Pages

Sunday, 16 June 2013

అదంతే... నాన్నా....!!



ఆయన ఎక్కడున్నాడు
ఎప్పుడో పోయాడుగా
నాకైతే నమ్మబుద్ధే కాదు
నమ్మనంటే నమ్మనని
ఉన్నావని వాదిస్తాను

కాసిన్ని విచిత్ర నవ్వుల్ని
మరికొన్ని చిత్రమైన మాటల్ని
ఇంకొన్ని జాలి చూపుల్ని
నా ముందు విసిరేస్తుంటారు
పిచ్చిది కాబోలు అనుకుంటూ...

ఇంట్లో అడుగుపెట్టింది మొదలు
నాన్నా... నాన్నా.. అంటూ
నీ ముందు ప్రత్యక్షమై
వసపిట్టలా వాగి వాగి
ఆనక ఆకలి గుర్తొచ్చి
అమ్మ దగ్గరికి పరిగెడితే...
ఏంటో దీని పిచ్చిగానీ
తనలో తాను గొణుక్కుంటూ
కంటినిండా నీటితో..... అమ్మ

ఇంట్లో ఉన్నన్నాళ్లూ
నీ చుట్టూ తిరుగుతూ
అల్లర్లు, అలకలు, ఫిర్యాదులు, కబుర్లు
ఒకటేమిటి..
ఇద్దరం మాటాడేసుకుంటుంటే
కుళ్లు సంగతి పక్కనబెట్టి
అందరూ హాశ్చర్యంతో
నోర్లు వెళ్లబెడుతుంటే
ఎంతగా నవ్వుకుంటామో
కదా నాన్నా...!

లేని నిన్ను తల్చుకుంటూ
ఉన్న ఫొటోను నిమురుతూ
నాలో నేను మాట్లాడుతుంటే
జనానికి హాశ్చర్యమూ
అమ్మకి కంటినిండా నీరూ...

ఏం చేయను..
నువ్ లేవంటారు
కాదు...
మాతోనే ఉన్నావంటాను
ఎవ్వరూ ఒప్పుకోరు
నేను అస్సలే ఒప్పుకోను...
అదంతే... నాన్నా....!!

ఇన్నాళ్లూ నీ చేతుల్లో నేను...
ఇప్పుడు నా గుండెల్లో నీవు...
అదంతే... నాన్నా....!!


27 comments:

Kathi Mahesh Kumar said...

చాలా బాగుంది.

వనజ తాతినేని/VanajaTatineni said...

ఇదంతే ! శోభ గారు . అర్ధం కాని వాళ్ళు, చేసుకొలేనివాళ్ళు పిచ్చివాళ్ళు హార్ట్ టచింగ్ !!

Unknown said...

గుండెల్లో దాచుకుని రోజూ తలచుకునే "నాన్న" ఎక్కడికీ పోడు.
Happy Father's Day!

శోభ said...

ధన్యవాదాలు మహేష్ గారూ

శోభ said...

వనజగారూ థ్యాంక్యూ సోమచ్ అండి

శోభ said...

చిన్ని ఆశ గారూ.. థ్యాంక్యూ...

మీకు కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

jags said...

manchi manasuto raasina mutyamanti satkavita tandri pai premato ubikivachchina anuraagamto rasavantamgaa ardavantamgaa vundi.. mee tandri gaari patla mee premaku meere haamedaaru jawaabeedaaru, verevvaro emanna vaari punyaanike vadileyandi.. U r too good. xlnt
jaganndh

jags said...

u have done a wonderful job and ur love for father is peerless and priceless. U need not worry what others think as u r answerable to urself and not others. None feed u mind it, it is ur sheer hard work that takes u forward.
jagannadh

శోభ said...

మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు జగన్నాథ్ గారూ..

జయ said...

చాలా బాగుందండి, మంచి పాట తో సహా.

శోభ said...

ధన్యవాదాలు జయగారూ...

Unknown said...

ఎద చెమ్మ తెప్పించావ్ రా శోభా...

నాన్నంటే.....మన ప్రపంచం....అందుకే గ్లోబులా ప్రతి క్షణం మన చేతుల్లోనూ...చేతల్లోనూ....వెరసి మన గుండెల్లోనూ....

