Pages

Tuesday, 30 August 2011

నువ్వులేవు.. నీ జ్ఞాపకాలున్నాయి....


కొందరు సుఖాల్లోనే తారసపడతారు
మరికొందరు కష్టాల్లోనూ చేయూతనిస్తారు
నువ్వు మాత్రం ఎప్పుడూ చెంతనే ఉంటావు
కళ్లు మూసినా, తెరచినా
నిద్రపోయినా, మేల్కొన్నా
నవ్వినా, ఏడ్చినా
ఎక్కడ ఉన్నా, ఏం చేసినా
నా ప్రతి కదలికలోనూ
చిరునవ్వుతో జీవిస్తుంటావు

కానీ.. నువ్వు దగ్గరున్నప్పుడు
నీకు ఏవంటే ఇష్టమో, నీకేం కావాలో
నీకంటూ ఇష్టాయిష్టాలున్నాయో, లేదో 
ఎప్పుడూ.. ఏవీ..
తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు
ఇప్పుడు.. నువ్వు లేని ఈ జీవితంలో
ప్రతిరోజూ, ప్రతి పనిలోనూ
తనకు ఇదంటే ఇష్టమో కాదో
ఇవన్నీ తనకు కావాలనిపించేదో ఏంటో
ఎప్పుడూ అడిగినవన్నీ అమర్చటమేగానీ
నోరు తెరచి ఇది కావాలని అడగలేదే..?
ఆలోచనలు మది గట్లు తెంచుకుంటాయి

అంతే…
నోటిదాకా వెళ్లింది, గొంతులో అడ్డుపడుతుంది
చెంపలపై వెచ్చని కన్నీరు
చేతిలో బొట్లుగా రాలుతుంటే
ఆ కన్నీటి బొట్లను
చిరునవ్వులు చిందించే నీ పలువరుసలో
ముత్యాలుగా మార్చి
నవ్వుతూ ముందుకు నడిపిస్తావు
నువ్వో జ్ఞాపకం అనుకున్నా..
నిజమై నాకు ఊపిరి పోస్తున్నావు….

............. ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం.

Thursday, 11 August 2011

చిన్ని ఆశలే కానీ… తీరేదెలా…?!


నక్షత్రాలన్నింటినీ గుత్తులుగా చేసి
మా ఇంటి పై కప్పుకు వేలాడదీయాలని
ఆకాశంలోని చందమామను లాక్కొచ్చి
నా కొప్పులో చక్కగా తురుముకోవాలని

వెన్నెల చల్లదనాన్నంతా
పెద్ద పెద్ద డబ్బాలలో నింపేసి
మా ఇంటినిండా దాచేసుకోవాలని
జలపాతాల నీటినంతా
నా దోసిళ్లతో బంధించేయాలని

అభయారణ్యాల అందాన్నంతా
మా పెరట్లో తోటగా చేసేయాలని
అడవిమల్లెల సువాసనంతా
మా ఇంటిమల్లెలు దోచేసుకోవాలని
కోకిలమ్మ రాగాలన్నీ
మా పాప గొంతుతో వినాలని

ఎన్నె ఎన్నెన్నో…
చిన్ని చిన్ని ఆశలే…..!!

కానీ, తీరేదెలా……….?????

Tuesday, 2 August 2011

గుండెకు ఆకలి.. కళ్లకూ ఆకలే...!!!



అమ్మ గుర్తొస్తే...
ఒకటే ఆకలి
కడుపు నింపుకునేందుకు కాదు
గుండె నింపుకునేందుకు........

నాన్న గుర్తొస్తే...
ఆకలే ఆకలి
కడుపునిండా కాదు
కళ్ల నిండా.......
లేని నాన్నను వెతుకుతూ
నా కళ్లకు ఒకటే ఆకలి.....

అమ్మ ప్రేమతో గుండె నింపుకోవచ్చు
కానీ...
ఎప్పటికీ తిరిగిరాని నాన్న ప్రేమ.....???
అందుకే నా కళ్ల ఆకలి తీరదు

ఎందుకు తల్లీ పస్తులుంటావ్
ఇలాగైతే ఎలా అంటూ.. నాన్న
ఎప్పుడైనా కల్లో కనిపించి ఊరడిస్తే
నా ఆకలంతా మటుమాయం
కానీ... ఆ కల మాయమవగానే
నాన్న కోసం నా కళ్ల ఆకలి
మళ్లీ మొదలు..............

Thursday, 28 July 2011

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!!


జీవితం అంటే.. ఎంపికల మయం
అందుకే సరైనదాన్ని ఎంచుకో
ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు..
నీ మనసే ఒక వేదం.. ఒక నిజం
అలా అనుకుంటేనే…
గెలుపు అవుతుంది శాశ్వతం

నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను
అమాంతం మార్చేసే మాటలవైపుకి
హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు
జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో
గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో

ఎవరి కోసమూ నువ్వు మారకు
అయితే, నీ కోసం నువ్వు మారాలి
శరీరంలోని ప్రతి అంగమూ
నీదైనప్పడు..
మనోదృష్టి, భావపరంపరలు
కూడా నీవే కదా…
వాటిల్లో పరుల జోక్యమెందుకు..?

నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ
నీదైన ముద్ర ఉన్నప్పుడు
నిన్ను నిన్నుగా ప్రేమించేవారు
ఎప్పుడూ నీ వెంటే ఉంటారు
నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు.!

Monday, 25 July 2011

మర్చిపోలేనన్నావు కానీ….!



మర్చిపోలేనన్నావు కానీ..
క్షమించటం మరిచావు
అయినప్పటికీ…
నీ స్నేహం కావాలి
నిజంగా నీకు తెలుసో లేదోగానీ
ఊపిరాగిపోయేదాకా నీ స్నేహం కావాలి

నువ్వు నా పక్కన లేని రోజున
కాలం కదుల్తోందా అనిపిస్తుంది
నీ తియ్యటి పిలుపులను
అంతం లేని కబుర్లను
కలిసి తిరిగిన ప్రాంతాలను
పంచుకున్న ఆనందాలను

కళ్లు కన్నీటి సంద్రాలయినప్పుడు
నేనున్నానని ధైర్యం చెప్పే
నులివెచ్చటి నీ స్పర్శను
అన్నింటినీ… అన్నింటికీ
దూరంగా జరిగిపోయినట్లు
గుండెల్లో ఒకటే బాధ…

ఆరోజేం జరిగిందో…
ఎందుకు వాదులాడామో
ఎందుకు దూరమయ్యామో
మాటల గాయాలు
మళ్లీ వెనక్కి రావు

కానీ..
అన్నింటినీ మర్చిపోయి
మళ్లీ తిరిగొస్తావని
నన్ను మన్నిస్తావనీ…
మళ్లీ నిన్ను చూసే
అదృష్టాన్ని ప్రసాదిస్తావని
చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తూ…!!

Friday, 22 July 2011

నవ్వుల పువ్వులు వికసించేదెన్నడో...!!


ఏమయ్యింది మనకు
పెంచుకున్న ఆశలు
అల్లుకున్న అనుబంధాలు
ఊసులు, భాషలూ
గాల్లో కట్టిన మేడల్లాగే
అవి కూడా ఇంతేనా…!

అప్పట్లో నీ సాహచర్యం
రోజు రోజుకీ ప్రకాశవంతమై
ప్రేమ, నవ్వులు, శ్రద్ధ
అభిమానం, అనురాగం
ఇలా చెప్పుకుంటూపోతే
దినదిన ప్రవర్థమానమే..!

నా వద్ద సంతోషాలెన్నీ ఉన్నా
అవన్నీ నువ్విచ్చినవే కదా…!
కమ్మటి కలలు ఎన్ని కన్నా
అవన్నీ నీ వల్లనే కదా….!

నేను అమితంగా ఇష్టపడే
ఒక్కగానొక్క అపురూప నేస్తానివి...
ఎప్పటికీ వడలిపోని
అరుదైన విరజాజి పువ్వువి..!

మరలాంటిది ఏమయ్యింది మనకు..?
ఏ నిశిరాతిరి నిద్దురలో
మబ్బుతెరలు కమ్మేశాయో.. ఏమో
వెలుగు రేఖలు విచ్చుకునేలోపే
జరగాల్సినదంతా జరిగిపోయింది

మనసులు తేలికై
దూరాలు దగ్గరై
నవ్వుల పువ్వులు
నిండు దోసిళ్లలో
కొలువయ్యేదెప్పుడో…!!

Monday, 18 July 2011

వెలుగు రేఖల వెతుకులాటలో…!



నా ఆలోచనలన్నీ
మనసు అనే విరిగిన ముక్కను
తీసుకొచ్చి చేతిలో పెట్టాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్యుడే మెల్లిగా కిందికి పడిపోతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
సంతోషం అనే కలకండ ముక్కను
తీసుకొచ్చి నోట్లో వేశాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
చంద్రుడే హాయిగా కిలకిలా నవ్వుతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
ఆశ అనే రేపటిని
తీసుకొచ్చి ముందు నిలిపాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్య, చంద్రులే పోటీ పడుతున్నట్లు…!

Friday, 15 July 2011

భూమ్యాకాశాల బంధమా…?!


చేసిన మంచిని మరవని తత్త్వం నీది
మంచినీ, చెడు కూడా మరవలేని మనస్తత్త్వం నాది
నువ్వేమో… ఆకాశం, నేనేమో భూమండలం
నువ్వు ప్రపంచాన్ని చుట్టేస్తే.. నేనేమో నిన్ను చుట్టేస్తా...

నేను లేకపోతే భూమండలమే లేదంటావు నువ్వు
నేనంటూ ఉంటేనే కదా ఆకాశానికి చోటంటాను నేను
ఎందులోనూ ఎవ్వరమూ తీసిపోయేది లేదు
అన్నింట్లోనూ ఎవరికి వారే.......
ఆలోచనలు, అభిరుచులు దాదాపు ఒక్కటే
కానీ అభిప్రాయాల్లో మాత్రం ఆమడదూరం......

ప్రతిదాన్నీ లైట్‌గా తీసుకోమంటావు నువ్వు
జీవితమే లైట్‌గా అవకూడదంటాను నేను
కోరి కోరి కష్టాల్లో పడవద్దని నేను హెచ్చరిస్తే…
ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసంటావు నువ్వు
ఎవరైనా శాసిస్తే ఒప్పుకోనంటావు నువ్వు
మంచి కోసం శాసించినా తప్పులేదంటాను నేను

వాదనల్లో పోటాపోటీ… మెట్టు దిగే ప్రశక్తే లేదు..
మొదలెట్టింది ఎక్కడో.. వెళ్తోంది ఎక్కడికో…

చివరకు.........

