చిన్ని పిట్ట (హనీ). ప్రపంచాన్నే జయించినంత సంతోషంతో లేఖను విడదీసిన నాకు నోట మాట రాకపోయింది తెలుసా.. అంత తప్పు నేనేం చేశాను అంటావేమో తుంటరి పిల్లా... ఏం చేశావో నీకు తెలీదా... ఏం చేశాను అని అలా బుంగమూతి పెట్టమాకు... నేనే చెబుతాలే..

తెల్లని పేపర్‌పై చక్కగా "ఓం" రాసి.. దానికి పసుపూ, కుంకుమ అద్ది మరీ మొదలెట్టిన నీ భక్తికి మెచ్చి పరవశుడనై.. ఆ తరువాత ఏముందో అని ఆత్రుతగా వెతికే నా కళ్లకి... "ప్రియమైన నీకు" అంటూ ముత్యాల్లాంటి అక్షరాలు తప్ప ఎంత వెతికినా మరేం కనిపించదే. ప్రియమైన నీకు తరువాత నువ్వు ఇంకేమైనా రాస్తే కదా కనిపించటానికి... బుద్ధూ బుద్ధూ.....

అయినా సరే నీ మీద ఎంతగా ప్రేమ పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేను.. నువ్వు ఏమైనా రాస్తే కేవలం ఆ మాటలు మాత్రమే ఆ లేఖలో ఉండేవి. కానీ ఏమీ రాయకుండా నువ్వు అలా వదిలేసి ఖాళీగా పంపిన లేఖలో నేను ఎన్నింటిని నింపుకున్నానో... నువ్వే రాసినట్లుగా ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి చదువుకున్నానో..... ఇదుగో ఆ లేఖ ఇప్పుడు నా చేతిలో అలాగే భద్రంగా.. అదేంటో చిత్రం... ఆనాటి భావనే ఇప్పుడూ.. అక్షయపాత్ర లాంటి నీ ప్రేమని ఎంత ఆస్వాదించినా.. ఇంకా ఎంతో మిగిలే ఉందని అనిపిస్తుంటుంది.

బుజ్జీ... మన వూరి జాతరలో తొలిసారిగా నిన్ను పట్టు పరికిణీలో చూసినప్పటి నా ఫీలింగ్స్ నీకు ఆరోజు అర్థమైందో లేదోగానీ.. ఎందుకో ఇవాళ చెప్పాలనిపిస్తోందిరా... అచ్చ తెలుగు కుందనపు బొమ్మ అలా నడిచి వస్తున్నట్టు, బాపూ బొమ్మకి ప్రాణం వచ్చి ఇలా నా కళ్లముందు తిరుగాడుతోన్న ఫీలింగ్. "అబ్బా.. ఎంత ముద్దుగా" ఉందో ఎంత దాచుకుందామన్నా దాగని మాట పైకి రాగా... నా ఫ్రెండ్స్ అంతా నన్నెలా ఆడుకున్నారో తెలుసా... అయినా నేను అవేమీ పట్టించుకునే స్థితిలో ఉంటే కదా... నువ్వెటు వెళ్తే అటు నా చూపులు, నా మనసూ.. పైకి మాత్రం ఇదేమీ గమనించనట్టుగా బెట్టు చేస్తూ, నా స్థితికి లోలోపల నవ్వుకుంటూ ఓసారి... పాపం పిల్లాడు.. అనే జాలి చూపుల్తో మరోసారి.. నువ్వు విసిరిన చూపులకు ఫిదా అయిపోయా.

ఇంకోసారి.. సంక్రాంతి పండుగ అప్పుడు అనుకుంటా... నోట్లో వేలు పెడితే కొరకనంతగా ఉండే ఈ పిల్లేనా అని సందేహంలో పడేసేలా ఎంత అల్లరి చేశావే బుజ్జీ. ఇదిగో నవ్వమాకు.. నాకు తెలుసు నువ్వు సంక్రాంతి అనగానే పడిపడీ నవ్వుతుంటావని.. చాలు చాలు ఇక ఆపు.. ఏవేవో వ్యూహాలు రచించి, నా డొక్కు స్నేహితులకు ఎన్నెన్నో మామూళ్లు, డిమాండ్లు నెరవేర్చీ మా అమ్మమ్మ వాళ్లూరికి నిన్ను సంక్రాంతికి వచ్చేలా చేస్తే.. ఏమీ ఎరగనట్టుగా నీ స్నేహితుల కోతిమూకతో సహా ఎంట్రీ ఇచ్చి నన్ను ఎంతలా ఏడిపించావు.

