Pages

Thursday, 7 July 2011

నిన్ను చేరేందుకే ఈ ప్రయాణం…!!


నిన్ను కలిసేదాకా
రాత్రులన్నీ చల్లగా
పగళ్లన్నీ నిస్తేజంగా
రోజులన్నీ నిశ్శబ్దంగా
నాకే వినిపించనంతగా
నా హృదయ స్పందన…

అదే నిన్ను కలిసాక
నా చేతులెప్పుడూ ఖాళీగా లేవు
నా మనస్సెప్పుడూ మౌనంగా లేదు
చూస్తుండగానే…
నిమిషాలు కాస్తా.. గంటల్లాగా
గంటలు కాస్తా… రోజుల్లాగా
రోజులు కాస్తా.. వారాలు, నెలలుగా
కాలం మునుముందుకు…

నిన్ను చూడకముందు
ఆకాశంలోని నక్షత్రాలు
వెలసిపోయినట్లుగా ఉండేవి
అదే నిన్ను చూశాక…
ఆ నక్షత్రాల్లో మెరుపు
నా జీవితంలోనూ వెలుగు

నువ్వు తోడుంటే…
నా శక్తి రెట్టింపవుతుంది
తినే తిండి, పీల్చే గాలి
అన్నీ బలవర్ధకాలే….!

నువ్వు లేని రోజున
నా ప్రపంచం శూన్యం
మళ్లీ…
ఓ అద్భుతమైన రోజున
నిన్ను చేరేందుకు
ఆగదు ఈ నిరంతర ప్రయాణం…!

Wednesday, 6 July 2011

నాన్నా.. నువ్వు లేని మా అమ్మ..!!



నువ్వు దూరమై ఏడాది గడుస్తున్నా
కాలం ఎప్పట్లాగే పరుగెడుతోంది
కాలంతోపాటు మేం కూడా…

నువ్వు దూరమైన అమ్మకూడా...
కాలంతో నిశ్శబ్దంగా అడుగులేస్తోంది
అయితే... నువ్వు ఉన్నప్పటి అమ్మకూ
నువ్వు లేనప్పటికీ అమ్మకూ
తేడా మాకిప్పుడే స్పష్టమవుతోంది

నువ్వు లేని ఆమె గతంలోలా
పెద్దరికంగా, ధైర్యంగా లేనేలేదు
ఆమెలో ఏదో తెలీని బాధ
అలాగనీ దాన్ని బయటపడనీయదు
నోరువిప్పి చెప్పదు
బహుశా.. తానే బాధపడితే
పిల్లలు ఇంకెంత బాధపడతారోనని
లోలోపలే కుములుతోందేమో…

అందుకే.. తను మరీ చిన్నపిల్లయిపోయింది
ఇప్పుడు ఆమె మాకు అమ్మకాదు
మేమే ఆమెను పాపలా చూడాల్సి వస్తోంది

పసిపిల్లలు తెలీని వారిని చూస్తే
హడలిపోయినట్లుగా..
ఆమె మాకు కష్టాలొస్తే హడలిపోతోంది
తెలిసినవారిని పిల్లలు హత్తుకున్నట్లుగా
మాకు సంతోషం కలిగితే
గుండెలకు హత్తుకుని ఆహ్వానిస్తోంది…

అదేంటమ్మా అలా చేస్తున్నావ్? అంటే,
చిన్నపిల్లలా ఉడుక్కుంటోంది…
నా పిల్లలు నాకే మంచి చెడ్డలు చెప్పటమా?
అని ప్రశ్నించటం మానేసి…
అందరూ నన్నే అంటున్నారనీ
అమాయకంగా ఏడుస్తోంది…

అందుకే ఆమెను ఓ పసిపాపలా
కంటికి రెప్పలా కాపాడుకోవటం మినహా
పై లోకానికి వెళ్లిన ఓ నాన్నా…
నిన్ను తెచ్చివ్వలేని నిస్సహాయులం మేం
ఆమెకి కలలోనైనా కనిపించి
నువ్వు ఉన్నప్పటి మా అమ్మలా
తనని ఉండమని చెప్పవూ…?!

Saturday, 14 May 2011

ఇప్పుడు ఆమె కూడా ఓ జ్ఞాపకం మాత్రమే....!!

చిన్న వయసులో స్కూళ్లకు సెలవులిచ్చే రోజుకోసం ఎదురుచూడని వాళ్లు ఎవరూ ఉండరు. అందరిలాగే నా చిన్ననాటి రోజులు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గర చేసిన అల్లరి అన్నీ మనసు మూలల్లో తియ్యటి, అందమైన జ్ఞాపకంలా భద్రంగా దాగి ఉన్నాయి. ఇప్పటి పిల్లలు వేసవి సెలవులను ఎంజాయ్ చేయటం చూస్తుంటే.. నా చిన్నతనంలోకి అలా పరుగులు పెట్టాలని అనిపిస్తోంది...

వేసవి సెలవులు అంటేనే అమ్మమ్మ వాళ్ల ఊరు.. అమ్మ, తాతయ్యలతో చేసిన అల్లరీ.. ముఖ్యంగా అమ్మమ్మను ముప్పతిప్పలుపెట్టిన సంఘటనలు, స్నేహితులతో కలిసి చేసిన ఘనకార్యాలు... తాతయ్య ఇచ్చిన వార్నింగులు.. నేరేడుపండ్ల తీపి గుర్తులు.. చింతపిక్కల రుచులు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి.. నా మనసు నిండా...

ఆ రోజుల్లో ఒంటిపూట బడులు జరుగుతున్నప్పుడే మాకు ఓ రకమైన హుషారు వచ్చేసేది.. ఒంటిపూట బడులు అయిపోగానే సెలవులు ఇచ్చేస్తారని బాగా గుర్తుంచుకునేవాళ్లం. అంతే ఇక సెలవులు ఇవ్వగానే నేనూ, తమ్ముళ్లు అమ్మను లాక్కుని అమ్మమ్మ వాళ్ల ఊరికి పరుగులు తీసేవాళ్లం. అమ్మ మాతో పాటు రెండ్రోజులుండి మళ్లీ మావూరు వెళ్లిపోయేది. మేము మాత్రం సెలవులు అయ్యేదాకా అక్కడే ఉండిపోయేవాళ్లం.


అమ్మమ్మకు మేం వచ్చినందుకు సంతోషంగా ఉన్నా... మేం చేసే అల్లరి తల్చుకుని భయపడిపోయేది. అది అమ్మకు తెలుసు కాబట్టి అమ్మమ్మను ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా ఉండాలని చెప్పి వెళ్లేది. అలాగే అమ్మా అంటూ అమ్మమ్మను బాగా చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చి మరీ పంపించేవాళ్లం.

అమ్మ అలా వెళ్లిందో లేదో ఇక మా ఆకతాయి పనులు మొదలు. ముగ్గురికీ వేరు వేరు స్నేహ బృందాలు. వాళ్లందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఆటలే ఆటలు.. అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఊరికి చివరన ఉండేది. ఇంటి చుట్టూ చెట్లు మధ్యలో పూరిగుడిసె.. ఎండలు ఎక్కువగా ఉన్నా, చెట్లు బాగా ఉండటంతో చెట్లకింద మా స్నేహితుల బృందాలతో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం...

ఆటలు ఆడేందుకు అమ్మమ్మ కంటబడకుండా ఇంట్లోకి వెళ్లి దొరికిన వస్తువును తెచ్చుకుని అప్పటికప్పుడు ఓ కొత్త ఆటను సృష్టించి ఆడేవాళ్లం. ఈలోగా అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లి జరిగిన తంతును తెలుసుకుని కర్ర పట్టుకుని మా దగ్గరికి పరుగులెత్తేది. మేం ఆమెకు అందితేగా.. ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఇలాగైతే మీ ఇంటికి పంపించేస్తానని బెదిరించేది. మేం వెళ్లమని చెబుతూ స్నేహితులతో కలిసి ఆమెను వెక్కిరించేవాళ్లం..

అమ్మానాన్నల ఆటలు, బొమ్మల పెండ్లి చేయటం, ముట్టాట (మామిడి ముట్టెతో ఆడేది), అచ్చినకాయలు (రాళ్లతో ఆడేది).. కోతి కొమ్మచ్చి... గోళీలాట, బిళ్లంకోళ్ళు..... ఇలా ఒకటేమిటి రకరకాల ఆటలు ఆడేవాళ్లం. బొమ్మల పెళ్లి సందర్భగా చిన్న చిన్న బుడుగు పాత్రలతో రకరకాల వంటలను వండటం... వాటికోసం ఇంట్లోంచి బియ్యం, పప్పులు దొంగిలించటం... ఇళ్లల్లోని పెద్దవాళ్లతో తన్నులు తినటం.. ఎంత సరదాగా ఉండేదో..

ముఖ్యంగా కోతి కొమ్మచ్చి ఆడుతూ.. మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలించుకుని ఇంటికి ఏడుస్తూ వెళితే... ఇంట్లోవాళ్లు ఇంకాస్త తన్ని.. ఆపైన ఏడుపు మాన్పేందుకు బుజ్జగించటం ఎంత బాగుండేదో... అలాగని ఊరుకూరికే బుజ్జగిస్తే ఒప్పుకునేది లేదు.. ఆ బుజ్జగింపులోనే అన్నింటినీ సాధించుకునేవాళ్లం...

తమ్ముళ్లు.. ఈత కొట్టేందుకు బావుల్లో దుంకటం, దెబ్బలు తగిలించుకుని రావటం... ఎక్కువసేపు నీళ్లలో ఉండటంవల్ల జలుబు, తుమ్ములు... ఇంటికి రాగానే అమ్మమ్మ, తాతయ్యలు వారిని తిడుతుంటే వాళ్లని వెక్కిరిస్తూ నవ్వటం.. దానికి వాళ్లు మరింతగా ఏడ్వటం... మళ్లీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్లను బుజ్జగిస్తూ నన్ను కోప్పడటం.. లాంటివన్నీ తల్చుకుంటే ఉన్నఫలానా ఇప్పటికిప్పుడు చిన్నవాళ్లం అయిపోవాలని అనిపిస్తోంది...

ఎండల్లో బయట తిరగవద్దంటూ అమ్మమ్మ, తాతయ్యలు ఎంతగా తిట్టినా, కొట్టినా, కోప్పడినా మేం ఏనాడూ ఆగింది లేదు.. పైగా స్నేహాలతో కలిసి ఒక్కోరోజు ఒక్కో రకమైన అడ్వెంచర్లు.....

ఆరోజు మా అడ్వెంచర్ ఏట్లోకి... ఏటిగట్టున ఉండే తాటిచెట్లలో ఉండే తాటి ముంజెలను, పండిపోయిన తాటిపండ్లను తినాలని ప్లాన్... అలాగే వస్తూ వస్తూ పక్కనే ఉండే నేరేడుపండ్ల చెట్టెక్కి బోలెడన్ని పండ్లు కోసుకుని రావాలని గుంపుగా బయల్దేరాము... ఏట్లోకి వెళ్లి తాటిచెట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ముంజెలు కొట్టేవాళ్ల దగ్గర రూపాయో, అర్దరూపాయో ఇచ్చి ముంజెలు కొనుక్కుని అందరం తినేవాళ్లం... అలాగే చెట్లకింద రాలిన తాటిపండ్లను ఏరుకుని ఓపికకొద్దీ వాటి రసాన్ని పీల్చేసేవాళ్లం.. పీల్చాం అనే బదులు పీల్చి పీల్చి పిప్పి చేసేసేవాళ్లం అని చెప్పవచ్చు..