పడ్డాక తెలుస్తుందిలే.. అని అలకతో నేను కునుకేస్తే
వస్తే రానీ.. పోతే పోనీ.. ధీమాగా ఉంటావు నువ్వు

రాజీ కుదిరే మార్గమే కరువాయే
నా అలకతో సమస్తం నిశ్శబ్దం
నీ కినుకతో అంతా నిరాసక్తం

కాలం అలా మెల్లిగా కదుల్తుంటే...........
“ముల్లును ముల్లుతోనే..” గుర్తొచ్చిందో.. ఏంటో…?
నువ్వూ… అలకపాన్పుకు అతుక్కుపోయావ్

నువ్వో వైపూ.. నేనోవైపు..
అలక పాన్పుకు అంటుకుపోయినా…
మాటలే లేకపోయినా…
ఊరుకుందునేమో
నీ ఉపవాస దీక్షకు దెబ్బకు దిగొచ్చేశా.....

బువ్వ తినమని బుజ్జగిస్తే…
ఇద్దరం కలిసే తిందామన్నావు
అంతే…
వాదనలు, సమస్యలు, పరిష్కారాలు
అన్నీ వేటిదారిన అవి టాటా చెప్పేశాయి...... :)


(మార్చి 31, 2009న నా మరో బ్లాగులో రాసినది.... అనివార్య కారణాల వల్ల ఆ బ్లాగును త్వరలో మూసేద్దామని అనుకుంటున్నాను... వాటిలోని పోస్టులను ఇలా ఈ బ్లాగుకు తరలించే ప్రయత్నమే ఇది... ఈ కవితను ఇంతకుముందే ఎవరైనా చదివివుంటే తిట్టుకోకండేం.....)

Thursday, 14 July 2011

శైలబాలకు "కారుణ్య" ఎందుకిష్టమంటే..?!



శైలూ (http://kallurisailabala.blogspot.com)కి ధన్యవాదాలతో....

Wednesday, 13 July 2011

బదులేమీ చెప్పలేకున్నా…!!

ఎందుకిలా అవుతోంది
ఏ అనుభూతులు నాలో
జీవం పోసుకుంటున్నాయి

అసలు నువ్వు లేకుండా
ఒక్క క్షణం కూడా గడవదే
ఎంతమందితో ఉన్నా
నీతో ఉన్న అనుభూతి లేదే
ఎందుకిలా అవుతోంది

నీ పిలుపుకి.. నీ నవ్వుకి..
నీ అలకలకి.. బుంగమూతికి
నీతో కలిసే అడుగులకు
నీకై కలిపే అన్నం ముద్దలకు
నీకోసం వెతికే కళ్లకు
బదులేమీ చెప్పలేకున్నా
తొందరగా వచ్చేసేయ్.. ప్లీజ్…!!

(March 19, 2009న రాసిన కవిత ఇది)

Monday, 11 July 2011

అమ్మలా లాలించే నేస్తమా..!!

కొన్ని నవ్వులు
మరికొన్ని అల్లర్లు
ఇంకొన్ని అలకలు
లెక్కలేనన్ని గొడవలు
అంతే స్థాయిలో రాజీలు
అంతంలేని పేచీలు
ఆరాటాలు.. పోరాటాలు..!

సంతోషాలు సాగుతాయి
కష్టాలు తరుగుతాయి
బాధలు పెరుగుతాయి
నవ్వులు వికసిస్తాయి
సంకెళ్లు విడిపోతాయి
విషాదం కూడా
సంగీతం అవుతుంది

జలజలా కారే కన్నీటి
సవ్వడులను వినే రెండు చెవులు
ఓదార్చే రెండు పెదవులు
ధైర్యం చెప్పే రెండు చేతులు
ఆసరా ఇచ్చే ఓ భుజం
అమ్మలా లాలించే
ఓ నేస్తం నాకు మాత్రమే సొంతం…!

Saturday, 9 July 2011

నాకు నేను పసిపాపనే…!!



నేను భవిష్యత్తునెదుర్కొంటాను
అది నాకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
నేను ఎదురుచూసినట్లుగా ఏమీ ఉండదు
నా కోసం ఏదీ ఎదురుచూస్తూ ఉండదు కూడా…

అలాంటప్పుడే నాదైన స్వప్నం
ఈ భూమ్మీదకు వాలిపోయింది
కాలం గడిచేకొద్దీ…
నావైన చిన్ని ప్రపంచాలు
కలలు, ఆశలు, ఆరాటాలు
అన్నీ అలా.. కొద్ది కొద్దిగా…
నాకు దూరంగా వెళ్లిపోయాయి

మళ్లీ ఆ రోజులకు వెళ్లలేను
ఇంకెప్పటికీ అవి తిరిగి రాలేవు
అయినప్పటికీ…
నాకు నేను ఎప్పుడూ పసిపాపనే...!!

Thursday, 7 July 2011

నిన్ను చేరేందుకే ఈ ప్రయాణం…!!


