Pages

Friday, 22 July 2011

నవ్వుల పువ్వులు వికసించేదెన్నడో...!!


ఏమయ్యింది మనకు
పెంచుకున్న ఆశలు
అల్లుకున్న అనుబంధాలు
ఊసులు, భాషలూ
గాల్లో కట్టిన మేడల్లాగే
అవి కూడా ఇంతేనా…!

అప్పట్లో నీ సాహచర్యం
రోజు రోజుకీ ప్రకాశవంతమై
ప్రేమ, నవ్వులు, శ్రద్ధ
అభిమానం, అనురాగం
ఇలా చెప్పుకుంటూపోతే
దినదిన ప్రవర్థమానమే..!

నా వద్ద సంతోషాలెన్నీ ఉన్నా
అవన్నీ నువ్విచ్చినవే కదా…!
కమ్మటి కలలు ఎన్ని కన్నా
అవన్నీ నీ వల్లనే కదా….!

నేను అమితంగా ఇష్టపడే
ఒక్కగానొక్క అపురూప నేస్తానివి...
ఎప్పటికీ వడలిపోని
అరుదైన విరజాజి పువ్వువి..!

మరలాంటిది ఏమయ్యింది మనకు..?
ఏ నిశిరాతిరి నిద్దురలో
మబ్బుతెరలు కమ్మేశాయో.. ఏమో
వెలుగు రేఖలు విచ్చుకునేలోపే
జరగాల్సినదంతా జరిగిపోయింది

మనసులు తేలికై
దూరాలు దగ్గరై
నవ్వుల పువ్వులు
నిండు దోసిళ్లలో
కొలువయ్యేదెప్పుడో…!!

Monday, 18 July 2011

వెలుగు రేఖల వెతుకులాటలో…!



నా ఆలోచనలన్నీ
మనసు అనే విరిగిన ముక్కను
తీసుకొచ్చి చేతిలో పెట్టాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్యుడే మెల్లిగా కిందికి పడిపోతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
సంతోషం అనే కలకండ ముక్కను
తీసుకొచ్చి నోట్లో వేశాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
చంద్రుడే హాయిగా కిలకిలా నవ్వుతున్నట్లు…!

నా ఆలోచనలన్నీ
ఆశ అనే రేపటిని
తీసుకొచ్చి ముందు నిలిపాయి
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా
సూర్య, చంద్రులే పోటీ పడుతున్నట్లు…!

Friday, 15 July 2011

భూమ్యాకాశాల బంధమా…?!


చేసిన మంచిని మరవని తత్త్వం నీది
మంచినీ, చెడు కూడా మరవలేని మనస్తత్త్వం నాది
నువ్వేమో… ఆకాశం, నేనేమో భూమండలం
నువ్వు ప్రపంచాన్ని చుట్టేస్తే.. నేనేమో నిన్ను చుట్టేస్తా...

నేను లేకపోతే భూమండలమే లేదంటావు నువ్వు
నేనంటూ ఉంటేనే కదా ఆకాశానికి చోటంటాను నేను
ఎందులోనూ ఎవ్వరమూ తీసిపోయేది లేదు
అన్నింట్లోనూ ఎవరికి వారే.......
ఆలోచనలు, అభిరుచులు దాదాపు ఒక్కటే
కానీ అభిప్రాయాల్లో మాత్రం ఆమడదూరం......

ప్రతిదాన్నీ లైట్‌గా తీసుకోమంటావు నువ్వు
జీవితమే లైట్‌గా అవకూడదంటాను నేను
కోరి కోరి కష్టాల్లో పడవద్దని నేను హెచ్చరిస్తే…
ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసంటావు నువ్వు
ఎవరైనా శాసిస్తే ఒప్పుకోనంటావు నువ్వు
మంచి కోసం శాసించినా తప్పులేదంటాను నేను

వాదనల్లో పోటాపోటీ… మెట్టు దిగే ప్రశక్తే లేదు..
మొదలెట్టింది ఎక్కడో.. వెళ్తోంది ఎక్కడికో…

చివరకు.........

పడ్డాక తెలుస్తుందిలే.. అని అలకతో నేను కునుకేస్తే
వస్తే రానీ.. పోతే పోనీ.. ధీమాగా ఉంటావు నువ్వు

రాజీ కుదిరే మార్గమే కరువాయే
నా అలకతో సమస్తం నిశ్శబ్దం
నీ కినుకతో అంతా నిరాసక్తం

కాలం అలా మెల్లిగా కదుల్తుంటే...........
“ముల్లును ముల్లుతోనే..” గుర్తొచ్చిందో.. ఏంటో…?
నువ్వూ… అలకపాన్పుకు అతుక్కుపోయావ్

నువ్వో వైపూ.. నేనోవైపు..
అలక పాన్పుకు అంటుకుపోయినా…
మాటలే లేకపోయినా…
ఊరుకుందునేమో
నీ ఉపవాస దీక్షకు దెబ్బకు దిగొచ్చేశా.....

బువ్వ తినమని బుజ్జగిస్తే…
ఇద్దరం కలిసే తిందామన్నావు
అంతే…
వాదనలు, సమస్యలు, పరిష్కారాలు
అన్నీ వేటిదారిన అవి టాటా చెప్పేశాయి...... :)


(మార్చి 31, 2009న నా మరో బ్లాగులో రాసినది.... అనివార్య కారణాల వల్ల ఆ బ్లాగును త్వరలో మూసేద్దామని అనుకుంటున్నాను... వాటిలోని పోస్టులను ఇలా ఈ బ్లాగుకు తరలించే ప్రయత్నమే ఇది... ఈ కవితను ఇంతకుముందే ఎవరైనా చదివివుంటే తిట్టుకోకండేం.....)

Thursday, 14 July 2011

శైలబాలకు "కారుణ్య" ఎందుకిష్టమంటే..?!



శైలూ (http://kallurisailabala.blogspot.com)కి ధన్యవాదాలతో....

Wednesday, 13 July 2011

బదులేమీ చెప్పలేకున్నా…!!

ఎందుకిలా అవుతోంది
ఏ అనుభూతులు నాలో
జీవం పోసుకుంటున్నాయి

అసలు నువ్వు లేకుండా
ఒక్క క్షణం కూడా గడవదే
ఎంతమందితో ఉన్నా
నీతో ఉన్న అనుభూతి లేదే
ఎందుకిలా అవుతోంది

నీ పిలుపుకి.. నీ నవ్వుకి..
నీ అలకలకి.. బుంగమూతికి
నీతో కలిసే అడుగులకు
నీకై కలిపే అన్నం ముద్దలకు
నీకోసం వెతికే కళ్లకు
బదులేమీ చెప్పలేకున్నా
తొందరగా వచ్చేసేయ్.. ప్లీజ్…!!