తాటిపండ్లు తియ్యగా, ఓ కమ్మనైన వాసనతో తినేందుకు భలే రుచిగా ఉంటాయి.. అయితే వాటికి పీచు ఎక్కువగా ఉంటుంది... దాన్ని ఇష్టపడి తినేవాళ్లకు ఆ రుచే వేరుగా ఉంటుంది. ఆ పీచులోంచి వచ్చే రసం తియ్యగా మంచి వాసనతో ఉంటుంది.. అదంటే మా గుంపుకు భలే ఇష్టం.. అందుకే తాటిపళ్లను ఫూటుగా లాగించేశాం... కాసేపు అక్కడే ఉన్న కానుగ, వేప చెట్లకింద కాసేపు ఆడుకుని ఆ తరువాత వానర సైన్యం లాగా మా గుంపు నేరేడుపండ్ల తోటలవైపు పరుగులు పెట్టింది.

గతంలో ఆ చెట్లలో కాసే పండ్లను ఎవరైనా సరే కోసుకుని తినేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిని ఎవరికో ఎవరో అమ్మేశారు. దాంతో కొనుక్కున్నవాళ్లు ఆ చెట్ల చుట్టూ కంచెవేసి కాపలావాళ్లను కూడా పెట్టుకున్నారు.. ఆ సంగతి తెలియక ఆ చెట్ల దగ్గరికి వెళితే కాపలావాడు మమ్మల్ని కట్టెతో బెదిరించాడు.. అయినా అతను చూడకుండా రాళ్లను పండ్లను రాలగొట్టేందుకు ట్రై చేశాం. అలా కొన్ని పండ్లను పోగుచేసుకున్నాం. అయితే అవి ఎవరికీ సరిపోలేదు.

దాంతో ఎలాగైనా సరే కాపలావాడు చూడకుండా కంచెదాటి చెట్టు పైకి ఎక్కాలనుకుని ఓ ఇద్దరూ అతను చూడకుండా మెల్లిగా కంచె దూకేశారు.. పిల్లిలా చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి అందినకాడికల్లా పండ్లను కోసి జేబుల్లో వేసుకోసాగారు... మేము కూడా ఇటువైపు చప్పుడు చేయకుండా ఉన్నాము.. ఇంతలో పెద్ద గాలి.. ఆ తరువాత మెల్లిగా చినుకులు మొదలై జోరుగా వర్షం పడసాగింది. ఓవైపు గాలి, మరోవైపు వర్షంవల్ల నిండా పండ్లతో ఉన్న చెట్లనుంచి పండ్లు గాలికి టపటపా నేలపై రాలుతున్నాయి.

బోలెడన్ని పండ్లు నేలపై పడటంతో జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మెల్లిగా కంచె దాటుకుని అందరం బిలబిలమంటూ పరుగెత్తి ఒడినిండా పండ్లు నింపుకుని, చెట్టుపై నక్కి ఉన్నవాళ్లను తీసుకుని ఇంటికి పరుగులు పెట్టాం. పాపం తోటవాడు అలా చూస్తూ ఉండిపోయాడేగానీ ఏమీ చేయలేకపోయాడు. (చిన్నతనంలో తెలియలేదుగానీ, పాపం పండ్లన్నీ రాలిపోయి ఆ చెట్లను కొన్నవాళ్లకు ఎంత నష్టం వచ్చి వుంటుందో కదా పాపం అనిపిస్తూ ఉంటుంది).

వర్షానికి తడిసి ఒడినిండా పండ్లతో ఇంటికి చేరిన మమ్మల్ని చూసిన పెద్దవాళ్లు మళ్లీ తిట్ల దండకాన్ని అందుకోవటమో, కొట్టడమో చేయటం.. మళ్లీ విధిగా బుజ్జగించటం జరిగిపోయేవి.. జలుబు, తుమ్ములు, పెద్దవాళ్ల తిట్లు, దెబ్బలు... ఇవన్నీ పక్కనపెడితే... నేరేడుపండ్లను శుభ్రం చేసి రాళ్ల ఉప్పు వేసిన మంచినీటిలో వాటిని ఊరబెట్టి తింటుంటే... అన్నీ మర్చిపోయేవాళ్లం...

ఒక్కోసారి తిరుగుళ్ళు కట్టిపెట్టి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పొలం దగ్గిరికి వెళ్లేవాళ్లం. అమ్మమ్మవాళ్లు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసేవాళ్లు.. ఆ పొలంలోనే  ఉండే బావి, బావి గట్టుపై ఉండే పనసచెట్టు, పక్కనే ఉండే మామిడిచెట్లు, టమోటో తోట, వరిపొలం.. అన్నింటినీ అప్పట్లో ఎంతగానో ఎంజాయ్ చేసేవాళ్లం... బాగా పండిన టొమోటో పండ్లను ఉప్పు, పచ్చిమిర్చి కారం వేసుకుని హాయిగా లాగించేసేవాళ్లం. పనస చెట్టెక్కి ఎవైనా పండి వుంటే వాటిని కోసుకునేవాళ్లం. మామిడి చెట్టు చాలా పెద్దగా ఉండటంతో దాన్ని ఎక్కేందుకు చేతకాక రాళ్లతో రాలగొట్టి తినేవాళ్లం.

మామిడికాయలను ఆవురావురు మంటూ తినేసేవాళ్లమేకానీ... దానికి ఉండే జీడిని పట్టించుకోకుండా తినటంవల్ల పెదాలపై పుళ్లు పడేవి. ఒక్కోసారి మీసాలు పెట్టుకున్నట్లుగా జీడి అయ్యేది. అందరూ వాటిని చూసి ఏడిపించేవాళ్లు కూడా...

ఆ... అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను.. మా అమ్మమ్మ అవిసె పువ్వుల వేపుడు ఎంత బాగా చేస్తారో తెలుసా... ఊరికి వెళ్లగానే ముందుగా అడిగి మరీ అవిసె పువ్వుల వేపుడు అడిగి మరీ చేయించుకుని తినేవాళ్లం. అలాగే లేత అవిసె కాయల వేపుడు కూడా.

గుమ్మడి పండుతో హల్వా చేయటం అందరికీ తెలిసిందే. మా అమ్మమ్మ మాత్రం గుమ్మడిపండు ముక్కలకు వేరుశెనగ గింజల పొడి కలిపి తాలింపు చేసేది. కారంగా, కమ్మగా, తియ్యగా ఎంత బాగుండేదో.. అలాగే మా అమ్మమ్మ స్పెషల్ వంటకం చక్కెరతో చేసే అత్తిరసాలు. వాటికి ముద్దపప్పు, నెయ్యి కలిపి తింటుంటే వాటి రుచే వేరు. మా అమ్మమ్మ దగ్గర బోలెడన్ని చేయించుకుని మరీ వెంట మావూరికి తీసుకెళ్లేవాళ్లం.

ఇకపోతే... చింతపిక్కల గురించి మీకు తప్పకుండా చెప్పాలి. చింతపండును విడదీయగా వచ్చే గింజలను సేకరించి వాటిని పెనంపై కొద్ది కొద్దిగా పోసి బాగా వేయించి వాటిని ఉప్పు కలిపిన నీటిలో రెండు లేదా మూడు రోజులపాటు బాగా నానబెట్టి, ఆ తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి గింజలను తినేవాళ్లం. అబ్బా చెబుతుంటేనే నోరూరిపోతోంది. నిజంగా చాలా రుచిగా ఉంటాయి. వేయించి, నానబెట్టడం, ఉప్పు కలిపిన నీటిలో నానటంవల్ల అవి కాస్త ఉప్పగా, కమ్మగా ఉంటాయి. ఇది మీకెవరికీ తెలిసి ఉండదు. కానీ, నా బాల్యానికి సంబంధించిన ఓ అపురూప జ్ఞాపకం ఇది.

మధ్యాహ్నం వేళల్లో ఆడుకునే ఓపిక లేనప్పుడు ఇంటి ముందర కానుగ చెట్టు కింద నులక మంచం... అమ్మమ్మ, తాతయ్యలతో కబుర్లు చెబుతూ నిద్దరోవడం. రాత్రిళ్లు కూడా చెట్టుకిందే పడుకుని అమ్మమ్మవాళ్లు చెప్పే కథలు ఊకొడుతూ హాయిగా నిద్రపోయేవాళ్లం.

అమ్మమ్మ వాళ్ల ఊర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. పాతకాలం నాటి కోట.. కృష్ణ దేవరాయల కాలం నాటిదనుకుంటా. (వివరాలు అవీ నాకు సరిగా తెలియవు) మహమ్మదీయులు హిందూ కోటలు, ఆలయాలపై విరుచుకుపడి చేసిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లుగా ఆ కోటలో విగ్రహాలన్నీ తలలు తెగిపడి కనిపిస్తుంటాయి.

ఒక్కోసారి మా బృందం ఆ కోటలోకి ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం. కోట చుట్టూ ప్రహరీగోడలన్నీ పడిపోయి శిథిలావస్థలో ఉండేది. కానీ కోట ముందర ఎంతో అందంగా రాళ్లతో పేర్చిన ప్రవేశ ద్వారం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఠీవిగా నిలబడి ఉంటుంది. అందులోంచి లోపలికి వెళ్తే మరీ పెద్దది కాదుగానీ ఓ మోస్తరు విశాలమైన ప్రాంతం.. అందులో చిన్న కోట.. ఆ కోట లోపల ఆలయంలాంటి ప్రదేశం.. ఆ ఆలయ గర్భగుడిలో విఠలేశ్వరుడు ఉండేవాడట. అందుకే మా అమ్మమ్మ వాళ్ల ఊరికి విఠలం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

తురక రాజులు హిందూ ఆలయాలపై, కోటలపై దాడులు చేసినప్పుడు ఈ కోటను, కోటలోని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఆలయం గర్భగుడిని పగుల గొట్టడమేగాక, ఆలయం వెలుపల, కోటచుట్టూ ఉండే రకరకాల రాతి విగ్రహాల తలలు తెగనరికి వేయటంతో అవి ఇప్పటికీ మొండాలు, తలలు వేరు వేరుగా కనిపిస్తుంటాయి. ఆ కోటలో కొంత భాగం బాగానే ఉండేది. ఆ ప్రాంతంలోనే మేము రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం.