నిన్ను కలిసేదాకా
రాత్రులన్నీ చల్లగా
పగళ్లన్నీ నిస్తేజంగా
రోజులన్నీ నిశ్శబ్దంగా
నాకే వినిపించనంతగా
నా హృదయ స్పందన…

అదే నిన్ను కలిసాక
నా చేతులెప్పుడూ ఖాళీగా లేవు
నా మనస్సెప్పుడూ మౌనంగా లేదు
చూస్తుండగానే…
నిమిషాలు కాస్తా.. గంటల్లాగా
గంటలు కాస్తా… రోజుల్లాగా
రోజులు కాస్తా.. వారాలు, నెలలుగా
కాలం మునుముందుకు…

నిన్ను చూడకముందు
ఆకాశంలోని నక్షత్రాలు
వెలసిపోయినట్లుగా ఉండేవి
అదే నిన్ను చూశాక…
ఆ నక్షత్రాల్లో మెరుపు
నా జీవితంలోనూ వెలుగు

నువ్వు తోడుంటే…
నా శక్తి రెట్టింపవుతుంది
తినే తిండి, పీల్చే గాలి
అన్నీ బలవర్ధకాలే….!

నువ్వు లేని రోజున
నా ప్రపంచం శూన్యం
మళ్లీ…
ఓ అద్భుతమైన రోజున
నిన్ను చేరేందుకు
ఆగదు ఈ నిరంతర ప్రయాణం…!

Wednesday, 6 July 2011

నాన్నా.. నువ్వు లేని మా అమ్మ..!!



నువ్వు దూరమై ఏడాది గడుస్తున్నా
కాలం ఎప్పట్లాగే పరుగెడుతోంది
కాలంతోపాటు మేం కూడా…

నువ్వు దూరమైన అమ్మకూడా...
కాలంతో నిశ్శబ్దంగా అడుగులేస్తోంది
అయితే... నువ్వు ఉన్నప్పటి అమ్మకూ
నువ్వు లేనప్పటికీ అమ్మకూ
తేడా మాకిప్పుడే స్పష్టమవుతోంది

నువ్వు లేని ఆమె గతంలోలా
పెద్దరికంగా, ధైర్యంగా లేనేలేదు
ఆమెలో ఏదో తెలీని బాధ
అలాగనీ దాన్ని బయటపడనీయదు
నోరువిప్పి చెప్పదు
బహుశా.. తానే బాధపడితే
పిల్లలు ఇంకెంత బాధపడతారోనని
లోలోపలే కుములుతోందేమో…

అందుకే.. తను మరీ చిన్నపిల్లయిపోయింది
ఇప్పుడు ఆమె మాకు అమ్మకాదు
మేమే ఆమెను పాపలా చూడాల్సి వస్తోంది

పసిపిల్లలు తెలీని వారిని చూస్తే
హడలిపోయినట్లుగా..
ఆమె మాకు కష్టాలొస్తే హడలిపోతోంది
తెలిసినవారిని పిల్లలు హత్తుకున్నట్లుగా
మాకు సంతోషం కలిగితే
గుండెలకు హత్తుకుని ఆహ్వానిస్తోంది…

అదేంటమ్మా అలా చేస్తున్నావ్? అంటే,
చిన్నపిల్లలా ఉడుక్కుంటోంది…
నా పిల్లలు నాకే మంచి చెడ్డలు చెప్పటమా?
అని ప్రశ్నించటం మానేసి…
అందరూ నన్నే అంటున్నారనీ
అమాయకంగా ఏడుస్తోంది…

అందుకే ఆమెను ఓ పసిపాపలా
కంటికి రెప్పలా కాపాడుకోవటం మినహా
పై లోకానికి వెళ్లిన ఓ నాన్నా…
నిన్ను తెచ్చివ్వలేని నిస్సహాయులం మేం
ఆమెకి కలలోనైనా కనిపించి
నువ్వు ఉన్నప్పటి మా అమ్మలా
తనని ఉండమని చెప్పవూ…?!

Saturday, 14 May 2011

ఇప్పుడు ఆమె కూడా ఓ జ్ఞాపకం మాత్రమే....!!

చిన్న వయసులో స్కూళ్లకు సెలవులిచ్చే రోజుకోసం ఎదురుచూడని వాళ్లు ఎవరూ ఉండరు. అందరిలాగే నా చిన్ననాటి రోజులు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గర చేసిన అల్లరి అన్నీ మనసు మూలల్లో తియ్యటి, అందమైన జ్ఞాపకంలా భద్రంగా దాగి ఉన్నాయి. ఇప్పటి పిల్లలు వేసవి సెలవులను ఎంజాయ్ చేయటం చూస్తుంటే.. నా చిన్నతనంలోకి అలా పరుగులు పెట్టాలని అనిపిస్తోంది...

వేసవి సెలవులు అంటేనే అమ్మమ్మ వాళ్ల ఊరు.. అమ్మ, తాతయ్యలతో చేసిన అల్లరీ.. ముఖ్యంగా అమ్మమ్మను ముప్పతిప్పలుపెట్టిన సంఘటనలు, స్నేహితులతో కలిసి చేసిన ఘనకార్యాలు... తాతయ్య ఇచ్చిన వార్నింగులు.. నేరేడుపండ్ల తీపి గుర్తులు.. చింతపిక్కల రుచులు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి.. నా మనసు నిండా...