(March 19, 2009న రాసిన కవిత ఇది)

Monday, 11 July 2011

అమ్మలా లాలించే నేస్తమా..!!

కొన్ని నవ్వులు
మరికొన్ని అల్లర్లు
ఇంకొన్ని అలకలు
లెక్కలేనన్ని గొడవలు
అంతే స్థాయిలో రాజీలు
అంతంలేని పేచీలు
ఆరాటాలు.. పోరాటాలు..!

సంతోషాలు సాగుతాయి
కష్టాలు తరుగుతాయి
బాధలు పెరుగుతాయి
నవ్వులు వికసిస్తాయి
సంకెళ్లు విడిపోతాయి
విషాదం కూడా
సంగీతం అవుతుంది

జలజలా కారే కన్నీటి
సవ్వడులను వినే రెండు చెవులు
ఓదార్చే రెండు పెదవులు
ధైర్యం చెప్పే రెండు చేతులు
ఆసరా ఇచ్చే ఓ భుజం
అమ్మలా లాలించే
ఓ నేస్తం నాకు మాత్రమే సొంతం…!

Saturday, 9 July 2011

నాకు నేను పసిపాపనే…!!



నేను భవిష్యత్తునెదుర్కొంటాను
అది నాకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
నేను ఎదురుచూసినట్లుగా ఏమీ ఉండదు
నా కోసం ఏదీ ఎదురుచూస్తూ ఉండదు కూడా…

అలాంటప్పుడే నాదైన స్వప్నం
ఈ భూమ్మీదకు వాలిపోయింది
కాలం గడిచేకొద్దీ…
నావైన చిన్ని ప్రపంచాలు
కలలు, ఆశలు, ఆరాటాలు
అన్నీ అలా.. కొద్ది కొద్దిగా…
నాకు దూరంగా వెళ్లిపోయాయి

మళ్లీ ఆ రోజులకు వెళ్లలేను
ఇంకెప్పటికీ అవి తిరిగి రాలేవు
అయినప్పటికీ…
నాకు నేను ఎప్పుడూ పసిపాపనే...!!

Thursday, 7 July 2011

నిన్ను చేరేందుకే ఈ ప్రయాణం…!!


నిన్ను కలిసేదాకా
రాత్రులన్నీ చల్లగా
పగళ్లన్నీ నిస్తేజంగా
రోజులన్నీ నిశ్శబ్దంగా
నాకే వినిపించనంతగా
నా హృదయ స్పందన…

అదే నిన్ను కలిసాక
నా చేతులెప్పుడూ ఖాళీగా లేవు
నా మనస్సెప్పుడూ మౌనంగా లేదు
చూస్తుండగానే…
నిమిషాలు కాస్తా.. గంటల్లాగా
గంటలు కాస్తా… రోజుల్లాగా
రోజులు కాస్తా.. వారాలు, నెలలుగా
కాలం మునుముందుకు…

నిన్ను చూడకముందు
ఆకాశంలోని నక్షత్రాలు
వెలసిపోయినట్లుగా ఉండేవి
అదే నిన్ను చూశాక…
ఆ నక్షత్రాల్లో మెరుపు
నా జీవితంలోనూ వెలుగు

నువ్వు తోడుంటే…
నా శక్తి రెట్టింపవుతుంది
తినే తిండి, పీల్చే గాలి
అన్నీ బలవర్ధకాలే….!

నువ్వు లేని రోజున
నా ప్రపంచం శూన్యం
మళ్లీ…
ఓ అద్భుతమైన రోజున
నిన్ను చేరేందుకు
ఆగదు ఈ నిరంతర ప్రయాణం…!

Wednesday, 6 July 2011

నాన్నా.. నువ్వు లేని మా అమ్మ..!!



నువ్వు దూరమై ఏడాది గడుస్తున్నా
కాలం ఎప్పట్లాగే పరుగెడుతోంది
కాలంతోపాటు మేం కూడా…

నువ్వు దూరమైన అమ్మకూడా...
కాలంతో నిశ్శబ్దంగా అడుగులేస్తోంది
అయితే... నువ్వు ఉన్నప్పటి అమ్మకూ
నువ్వు లేనప్పటికీ అమ్మకూ
తేడా మాకిప్పుడే స్పష్టమవుతోంది

నువ్వు లేని ఆమె గతంలోలా
పెద్దరికంగా, ధైర్యంగా లేనేలేదు
ఆమెలో ఏదో తెలీని బాధ
అలాగనీ దాన్ని బయటపడనీయదు
నోరువిప్పి చెప్పదు
బహుశా.. తానే బాధపడితే
పిల్లలు ఇంకెంత బాధపడతారోనని
లోలోపలే కుములుతోందేమో…

అందుకే.. తను మరీ చిన్నపిల్లయిపోయింది
ఇప్పుడు ఆమె మాకు అమ్మకాదు
మేమే ఆమెను పాపలా చూడాల్సి వస్తోంది

పసిపిల్లలు తెలీని వారిని చూస్తే
హడలిపోయినట్లుగా..
ఆమె మాకు కష్టాలొస్తే హడలిపోతోంది
తెలిసినవారిని పిల్లలు హత్తుకున్నట్లుగా
మాకు సంతోషం కలిగితే
గుండెలకు హత్తుకుని ఆహ్వానిస్తోంది…

అదేంటమ్మా అలా చేస్తున్నావ్? అంటే,
చిన్నపిల్లలా ఉడుక్కుంటోంది…
నా పిల్లలు నాకే మంచి చెడ్డలు చెప్పటమా?
అని ప్రశ్నించటం మానేసి…
అందరూ నన్నే అంటున్నారనీ
అమాయకంగా ఏడుస్తోంది…

అందుకే ఆమెను ఓ పసిపాపలా
కంటికి రెప్పలా కాపాడుకోవటం మినహా
పై లోకానికి వెళ్లిన ఓ నాన్నా…
నిన్ను తెచ్చివ్వలేని నిస్సహాయులం మేం
ఆమెకి కలలోనైనా కనిపించి
నువ్వు ఉన్నప్పటి మా అమ్మలా
తనని ఉండమని చెప్పవూ…?!

Saturday, 14 May 2011

ఇప్పుడు ఆమె కూడా ఓ జ్ఞాపకం మాత్రమే....!!

చిన్న వయసులో స్కూళ్లకు సెలవులిచ్చే రోజుకోసం ఎదురుచూడని వాళ్లు ఎవరూ ఉండరు. అందరిలాగే నా చిన్ననాటి రోజులు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గర చేసిన అల్లరి అన్నీ మనసు మూలల్లో తియ్యటి, అందమైన జ్ఞాపకంలా భద్రంగా దాగి ఉన్నాయి. ఇప్పటి పిల్లలు వేసవి సెలవులను ఎంజాయ్ చేయటం చూస్తుంటే.. నా చిన్నతనంలోకి అలా పరుగులు పెట్టాలని అనిపిస్తోంది...