ఆ కోటపై తురక రాజులు దాడి చేసినప్పుడు ఆలయంలోని విఠలేశ్వర స్వామి భయంతో అలా అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడనీ.. అలా వెళ్తూ వెళ్తూ ఓచోట వాయిల్ చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశంలో దాక్కున్నాడని తమ పెద్దవాళ్లు చెప్పారని మా అమ్మమ్మవాళ్లు మాకు కథలు కథలుగా చెప్పేవాళ్లు. అందుకే ఆ దేవుడు దాక్కున్న ప్రాంతం తరువాత తరువాత వాయిల్‌పాడుగా కాలక్రమంలో వాయల్పాడు.. ఇప్పుడు వాల్మీకిపురంగా అవతరించింది.

అలాగే ఆ కోట గురించి పెద్దవాళ్లు చెప్పే విషయాలను నోళ్లు వెళ్లబెట్టి వినేవాళ్లం. ఇంకోసారి అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేంతగా వాళ్లు మాకు ఆ కోట గురించి కథలు చెప్పేవాళ్లు. తురక రాజులు దాడులు చేసినప్పుడు ఆ కోటలోని రాజు, అతని భార్యలు, సంతానం, ఇంకా ముఖ్యమైన రాజ సంబంధీకులంతా తురక రాజులకు దొరకకూడదని సామూహికంగా వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, బంగారంతో సహా కోటలోనే ఉన్న కోనేరులో దూకి సమాధి అయ్యారనీ... ఆ ఆస్తి పరులపాలు కాకుండా ఉండేందుకు మంత్రబలంతో ఓ పామును కాపలాగా ఉంచారనీ చెబుతుంటారు. కాబట్టి.. ఆ డబ్బు, బంగారం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రక్తం కక్కుకు చచ్చిపోతారని కాబట్టి మీరు ఆ వైపు వెళ్లవద్దని మమ్మల్ని చాలా భయపెట్టేవాళ్లు.

మేం చిన్నపిల్లలప్పటికే ఆ కోట అవసాన దశలో ఉండేది. అప్పటికే కోటలోని కోనేరు పూర్తిగా పూడిపోయి ఆ స్థానంలో మట్టి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కోటలోని గుప్త నిధుల కోసం ఎవరెవరో తవ్వకాల కోసం రావటం, మా పెద్దవాళ్లు చెప్పినట్లు రక్తం కక్కుకు చచ్చిపోవటం జరిగేది. అలా చనిపోయిన ఒకతన్ని నేను చూసినట్లు నాకు లీలగా గుర్తు. (కానీ అది నిజమో, అబద్ధమో ఇప్పటికీ అంతుబట్టలేదనుకోండి) ఇప్పటికీ కోట అలాగే ఉంది.. మేం పిల్లలప్పటికంటే ఇప్పుడు ఇంకా జీర్ణ దశలో ఉంది. అయితే కోట ప్రవేశ ద్వారం మాత్రం అంతే ఠీవిగా నిలబడి.. తనపై చిన్న చిన్న చెట్లకు జీవం పోస్తోంది.

ఇదండీ.. మా అమ్మమ్మ వూరితో నాకున్న అనుబంధం.. అనుభవాలు.. అమ్మమ్మతో పెనవేసుకున్న ఈ జ్ఞాపకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు.. వరద వెల్లువలా అలా మనసునిండా జ్ఞాపకాల ఊసులన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి. ఇన్ని జ్ఞాపకాలను మిగిల్చిన ఆ ఊరుతోపాటు.. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఒక జ్ఞాపకం మాత్రమే.

ఆమె ఆ వూరికి, మాకూ లేకుండా ఏప్రిల్ 18, 2007న పైలోకాలకు తరలిపోయింది. తను లేని ఆ ఊరికి వెళ్లాలంటే మనస్సు మూగదైపోతుంటుంది. అయినా.. ఆమె తిరిగిన ఆ ఇంటిని, ఆమె స్పర్శతో పులకించిపోయిన ప్రతిదాన్నీ కళ్లతో స్పర్శించి.. ఆమె శాశ్వతంగా నిద్రించిన స్థలంలో జ్ఞాపకాల ఊసులతో సేదతీరి భారమైన మనస్సుతో తిరిగిరావటం మామూలైపోయింది.

Tuesday, 3 May 2011

ఆంధ్రభూమిలో నా బ్లాగు గురించి....

ఆంధ్రభూమి పత్రిక, విశాఖపట్నం సిటీ ఎడిషన్ సెంటర్ స్ప్రెడ్‌లో మెరుపు అనే పేజీలో నా బ్లాగు గురించిన పరిచయం గత వారం పబ్లిష్ అయ్యింది. ఇన్నాళ్లుగా ఎంతగా ప్రయత్నించినా ఆ కాపీని సంపాదించటం కుదరలేదు. ఒక సోదరుడి సహాయంవల్ల అది ఈరోజుకి సాధ్యమైంది. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇలా ముందుకొస్తున్నా.....


"కొంతమంది మిత్రులు ఈ స్కాన్ చేసిన పేజీ సరిగా కనబడటం లేదని, చదివేందుకు వీలు కావటం లేదని అన్నారు. అందుకే వారి కోసం ఇది.. జగతి గారు పత్రికకు పంపిన తరువాత నాక్కూడా మెయిల్లో పంపించారు. అలా పంపినదాన్ని యధాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను."


హలో బ్లాగున్నారా?

చల్లని మనసు, మెత్తని మాటా, మృదుమధురమైన భావనలు, అన్నిటికీ మించి ప్రేమ పూరితమైన కవన పుష్పాలు....వెరసి శోభారాజు అనబడే ఈ అమ్మాయి మనసు...అసలు మనసుకి అర్ధం ఇప్పుడేంటో తెలుసా ...బ్లాగ్ ...మనో భావాలను అక్షరాల దారాలతో అందంగా అల్లిన మాలలు ఈ బ్లాగులు. 

ఈ రోజు అలాంటి మృదువైన ఓ మనసు గురించి తెలుసుకుందామా. ఆమె బ్లాగ్ పేరు కుడా ఆమె అంత సున్నితమైనదే సుమండీ 'కారుణ్య'. బ్లాగ్ లోకి ప్రవేశిస్తూనే ఆమె నిరాడంబరత ప్రేమాస్పదమైన ఆమె మాటల్లో తన గురించి ఇలా  అంటుంది...''నన్ను నేను వెదుక్కుంటూ" ఎంత గొప్ప మాట. ఇంత చిన్నవయసులో ఎంత పరిణితి.

నాన్న గురించి తను రాసినది చూస్తే హృదయం చెమర్చక మానదు ఎవరికైనా. ఏ మాత్రం అతిశయం లేకుండా స్వచ్చంగా రాసిన కవితలు ఆమె హృదయానికి దర్పణాలు. స్పందించే హృది ఉంటే కాదేది కవితకనర్హం అన్నట్లు చిరు స్పందనలను కూడా కవిత్వకరీకరించే అందమైన అక్షరాల హరివిల్లు శోభారాజు 'కారుణ్య'.

ఈమె రాతలు కేవలం చదవాల్సినవే కాక చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయనిపిస్తుంది నాకు. కోల్పోతున్న మనవ సంబంధాలు తల్లి తండ్రుల పట్ల  ప్రేమానురాగాలు, అమ్మ మనసు ఇలా ఎన్నో భావాలు ఆర్ద్రతతో మనల్ని కదిలించక మానవు.

అందరితోనూ కలగలిసి పోయే మనస్తత్వం, అందరి ఆనందాన్ని విజయాన్ని తనదిగా ఆనందించే సహృదయతా కలిగిన శోభ నిజంగా అందరికీ ఎంతో ప్రియమైన వ్యక్తీ  కూడా. ఎక్కడా ఎప్పుడూ ఒక్కక పరుష వాక్యం పలుకదు, కానీ స్థిరచిత్తురాలు సుమా. ఈమె ప్రస్తుత నివాసం చెన్నైలో. కొన్నేళ్ళు భర్త ఉద్యోగ రీత్యా విశాఖ గాజువాకలో కూడా ఉన్నారు. 

జీవితం పట్ల ప్రేమ , జీవన మర్యాద కలిగి ఉన్న ఈ కారుణ్య మూర్తి బ్లాగ్ మీరు ఒకసారి పలకరించారా, ఆ తర్వాత మీరే పదే పదే పలకరిస్తారామెని 'హలో బ్లాగున్నారా?' అంటూ...  చూసారా ఎంత మంచిదాన్నో మరి నేను మీకు ఆమె బ్లాగ్ చిరునామా చెప్తాను ఉండండి మరీ....  http://kaarunya.blogspot.in/

..................జగతి 


Saturday, 16 April 2011

అమ్మ మనసు


లేచీ లేవంగానే "మా" అనే కేక..
కళ్లు తెరవగానే
అటు దేవుడినీ, ఇటు నన్నూ
మార్చి మార్చి చూసే చూపులు..
ఇక రెండు వారాలకోసారేనని........

దినపత్రిక కోసం అబ్బా కొడుకులిద్దరూ

తగవులాడుకుంటుంటే
ముసి ముసిగా నవ్వుతూ...
పిల్లాడితో పోటీ ఏంటని
పేపర్ లాక్కుని అబ్బాయికిచ్చేసే
రోజువారీ సంఘటన కోసం
ఇకపై రెండు వారాలు ఆగాలని......

అమ్మా... నాకివాళ ఈ టిఫిన్ చేసి పెట్టు

అలాగే లంచ్‌‍‌లోకి అంటూ...
లెక్కలేనని ఐటమ్స్ పేర్లు చెబుతుంటే,
కళ్లు తేలేస్తుండే నా అవస్థను చూసి,
చిలిపిగా నవ్వుతూ అల్లరి చేసే సన్నివేశాలు
ఇక రెండు వారాల విరామం తర్వాతేనని...

రోజూ కాలేజీకెళ్తూ..

వీధిమలుపు తిరిగేదాకా
ఆగకుండా టాటా చెప్పే చేతులు
మేడమెట్లు ఎక్కి, దిగేటప్పుడు
ఆసరాగా నిలిచే అవే చేతులు
పనిలో లీనమై ఉన్నప్పుడు
మెడచుట్టూ అల్లుకుపోయే
ఆ చేతుల స్పర్శ..
ఇక రెండు వారాలకోసారేనని

రాత్రి భోజనాల వేళప్పుడు

ఓవైపు టీవీ చూస్తూ...
మరోవైపు పుస్తకం చదువుతూ
ప్లేటులో ఏముందో చూడకుండా
గెలుకుతూ తింటుంటే..
ఇలాగయితే ఒంటికి ఎలా పడ్తుంది నాన్నా
అంటూ సుతిమెత్తగా మందలిస్తూ..
గోరుముద్దల్ని తినిపిస్తూ.. తృప్తి పొందేది
ఇక రెండు వారాలకోసారేనని...

నిదురమ్మ ఒడిలోకి జారుకునేందుకు

ముందుగా నా ఒడిలో నువు దూరిపోతే
చేతివేళ్లతో నీ తలను నిమురుతుంటే
కళ్లు ఇంతింతచేసి కబుర్లు చెబుతూ
హాయిగా నిద్దరోయే నీ నుదుటిపై
వెచ్చని ముద్దుపెట్టి మురిసిపోయేందుకు
రెండు వారాలు ఆగాలని....