ఆ రోజుల్లో ఒంటిపూట బడులు జరుగుతున్నప్పుడే మాకు ఓ రకమైన హుషారు వచ్చేసేది.. ఒంటిపూట బడులు అయిపోగానే సెలవులు ఇచ్చేస్తారని బాగా గుర్తుంచుకునేవాళ్లం. అంతే ఇక సెలవులు ఇవ్వగానే నేనూ, తమ్ముళ్లు అమ్మను లాక్కుని అమ్మమ్మ వాళ్ల ఊరికి పరుగులు తీసేవాళ్లం. అమ్మ మాతో పాటు రెండ్రోజులుండి మళ్లీ మావూరు వెళ్లిపోయేది. మేము మాత్రం సెలవులు అయ్యేదాకా అక్కడే ఉండిపోయేవాళ్లం.


అమ్మమ్మకు మేం వచ్చినందుకు సంతోషంగా ఉన్నా... మేం చేసే అల్లరి తల్చుకుని భయపడిపోయేది. అది అమ్మకు తెలుసు కాబట్టి అమ్మమ్మను ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా ఉండాలని చెప్పి వెళ్లేది. అలాగే అమ్మా అంటూ అమ్మమ్మను బాగా చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చి మరీ పంపించేవాళ్లం.

అమ్మ అలా వెళ్లిందో లేదో ఇక మా ఆకతాయి పనులు మొదలు. ముగ్గురికీ వేరు వేరు స్నేహ బృందాలు. వాళ్లందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఆటలే ఆటలు.. అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఊరికి చివరన ఉండేది. ఇంటి చుట్టూ చెట్లు మధ్యలో పూరిగుడిసె.. ఎండలు ఎక్కువగా ఉన్నా, చెట్లు బాగా ఉండటంతో చెట్లకింద మా స్నేహితుల బృందాలతో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం...

ఆటలు ఆడేందుకు అమ్మమ్మ కంటబడకుండా ఇంట్లోకి వెళ్లి దొరికిన వస్తువును తెచ్చుకుని అప్పటికప్పుడు ఓ కొత్త ఆటను సృష్టించి ఆడేవాళ్లం. ఈలోగా అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లి జరిగిన తంతును తెలుసుకుని కర్ర పట్టుకుని మా దగ్గరికి పరుగులెత్తేది. మేం ఆమెకు అందితేగా.. ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఇలాగైతే మీ ఇంటికి పంపించేస్తానని బెదిరించేది. మేం వెళ్లమని చెబుతూ స్నేహితులతో కలిసి ఆమెను వెక్కిరించేవాళ్లం..

అమ్మానాన్నల ఆటలు, బొమ్మల పెండ్లి చేయటం, ముట్టాట (మామిడి ముట్టెతో ఆడేది), అచ్చినకాయలు (రాళ్లతో ఆడేది).. కోతి కొమ్మచ్చి... గోళీలాట, బిళ్లంకోళ్ళు..... ఇలా ఒకటేమిటి రకరకాల ఆటలు ఆడేవాళ్లం. బొమ్మల పెళ్లి సందర్భగా చిన్న చిన్న బుడుగు పాత్రలతో రకరకాల వంటలను వండటం... వాటికోసం ఇంట్లోంచి బియ్యం, పప్పులు దొంగిలించటం... ఇళ్లల్లోని పెద్దవాళ్లతో తన్నులు తినటం.. ఎంత సరదాగా ఉండేదో..

ముఖ్యంగా కోతి కొమ్మచ్చి ఆడుతూ.. మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలించుకుని ఇంటికి ఏడుస్తూ వెళితే... ఇంట్లోవాళ్లు ఇంకాస్త తన్ని.. ఆపైన ఏడుపు మాన్పేందుకు బుజ్జగించటం ఎంత బాగుండేదో... అలాగని ఊరుకూరికే బుజ్జగిస్తే ఒప్పుకునేది లేదు.. ఆ బుజ్జగింపులోనే అన్నింటినీ సాధించుకునేవాళ్లం...

తమ్ముళ్లు.. ఈత కొట్టేందుకు బావుల్లో దుంకటం, దెబ్బలు తగిలించుకుని రావటం... ఎక్కువసేపు నీళ్లలో ఉండటంవల్ల జలుబు, తుమ్ములు... ఇంటికి రాగానే అమ్మమ్మ, తాతయ్యలు వారిని తిడుతుంటే వాళ్లని వెక్కిరిస్తూ నవ్వటం.. దానికి వాళ్లు మరింతగా ఏడ్వటం... మళ్లీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్లను బుజ్జగిస్తూ నన్ను కోప్పడటం.. లాంటివన్నీ తల్చుకుంటే ఉన్నఫలానా ఇప్పటికిప్పుడు చిన్నవాళ్లం అయిపోవాలని అనిపిస్తోంది...

ఎండల్లో బయట తిరగవద్దంటూ అమ్మమ్మ, తాతయ్యలు ఎంతగా తిట్టినా, కొట్టినా, కోప్పడినా మేం ఏనాడూ ఆగింది లేదు.. పైగా స్నేహాలతో కలిసి ఒక్కోరోజు ఒక్కో రకమైన అడ్వెంచర్లు.....