వేసవి సెలవులు అంటేనే అమ్మమ్మ వాళ్ల ఊరు.. అమ్మ, తాతయ్యలతో చేసిన అల్లరీ.. ముఖ్యంగా అమ్మమ్మను ముప్పతిప్పలుపెట్టిన సంఘటనలు, స్నేహితులతో కలిసి చేసిన ఘనకార్యాలు... తాతయ్య ఇచ్చిన వార్నింగులు.. నేరేడుపండ్ల తీపి గుర్తులు.. చింతపిక్కల రుచులు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి.. నా మనసు నిండా...

ఆ రోజుల్లో ఒంటిపూట బడులు జరుగుతున్నప్పుడే మాకు ఓ రకమైన హుషారు వచ్చేసేది.. ఒంటిపూట బడులు అయిపోగానే సెలవులు ఇచ్చేస్తారని బాగా గుర్తుంచుకునేవాళ్లం. అంతే ఇక సెలవులు ఇవ్వగానే నేనూ, తమ్ముళ్లు అమ్మను లాక్కుని అమ్మమ్మ వాళ్ల ఊరికి పరుగులు తీసేవాళ్లం. అమ్మ మాతో పాటు రెండ్రోజులుండి మళ్లీ మావూరు వెళ్లిపోయేది. మేము మాత్రం సెలవులు అయ్యేదాకా అక్కడే ఉండిపోయేవాళ్లం.


అమ్మమ్మకు మేం వచ్చినందుకు సంతోషంగా ఉన్నా... మేం చేసే అల్లరి తల్చుకుని భయపడిపోయేది. అది అమ్మకు తెలుసు కాబట్టి అమ్మమ్మను ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా ఉండాలని చెప్పి వెళ్లేది. అలాగే అమ్మా అంటూ అమ్మమ్మను బాగా చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చి మరీ పంపించేవాళ్లం.

అమ్మ అలా వెళ్లిందో లేదో ఇక మా ఆకతాయి పనులు మొదలు. ముగ్గురికీ వేరు వేరు స్నేహ బృందాలు. వాళ్లందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఆటలే ఆటలు.. అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఊరికి చివరన ఉండేది. ఇంటి చుట్టూ చెట్లు మధ్యలో పూరిగుడిసె.. ఎండలు ఎక్కువగా ఉన్నా, చెట్లు బాగా ఉండటంతో చెట్లకింద మా స్నేహితుల బృందాలతో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం...

ఆటలు ఆడేందుకు అమ్మమ్మ కంటబడకుండా ఇంట్లోకి వెళ్లి దొరికిన వస్తువును తెచ్చుకుని అప్పటికప్పుడు ఓ కొత్త ఆటను సృష్టించి ఆడేవాళ్లం. ఈలోగా అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లి జరిగిన తంతును తెలుసుకుని కర్ర పట్టుకుని మా దగ్గరికి పరుగులెత్తేది. మేం ఆమెకు అందితేగా.. ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఇలాగైతే మీ ఇంటికి పంపించేస్తానని బెదిరించేది. మేం వెళ్లమని చెబుతూ స్నేహితులతో కలిసి ఆమెను వెక్కిరించేవాళ్లం..

అమ్మానాన్నల ఆటలు, బొమ్మల పెండ్లి చేయటం, ముట్టాట (మామిడి ముట్టెతో ఆడేది), అచ్చినకాయలు (రాళ్లతో ఆడేది).. కోతి కొమ్మచ్చి... గోళీలాట, బిళ్లంకోళ్ళు..... ఇలా ఒకటేమిటి రకరకాల ఆటలు ఆడేవాళ్లం. బొమ్మల పెళ్లి సందర్భగా చిన్న చిన్న బుడుగు పాత్రలతో రకరకాల వంటలను వండటం... వాటికోసం ఇంట్లోంచి బియ్యం, పప్పులు దొంగిలించటం... ఇళ్లల్లోని పెద్దవాళ్లతో తన్నులు తినటం.. ఎంత సరదాగా ఉండేదో..

ముఖ్యంగా కోతి కొమ్మచ్చి ఆడుతూ.. మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలించుకుని ఇంటికి ఏడుస్తూ వెళితే... ఇంట్లోవాళ్లు ఇంకాస్త తన్ని.. ఆపైన ఏడుపు మాన్పేందుకు బుజ్జగించటం ఎంత బాగుండేదో... అలాగని ఊరుకూరికే బుజ్జగిస్తే ఒప్పుకునేది లేదు.. ఆ బుజ్జగింపులోనే అన్నింటినీ సాధించుకునేవాళ్లం...

తమ్ముళ్లు.. ఈత కొట్టేందుకు బావుల్లో దుంకటం, దెబ్బలు తగిలించుకుని రావటం... ఎక్కువసేపు నీళ్లలో ఉండటంవల్ల జలుబు, తుమ్ములు... ఇంటికి రాగానే అమ్మమ్మ, తాతయ్యలు వారిని తిడుతుంటే వాళ్లని వెక్కిరిస్తూ నవ్వటం.. దానికి వాళ్లు మరింతగా ఏడ్వటం... మళ్లీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్లను బుజ్జగిస్తూ నన్ను కోప్పడటం.. లాంటివన్నీ తల్చుకుంటే ఉన్నఫలానా ఇప్పటికిప్పుడు చిన్నవాళ్లం అయిపోవాలని అనిపిస్తోంది...

ఎండల్లో బయట తిరగవద్దంటూ అమ్మమ్మ, తాతయ్యలు ఎంతగా తిట్టినా, కొట్టినా, కోప్పడినా మేం ఏనాడూ ఆగింది లేదు.. పైగా స్నేహాలతో కలిసి ఒక్కోరోజు ఒక్కో రకమైన అడ్వెంచర్లు.....

ఆరోజు మా అడ్వెంచర్ ఏట్లోకి... ఏటిగట్టున ఉండే తాటిచెట్లలో ఉండే తాటి ముంజెలను, పండిపోయిన తాటిపండ్లను తినాలని ప్లాన్... అలాగే వస్తూ వస్తూ పక్కనే ఉండే నేరేడుపండ్ల చెట్టెక్కి బోలెడన్ని పండ్లు కోసుకుని రావాలని గుంపుగా బయల్దేరాము... ఏట్లోకి వెళ్లి తాటిచెట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ముంజెలు కొట్టేవాళ్ల దగ్గర రూపాయో, అర్దరూపాయో ఇచ్చి ముంజెలు కొనుక్కుని అందరం తినేవాళ్లం... అలాగే చెట్లకింద రాలిన తాటిపండ్లను ఏరుకుని ఓపికకొద్దీ వాటి రసాన్ని పీల్చేసేవాళ్లం.. పీల్చాం అనే బదులు పీల్చి పీల్చి పిప్పి చేసేసేవాళ్లం అని చెప్పవచ్చు..