పశువుల పండుగ రోజున ఊరిబయటకు పశువుల్ని తోలుకెళ్లి, కాటమరాజు దగ్గర పూజ చేసేటప్పుడు ఎంతలా ఆడుకున్నావే నాతో. ఎవరూ చూడకుండా నాకు కన్నుకొట్టడం, నేను తేరుకుని రెస్పాండ్ అయ్యేలోపు ఏమీ తెలీనట్టుగా అందరితో కబుర్లు చెబుతున్న నిన్ను చూస్తే.. అందరూ చూస్తుండగానే కన్ను కొట్టి చిలిపిగా నవ్వాలని అనిపించేది. ఏదయితే అదయిందని నేను ఆ ప్రయత్నంలో ఉండగానే వద్దు ప్లీజ్ అంటూ నీ వేడుకోలు... ఎంత ముచ్చటగా ఉండేదో... నిజంగా ఎంత అద్భుతమైన జ్ఞాపకాలు కదా అవి... ఎన్ని రోజులు గడిచినా ఆ జ్ఞాపకాలు మనసులో మెదలాడగానే... మన ప్రమేయం లేకుండా చిరునవ్వు పెదాలపై దోబూచులాడదూ...

అన్నీ సరేలే... నేను వద్దు వద్దంటున్నా... బలవంతంగా ఊరికి పంపించి.. ఇప్పుడేమో దేవిగారిని శాంతింపజేయాలనా... ఈ "ప్రేమలేఖ"... మీ ఎత్తులు ఫలించవిక... నే అలిగానంతే.. అని బుంగమూతి పెట్టమాకే తల్లీ... నీ అలకతో నా గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెడుతున్నాయి... ఇంకా విమానాల్లాంటివి పరిగెత్తించనీయకు... మా బుజ్జి కదూ, మా బంగారం కదూ...?! హమ్మయ్యా.. నవ్వావా.. థ్యాంక్సే బుచ్చీ...! 

పెళ్లయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ నన్ను వదిలివెళ్లని నీవు.. మొన్న కూడా ఇష్టంలేకుండానే వెళ్లావని నాకు తెలీదా ఏంటి. అయినా తప్పదురా.. ఇద్దరం ముగ్గురం అయ్యే రోజు దగ్గర్లోనే కదా... మన ప్రేమకు ప్రతిరూపాన్ని జాగ్రత్తగా ఈ లోకంలోకి తీసుకొచ్చేందుకు నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన అమ్మ ఒడికంటే పదిలమైన గుడి ఏముంటుంది మన పాపాయికి... అందుకే నా బుజ్జి శ్రీమతిని మా అత్తమ్మతో పంపించానట. అర్థం చేసుంటారు కదండీ బుజ్జులు..

అయినా నీ దిగులంతా నాకు తెలుసులెండి శ్రీమతిగారు.. నేను ఒంటరిగా ఉంటానని, నా అవసరాలు ఎవరు చూస్తారని తమరి దిగులు. అయినా నేను ఒంటరినని ఎవరన్నారు నీతో. నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటుంటే నేను ఒంటరినెలా అవుతానే పిచ్చీ... రోజూ బలవంతం చేసి, బుజ్జగించి మరీ తినిపించే నా బుజ్జమ్మ లేకపోయినా, నువ్వే దగ్గరుండి అన్ని పనులూ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ... ఎంత చక్కగా పనులన్నీ చేసేసుకుంటున్నానో తెలుసా...? నువ్వు చూస్తే.. ఎంతగా మెచ్చుకుంటావో...

నువ్వు గుర్తు వచ్చినప్పుడు నీ చీరని చుట్టుకుని పడుకుంటే.. అదేంటో చిత్రం.. అచ్చం నీ పక్కనే పడుకుని ఎంచక్కా కబుర్లు చెబుతున్నట్లు.. నేను చెప్పే కబుర్లను వింటూ మిలమిలా మెరుస్తూ, అటూ ఇటూ కదలాడే నీ మీనాల్లాంటి కళ్లని చూస్తున్నట్లు అనిపిస్తోంది.. ఎన్నెన్ని కబుర్లో.. చెప్పి, చెప్పీ ఎప్పుడో అలసిపోయి నిదురబోయిన నేను.. ఉదయాన్నే కళ్లు తెరిచి చూసేసరికి నీ ఒడిలో (నీ చీరలో ముఖం దాచుకుని) హాయిగా బజ్జోనుంటాను. ఇంట్లో నువ్వున్నప్పుడు ఎలా కబుర్లు చెబుతుంటానో అలా కబుర్లు చెప్పుకుంటూనే పనులన్నీ చకచకా కానించి, ఆఫీసుకు పరుగులెడుతున్నాను. చూశావా.. ఎంత బుద్ధిమంతుడో నీ శ్రీవారు... "అబ్బా చాల్లేద్దూ... మావారికి దిష్టి తగులుతుంది" అంటున్నావు కదా.. నాకు తెలుసు బుజ్జీ.