రెండు వారాలు ఆగాలని బాధపడాలో

రెండు వారాలకైనా వస్తావని సంతోషించాలో
అర్థంకాని అయోమయం ఓవైపూ...
బ్రతుకుపోరులో ఉద్యోగం అనే ఆసరాతో
ప్రయోజకుడివై తిరిగొస్తావన్న ఆనందం మరోవైపూ...
ఇప్పుడు దూరమైనా, ఎప్పటికీ దగ్గరుంటావన్న
ఆశ అనే శ్వాసతో ఎదురుచూస్తూ ఓ అమ్మ.....!!!

(చదువులు పూర్తి చేసుకున్న పిల్లలు ఉద్యోగాల వేటలో కన్న తల్లిదండ్రులను, ఉన్న ఊరిని వదిలి మహానగరాలకు వెళ్లటం సర్వ సాధారణ విషయమే. అయితే అప్పటిదాకా తన కొంగు పట్టుకుని తిరుగాడిన పిల్లలు ఇలా ఒక్కసారిగా దూరమవటాన్ని జీర్ణించుకోవటం తల్లులకు కాస్త కష్టమైనపనే. అలా ఓ అమ్మ మనసులోకి తొంగిచూసే చిన్న ప్రయత్నమే ఇది...)

Tuesday, 12 April 2011

"సాహితీ" కుటుంబం...!!


ఏంట్రా తల్లీ ఎన్నాళ్ళైంది చూసి
ఏమైపోయావు.. ఎక్కడున్నావు?
సోదరీ.. బాగున్నావా...
ఈ మధ్య అస్సలు కనిపించటం లేదేం?

అమ్మాయ్.. ఒంట్లో బాగలేదా
బొత్తిగా నల్లపూస అయిపోయావే?
సోదరా... ఏమైంది నీకు
రోజుకి ఒక్కసారైనా
పిలిస్తే చాలు పలికేవాడివి
ఇప్పుడెక్కడ?

అయ్యో చెల్లికి ఏమైంది
అక్క ఎలా ఉందో ఏంటో
మా అమ్మాయి జాడే లేదు
ఇక అన్నయ్య మాటో..
స్నేహితుల ఎదురుచూపులు
మాటల్లో చెప్పలేనివి....

అక్కా... అన్నా, తమ్ముడా,
అమ్మాయ్, తల్లీ, చెల్లీ.......
ఈ పిలుపులన్నీ..
రక్త సంబంధం పంచి ఇచ్చినవా?
కానే కావు... మరి... ??
"సాహితీ" తల్లి ఇచ్చిన అను'బంధాలు'

ఈ 'తల్లి' పంచిన ప్రేమతో తరించిన
పిల్లలంతా తమ ఆత్మీయతనంతా
పిలుపుల్లో రంగరించి...
ప్రతి ఒక్కరూ సైనికులై
కలాల నాగళ్లతో
ప్రతిరోజూ, ప్రతిక్షణం..
"సాహితీ" సేద్యం చేస్తున్నవాళ్లే....!!

మామూలు "కుటుంబం"లోకిమల్లే
ఈ 'సాహితీ' కుటుంబంలోనూ
వాదులాడుకుంటారు....
కానీ ఆస్తుల కోసం కాదు
అలుగుతారు..
కావాల్సింది పొందేందుకు కాదు
బుజ్జగిస్తారు...
అభిప్రాయాలను బలవంతంగా రుద్దేందుకు కాదు....

వాదులాడుతారు... చర్చిస్తారు...
ఓ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేందుకు
మేటి పరిష్కారాలను వెదికేందుకు
కలాలకు మరింతగా "పదును" పెట్టేందుకు

అలుగుతారు...
చాన్నాళ్లుగా పలుకరించనందుకు కాదు
పిలుపు కోసమూ కాదు... "రచన" కోసం...
కలాలకు 'సోమరితనం' సోకకూడదని..
సాహితీవనం బీడుబారి పోకూడదని
'రచన'లనే 'మొలక'లతో పచ్చగా కళకళలాడాలని

బుజ్జగిస్తారు...
దారి తప్పిన 'రచన'లతో
గాయపరిచే 'మాట'లతో
'వ్యాఖ్య'లనే యుద్ధంతో
'సాహితీ' అమ్మ విధించిన
హద్దులను చెరిపేయటం
సరికాదంటూ...
ఒకరినొకరు బుజ్జగించుకుంటారు

ఇలా... "సాహితీ" తల్లి లాలనలో
'రేపటి' తరానికి 'ప్రతీక'లుగా
'విజ్ఞాన'మనే జ్యోతిని వెలిగిస్తూ
"ముఖచిత్ర కూడలి" సాక్షిగా
"జైహో సాహితీ మాతాకీ" అంటూ
ఒకళ్ళు ఇద్దరై... ఇద్దరు ముగ్గురై
వందలు వేలై..... అలా.... అలా.....
మున్ముందుకే.......!!!

(ఫేస్‌బుక్‌లో నిర్వహిస్తున్న "తెలుగు సాహితీ వలయం" గుంపు కోసం ప్రేమతో రాసిన
ఈ కవితను బ్లాగర్ల కోసం శ్రీరామనవమి శుభాకాంక్షలతో....)

Friday, 25 March 2011

'పండు'టాకుల పాట..!!



ఇన్నాళ్లూ చలితో బిగదీసుకుపోయిన కోకిలమ్మ
గొంతు సవరించుకుని వేసవికి సన్నద్ధమవుతోంటే...

నేనేమీ తక్కువ తినలేదంటూ
కోకిలమ్మకు ఆశ్రయం ఇచ్చే చెట్లు కూడా
ఆకులన్నింటినీ రాల్చేసుకుని,
పచ్చని పెళ్లికూతురిలా, చిగుర్లు తొడిగి
వేసవికి చల్లటి స్వాగతం చెప్పేందుకు
బిరబిరా సృష్టికార్యాన్ని నెరవేరుస్తున్నాయి...

అంతకుముందుగా..
కోకిలమ్మ ఓ చెట్టుపై వాలి రాగాలు తీస్తోంటే...
గలగలమంటూ 'పండు'టాకులు చప్పుడు చేశాయి
ఓహో ఇదేంటి.. నా పాట కంటే,
వీటి చప్పుడే కమ్మగా ఉందే అనుకుంటూ
ఓ చెవి అటు పారేసింది కోకిలమ్మ

పండుటాకులున్న కొమ్మకు పక్కగా మరో కొమ్మ
ఆ కొమ్మకొక చిన్న రెమ్మ
ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు
చల్లగాలి జోలపాటతో నిద్దరోయిన దాన్ని
సూర్య కిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి...
ఒళ్లు విరుచుకుని కిలకిలమంటున్న చిగురుటాకును
సన్నగా, బాధగా 'పండు'టాకుల పాట తాకింది
పాటను విన్న చిగురుటాకు ఫక్కున నవ్వింది

దాంతో 'పండు'టాకులన్నీ ఇంకా గట్టిగా పాడసాగాయి
చిగురుటాకు కూడా మళ్లీ మళ్లీ నవ్వసాగింది
ఇంతలో ఓపిక నశించిన ఓ పండుటాకు...
"ఎందుకే ఆ మిడిసిపాటు" అంటూ
చిగురుటాకును నిలదీసింది..
మిడిసిపాటు ఎందుకుండదు..
నేనేమీ మీలా పసుపుపచ్చను కాదు...
నున్నగా నవనవలాడే పచ్చనాకును
ఇకపై పువ్వులు పూస్తాను..
పండ్లు కాస్తాను... అంటూ
ఆపకుండా చెప్పుకుపోతోంది పచ్చనాకు..

అలా చెబుతూ, చెబుతూ
ఇక ముందుకెళ్లటం సాధ్యంకాక...
ఓ చోట చటుక్కున ఆగిపోయింది...
వెంటనే పండుటాకులు అందుకున్నాయి
"ఏం ఆపేశావేం? కానీ...?" రెట్టించాయి
"మరీ.. మరీ..." గొణుక్కుంటోంది పచ్చనాకు...

తానూ ఏదో ఓరోజున 'పండు'టాకు
అవక తప్పదని అర్థమైంది 'పచ్చ'నాకుకు...
దాంతో మనసు భారంకాగా... తలవాల్చేసి,
పండుటాకులకేసి దీనంగా చూసింది
ఇందాకటిలా కాకుండా...
'పండు'టాకుల పాటలోని ఆర్తి
మనసుని పిండేయగా...
పండుటాకులను సగర్వంగా సాగనంపుతూ
సన్నగా పాటనందుకుంది...
ఇదంతా కళ్లారా చూసిన కోకిలమ్మ
పచ్చనాకుతో కలిసి కోరస్ ఇచ్చింది....!!!

Tuesday, 15 March 2011

తమ్ముడా.. మోహన కుమారా..!!



పైలోకాలకు తరలిన తమ్ముడా
నువ్వెళ్లిపోయి నా తమ్ముడిని
కాదు కాదు నీ మిత్రుడిని
నీ సంతోషాలనే కాకుండా
నీ దుఃఖాన్నీ పంచుకున్న
మావాడికి ప్రాణబిక్ష పెట్టి
నువ్వెళ్లిపోయి…
నీ స్నేహానికీ, మాకూ…
ప్రాణం పోశావా..?


నా బిడ్డతో పాటు ఆ బిడ్డను కూడా
చల్లంగ చూడలేదు ఎందుకమ్మా అంటూ
గంగమ్మ తల్లితో మొరపెట్టుకుంటున్న
అమ్మతో.. కుమార్ అంతమంచోడా
అని అడిగితే…


వాడు కూడా నీ తమ్ముల్లాంటోడే తల్లీ
ఎంత మంచి రూపు, ఎంత మంచి మాట
నీ తమ్ముడూ.. ఆ కుమారూ…
ఒకే కంచంలో తినేవాళ్లు
ఒకే మంచంలో పడుకునేవాళ్లు
అంత మంచి నేస్తాలను
అంత మంచి బిడ్డను
తాను ఎక్కడా చూడలేదని
అమ్మ రోదిస్తూ చెబుతుంటే…


ఎప్పుడో చూసిన నీ రూపాన్ని
ఒకచోట పేర్చి చూసేందుకు
ఎంత ప్రయత్నించినా కుదరలేదు
అదెలా కుదురుతుంది చెప్పు…
నా ఎదురుగా తమ్ముడి రూపంలో
సజీవంగా నువ్వు కనిపిస్తుంటే…


(మార్చి 22, 2009న జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయిన మా పెద్ద తమ్ముడి ప్రాణ స్నేహితుడు కుమార్‌కు అశ్రునివాళులతో… వద్దంటే వినకుండా ముందు కూర్చుని బండి నడుపుతున్న కుమార్.. తన తప్పేమీ లేకుండానే జీపు వాడు గుద్దేయటంతో, వెనుక కూర్చున్న నా తమ్ముడికి ప్రాణబిక్ష పెట్టి తానేమో కానరాని దూరాలకు వెళ్లిపోయాడు.)

Monday, 14 February 2011

ప్రేమ "ఒక్క" రోజేనా....???!!!