తాటిపండ్లు తియ్యగా, ఓ కమ్మనైన వాసనతో తినేందుకు భలే రుచిగా ఉంటాయి.. అయితే వాటికి పీచు ఎక్కువగా ఉంటుంది... దాన్ని ఇష్టపడి తినేవాళ్లకు ఆ రుచే వేరుగా ఉంటుంది. ఆ పీచులోంచి వచ్చే రసం తియ్యగా మంచి వాసనతో ఉంటుంది.. అదంటే మా గుంపుకు భలే ఇష్టం.. అందుకే తాటిపళ్లను ఫూటుగా లాగించేశాం... కాసేపు అక్కడే ఉన్న కానుగ, వేప చెట్లకింద కాసేపు ఆడుకుని ఆ తరువాత వానర సైన్యం లాగా మా గుంపు నేరేడుపండ్ల తోటలవైపు పరుగులు పెట్టింది.

గతంలో ఆ చెట్లలో కాసే పండ్లను ఎవరైనా సరే కోసుకుని తినేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిని ఎవరికో ఎవరో అమ్మేశారు. దాంతో కొనుక్కున్నవాళ్లు ఆ చెట్ల చుట్టూ కంచెవేసి కాపలావాళ్లను కూడా పెట్టుకున్నారు.. ఆ సంగతి తెలియక ఆ చెట్ల దగ్గరికి వెళితే కాపలావాడు మమ్మల్ని కట్టెతో బెదిరించాడు.. అయినా అతను చూడకుండా రాళ్లను పండ్లను రాలగొట్టేందుకు ట్రై చేశాం. అలా కొన్ని పండ్లను పోగుచేసుకున్నాం. అయితే అవి ఎవరికీ సరిపోలేదు.

దాంతో ఎలాగైనా సరే కాపలావాడు చూడకుండా కంచెదాటి చెట్టు పైకి ఎక్కాలనుకుని ఓ ఇద్దరూ అతను చూడకుండా మెల్లిగా కంచె దూకేశారు.. పిల్లిలా చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి అందినకాడికల్లా పండ్లను కోసి జేబుల్లో వేసుకోసాగారు... మేము కూడా ఇటువైపు చప్పుడు చేయకుండా ఉన్నాము.. ఇంతలో పెద్ద గాలి.. ఆ తరువాత మెల్లిగా చినుకులు మొదలై జోరుగా వర్షం పడసాగింది. ఓవైపు గాలి, మరోవైపు వర్షంవల్ల నిండా పండ్లతో ఉన్న చెట్లనుంచి పండ్లు గాలికి టపటపా నేలపై రాలుతున్నాయి.

బోలెడన్ని పండ్లు నేలపై పడటంతో జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మెల్లిగా కంచె దాటుకుని అందరం బిలబిలమంటూ పరుగెత్తి ఒడినిండా పండ్లు నింపుకుని, చెట్టుపై నక్కి ఉన్నవాళ్లను తీసుకుని ఇంటికి పరుగులు పెట్టాం. పాపం తోటవాడు అలా చూస్తూ ఉండిపోయాడేగానీ ఏమీ చేయలేకపోయాడు. (చిన్నతనంలో తెలియలేదుగానీ, పాపం పండ్లన్నీ రాలిపోయి ఆ చెట్లను కొన్నవాళ్లకు ఎంత నష్టం వచ్చి వుంటుందో కదా పాపం అనిపిస్తూ ఉంటుంది).

వర్షానికి తడిసి ఒడినిండా పండ్లతో ఇంటికి చేరిన మమ్మల్ని చూసిన పెద్దవాళ్లు మళ్లీ తిట్ల దండకాన్ని అందుకోవటమో, కొట్టడమో చేయటం.. మళ్లీ విధిగా బుజ్జగించటం జరిగిపోయేవి.. జలుబు, తుమ్ములు, పెద్దవాళ్ల తిట్లు, దెబ్బలు... ఇవన్నీ పక్కనపెడితే... నేరేడుపండ్లను శుభ్రం చేసి రాళ్ల ఉప్పు వేసిన మంచినీటిలో వాటిని ఊరబెట్టి తింటుంటే... అన్నీ మర్చిపోయేవాళ్లం...

ఒక్కోసారి తిరుగుళ్ళు కట్టిపెట్టి అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పొలం దగ్గిరికి వెళ్లేవాళ్లం. అమ్మమ్మవాళ్లు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసేవాళ్లు.. ఆ పొలంలోనే  ఉండే బావి, బావి గట్టుపై ఉండే పనసచెట్టు, పక్కనే ఉండే మామిడిచెట్లు, టమోటో తోట, వరిపొలం.. అన్నింటినీ అప్పట్లో ఎంతగానో ఎంజాయ్ చేసేవాళ్లం... బాగా పండిన టొమోటో పండ్లను ఉప్పు, పచ్చిమిర్చి కారం వేసుకుని హాయిగా లాగించేసేవాళ్లం. పనస చెట్టెక్కి ఎవైనా పండి వుంటే వాటిని కోసుకునేవాళ్లం. మామిడి చెట్టు చాలా పెద్దగా ఉండటంతో దాన్ని ఎక్కేందుకు చేతకాక రాళ్లతో రాలగొట్టి తినేవాళ్లం.

మామిడికాయలను ఆవురావురు మంటూ తినేసేవాళ్లమేకానీ... దానికి ఉండే జీడిని పట్టించుకోకుండా తినటంవల్ల పెదాలపై పుళ్లు పడేవి. ఒక్కోసారి మీసాలు పెట్టుకున్నట్లుగా జీడి అయ్యేది. అందరూ వాటిని చూసి ఏడిపించేవాళ్లు కూడా...

ఆ... అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను.. మా అమ్మమ్మ అవిసె పువ్వుల వేపుడు ఎంత బాగా చేస్తారో తెలుసా... ఊరికి వెళ్లగానే ముందుగా అడిగి మరీ అవిసె పువ్వుల వేపుడు అడిగి మరీ చేయించుకుని తినేవాళ్లం. అలాగే లేత అవిసె కాయల వేపుడు కూడా.