ఆరోజు మా అడ్వెంచర్ ఏట్లోకి... ఏటిగట్టున ఉండే తాటిచెట్లలో ఉండే తాటి ముంజెలను, పండిపోయిన తాటిపండ్లను తినాలని ప్లాన్... అలాగే వస్తూ వస్తూ పక్కనే ఉండే నేరేడుపండ్ల చెట్టెక్కి బోలెడన్ని పండ్లు కోసుకుని రావాలని గుంపుగా బయల్దేరాము... ఏట్లోకి వెళ్లి తాటిచెట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ముంజెలు కొట్టేవాళ్ల దగ్గర రూపాయో, అర్దరూపాయో ఇచ్చి ముంజెలు కొనుక్కుని అందరం తినేవాళ్లం... అలాగే చెట్లకింద రాలిన తాటిపండ్లను ఏరుకుని ఓపికకొద్దీ వాటి రసాన్ని పీల్చేసేవాళ్లం.. పీల్చాం అనే బదులు పీల్చి పీల్చి పిప్పి చేసేసేవాళ్లం అని చెప్పవచ్చు..

తాటిపండ్లు తియ్యగా, ఓ కమ్మనైన వాసనతో తినేందుకు భలే రుచిగా ఉంటాయి.. అయితే వాటికి పీచు ఎక్కువగా ఉంటుంది... దాన్ని ఇష్టపడి తినేవాళ్లకు ఆ రుచే వేరుగా ఉంటుంది. ఆ పీచులోంచి వచ్చే రసం తియ్యగా మంచి వాసనతో ఉంటుంది.. అదంటే మా గుంపుకు భలే ఇష్టం.. అందుకే తాటిపళ్లను ఫూటుగా లాగించేశాం... కాసేపు అక్కడే ఉన్న కానుగ, వేప చెట్లకింద కాసేపు ఆడుకుని ఆ తరువాత వానర సైన్యం లాగా మా గుంపు నేరేడుపండ్ల తోటలవైపు పరుగులు పెట్టింది.

గతంలో ఆ చెట్లలో కాసే పండ్లను ఎవరైనా సరే కోసుకుని తినేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిని ఎవరికో ఎవరో అమ్మేశారు. దాంతో కొనుక్కున్నవాళ్లు ఆ చెట్ల చుట్టూ కంచెవేసి కాపలావాళ్లను కూడా పెట్టుకున్నారు.. ఆ సంగతి తెలియక ఆ చెట్ల దగ్గరికి వెళితే కాపలావాడు మమ్మల్ని కట్టెతో బెదిరించాడు.. అయినా అతను చూడకుండా రాళ్లను పండ్లను రాలగొట్టేందుకు ట్రై చేశాం. అలా కొన్ని పండ్లను పోగుచేసుకున్నాం. అయితే అవి ఎవరికీ సరిపోలేదు.

దాంతో ఎలాగైనా సరే కాపలావాడు చూడకుండా కంచెదాటి చెట్టు పైకి ఎక్కాలనుకుని ఓ ఇద్దరూ అతను చూడకుండా మెల్లిగా కంచె దూకేశారు.. పిల్లిలా చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి అందినకాడికల్లా పండ్లను కోసి జేబుల్లో వేసుకోసాగారు... మేము కూడా ఇటువైపు చప్పుడు చేయకుండా ఉన్నాము.. ఇంతలో పెద్ద గాలి.. ఆ తరువాత మెల్లిగా చినుకులు మొదలై జోరుగా వర్షం పడసాగింది. ఓవైపు గాలి, మరోవైపు వర్షంవల్ల నిండా పండ్లతో ఉన్న చెట్లనుంచి పండ్లు గాలికి టపటపా నేలపై రాలుతున్నాయి.

బోలెడన్ని పండ్లు నేలపై పడటంతో జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మెల్లిగా కంచె దాటుకుని అందరం బిలబిలమంటూ పరుగెత్తి ఒడినిండా పండ్లు నింపుకుని, చెట్టుపై నక్కి ఉన్నవాళ్లను తీసుకుని ఇంటికి పరుగులు పెట్టాం. పాపం తోటవాడు అలా చూస్తూ ఉండిపోయాడేగానీ ఏమీ చేయలేకపోయాడు. (చిన్నతనంలో తెలియలేదుగానీ, పాపం పండ్లన్నీ రాలిపోయి ఆ చెట్లను కొన్నవాళ్లకు ఎంత నష్టం వచ్చి వుంటుందో కదా పాపం అనిపిస్తూ ఉంటుంది).

వర్షానికి తడిసి ఒడినిండా పండ్లతో ఇంటికి చేరిన మమ్మల్ని చూసిన పెద్దవాళ్లు మళ్లీ తిట్ల దండకాన్ని అందుకోవటమో, కొట్టడమో చేయటం.. మళ్లీ విధిగా బుజ్జగించటం జరిగిపోయేవి.. జలుబు, తుమ్ములు, పెద్దవాళ్ల తిట్లు, దెబ్బలు... ఇవన్నీ పక్కనపెడితే... నేరేడుపండ్లను శుభ్రం చేసి రాళ్ల ఉప్పు వేసిన మంచినీటిలో వాటిని ఊరబెట్టి తింటుంటే... అన్నీ మర్చిపోయేవాళ్లం...