"ప్రేమ" కొన్నిసార్లు కొత్తగా
మరికొన్నిసార్లు తాజాగా
చాలాసార్లు సంతోషంగా
ఉన్నచోట ఉండనీయకుండా
ఊపిరి సలపనీయకుండా
ఉక్కిరి బిక్కిరి చేస్తుంది...

ప్రేమ చిగురించిన తొలినాళ్లలోనో
కొత్త దంపతుల సరాగాల్లోనో
ఇవన్నీ మామూలే...

అంటే...
ప్రేమించిన మొదట్లోనో..
పెళ్లయిన కొత్తల్లోనో
ప్రేమ ఉంటే సరిపోతుందా...
మరి జీవితమంతా ఏముండాలి...?

అసలు ప్రేమించడానికి తీరికెక్కడిది?
బరువులు, బాధ్యతలు,
కష్టాలు, కడగండ్లు,
అప్పులు, అగచాట్లు
ఇన్నింటితో వేగుతుంటే...
మళ్లీ ప్రేమంటారేంటి?

అవన్నీ ఉంటే.. ప్రేమించకూడదా ఏం?
ఎలా కుదురుతుంది?
ఎందుకు కుదరదు?

అలసిన మోముతో
భారంగా అడుగులేసుకుంటూ
ఇంటికి చేరిన అతనికి
చిరునవ్వుతో స్వాగతం చెబుతూ
ఆప్యాయంగా చుట్టుకోవటం "ప్రేమ" కాదా?
దీన్ని "ప్రేమ" అనకూడదా?

"ప్రేమ"గా చెంత చేరి
నుదుటపై చెమటను తుడుస్తూ
బాగా అలసిపోయారా అన్నట్టు
కళ్లతోనే పరామర్శిస్తున్న ఆమెను
ఇంటిపనితో నువ్వూ అలసిపోయావుగా?
అంటూ కళ్లతోనే బదులిస్తూ..
ఊరడించటం "ప్రేమ" కాదా?
దీన్ని "ప్రేమ" అనకూడదా?

ఈ మాత్రం "ప్రేమ"ను కురిపించేందుకు
తీరుబాటు కావాలా?
ప్రత్యేకమైన రోజులు కావాలా?
"ప్రేమ" అనేది ఏ ఒక్కరోజులోనో పుట్టి
మరొక్క రోజులోనో అంతమయితే చాలా..?
జీవితమంతా ఉండక్కరలేదా?

ఇగోలను పక్కకు నెట్టి
ఒకరినొకరు అర్థం చేసుకుని
సాగిపోవటమే నిజమైన "ప్రేమ"
కానీ.. ఈ రోజుల్లో ఎంతమందికి
అది సాధ్యమవుతోందో...
ఆ దేవుడికే ఎరుక..........!!!

Tuesday, 8 February 2011

మట్టి సుగంధం ''మా నాన్న''


"మన పిచ్చిగానీ నాన్న ఎక్కడికి వెళతాడు?
ఆయన మన చుట్టూనే ఉంటాడు
మనల్ని చుట్టుకునే ఉంటాడు
మన మెతుకులో మెతుకై 
వాతాపి జీర్ణం అంటూ
ప్రేమగా కడుపు తడుముతూనే ఉంటాడు"

నాన్న గురించి చెప్పాలంటే, రాయాలంటే ఎన్ని పేజీలు, పుస్తకాలు నింపినా.. మళ్లీ మళ్లీ అవి నిండిపోతూనే ఉంటాయి. మనసు అనే ప్రవాహం నుంచీ జ్ఞాపకాలు అనే గట్లు తెగి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నప్పటినుంచీ అన్నీ తానై, ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ, ఆ దేవుడికి మారు రూపమైన నాన్నల గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే.

మా నాన్న మాకు దూరమై అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం రోజులు ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తూ ఉన్నా, తన ఆశీస్సులు మమ్మల్ని చల్లగా ఉంచుతాయన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాం. సంవత్సరం క్రితందాకా మాతో ఉన్న ఆయన ఈరోజు మా ముందులేడన్న నిజం తల్చుకుంటే గుండె పిండేసినట్లవుతుంది.

తను లేని లోటు, ఆయన తోడు లేకుండా మేము భారంగా వేసిన అడుగులు, గడిపిన రోజులు గుర్తొస్తే ఇంకా ఒక ఏడాదేగా గడిచింది... ఇంకెన్ని రోజులు ఇలా గడపాలో కదా.. అనుకోగానే గుండె కరిగి కన్నీటి వరదై చెంపలను తడిమేస్తుంది. అయితే, పసిపిల్లల అమాయకత్వం కలగలసిన మా నాన్న నవ్వు మాకు ధైర్యం చెబుతూ, నేనెక్కడున్నా మీతోనే ఉంటాననే ధీమాను కలిగిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది.

రవాణా సౌకర్యాలు అంతగా లేని ఓ మారుమూల పల్లెటూళ్లో మా నాన్నగారు జన్మించారు.... అప్పట్లో పల్లెటూళ్లలో నిరుపేద కుటుంబీకులు ఎలాంటి జీవనం గడిపేవారో, నా తండ్రి కూడా అలాంటి జీవితాన్నే గడిపారు. పశువులను మేతకు తీసుకెళ్లటం, వాటి బాగోగులు చూసుకోవటంతోనే ఆయన బాల్యం గడిచిపోయింది. పాఠశాల సౌకర్యం కూడా ఆ ఊర్లో లేదు కాబట్టి మా నాన్నకు చదువుకోలేదు. ఒకవేళ పాఠశాల ఉండివున్నా, చదువుకునేవారో లేదో తెలియదు.

అలా బాల్యం గడిచిన తరువాత మా అమ్మను పెళ్లి చేసుకున్నారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనంలో పెరిగి పెద్దవారైన నా తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులు మైనారిటీ తీరకుండానే వివాహం జరిపించారు. మరో సంవత్సరానికి నేను తొలి సంతానంగా వారికి జన్మించాను.... కనీసం వంట కూడా చేయటం చేతగాని అమ్మను, నన్ను మా నాన్న కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజంతా కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తూ, వంటకు కావాల్సిన సరుకులు కొనుక్కుని వచ్చేవారు. ఆ తరువాత ఆయనే వంటచేసి అమ్మకూ, నాకూ తినిపించి పడుకునేవారు. మళ్లీ ఉదయాన్నే పనులకు పరుగుతీసేవారు.

కూలిపనులు లేని రోజున అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, తనతోపాటు వచ్చిన జతగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క మోపు మాత్రమే తెస్తే, మా నాన్న రెండు మోపులను మోపుపై మోపు పెట్టుకుని పరుగుతీసేవారు. ఆ కట్టెల మోపులను తీసుకుని ఓ గంటసేపు కాలినడకనే పక్కనే ఉండే గ్రామానికి వెళ్లి అక్కడ షావుకార్లకు అమ్మి డబ్బులు తీసుకుని.. బియ్యం, ఉప్పూ, పప్పూ కొనుక్కుని వచ్చేవారు. (నాన్నగారి మొదటి వర్థంతి రోజు రాత్రి అమ్మ నాతో మాట్లాడుతూ.. వారి జీవితం ఎలా మొదలైందీ, ఇప్పుడు ఎలా ఉందీ.. భోరున విలపిస్తూ చెప్పింది..)

నాన్నకు చేదోడువాదోడుగా ఉండేందుకు అమ్మకూడా కూలిపనులకు వెళ్లేందుకు సిద్ధపడింది. అలా ఇద్దరూ జంటగా కూలిపనులకు వెళ్లేవాళ్లు. ఓ భుజంపైన నన్ను, మరో భుజంపైన చద్దిమూటను పెట్టుకుని.. అమ్మ తోడుగా నాన్న హుషారుగా కూలిపనులకు వెళ్లేవాడు. ఎంత కష్టమైనా సరే.. ముద్దుగా, బొద్దుగా ఉండే నన్ను చూడగానే ఇట్టే మరిచిపోయేవారమని అమ్మ ఇప్పటికీ చెబుతుంటుంది.


 ........... ఆ తరువాత మరో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన మా అమ్మానాన్నలు.. ఓ చిన్న పూలకొట్టు, పూరిపాకతో జీవితం ప్రారంభించారు. అదే ఊర్లో ఇప్పుడు మూడు మిద్దె ఇళ్లను కట్టి, మా పేరుతో కొద్దిపాటి డబ్బును జమచేశారు. ముగ్గుర్నీ ఉన్నత చదువులు చదివించారు. ఉన్నంతలో సంతృప్తికరమైన జీవితం.. ఇలా హాయిగా సాగిపోతున్న జీవితంలో మా నాన్న అనారోగ్యం పెద్ద శాపంలా పరిణమించింది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆయన అనారోగ్యం కుదుటపడలేదు. ఈ క్రమంలోనే కామెర్ల వ్యాధి సోకింది. దానికి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకుండా ఆయన ఎక్కువగా నాటుమందులపైనే ఆధారపడటంతో ఆయన లివర్ పూర్తిగా పాడయిపోయింది.

....... మెల్లిగా నోటినుంచి, ముక్కునుంచి, మలమూత్రాలలోనూ రక్తం పడటం ప్రారంభించింది. మాకు చెబితే భయపడతాం అని ఆయన చెప్పకుండా దాచేశారు. అలా ఓ పదిరోజుల్లోనే ఆయనకు సీరియస్ అయ్యింది. ఆసుపత్రిలో మూడు రోజులుండి మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆయన చివరిరోజంతా ఆసుపత్రిలోనే ఉన్నాం. బీపీ చాలా కిందికి పడిపోయింది. మెలకువగాలేరు. చాలా భారంగా శ్వాస తీసుకుంటున్నారు. ఆయన ఇంకో నాలుగు గంటల్లో చనిపోతారనగా.. కాస్త మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న అందరినీ కళ్లతోనే పలుకరించారు. నా వైపు మాత్రం పదే పదే చూస్తుండటంతో ఏంటి నాన్నా అని అడిగాను. "ఏంలేదమ్మా" అంటూ ఓపిక తెచ్చుకుని అన్నారు. అదే ఆయన చివరిమాట. ఆ తరువాత ఆయన మాకు ఇక లేరు.

జీవితమంతా కష్టాలతోనే సాగిపోయిన మా నాన్న.. పిల్లలు పెద్దవారై, ప్రయోజకులై సుఖపెట్టే సమయంలో ఈ లోకంనుంచే శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఈ విషయం తల్చుకున్నప్పుడల్లా గుండెనెవరో మెలిపెడుతున్నట్లుగా ఒకటే బాధగా ఉంటుంది. ఏ రోజు కూడా సుఖమంటే ఏంటో తెలియని నా తండ్రి, ఇక తాను పడ్డ కష్టం చాలునంటూ శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లిపోయారు. తాను ఉన్నా, లేకున్నా పిల్లలు కష్టపడకూడదని.. తనకు చేతనైన అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఆయన ఎలాంటి కష్టం కలిగించకుండా కానరాని లోకాలకు తరలివెళ్లారు.