గుమ్మడి పండుతో హల్వా చేయటం అందరికీ తెలిసిందే. మా అమ్మమ్మ మాత్రం గుమ్మడిపండు ముక్కలకు వేరుశెనగ గింజల పొడి కలిపి తాలింపు చేసేది. కారంగా, కమ్మగా, తియ్యగా ఎంత బాగుండేదో.. అలాగే మా అమ్మమ్మ స్పెషల్ వంటకం చక్కెరతో చేసే అత్తిరసాలు. వాటికి ముద్దపప్పు, నెయ్యి కలిపి తింటుంటే వాటి రుచే వేరు. మా అమ్మమ్మ దగ్గర బోలెడన్ని చేయించుకుని మరీ వెంట మావూరికి తీసుకెళ్లేవాళ్లం.

ఇకపోతే... చింతపిక్కల గురించి మీకు తప్పకుండా చెప్పాలి. చింతపండును విడదీయగా వచ్చే గింజలను సేకరించి వాటిని పెనంపై కొద్ది కొద్దిగా పోసి బాగా వేయించి వాటిని ఉప్పు కలిపిన నీటిలో రెండు లేదా మూడు రోజులపాటు బాగా నానబెట్టి, ఆ తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి గింజలను తినేవాళ్లం. అబ్బా చెబుతుంటేనే నోరూరిపోతోంది. నిజంగా చాలా రుచిగా ఉంటాయి. వేయించి, నానబెట్టడం, ఉప్పు కలిపిన నీటిలో నానటంవల్ల అవి కాస్త ఉప్పగా, కమ్మగా ఉంటాయి. ఇది మీకెవరికీ తెలిసి ఉండదు. కానీ, నా బాల్యానికి సంబంధించిన ఓ అపురూప జ్ఞాపకం ఇది.

మధ్యాహ్నం వేళల్లో ఆడుకునే ఓపిక లేనప్పుడు ఇంటి ముందర కానుగ చెట్టు కింద నులక మంచం... అమ్మమ్మ, తాతయ్యలతో కబుర్లు చెబుతూ నిద్దరోవడం. రాత్రిళ్లు కూడా చెట్టుకిందే పడుకుని అమ్మమ్మవాళ్లు చెప్పే కథలు ఊకొడుతూ హాయిగా నిద్రపోయేవాళ్లం.

అమ్మమ్మ వాళ్ల ఊర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. పాతకాలం నాటి కోట.. కృష్ణ దేవరాయల కాలం నాటిదనుకుంటా. (వివరాలు అవీ నాకు సరిగా తెలియవు) మహమ్మదీయులు హిందూ కోటలు, ఆలయాలపై విరుచుకుపడి చేసిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లుగా ఆ కోటలో విగ్రహాలన్నీ తలలు తెగిపడి కనిపిస్తుంటాయి.

ఒక్కోసారి మా బృందం ఆ కోటలోకి ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం. కోట చుట్టూ ప్రహరీగోడలన్నీ పడిపోయి శిథిలావస్థలో ఉండేది. కానీ కోట ముందర ఎంతో అందంగా రాళ్లతో పేర్చిన ప్రవేశ ద్వారం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఠీవిగా నిలబడి ఉంటుంది. అందులోంచి లోపలికి వెళ్తే మరీ పెద్దది కాదుగానీ ఓ మోస్తరు విశాలమైన ప్రాంతం.. అందులో చిన్న కోట.. ఆ కోట లోపల ఆలయంలాంటి ప్రదేశం.. ఆ ఆలయ గర్భగుడిలో విఠలేశ్వరుడు ఉండేవాడట. అందుకే మా అమ్మమ్మ వాళ్ల ఊరికి విఠలం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

తురక రాజులు హిందూ ఆలయాలపై, కోటలపై దాడులు చేసినప్పుడు ఈ కోటను, కోటలోని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. ఆలయం గర్భగుడిని పగుల గొట్టడమేగాక, ఆలయం వెలుపల, కోటచుట్టూ ఉండే రకరకాల రాతి విగ్రహాల తలలు తెగనరికి వేయటంతో అవి ఇప్పటికీ మొండాలు, తలలు వేరు వేరుగా కనిపిస్తుంటాయి. ఆ కోటలో కొంత భాగం బాగానే ఉండేది. ఆ ప్రాంతంలోనే మేము రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం.

ఆ కోటపై తురక రాజులు దాడి చేసినప్పుడు ఆలయంలోని విఠలేశ్వర స్వామి భయంతో అలా అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడనీ.. అలా వెళ్తూ వెళ్తూ ఓచోట వాయిల్ చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశంలో దాక్కున్నాడని తమ పెద్దవాళ్లు చెప్పారని మా అమ్మమ్మవాళ్లు మాకు కథలు కథలుగా చెప్పేవాళ్లు. అందుకే ఆ దేవుడు దాక్కున్న ప్రాంతం తరువాత తరువాత వాయిల్‌పాడుగా కాలక్రమంలో వాయల్పాడు.. ఇప్పుడు వాల్మీకిపురంగా అవతరించింది.

అలాగే ఆ కోట గురించి పెద్దవాళ్లు చెప్పే విషయాలను నోళ్లు వెళ్లబెట్టి వినేవాళ్లం. ఇంకోసారి అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేంతగా వాళ్లు మాకు ఆ కోట గురించి కథలు చెప్పేవాళ్లు. తురక రాజులు దాడులు చేసినప్పుడు ఆ కోటలోని రాజు, అతని భార్యలు, సంతానం, ఇంకా ముఖ్యమైన రాజ సంబంధీకులంతా తురక రాజులకు దొరకకూడదని సామూహికంగా వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, బంగారంతో సహా కోటలోనే ఉన్న కోనేరులో దూకి సమాధి అయ్యారనీ... ఆ ఆస్తి పరులపాలు కాకుండా ఉండేందుకు మంత్రబలంతో ఓ పామును కాపలాగా ఉంచారనీ చెబుతుంటారు. కాబట్టి.. ఆ డబ్బు, బంగారం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రక్తం కక్కుకు చచ్చిపోతారని కాబట్టి మీరు ఆ వైపు వెళ్లవద్దని మమ్మల్ని చాలా భయపెట్టేవాళ్లు.

మేం చిన్నపిల్లలప్పటికే ఆ కోట అవసాన దశలో ఉండేది. అప్పటికే కోటలోని కోనేరు పూర్తిగా పూడిపోయి ఆ స్థానంలో మట్టి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కోటలోని గుప్త నిధుల కోసం ఎవరెవరో తవ్వకాల కోసం రావటం, మా పెద్దవాళ్లు చెప్పినట్లు రక్తం కక్కుకు చచ్చిపోవటం జరిగేది. అలా చనిపోయిన ఒకతన్ని నేను చూసినట్లు నాకు లీలగా గుర్తు. (కానీ అది నిజమో, అబద్ధమో ఇప్పటికీ అంతుబట్టలేదనుకోండి) ఇప్పటికీ కోట అలాగే ఉంది.. మేం పిల్లలప్పటికంటే ఇప్పుడు ఇంకా జీర్ణ దశలో ఉంది. అయితే కోట ప్రవేశ ద్వారం మాత్రం అంతే ఠీవిగా నిలబడి.. తనపై చిన్న చిన్న చెట్లకు జీవం పోస్తోంది.