ఒక్కోసారి తిరుగుళ్ళు కట్టిపెట్టి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పొలం దగ్గిరికి వెళ్లేవాళ్లం. అమ్మమ్మవాళ్లు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసేవాళ్లు.. ఆ పొలంలోనే  ఉండే బావి, బావి గట్టుపై ఉండే పనసచెట్టు, పక్కనే ఉండే మామిడిచెట్లు, టమోటో తోట, వరిపొలం.. అన్నింటినీ అప్పట్లో ఎంతగానో ఎంజాయ్ చేసేవాళ్లం... బాగా పండిన టొమోటో పండ్లను ఉప్పు, పచ్చిమిర్చి కారం వేసుకుని హాయిగా లాగించేసేవాళ్లం. పనస చెట్టెక్కి ఎవైనా పండి వుంటే వాటిని కోసుకునేవాళ్లం. మామిడి చెట్టు చాలా పెద్దగా ఉండటంతో దాన్ని ఎక్కేందుకు చేతకాక రాళ్లతో రాలగొట్టి తినేవాళ్లం.

మామిడికాయలను ఆవురావురు మంటూ తినేసేవాళ్లమేకానీ... దానికి ఉండే జీడిని పట్టించుకోకుండా తినటంవల్ల పెదాలపై పుళ్లు పడేవి. ఒక్కోసారి మీసాలు పెట్టుకున్నట్లుగా జీడి అయ్యేది. అందరూ వాటిని చూసి ఏడిపించేవాళ్లు కూడా...

ఆ... అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను.. మా అమ్మమ్మ అవిసె పువ్వుల వేపుడు ఎంత బాగా చేస్తారో తెలుసా... ఊరికి వెళ్లగానే ముందుగా అడిగి మరీ అవిసె పువ్వుల వేపుడు అడిగి మరీ చేయించుకుని తినేవాళ్లం. అలాగే లేత అవిసె కాయల వేపుడు కూడా.

గుమ్మడి పండుతో హల్వా చేయటం అందరికీ తెలిసిందే. మా అమ్మమ్మ మాత్రం గుమ్మడిపండు ముక్కలకు వేరుశెనగ గింజల పొడి కలిపి తాలింపు చేసేది. కారంగా, కమ్మగా, తియ్యగా ఎంత బాగుండేదో.. అలాగే మా అమ్మమ్మ స్పెషల్ వంటకం చక్కెరతో చేసే అత్తిరసాలు. వాటికి ముద్దపప్పు, నెయ్యి కలిపి తింటుంటే వాటి రుచే వేరు. మా అమ్మమ్మ దగ్గర బోలెడన్ని చేయించుకుని మరీ వెంట మావూరికి తీసుకెళ్లేవాళ్లం.

ఇకపోతే... చింతపిక్కల గురించి మీకు తప్పకుండా చెప్పాలి. చింతపండును విడదీయగా వచ్చే గింజలను సేకరించి వాటిని పెనంపై కొద్ది కొద్దిగా పోసి బాగా వేయించి వాటిని ఉప్పు కలిపిన నీటిలో రెండు లేదా మూడు రోజులపాటు బాగా నానబెట్టి, ఆ తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి గింజలను తినేవాళ్లం. అబ్బా చెబుతుంటేనే నోరూరిపోతోంది. నిజంగా చాలా రుచిగా ఉంటాయి. వేయించి, నానబెట్టడం, ఉప్పు కలిపిన నీటిలో నానటంవల్ల అవి కాస్త ఉప్పగా, కమ్మగా ఉంటాయి. ఇది మీకెవరికీ తెలిసి ఉండదు. కానీ, నా బాల్యానికి సంబంధించిన ఓ అపురూప జ్ఞాపకం ఇది.

మధ్యాహ్నం వేళల్లో ఆడుకునే ఓపిక లేనప్పుడు ఇంటి ముందర కానుగ చెట్టు కింద నులక మంచం... అమ్మమ్మ, తాతయ్యలతో కబుర్లు చెబుతూ నిద్దరోవడం. రాత్రిళ్లు కూడా చెట్టుకిందే పడుకుని అమ్మమ్మవాళ్లు చెప్పే కథలు ఊకొడుతూ హాయిగా నిద్రపోయేవాళ్లం.

అమ్మమ్మ వాళ్ల ఊర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. పాతకాలం నాటి కోట.. కృష్ణ దేవరాయల కాలం నాటిదనుకుంటా. (వివరాలు అవీ నాకు సరిగా తెలియవు) మహమ్మదీయులు హిందూ కోటలు, ఆలయాలపై విరుచుకుపడి చేసిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లుగా ఆ కోటలో విగ్రహాలన్నీ తలలు తెగిపడి కనిపిస్తుంటాయి.