జీవితమంతా పిల్లల కోసమే కష్టపడిన, తపించిన ఆయన నుంచి ఆయన పిల్లలమైన మేమే కాదు, ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి.

ఆకలితో ఉన్నవారు ఎవరైనా, ఎలాంటివారైనా ఆదరించాలని. మనకు లేకపోయినా వాళ్లకు మనకు ఉన్నంతలో పెట్టి పంపించాలని ఆయన పదే పదే చెబుతుండేవారు. ప్రతిరోజూ తను తినే తిండిని ఎవరో ఒకరితో పంచుకోకుండా ఆయన ఎప్పుడూ తిన్నది లేదు. ఒక్కోసారి తనకు లేకపోయినా ఎదుటివారి ఆకలిని గుర్తించి తీర్చేవారు. తాను ఒకపూట తింటూ, మాకు మూడుపూట్లా కడుపునిండా తిండిపెట్టిన ఆయనకు ఆకలి విలువ ఏంటో తెలుసు కాబట్టి అలా చేసేవారేమో. ఆయన నుంచి మేం నేర్చుకున్న గొప్ప విషయం ఇది. ఆయన పిల్లలుగా మేం ముగ్గురం ఆయన కట్టించిన, తిరుగాడిన ఆ ఇంటికి ఎవరు వచ్చినా ఆకలితో వెళ్లకుండా చూస్తున్నాము.

అదే విధంగా మోసపూరితమైన పనులకు ఎప్పుడూ పాల్పడవద్దనీ, అబద్ధాలు చెప్పవద్దని ఆయన మాకు పదే పదే చెప్పేవారు. మోసం చేయటం, అక్రమంగా, అన్యాయంగా సంపాదించటం అంటే ఆయనకు గిట్టదు. న్యాయంగా కష్టపడి సంపాదించుకోవాలని ఆయన చెప్పేవారు. రాజన్న పిల్లలు అంటే పదిమందీ మంచిగా చెప్పుకోవాలని ఆయన ఆశపడేవారు. నేను మీకు పెద్ద పెద్ద ఆస్తులను సంపాదించి ఇవ్వకపోయినా విద్యాబుధ్దులు, నీతి నిజాయితీలు నేర్పించాను. తండ్రిగా ఇంతకంటే ఇంకేం చేయలేనురా అని అప్పుడప్పుడూ ఆయన అంటుండేవారు.

అన్నింటికంటే ఆయననుంచి ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సినది ఒకటుంది. అదే క్షమాగుణం. ఎన్నోసార్లు తనను మానసికంగా, శారీరకంగా గాయపర్చిన వ్యక్తులను సైతం ఆయన చాలా సులభంగా క్షమించేసేవారు. "పోనీలే తల్లీ వారి పాపాన వాళ్లే పోతారు. మనకు వచ్చే నష్టం ఏమీ లేదు" అనేవారాయన. రక్త సంబంధీకులనే కాదు, బంధువులను, ఊర్లోవాళ్లను ఎవరినైనా సరే తన తప్పు ఏమీ లేకున్నా, తనను నిందిస్తూ ఇబ్బంది పెట్టినా సరే.. అలాంటి వాళ్లను కూడా చాలా సులభంగా క్షమించేసేవారు.

తన వ్యాధి తీవ్రమవుతోందనీ, ఇకపై ఎక్కువ రోజులు తాను బ్రతికి ఉండనని అర్థం చేసుకున్న మా నాన్న మాకు చెబితే భయపడతామని చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. బ్రతికి ఉన్న రోజులలో తనకు ఏవేవి ఇష్టమో అవన్నీ చేశారు. ఎవరెవరిని చూడాలని ఉందో, అందరినీ చూసి వచ్చారు. ఏమేమి తినాలో వాటన్నింటినీ తిన్నారు. తాను కట్టించిన ఇళ్లను, ఇంటి పరిసర ప్రాంతాలను తనివితీరా చూసుకున్నారు.

(ఇవన్నీ తాను చనిపోయిన తరువాత అందరూ చెబితే మాకు తెలిసాయి. ముఖ్యంగా మొదటి వర్థంతి రోజున మా ఊర్లో ఒకామె చెప్పిన విషయం మమ్నల్ని నిశ్చేష్టులను చేసింది. మరో మూడు రోజుల్లో ఆయన చనిపోతారనగా తనను పిలిచి, "ఏమ్మా నీకు 5 రూపాయలు బాకీ ఉన్నాను కదా, ఇదుగో తీసుకో" అని అన్నాడట. "ఏంటన్నా ఈ ఊర్లోనే కదా ఉన్నావు, ఇప్పుడెందుకు పిలిచి మరీ ఇస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావేంటి?" అని ఆమె అడిగితే, "ఎక్కడికీ వెళ్లటంలేదమ్మా, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఎవ్వరికీ బాకీ ఉండటం నాకు ఇష్టం లేదు" అని చెప్పారట. అది ఆమె చెబుతుంటే ఆయన రూపం మా కళ్లముందు నిలబడి చెబుతున్నట్లుగా అనిపించి పిచ్చిగా ఏడ్చేశాం.)

ఇవండీ మా నాన్నతో మాకున్న జ్ఞాపకాలు.. జ్ఞాపకాలు అనేకన్నా, మా నాన్నతో మేం గడిపిన అరుదైన క్షణాలు అనవచ్చు. ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టి, తాను నిరక్షరాస్యుడైనా, తన పిల్లలు తనలా ఉండకూడదని చదువులు చెప్పించి, తన పిల్లలు మరో పదిమందికి విద్యాదానం చేయగలిగే స్థాయికి మమ్మల్ని ప్రయోజకుల్ని చేసి.. కానరాని లోకాలకు తరలివెళ్లిన నా తండ్రికి ఇదే నా అక్షర సుమాంజలి. 

నాన్నా...
నీవు ఎక్కడున్నా, నీ ఆత్మకు శాంతి చేకూరాలనీ...
నీ చల్లని చూపులు మా వెన్నంటే ఉండాలనీ
నీ జ్ఞాపకాలను...
నువ్వు పంచిన ఆత్మీయతానురాగాలను..
నీ చిరునవ్వులను పూమాలగా చేసి...
ఇదుగో నీకే సమర్పిస్తున్నాం...
ఆశీర్వదిస్తావు కదూ... ?!!


ఈ వ్యాసం పూర్తి పాఠం సిలికానాంధ్ర వారి సుజనరంజని పాఠకుల పేజీలోని మా నాన్నకు జేజేలు శీర్షిక కిందన పబ్లిష్ అయ్యింది.

Tuesday, 25 January 2011

నువ్వు + నేను = ........ ?

 
అలుపే లేని అలను నేను
విరుచుకుపడే కెరటానివి నీవు

అల ఎప్పుడూ ఒడ్డును
అంటిపెట్టుకునే ఉంటుంది

కెరటానికి కోపం వస్తేనే
ఒడ్డును పలుకరిస్తుంది

అల అంటిపెట్టుకున్నా..
కెరటం కోపగించుకున్నా..

ఆ ఒడ్డు మాత్రం స్థిరంగా..
ఎప్పటికీ అలాగే ఉంటుంది

ఆ ఒడ్డు పేరే అను"బంధం"

యుగాలు మారినా
తరాలు మారినా
అది మాత్రం మారదు
తన ఉనికిని కోల్పోదు...!!!

Monday, 17 January 2011

బొట్టూ, కాటుకతో తరలివచ్చిన "సంక్రాంతి లక్ష్మి"

ఎప్పుడూ బస్ ప్రయాణంలో... మొబైల్ ఫోన్లో ఎఫ్ఎం పెట్టుకుని వింటుండే నేను, ఈరోజు కాస్త భిన్నంగా ఏదైనా పుస్తకం చదవాలనుకుని ముందుగానే బ్యాగులో సర్దుకున్నాను. పండుగ సెలవులు కావడంతో రోడ్లంతా నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నాయి. ఆ ప్రశాంతతలోనే, బస్సులో కూర్చున్న నేను మెల్లిగా పుస్తకం తెరిచాను.

పుస్తకం అటు నుంచీ ఇటూ, ఇటు నుంచీ అటూ తిరగేసిన నాకు... "అమృతం కురిసిన రాత్రి" అంటూ ఓ కథ నాకు స్వాగతం పలికింది. అంతే ఒక్కసారిగా కథలో లీనమైపోయాను. చదువుతుండేకొద్దీ నా మనసులో ఎక్కడలేని సంతోషం, ఒక రకమైన భావోద్వేగం కమ్ముకున్నాయి.

పల్లెలో టీచర్‌గా పనిచేస్తుండి, రిటైరైపోయిన ఓ పెద్దాయన... కొడుకు ఉంటుండే భాగ్య నగరానికి వచ్చి అపార్ట్‌మెంట్‌పై నిల్చుని వెన్నలను ఆస్వాదిస్తూ ఉంటాడు. "అయ్యో.. మంచులో నిల్చున్నారేంటీ, కిందికి దిగిరండి. లేదంటే రొంప చేస్తుందంటున్న" భార్య పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తాడాయన.

వెంటనే.. "తులసీ.. ఓ పెద్ద క్యారేజీ సెట్ తీసుకొచ్చి, అందులోని గిన్నెలన్నింట్లోనూ వెన్నెల నింపి, కిందికి తీసుకెళ్లి అబ్బాయికీ, కోడలికి, మనవడికి గోరుముద్దల్లాగా తినిపించకూడదూ.." అని ఆమెనడుగుతాడు. "చాల్లేండి సంబరం. భావుకత చాలించి కిందికి దిగిరండి, వెన్నెల్లి చూస్తే చాలు మరీ చిన్నపిల్లాడైపోతారు.." అంటూ సున్నితంగా హెచ్చరిస్తుందామె.

నిజంగా... వెన్నెల గురించి అంత భావుకతగా మాట్లాడిన ఆయన తీరు, ఆమె సమాధానం.. చదివిన నాకు ఎక్కడలేని ఆనందం, ఒక రకమైన తృప్తి కలిగాయి. "తల్లిదండ్రులు ఉద్యోగ జీవితాలతో, పిల్లలు చదువుల భారంతో సతమతమయ్యే నేటి స్పీడ్ కాలంలో ఇలాంటి ఫీలింగ్స్‌కు కూడా తావుందా..?" అన్న ప్రశ్న నాకే కాదు, కథలోని ఆ పెద్దాయనకు కూడా.

ఇంటికి రాగానే కొడుకు లాప్‌టాప్‌తోనూ, కోడలు టీవీతోనూ, మనుమడు మొబైల్‌ఫోన్‌తోనూ బిజీగా ఉండటం చూసి అందరి ముఖాలను మార్చి, మార్చి చూస్తుండే తన భార్య అవస్థ గుర్తొచ్చిందేమో ఆయనకు.. ఆ వెన్నెల రాత్రుల్లో అపార్ట్‌మెంట్ లైన్‌మెన్‌కు డబ్బులిచ్చి ఎవరికీ తెలియకుండా కరెంట్ తీసేయమని చెప్పేస్తాడు.