ఇదండీ.. మా అమ్మమ్మ వూరితో నాకున్న అనుబంధం.. అనుభవాలు.. అమ్మమ్మతో పెనవేసుకున్న ఈ జ్ఞాపకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు.. వరద వెల్లువలా అలా మనసునిండా జ్ఞాపకాల ఊసులన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి. ఇన్ని జ్ఞాపకాలను మిగిల్చిన ఆ ఊరుతోపాటు.. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఒక జ్ఞాపకం మాత్రమే.

ఆమె ఆ వూరికి, మాకూ లేకుండా ఏప్రిల్ 18, 2007న పైలోకాలకు తరలిపోయింది. తను లేని ఆ ఊరికి వెళ్లాలంటే మనస్సు మూగదైపోతుంటుంది. అయినా.. ఆమె తిరిగిన ఆ ఇంటిని, ఆమె స్పర్శతో పులకించిపోయిన ప్రతిదాన్నీ కళ్లతో స్పర్శించి.. ఆమె శాశ్వతంగా నిద్రించిన స్థలంలో జ్ఞాపకాల ఊసులతో సేదతీరి భారమైన మనస్సుతో తిరిగిరావటం మామూలైపోయింది.

Tuesday, 3 May 2011

ఆంధ్రభూమిలో నా బ్లాగు గురించి....

ఆంధ్రభూమి పత్రిక, విశాఖపట్నం సిటీ ఎడిషన్ సెంటర్ స్ప్రెడ్‌లో మెరుపు అనే పేజీలో నా బ్లాగు గురించిన పరిచయం గత వారం పబ్లిష్ అయ్యింది. ఇన్నాళ్లుగా ఎంతగా ప్రయత్నించినా ఆ కాపీని సంపాదించటం కుదరలేదు. ఒక సోదరుడి సహాయంవల్ల అది ఈరోజుకి సాధ్యమైంది. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇలా ముందుకొస్తున్నా.....


"కొంతమంది మిత్రులు ఈ స్కాన్ చేసిన పేజీ సరిగా కనబడటం లేదని, చదివేందుకు వీలు కావటం లేదని అన్నారు. అందుకే వారి కోసం ఇది.. జగతి గారు పత్రికకు పంపిన తరువాత నాక్కూడా మెయిల్లో పంపించారు. అలా పంపినదాన్ని యధాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను."


హలో బ్లాగున్నారా?

చల్లని మనసు, మెత్తని మాటా, మృదుమధురమైన భావనలు, అన్నిటికీ మించి ప్రేమ పూరితమైన కవన పుష్పాలు....వెరసి శోభారాజు అనబడే ఈ అమ్మాయి మనసు...అసలు మనసుకి అర్ధం ఇప్పుడేంటో తెలుసా ...బ్లాగ్ ...మనో భావాలను అక్షరాల దారాలతో అందంగా అల్లిన మాలలు ఈ బ్లాగులు. 

ఈ రోజు అలాంటి మృదువైన ఓ మనసు గురించి తెలుసుకుందామా. ఆమె బ్లాగ్ పేరు కుడా ఆమె అంత సున్నితమైనదే సుమండీ 'కారుణ్య'. బ్లాగ్ లోకి ప్రవేశిస్తూనే ఆమె నిరాడంబరత ప్రేమాస్పదమైన ఆమె మాటల్లో తన గురించి ఇలా  అంటుంది...''నన్ను నేను వెదుక్కుంటూ" ఎంత గొప్ప మాట. ఇంత చిన్నవయసులో ఎంత పరిణితి.

నాన్న గురించి తను రాసినది చూస్తే హృదయం చెమర్చక మానదు ఎవరికైనా. ఏ మాత్రం అతిశయం లేకుండా స్వచ్చంగా రాసిన కవితలు ఆమె హృదయానికి దర్పణాలు. స్పందించే హృది ఉంటే కాదేది కవితకనర్హం అన్నట్లు చిరు స్పందనలను కూడా కవిత్వకరీకరించే అందమైన అక్షరాల హరివిల్లు శోభారాజు 'కారుణ్య'.

ఈమె రాతలు కేవలం చదవాల్సినవే కాక చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయనిపిస్తుంది నాకు. కోల్పోతున్న మనవ సంబంధాలు తల్లి తండ్రుల పట్ల  ప్రేమానురాగాలు, అమ్మ మనసు ఇలా ఎన్నో భావాలు ఆర్ద్రతతో మనల్ని కదిలించక మానవు.

అందరితోనూ కలగలిసి పోయే మనస్తత్వం, అందరి ఆనందాన్ని విజయాన్ని తనదిగా ఆనందించే సహృదయతా కలిగిన శోభ నిజంగా అందరికీ ఎంతో ప్రియమైన వ్యక్తీ  కూడా. ఎక్కడా ఎప్పుడూ ఒక్కక పరుష వాక్యం పలుకదు, కానీ స్థిరచిత్తురాలు సుమా. ఈమె ప్రస్తుత నివాసం చెన్నైలో. కొన్నేళ్ళు భర్త ఉద్యోగ రీత్యా విశాఖ గాజువాకలో కూడా ఉన్నారు. 

జీవితం పట్ల ప్రేమ , జీవన మర్యాద కలిగి ఉన్న ఈ కారుణ్య మూర్తి బ్లాగ్ మీరు ఒకసారి పలకరించారా, ఆ తర్వాత మీరే పదే పదే పలకరిస్తారామెని 'హలో బ్లాగున్నారా?' అంటూ...  చూసారా ఎంత మంచిదాన్నో మరి నేను మీకు ఆమె బ్లాగ్ చిరునామా చెప్తాను ఉండండి మరీ....  http://kaarunya.blogspot.in/

..................జగతి 


Saturday, 16 April 2011

అమ్మ మనసు


లేచీ లేవంగానే "మా" అనే కేక..
కళ్లు తెరవగానే
అటు దేవుడినీ, ఇటు నన్నూ
మార్చి మార్చి చూసే చూపులు..
ఇక రెండు వారాలకోసారేనని........