ఒక్కోసారి మా బృందం ఆ కోటలోకి ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం. కోట చుట్టూ ప్రహరీగోడలన్నీ పడిపోయి శిథిలావస్థలో ఉండేది. కానీ కోట ముందర ఎంతో అందంగా రాళ్లతో పేర్చిన ప్రవేశ ద్వారం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఠీవిగా నిలబడి ఉంటుంది. అందులోంచి లోపలికి వెళ్తే మరీ పెద్దది కాదుగానీ ఓ మోస్తరు విశాలమైన ప్రాంతం.. అందులో చిన్న కోట.. ఆ కోట లోపల ఆలయంలాంటి ప్రదేశం.. ఆ ఆలయ గర్భగుడిలో విఠలేశ్వరుడు ఉండేవాడట. అందుకే మా అమ్మమ్మ వాళ్ల ఊరికి విఠలం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

తురక రాజులు హిందూ ఆలయాలపై, కోటలపై దాడులు చేసినప్పుడు ఈ కోటను, కోటలోని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఆలయం గర్భగుడిని పగుల గొట్టడమేగాక, ఆలయం వెలుపల, కోటచుట్టూ ఉండే రకరకాల రాతి విగ్రహాల తలలు తెగనరికి వేయటంతో అవి ఇప్పటికీ మొండాలు, తలలు వేరు వేరుగా కనిపిస్తుంటాయి. ఆ కోటలో కొంత భాగం బాగానే ఉండేది. ఆ ప్రాంతంలోనే మేము రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం.

ఆ కోటపై తురక రాజులు దాడి చేసినప్పుడు ఆలయంలోని విఠలేశ్వర స్వామి భయంతో అలా అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడనీ.. అలా వెళ్తూ వెళ్తూ ఓచోట వాయిల్ చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశంలో దాక్కున్నాడని తమ పెద్దవాళ్లు చెప్పారని మా అమ్మమ్మవాళ్లు మాకు కథలు కథలుగా చెప్పేవాళ్లు. అందుకే ఆ దేవుడు దాక్కున్న ప్రాంతం తరువాత తరువాత వాయిల్‌పాడుగా కాలక్రమంలో వాయల్పాడు.. ఇప్పుడు వాల్మీకిపురంగా అవతరించింది.

అలాగే ఆ కోట గురించి పెద్దవాళ్లు చెప్పే విషయాలను నోళ్లు వెళ్లబెట్టి వినేవాళ్లం. ఇంకోసారి అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేంతగా వాళ్లు మాకు ఆ కోట గురించి కథలు చెప్పేవాళ్లు. తురక రాజులు దాడులు చేసినప్పుడు ఆ కోటలోని రాజు, అతని భార్యలు, సంతానం, ఇంకా ముఖ్యమైన రాజ సంబంధీకులంతా తురక రాజులకు దొరకకూడదని సామూహికంగా వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, బంగారంతో సహా కోటలోనే ఉన్న కోనేరులో దూకి సమాధి అయ్యారనీ... ఆ ఆస్తి పరులపాలు కాకుండా ఉండేందుకు మంత్రబలంతో ఓ పామును కాపలాగా ఉంచారనీ చెబుతుంటారు. కాబట్టి.. ఆ డబ్బు, బంగారం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రక్తం కక్కుకు చచ్చిపోతారని కాబట్టి మీరు ఆ వైపు వెళ్లవద్దని మమ్మల్ని చాలా భయపెట్టేవాళ్లు.

మేం చిన్నపిల్లలప్పటికే ఆ కోట అవసాన దశలో ఉండేది. అప్పటికే కోటలోని కోనేరు పూర్తిగా పూడిపోయి ఆ స్థానంలో మట్టి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కోటలోని గుప్త నిధుల కోసం ఎవరెవరో తవ్వకాల కోసం రావటం, మా పెద్దవాళ్లు చెప్పినట్లు రక్తం కక్కుకు చచ్చిపోవటం జరిగేది. అలా చనిపోయిన ఒకతన్ని నేను చూసినట్లు నాకు లీలగా గుర్తు. (కానీ అది నిజమో, అబద్ధమో ఇప్పటికీ అంతుబట్టలేదనుకోండి) ఇప్పటికీ కోట అలాగే ఉంది.. మేం పిల్లలప్పటికంటే ఇప్పుడు ఇంకా జీర్ణ దశలో ఉంది. అయితే కోట ప్రవేశ ద్వారం మాత్రం అంతే ఠీవిగా నిలబడి.. తనపై చిన్న చిన్న చెట్లకు జీవం పోస్తోంది.

ఇదండీ.. మా అమ్మమ్మ వూరితో నాకున్న అనుబంధం.. అనుభవాలు.. అమ్మమ్మతో పెనవేసుకున్న ఈ జ్ఞాపకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు.. వరద వెల్లువలా అలా మనసునిండా జ్ఞాపకాల ఊసులన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి. ఇన్ని జ్ఞాపకాలను మిగిల్చిన ఆ ఊరుతోపాటు.. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఒక జ్ఞాపకం మాత్రమే.

ఆమె ఆ వూరికి, మాకూ లేకుండా ఏప్రిల్ 18, 2007న పైలోకాలకు తరలిపోయింది. తను లేని ఆ ఊరికి వెళ్లాలంటే మనస్సు మూగదైపోతుంటుంది. అయినా.. ఆమె తిరిగిన ఆ ఇంటిని, ఆమె స్పర్శతో పులకించిపోయిన ప్రతిదాన్నీ కళ్లతో స్పర్శించి.. ఆమె శాశ్వతంగా నిద్రించిన స్థలంలో జ్ఞాపకాల ఊసులతో సేదతీరి భారమైన మనస్సుతో తిరిగిరావటం మామూలైపోయింది.