అనుకున్నట్లుగానే కరెంట్ పోవడం... అపార్ట్‌మెంట్‌లోని పిల్లా, జెల్లా, చిన్నా, పెద్దా అందరూ బిలబిలమంటూ టెర్రస్ పైకి చేరుకోవటం జరిగిపోతాయి. ఆ టెర్రస్‌మీద అక్కడ ఆ పెద్దాయన, తులసమ్మ ఇద్దరూ మనవడికి తమ కొడుకు చిన్నప్పటి సంగతులు, చిన్న చిన్న కథలు చెబుతూ, తమషా విషయాలు వచ్చినప్పుడు నవ్వుతూ.. వారు తమని తామే మైమరచిపోతారు.

ఆ తరువాత, వెంట వెంటనే... అదే టెర్రస్ పైన మనసును కదిలించివేసే అనేక సంఘటనలతో మేలుకున్న స్పీడ్ మనుషులందరిలోనూ ఇన్నాళ్లు తాము మరమనుషులుగా బ్రతుకుతున్నామన్న భావనను కలిగించి, వాళ్ల కళ్లు తెరిపించేలా ముగుస్తుందీ కథ.

ముఖ్యంగా ఆ అపార్ట్‌మెంట్లోనే ఉండే ఓ పెద్దావిడ... "ఉండడర్రా పిల్లలూ... అలసిపోయి ఉంటారు" అంటూ గోంగూర, నెయ్యి కలిపిన వేడి వేడి అన్నం తీసుకొచ్చి అందరి చేతుల్లో తలో ముద్ద పెడుతుంది. అది తిన్న వారందరూ ఆ చల్లటి వెన్నెల్లో అమృతంలాగా భావించి తృప్తిగా తిని అక్కడే కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు... ఈ కథ కంచికి మనం కిందికి...

పొద్దున్నే... అదీ పండుగ రోజున మంచి కథ చదివాననిపించింది. పట్టణాల్లో ఉద్యోగ జీవితాల్లో, ఉరుకుల పరుగులతో వెనుక ఎవరో తరుముతున్నట్లుగా పరుగులు తీసే అందరూ తప్పకుండా ఈ కథ చదివితే బాగుండుననిపించింది. మరబొమ్మల్లాగా పని చేసుకుపోయేవారు, ఖచ్చితంగా ఆలోచించాల్సిందే కదా...!

ఏదో తెలియని ఆనందంతో నవ్వుతూ చూద్దును కదా.. నా ఎదురుగా ఓ విదేశీ మహిళ నిల్చుని ఉంది. అప్పటికే సంతోషంతో ఉన్న నేను, ఆమెని చూడగానే మరింత సంతోషానికి లోనయ్యాను. అలాగని ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ ఆమె రూపం, అలంకరణ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఓస్.. విదేశీ మహిళ ఎలా ఉంటుందిలే... టీషర్టు, ఫ్యాంటుతోనో, మరేదో డ్రస్‌తోనో ఉండి ఉంటుందిలే అనుకుంటున్నారేమో..!

అయితే మీరు పప్పులో కాలేసినట్లే..! చూడచక్కగా ఉన్న ఆమె నుదుటిమీద ఎర్రటి బొట్టు, పాపిట్లో సింధూరం, కళ్లకు కాటుకతో, నున్నగా దువ్వుకుని.. చక్కగా జడ వేసుకుని హాయిగా నిల్చుని అటూ, ఇటూ చూస్తోంది. నిజంగా ఆమె చూడ్డానికి ఎంత బాగుందో తెలుసా..?

అసలే తెల్లని మేనిఛాయ, ఆపైన కుంకుమ బొట్టు... అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే... చక్కగా చీరకట్టుకుంది. ఎంత చక్కగా అంటే, మనం కూడా అంత బాగా కట్టుకోలేమేమో అన్నంతగా... భారతీయతకే కొత్త అర్థాన్నిస్తున్న ఈ విదేశీ మహిళ కట్టూ, బొట్టూ... ఫ్యాషన్లకు అలవాటు పడిన భారతీయ వనితలకు ఏదో చెబుతున్నట్లుగా లేదూ...!

పొద్దుటిపూట, అదీ పండుగ రోజున ఓ మంచి సందేశంతో కూడిన కథను చదివి, ఆనందంలో మునిగి ఉన్న నన్ను... చక్కగా, సంప్రదాయబద్ధంగా కనిపించిన విదేశీ మహిళ ఆకర్షణీయమైన రూపం "సంక్రాంతి లక్ష్మి" ఈమే కాదుగదా.. అనే సందేహంలో పడేసింది కూడా...!!

Friday, 7 January 2011

మా రాజు - నోరు జారాడు...!!


"డేయ్ అంద డబ్బా కొండువాడా... (రేయ్ ఆ డబ్బా తీసుకురా).. పెరియమ్మా ఇవన్ పారూ ఎన్నై అడికిరా... (పెద్దమ్మా వాడు చూడూ నన్ను కొడుతున్నాడు)" అంటూ పక్క పోర్షన్‌లోంచి గట్టిగా మాటలే మాటలు.. బాల్కనీ అంతా గిజగిజా జనాలు నిల్చోనున్నారు. ఒకటే సందడి.
ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు.. "రేపు ఆదివారం కాబట్టి నన్ను ఎవరూ లేపకండి. ఇవ్వాళైనా బాగా నిద్రపోవాలి" అంటూ మావారినీ, మా అబ్బాయినీ హెచ్చరించి మరీ పడుకున్న నాకు పక్కింటి గోలతో ఆరుకూడా కాకుండానే మెలకువ వచ్చేసింది.

గత వారం రోజుల నుంచీ ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలూ లేకుండా నిశ్శబ్దంగా ఉన్న మా పక్క పోర్షన్‌లో ఒకటే హడావిడి. అస్సలే భోరున కురుస్తున్న వర్షం శబ్దానికి తోడుగా పక్కింట్లోంచి వస్తున్న చప్పుళ్లతో.. "అబ్బా ఏంటీ నస, ఎమైనా సరే నిద్రపోవాల్సిందే..." అనుకుంటూ ముసుగుతన్ని మళ్ళీ పడుకున్నాను.

ఓ ఐదు నిమిషాల తరువాత ఎవరో తలుపును దబదబా బాదుతున్నారు. అసలే నిద్రపట్టక చిరాగ్గా ఉన్న నేను, "ఈ రోజు నా చేతిలో అయిపోయారే అనుకుంటూ..." విసురుగా వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఒకామె నవ్వు మొహంతో "ఇన్నేకి పాల్ కాసరోం.. ఇన్నూం సామాన్ కొండువర్‌లే.. చిన్న పాత్రం ఒన్నుం తరింగలా" (ఈరోజు పాలు కాస్తున్నాం. ఇంకా సామాన్ తీసుకురాలేదు. చిన్నపాత్ర ఒకటి ఇస్తారా) అని అడిగింది.

ఓహో పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగినారన్నమాట అని మనసులో అనుకుంటూ... "ఇందాంగే" (ఇదుగోండి) అంటూ నవ్వుతూ పాత్ర ఇచ్చాను. ఎలాగూ నిద్ర చెడిపోయింది ఇప్పుడు పడుకున్నా నిద్ర రాదు. సర్లే పనులైనా త్వరగా ముగించి మధ్యాహ్నం అయినా పడుకోవచ్చులే అనుకుంటూ పనుల్లో పడిపోయాను.

ఎవరినైతే దబాయించి, బెదిరించి రాత్రి పడుకున్నానో.. ఆ శాల్తీలు రెండూ మాత్రం 11 గంటలు అవుతున్నా నిద్ర లేవలేదు. ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లను చూసి కుళ్లుకుంటూ వంటపని చేయసాగాను. ఇంతలో మావాడు లేచి అమ్మా... కాఫీ అంటూ అరిచాడు. కాఫీ చేసి తీసుకెళ్లి ఇవ్వగానే.. "ఏంటమ్మా బాల్కనీలో ఒకటే గోల" అని అడిగాడు.

"ఆహా.. ఆ గోల తమరికి ఇప్పుడే వినిపిస్తోందా.. ఉదయం నుంచీ ఆ గోలను భరిస్తూనే ఉన్నాను తండ్రీ. పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగారట. పాలు కాస్తున్నారు" అని చెప్పాను. "ఆహా.." అంటూ మావాడు పేపర్లో మునిగిపోయాడు. ఇంతలో మా ఆయన లేచి "టిఫిన్ అయ్యిందా" అన్నాడు. "అయ్యింది మహాప్రభో తమరు అన్ని పనులూ ముగించుకుని రండి, ఆరగించుదురుగానీ..." (ఈయనదో గోల.. ఎప్పుడైతే ఆ షుగర్ జబ్బు వచ్చిందోగానీ.. లేచీ లేవగానే ఆకలేస్తుంది అంటూనే నిద్ర లేస్తారు) అన్నాను.

"ఏంటీ పొద్దున్నే భలే వేడిగా ఉన్నావు.. ఏంటి సంగతి" ఆరా తీశాడు మా ఆయన. "ఆ ఏముంది పక్కింట్లోకి కొత్తగా వచ్చారట పాలు కాస్తున్నారు. అయినా ఇన్నేళ్లుగా మనం ఇక్కడ ఉంటున్నాం.. ఓ ఇల్లు మారి, ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో నామ్ కే వాస్తే లాగా పాలు కాస్తాం కదా... వీళ్ళేంటో మరీ విచిత్రంగా మందలు మందలుగా జనాలు, ఒకటే గోల.. ఏవేవో చేస్తున్నారు. అద్దె ఇంట్లోకి దిగుతూ.. ఏదో సొంతంగా ఇల్లు కట్టి, ఆ ఇంట్లో పాలు పొంగిస్తున్నట్లుగా చేస్తున్నారు" చిరాగ్గా అన్నాను.

"సర్లే.. మనలాగే అందరూ ఉండాలంటే కుదురుతుందా. అసలే అరవమేళాలు.. వాళ్లలాగా మనం కూడా టెనెంట్స్ మాత్రమే, మనకెందుకు చెప్పు" అంటూ మా ఆయన బాత్రూంలో దూరిపోయాడు. అవును నిజమే కదూ అనుకుంటూ.. అబ్బా రోజంతా ఇలాగే మూడీగా ఉంటే బాగుండదు, మూడ్ మార్చుకోవాల్సిందేనని నిర్ణయించుకుని, చిన్నగా పాడుకుంటూ వంటింట్లోకి వెళ్ళాను.

పక్కింట్లో హడావిడి మాత్రం తగ్గలేదు. వర్షం పడుతున్నా ఎవరో జనాలు వస్తూనే, వెళ్తూనే ఉన్నారు. పాలూ, పండ్లు తీసుకుని ఆ ఇంటావిడ మాకు ఇచ్చి వెళ్లింది. మధ్య మధ్యలో కూడా అవి కావాలి, ఇవి కావాలి అంటూ వస్తువులు పట్టుకెళ్తూనే ఉన్నారు. మొత్తానికి ఆ రోజు అలా గడిచిపోయింది.