శోభా....మరిచిపోని కన్నీళ్ళూ మళ్ళీ నింపుకుంటూ నా కళ్ళు... ఎద వాకిళ్ళూ...

శోభ said...

నాన్న ప్రేమకి చెమ్మగిల్లని కన్నులేవి చెప్పండి

నాన్నలు ఉన్నవారి కళ్లలో కనిపించే ధైర్యం... లేని వారి కళ్లలోనూ కనిపిస్తుంది.. కన్నీళ్ల రూపంలో...

అక్కా... గుండెనిండా నాన్న ప్రేమని నింపుకుని.. అదే గుండెను చిక్కబట్టుకోడం మినహా మరేం చేయగలం మనం... :(

Priya said...

మనసుని తాకాయి శోభ గారూ మీ మాటలు. అద్భుతంగా రాసారు.

శోభ said...

థ్యాంక్యూ ప్రియా

Unknown said...

చాలా బావుంది అక్కా !

శోభ said...

ధన్యవాదాలు శైలూ

veera murthy (satya) said...

మీ మనసులోని నాన్న ప్రేమనీ, ప్రేరణని, సారాన్ని, జ్ఞాపకాల్లోంచి జీవితంవరకూ తెచ్చుకుంటున్నారంటే మీరు నిజంగా ధన్యజీవులు... చక్కగా రాసారు...

-sata

శోభ said...

Thank You So much Satya...

Sreenivas said...

శోభ గారు చాలా బాగా రాశారు.. "నాన్న జ్ఞాపకాలు" అన్నీ చదివాను..చాల బాగా నచ్చాయి...
మా నాన్న గుర్తొచ్చారు.. నా మనసు బాగోలేనప్పుడల్లా ఇవి చదువుతూ మా నాన్నతో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటాను..ఇప్పటికే 10 సార్లు చదివాను.. చదువుతున్నంత సేపు నా కళ్ళ వెంట నీళ్ళు కారుతూనే ఉంటాయి.. మీకు థాంక్స్ చెప్పడానికి ఈ కామెంట్ రాస్తున్నాను.. థాంక్స్.. ఇంత బాగా రాసినందుకు

శోభ said...

మా నాన్న జ్ఞాపకాలు మిమ్మల్ని ఇంతగా కదిలించినందుకు.. అవే జ్ఞాపకాలు మనసు బాలేనప్పుడు మీకు ఊరటనిస్తున్నందుకు తృప్తిగా ఉంది శ్రీనివాసరావు గారు.
ధైర్యంగా ఉండండి. ఇంతకంటే ఏం చెప్పలేను.. నాదీ మీ పరిస్థితే కాబట్టి. :(

Shruti said...

చాలా చాలా చాలా చాలా చాలా..... చాలా బాగుంది అమ్మా... చదివిన తర్వాత మాటలు రావడం లేదు.. మనస్సు బరువు అయిపోయింది.. చదువుతున్నంత సేపు నా కూతురు నా కళ్ల ముందు నిలబడి తన బుల్లి చేతులు చాచి, పిలుస్తున్నట్లు అనిపించింది..

శోభ said...

Thq so much sruthi...

Unknown said...

Superb andi.. Awesome

శోభ said...

ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు..

Vijaya Ramireddy said...

🙁🙁🙁

Vijaya Ramireddy said...

ఇది చదవడం ఎన్నోసారో తెలియదు, నాయన గురించి ఎన్ని సార్లు చదివినా కూడా మల్లి మల్లి కొత్తగానే ఉంటుంది. చదివిన ప్రతి సారి చెమ్మగిల్లిన కళ్ళతో ముగింపు. ఏదో చదవాలని మీ బ్లాగ్ లోకి వస్తా, స్క్రోలింగ్ చేస్తూ పోతుంటే ఈ హెడ్డింగ్ దగ్గర వేలు ముందుకు పోనంటు మొండికేస్తుంది . అదే నాయనకు బిడ్డలకు వున్న తీయటి ప్రేమాను బంధం. శోభా గారు మీ నాయన మీద ప్రేమ మధురాతి మధురం . మేము నాన్నను నాయనా అంటాము. అలా పిలిస్తేనే అలా రాస్తేనే మాకు పరిపూర్ణత్వం. అందులో నో కాంప్రమైజ్ ఎవరు ఏమనుకున్నా అసలు లెక్కే చేయం.