ఇంత రాత్రి గడుస్తున్నా... నాకు ఇంకా ఇంకా రాయాలని అనిపిస్తోంది బుజ్జమ్మా. ఎన్ని జ్ఞాపకాలో, మరెన్ని అనుభూతులో కదా.. నేనేమీ బుచ్చమ్మను కాను బ్లాంక్ లెటర్ పంపేందుకు..  అయ్యగారు మాంచి మూడ్‌లో ఉన్నారు.. ఎన్ని పేజీలైనా అలవోకగా ఇట్టే రాసేయగలరు. ఈ లేఖ ఎవరైనా చదివితే ఎలా అని భయపడే ప్రేమికుడి స్టేజ్ దాటిపోయి అయ్యగారు శ్రీవారి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి.. ఎవరికీ భయపడే పనేలేదు. నువ్వీ లేఖ చదువుకున్నా ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. మొగుడూ పెళ్లాలు వాళ్ల ఇష్టం అని మన పెద్దాళ్లు ముసిముసిగా నవ్వుకుంటూ బయటపడతారు. కానీ.. లేఖ ఇంతకంటే ఎక్కువ రాయాలంటే కష్టంగా ఉంది.

అదేంటి పెళ్లానికి ప్రేమలేఖ రాయటం కష్టమా... అని మళ్లీ అలకపాన్పు ఎక్కబాకండి శ్రీమతిగారూ... అంతా మీ మంచికేనండి. మీరు నా లేఖను చదువుతూ.. ఎమోషనల్ అవుతూ ఇలా రాత్రంతా మేలుకుంటే, నీ పొట్టలో హాయిగా బజ్జున్న బుజ్జోడి నిద్ర పాడుచేసినట్లు అవుతుంది కదా... అంతేకాకుండా నా బుజ్జమ్మకు మాత్రం రెస్ట్ అవసరం లేదా.. అందుకే కూసింత స్వార్థంతో ఇప్పటికిలా లేఖను ముగించేస్తున్నాను. బుంగమూతి బుజ్జమ్మా... అర్థం చేసుకుంటావుగా..

అయినా నువ్వు నా బుజ్జమ్మవుగా.. ఎప్పుడో అర్థం చేసుకుని అప్పుడే పడుకునేశావా.. అమ్మో... ఎంతైనా బుజ్జమ్మ, బుజ్జమ్మే.... లవ్ యూ బుజ్జీ.. హాయిగా బజ్జో తల్లీ....!!

(ఇదుగో మీరందరూ నా బుజ్జికి దిష్టి పెట్టమాకండి... హాయిగా దీవించేసేయండి... )


10 comments:

Kranthi M said...

Good one kArunya gArU :)

David said...

చాలా బాగుంది.

శోభ said...

క్రాంతి కుమార్ గారు.. ధన్యవాదాలండీ.. నా బ్లాగులోకి మీ రాక నిజంగా చాలా సంతోషంగా ఉంది..

Thanks a lot Sir...

శోభ said...

డేవిడ్ గారూ.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు..

Chinni said...

శోభ గారు,బుజ్జమ్మను ఇంత ప్రేమించే బుజ్జమ్మ శ్రీవారి ప్రేమకు ఫిదా ఇక్కడ..
మనలో మనమాట ఇలాంటి అబ్బాయిలు నిజంగానే ఉంటారంటారా??

శోభ said...

చిన్నిగారు...

మళ్లీ చాన్నాళ్లకు మీ రాక సంతోషం సుమండీ... :)

మనలో మన మాట ఇలాంటి అబ్బాయిలు నిజంగానే ఉంటారంటారా?? అని అడిగారు...

ఎందుకుండరండీ... తప్పకుండా ఉంటారు... ఉన్నారు... నాకు అతి దగ్గరి స్నేహితులు, బంధువుల్లో చాలామందిని చూశాను కూడా. కూసింత ఈర్ష్యపడ్డాను కూడా... :)

Priya said...

No words అండీ అసలు. కంటెంట్ వేరయినా నాకెందుకో భరత్ నాకు రాసిన లవ్ లెటర్ గుర్తొచ్చింది. శోభా.. మీరెంత అందంగా రాస్తారో భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి! ఇదిగో ఇప్పుడు మీరలా బుంగ మూతి పెట్టకండీ "భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి మాత్రమేనా" అనీ. మీరేం చెప్పినా అందంగా ఉంటుంది ఇలాటివైతే మరీను :)

Anonymous said...

Very nice post Karunya garu... I like this very much, infact i involved in the situation(as i have to go to my home town next month)

శోభ said...

ధన్యవాదాలు ప్రియ.. :)

శోభ said...

అనానిమస్ గారూ... (మీ పేరు అస్సలు చెప్పరా..?)

ధన్యవాదాలు... సొంత ఊరికి వెళ్తే అంతకంటే సంతోషమా...?! బాగా ఎంజాయ్ చేయండి... :)