మరుసటి రోజు పక్కింట్లో దిగిన అతను మా ఆయన్ని పిలిచి పరిచయం చేసుకున్నాడు. "నిన్న ఒకటే హడావిడిగా ఉండి పరిచయం చేసుకోవటం కుదర్లేదు సర్.." అంటూ, తన భార్యను కూడా పిల్చి పరిచయం చేసుకున్నాడు. మా ఆయన నన్ను కూడా పరిచయం చేశాడు. మొత్తానికి పరిచయ కార్యక్రమాలు అయ్యాక మెల్లిగా మొదలెట్టాడతను.

"ఎక్కడెక్కడో వెదికాం. ఇలాంటి ఇల్లు దొరకలేదు. మొత్తానికి మంచి ఇల్లే దొరికింది" అంటూ ఓనర్ గురించీ, పక్క ఇళ్లవాళ్ల గురించీ, కింద పోర్షన్లలో ఉండేవారి గురించి, చుట్టుప్రక్కల అంగళ్లు, బస్టాండు.. వివరాలన్నీ ఆరా తీశాడు అతను.

"అది సరేనండీ.. ఇంటి అద్దె ఎంతని ఓనర్ చెప్పాడు?" అంటూ మావారు అడగ్గా... "4 వేలు సార్.. అడ్వాన్స్ 40 వేలు" అన్నాడు.

"ఆహా.. అలాగా..! మా ఇల్లు 3 వేలే, 25 వేలే అడ్వాన్స్ ఇచ్చాం.." అంటూ మావారు నోరు జారనే జారారు - షరామామూలుగా.

"అవునా అలాగా.. సేమ్ మీ ఇల్లంతే కదా మా ఇల్లు కూడా ఉంటుంది. మరి మాకెందుకు ఓనర్ ఎక్కువ అద్దె చెప్పాడు?" అంటూ అతను వెంటనే ప్రశ్నించాడు.

మా ఆయన్ని మెల్లిగా గిల్లిన నేను కల్పించుకుంటూ... "మరేంలేదులెండి.. మేము చాన్నాళ్లుగా ఉంటున్నాం కదా.. మాపైన ఓనర్‌కు నమ్మకం ఎక్కువలెండి. ఇన్నిరోజులుగా నమ్మకంగా ఉంటున్నాం కాబట్టే అద్దె పెంచలేదు" అన్నాను.

"ఓహో.. అప్పడియా?" అంటూ అతను వెళ్లిపోయాడు.

అతను అలా వెళ్లగానే.. "మీ నోట్లో ఏదీ దాగదా...? అతను వెళ్లి ఓనర్‌ను నిలదీస్తే.. మనల్ని కూడా అద్దె ఎక్కువ ఇవ్వమని అడుగుతాడులే ఉండు..." అంటూ కోప్పడ్డాను.

"అవును నిజమే.. ఏదో అలా వచ్చేసింది." అంటూ సర్దుకున్నారు మావారు.

పక్క పోర్షన్ ఖాళీ అవుతున్నప్పుడే మేం కాస్త భయపడ్డమాట వాస్తవం. ఈసారి అద్దెకు వచ్చేవాళ్లు ఎక్కువ ఇస్తే మమ్మల్ని కూడా అద్దె ఎక్కువ ఇవ్వమని అడుగుతాడేమో అనుకున్నాం. ఇప్పుడేమో ఈయన ఇలా నోరుజారారు. ఏమవుతుందో ఏమో అనుకుంటూ.. అలా రెండు రోజులు గడిచిపోయాయి.

మేం భయపడినట్లుగానే... సాధారణంగా ఇంటివైపు కన్నెత్తి చూడని మా ఇంటి ఓనర్.. పొద్దున్నే ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే మా ఆయన ఆఫీసుకు వెళ్లిపోయారు. మా అబ్బాయి ఆఫీసుకెళ్లేందుకు బయల్దేరుతూ బాల్కనీలో ఓనర్ని చూసి "అమ్మా.. అంకుల్" వచ్చారు అన్నాడు.

"రండి సర్.. బాగున్నారా..?" లోపల గుబులుగా ఉన్నా, బయటికి మాత్రం నవ్వుతూ ఆహ్వానించాను.

"ఏంటి సర్ ఎప్పుడూ ఇటువైపు రారు, ఏంటి విషయం?" అని అడిగాను.

"ఒన్నుం ఇల్లే మా.. ఎనకు వీడు వేండుమ్ (ఏం లేదమ్మా.. నాకు ఇల్లు కావాలి)" అన్నాడు.

"అదేంటి సర్.. ఇలా సడెన్‌గా చెబితే ఎలా?" అన్నాను.

"సడెన్‌గా ఏమీ లేదమ్మా.. ఇంకో రెండు నెలల్లో ఖాళీ చేస్తే చాలు. మా చెల్లెలు ఇల్లు కావాలంటోంది. పిల్లల స్కూలు ఇక్కడికి దగ్గర్లోనే. అందుకే ఇక్కడికి రావాలంటోంది." అన్నాడు.

"అదేంటి సర్.. పక్కింట్లోకి ఎవరు కొత్తగా వచ్చినా మీరు ఇలాగే చెబుతున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు మళ్లీ ఇలా అంటున్నారు..?" బాధగా అన్నాను.

"నేను ఆ తరువాత ఎప్పుడైనా ఇలా అడిగానా.. నాకు ఇల్లు అవసరం ఏం చేయమంటారు. అయినా ఇది నా ఇల్లే కదా, మీరు ఎన్నేళ్లు ఉన్నా, ఖాళీ చేయాల్సిందే కదా.." అన్నాడు.

"అదీ నిజమేలెండి.. ఆయన ఇంటికి రాగానే చెబుతానులెండి" అన్నాను.

ఓనర్ వెళ్లాక మా ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆ రోజు తమరు కంట్రోల్‌గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని దెప్పాను.

ఏదో ఆవేశంలో మా ఆయనపై కోప్పడ్డానుగానీ.. మా ఓనర్ ఓ విచిత్రమైన మనిషి.. తాను రెంట్ పెంచాలనుకుంటే అదే విషయం నేరుగా చెప్పడు. నేరుగా చెబితే ఇష్టమైతే ఉండటమో లేకపోతే వెళ్లిపోవడమో చేస్తాం. కానీ ఆయన ఏకంగా ఇల్లే ఖాళీ చేసేయమంటాడు. అదే ఆయన స్పెషాలిటీ.. అలా చెబితే మన పరిస్థితులను బట్టి అతన్ని బ్రతిమలాడుకోవాలి. లేదంటే పారిపోవాలి.

ఇప్పటికి ఇలా రెండుసార్లు అలాగే చేశాడు. అందుకే పక్కింట్లో ఎవరైనా ఖాళీ చేస్తే, మాకు ఆ రోజునుంచే గుబులు మొదలవుతుంది. మేం భయపడినట్టుగానే ఈసారి కూడా అలాగే చేశాడు. ఇక మళ్లీ అతగాడిని బ్రతిమలాడుకోవాలి అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నా. బుర్ర అస్సలేం బాగలేదు.. వేరే ఇల్లు చూసుకుందామా, లేదా ఇక్కడే ఉందామా.. అనుకుంటూ పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఉండిపోయా.

ఆ తరువాత ఓ వారం రోజులపాటు ఓనర్ ఇంటిచుట్టూ ప్రదక్షిణ చేస్తేగానీ... ఆయనగారు ఆ ఇంట్లో మేం ఉండేందుకు ఒప్పుకోలేదు. రెంట్ పెంచటమేగాకుండా, అడ్వాన్స్ కూడా ఎక్కువ తీసుకున్నాడు. అదీ ఓ సంవత్సరం రోజుల వరకు మాత్రమే. ఆ తరువాత ఖచ్చితంగా చెప్పిన రోజున ఖాళీ చేయాలనే కండీషన్‌తో ఒప్పుకున్నాడు.

ఇవండీ మా అద్దె ఇంటి కష్టాలు.. ముఖ్యంగా మా ఆయన నోరుజారటంవల్ల వచ్చిన కష్టాలు.. ఈ మహానగరంలో ఓ పద్నాలుగేళ్లుగా అద్దె ఇంట్లోనే గడుపుతున్న మాకు... ఇల్లు మారాల్సిన ప్రతిసారీ ఇలాంటి కష్టాలే. అందుకే ప్రతిసారీ.. చదువులేకపోయినా, ఎలాంటి ఉద్యోగం లేకపోయినా రెండు మూడు పోర్షన్లు ఉండే ఓ సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది అనుకోని రోజు లేదంటే నమ్మండి. ఎందుకంటే.. ఈ రోజుల్లో సొంత ఇల్లే ఓ బంగారుబాతు లాంటిది. అది ఉంటే చాలు డబ్బులే.. డబ్బులే...!! ఆ బంగారుబాతు ఉన్నవాళ్లంతా మహారాజులే...!!

Thursday, 6 January 2011

ఓ అబద్ధం.. మరో జ్ఞాపకం...!!

అటుచూడు…
ఓ అందమైన అబద్ధం
రెండు చేతులనూ
గుండెలపై వేసుకుని మరీ
నిత్య నూతనమైన విశ్రాంతితో
నిద్రపోతున్నట్లుగా కనిపిస్తోంది

ఇటుచూడు…
ఓ మరపురాని జ్ఞాపకం
ముసిముసి నవ్వులను
పెదవులపై పూయిస్తూ…
జ్ఞాపకాల తీరానికి
పదే పదే తీసుకెళ్తూ...
గుండెగదిలో సవ్వడి చేస్తూ
గిలిగింతలు పెడుతోంది…!

Tuesday, 4 January 2011

నా పాప కోసం...!!

ఇంకా పుట్టని నా పాప కోసం
ఆశల సౌధాలెన్నింటినో కట్టేశా...


బుల్లి బుల్లి చేతులతో
బోసినవ్వులు రువ్వుతుండే
బొమ్మలాంటి బుజ్జాయిని
పాలబుగ్గల పసిపాపాయిని
తనివితీరా ముద్దాడాలని
లాలిపాడుతూ జోకొట్టాలని...


చందమామను చూపిస్తూ
గోరుముద్దలు తినిపించాలని 

వచ్చీరాని మాటలతో
చిలుక పలుకలు పలుకుతుంటే
పగలబడి నవ్వాలనీ
తప్పటడుగులు వేస్తూ
నడక నేర్చుకుంటుంటే
దగ్గరుండి దారి చూపించాలనీ...


జీవితం ప్రతి దశలోనూ
చుక్కానినై నడిపించాలనీ
అచ్చం అమ్మలాగున్నావే తల్లీ
అని అందరూ అంటుంటే
మురిసి మైమరచి పోవాలనీ
ఎన్నో, ఎన్నెన్నో ఆశలు...


కానీ,
నా పాప చేసుకున్న పుణ్యమో
ఆ దేవుడు ఇచ్చిన వరమో...
తాను పుట్టకుండానే బ్రతికిపోయింది
                                                                                                       నా పొట్టలో పుట్టనందుకు కాదు..
                                                                                                       ఈ పాడులోకంలోకి రానందుకు....!!!