దినపత్రిక కోసం అబ్బా కొడుకులిద్దరూ

తగవులాడుకుంటుంటే
ముసి ముసిగా నవ్వుతూ...
పిల్లాడితో పోటీ ఏంటని
పేపర్ లాక్కుని అబ్బాయికిచ్చేసే
రోజువారీ సంఘటన కోసం
ఇకపై రెండు వారాలు ఆగాలని......

అమ్మా... నాకివాళ ఈ టిఫిన్ చేసి పెట్టు

అలాగే లంచ్‌‍‌లోకి అంటూ...
లెక్కలేనని ఐటమ్స్ పేర్లు చెబుతుంటే,
కళ్లు తేలేస్తుండే నా అవస్థను చూసి,
చిలిపిగా నవ్వుతూ అల్లరి చేసే సన్నివేశాలు
ఇక రెండు వారాల విరామం తర్వాతేనని...

రోజూ కాలేజీకెళ్తూ..

వీధిమలుపు తిరిగేదాకా
ఆగకుండా టాటా చెప్పే చేతులు
మేడమెట్లు ఎక్కి, దిగేటప్పుడు
ఆసరాగా నిలిచే అవే చేతులు
పనిలో లీనమై ఉన్నప్పుడు
మెడచుట్టూ అల్లుకుపోయే
ఆ చేతుల స్పర్శ..
ఇక రెండు వారాలకోసారేనని

రాత్రి భోజనాల వేళప్పుడు

ఓవైపు టీవీ చూస్తూ...
మరోవైపు పుస్తకం చదువుతూ
ప్లేటులో ఏముందో చూడకుండా
గెలుకుతూ తింటుంటే..
ఇలాగయితే ఒంటికి ఎలా పడ్తుంది నాన్నా
అంటూ సుతిమెత్తగా మందలిస్తూ..
గోరుముద్దల్ని తినిపిస్తూ.. తృప్తి పొందేది
ఇక రెండు వారాలకోసారేనని...

నిదురమ్మ ఒడిలోకి జారుకునేందుకు

ముందుగా నా ఒడిలో నువు దూరిపోతే
చేతివేళ్లతో నీ తలను నిమురుతుంటే
కళ్లు ఇంతింతచేసి కబుర్లు చెబుతూ
హాయిగా నిద్దరోయే నీ నుదుటిపై
వెచ్చని ముద్దుపెట్టి మురిసిపోయేందుకు
రెండు వారాలు ఆగాలని....

రెండు వారాలు ఆగాలని బాధపడాలో

రెండు వారాలకైనా వస్తావని సంతోషించాలో
అర్థంకాని అయోమయం ఓవైపూ...
బ్రతుకుపోరులో ఉద్యోగం అనే ఆసరాతో
ప్రయోజకుడివై తిరిగొస్తావన్న ఆనందం మరోవైపూ...
ఇప్పుడు దూరమైనా, ఎప్పటికీ దగ్గరుంటావన్న
ఆశ అనే శ్వాసతో ఎదురుచూస్తూ ఓ అమ్మ.....!!!

(చదువులు పూర్తి చేసుకున్న పిల్లలు ఉద్యోగాల వేటలో కన్న తల్లిదండ్రులను, ఉన్న ఊరిని వదిలి మహానగరాలకు వెళ్లటం సర్వ సాధారణ విషయమే. అయితే అప్పటిదాకా తన కొంగు పట్టుకుని తిరుగాడిన పిల్లలు ఇలా ఒక్కసారిగా దూరమవటాన్ని జీర్ణించుకోవటం తల్లులకు కాస్త కష్టమైనపనే. అలా ఓ అమ్మ మనసులోకి తొంగిచూసే చిన్న ప్రయత్నమే ఇది...)

Tuesday, 12 April 2011

"సాహితీ" కుటుంబం...!!


ఏంట్రా తల్లీ ఎన్నాళ్ళైంది చూసి
ఏమైపోయావు.. ఎక్కడున్నావు?
సోదరీ.. బాగున్నావా...
ఈ మధ్య అస్సలు కనిపించటం లేదేం?

అమ్మాయ్.. ఒంట్లో బాగలేదా
బొత్తిగా నల్లపూస అయిపోయావే?
సోదరా... ఏమైంది నీకు
రోజుకి ఒక్కసారైనా
పిలిస్తే చాలు పలికేవాడివి
ఇప్పుడెక్కడ?

అయ్యో చెల్లికి ఏమైంది
అక్క ఎలా ఉందో ఏంటో
మా అమ్మాయి జాడే లేదు
ఇక అన్నయ్య మాటో..
స్నేహితుల ఎదురుచూపులు
మాటల్లో చెప్పలేనివి....

అక్కా... అన్నా, తమ్ముడా,
అమ్మాయ్, తల్లీ, చెల్లీ.......
ఈ పిలుపులన్నీ..
రక్త సంబంధం పంచి ఇచ్చినవా?
కానే కావు... మరి... ??
"సాహితీ" తల్లి ఇచ్చిన అను'బంధాలు'

ఈ 'తల్లి' పంచిన ప్రేమతో తరించిన
పిల్లలంతా తమ ఆత్మీయతనంతా
పిలుపుల్లో రంగరించి...
ప్రతి ఒక్కరూ సైనికులై
కలాల నాగళ్లతో
ప్రతిరోజూ, ప్రతిక్షణం..
"సాహితీ" సేద్యం చేస్తున్నవాళ్లే....!!

మామూలు "కుటుంబం"లోకిమల్లే
ఈ 'సాహితీ' కుటుంబంలోనూ
వాదులాడుకుంటారు....
కానీ ఆస్తుల కోసం కాదు
అలుగుతారు..
కావాల్సింది పొందేందుకు కాదు
బుజ్జగిస్తారు...
అభిప్రాయాలను బలవంతంగా రుద్దేందుకు కాదు....

వాదులాడుతారు... చర్చిస్తారు...
ఓ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేందుకు
మేటి పరిష్కారాలను వెదికేందుకు
కలాలకు మరింతగా "పదును" పెట్టేందుకు

అలుగుతారు...
చాన్నాళ్లుగా పలుకరించనందుకు కాదు
పిలుపు కోసమూ కాదు... "రచన" కోసం...
కలాలకు 'సోమరితనం' సోకకూడదని..
సాహితీవనం బీడుబారి పోకూడదని
'రచన'లనే 'మొలక'లతో పచ్చగా కళకళలాడాలని

బుజ్జగిస్తారు...
దారి తప్పిన 'రచన'లతో
గాయపరిచే 'మాట'లతో
'వ్యాఖ్య'లనే యుద్ధంతో
'సాహితీ' అమ్మ విధించిన
హద్దులను చెరిపేయటం
సరికాదంటూ...
ఒకరినొకరు బుజ్జగించుకుంటారు

ఇలా... "సాహితీ" తల్లి లాలనలో
'రేపటి' తరానికి 'ప్రతీక'లుగా
'విజ్ఞాన'మనే జ్యోతిని వెలిగిస్తూ
"ముఖచిత్ర కూడలి" సాక్షిగా
"జైహో సాహితీ మాతాకీ" అంటూ
ఒకళ్ళు ఇద్దరై... ఇద్దరు ముగ్గురై
వందలు వేలై..... అలా.... అలా.....
మున్ముందుకే.......!!!

(ఫేస్‌బుక్‌లో నిర్వహిస్తున్న "తెలుగు సాహితీ వలయం" గుంపు కోసం ప్రేమతో రాసిన
ఈ కవితను బ్లాగర్ల కోసం శ్రీరామనవమి శుభాకాంక్షలతో....)

Friday, 25 March 2011

'పండు'టాకుల పాట..!!



ఇన్నాళ్లూ చలితో బిగదీసుకుపోయిన కోకిలమ్మ
గొంతు సవరించుకుని వేసవికి సన్నద్ధమవుతోంటే...

నేనేమీ తక్కువ తినలేదంటూ
కోకిలమ్మకు ఆశ్రయం ఇచ్చే చెట్లు కూడా
ఆకులన్నింటినీ రాల్చేసుకుని,
పచ్చని పెళ్లికూతురిలా, చిగుర్లు తొడిగి
వేసవికి చల్లటి స్వాగతం చెప్పేందుకు
బిరబిరా సృష్టికార్యాన్ని నెరవేరుస్తున్నాయి...

అంతకుముందుగా..
కోకిలమ్మ ఓ చెట్టుపై వాలి రాగాలు తీస్తోంటే...
గలగలమంటూ 'పండు'టాకులు చప్పుడు చేశాయి
ఓహో ఇదేంటి.. నా పాట కంటే,
వీటి చప్పుడే కమ్మగా ఉందే అనుకుంటూ
ఓ చెవి అటు పారేసింది కోకిలమ్మ

పండుటాకులున్న కొమ్మకు పక్కగా మరో కొమ్మ
ఆ కొమ్మకొక చిన్న రెమ్మ
ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు
చల్లగాలి జోలపాటతో నిద్దరోయిన దాన్ని
సూర్య కిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి...
ఒళ్లు విరుచుకుని కిలకిలమంటున్న చిగురుటాకును
సన్నగా, బాధగా 'పండు'టాకుల పాట తాకింది
పాటను విన్న చిగురుటాకు ఫక్కున నవ్వింది

దాంతో 'పండు'టాకులన్నీ ఇంకా గట్టిగా పాడసాగాయి
చిగురుటాకు కూడా మళ్లీ మళ్లీ నవ్వసాగింది
ఇంతలో ఓపిక నశించిన ఓ పండుటాకు...
"ఎందుకే ఆ మిడిసిపాటు" అంటూ
చిగురుటాకును నిలదీసింది..
మిడిసిపాటు ఎందుకుండదు..
నేనేమీ మీలా పసుపుపచ్చను కాదు...
నున్నగా నవనవలాడే పచ్చనాకును
ఇకపై పువ్వులు పూస్తాను..
పండ్లు కాస్తాను... అంటూ
ఆపకుండా చెప్పుకుపోతోంది పచ్చనాకు..

అలా చెబుతూ, చెబుతూ
ఇక ముందుకెళ్లటం సాధ్యంకాక...
ఓ చోట చటుక్కున ఆగిపోయింది...
వెంటనే పండుటాకులు అందుకున్నాయి
"ఏం ఆపేశావేం? కానీ...?" రెట్టించాయి
"మరీ.. మరీ..." గొణుక్కుంటోంది పచ్చనాకు...

తానూ ఏదో ఓరోజున 'పండు'టాకు
అవక తప్పదని అర్థమైంది 'పచ్చ'నాకుకు...
దాంతో మనసు భారంకాగా... తలవాల్చేసి,
పండుటాకులకేసి దీనంగా చూసింది
ఇందాకటిలా కాకుండా...
'పండు'టాకుల పాటలోని ఆర్తి
మనసుని పిండేయగా...
పండుటాకులను సగర్వంగా సాగనంపుతూ
సన్నగా పాటనందుకుంది...
ఇదంతా కళ్లారా చూసిన కోకిలమ్మ
పచ్చనాకుతో కలిసి కోరస్ ఇచ్చింది....!!!

Tuesday, 15 March 2011

తమ్ముడా.. మోహన కుమారా..!!



పైలోకాలకు తరలిన తమ్ముడా
నువ్వెళ్లిపోయి నా తమ్ముడిని
కాదు కాదు నీ మిత్రుడిని
నీ సంతోషాలనే కాకుండా
నీ దుఃఖాన్నీ పంచుకున్న
మావాడికి ప్రాణబిక్ష పెట్టి
నువ్వెళ్లిపోయి…
నీ స్నేహానికీ, మాకూ…
ప్రాణం పోశావా..?


నా బిడ్డతో పాటు ఆ బిడ్డను కూడా
చల్లంగ చూడలేదు ఎందుకమ్మా అంటూ
గంగమ్మ తల్లితో మొరపెట్టుకుంటున్న
అమ్మతో.. కుమార్ అంతమంచోడా
అని అడిగితే…


వాడు కూడా నీ తమ్ముల్లాంటోడే తల్లీ
ఎంత మంచి రూపు, ఎంత మంచి మాట
నీ తమ్ముడూ.. ఆ కుమారూ…
ఒకే కంచంలో తినేవాళ్లు
ఒకే మంచంలో పడుకునేవాళ్లు
అంత మంచి నేస్తాలను
అంత మంచి బిడ్డను
తాను ఎక్కడా చూడలేదని
అమ్మ రోదిస్తూ చెబుతుంటే…


ఎప్పుడో చూసిన నీ రూపాన్ని
ఒకచోట పేర్చి చూసేందుకు
ఎంత ప్రయత్నించినా కుదరలేదు
అదెలా కుదురుతుంది చెప్పు…
నా ఎదురుగా తమ్ముడి రూపంలో
సజీవంగా నువ్వు కనిపిస్తుంటే…


(మార్చి 22, 2009న జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయిన మా పెద్ద తమ్ముడి ప్రాణ స్నేహితుడు కుమార్‌కు అశ్రునివాళులతో… వద్దంటే వినకుండా ముందు కూర్చుని బండి నడుపుతున్న కుమార్.. తన తప్పేమీ లేకుండానే జీపు వాడు గుద్దేయటంతో, వెనుక కూర్చున్న నా తమ్ముడికి ప్రాణబిక్ష పెట్టి తానేమో కానరాని దూరాలకు వెళ్లిపోయాడు.)