Pages

Thursday, 25 November 2010

ఏం చేస్తారో.. మీ ఇష్టం మరి...!!

స్వచ్ఛంగా ఉంటాను
ఎవరెలా రాసినా...
రంగులు పులుముకుంటాను...!

నాకు పేదా, ధనికా
రాజు, రెడ్డి తేడా లేదు
చిన్నా, పెద్దా బేధం లేదు
బాషా బేధాలు అసలే లేవు

అ, ఆలు రాస్తూ అక్షరాలు దిద్దినా
ఆశల సౌధాల ప్రేమలేఖలు రాసినా
ఆస్థి విలువల స్టాంపులు రాసినా...!

ఆంతర్య సౌందర్యాలను
అందంగా జతకూర్చి
ఆశల మాలికలతో
సజీవ కవితల్ని ఆవిష్కరించినా..!

కన్నవారిని కష్టపెట్టలేక
మెట్టినింట బ్రతుకులేక
మరణశయ్యకు మరలిపోతూ
అత్తవారింటి అర్థాలను,
పరమార్థాలను లోకానికి అక్షరీకరించినా...!

ఎవరెలా రాసినా...
నిజాన్ని నిర్భయంగా చాటేస్తాను...!

చించి పడేస్తారో.. ఉండచుట్టి పారేస్తారో
మీ ఇష్టం మరి...!

Friday, 19 November 2010

నాకు చనిపోవాలని లేదు...!

ఆసియా సంపన్న మహిళ "అత్యాశ"
అరె... ఆసియాలోనే సంపన్నమైన మహిళకు అత్యాశా? ఏంటబ్బా అనుకుంటున్నారా..? అవునండీ ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం. పేదవారైనా, ఆస్థిపరులైనా ఎవరైనప్పటికీ ఏదో ఒకరోజున అక్కడికి పోవాల్సిందేగా మరి..! అక్కడికా...? మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటండి బాబూ..? ఇదేగా మీ ప్రశ్న.

"అక్కడికి" అంటే శ్మశానానికి అని అర్థం. గుడిసెలో నివసించే పేదవాడైనా, మేడలో ఉండే షావుకారయినా, ఎవరికయినా కావాల్సింది చనిపోయినప్పుడు పాతిపెట్టేందుకు కాస్తంత స్థలం (ఇప్పుడయితే క్షణాల్లో మనిషిని బూడిద చేసే టెక్నాలజీ ఉండనే ఉందనుకోండి అది వేరే విషయం) మాత్రమే.

మరి... మన ఈ ఆసియా సంపన్న మహిళకు మాత్రం అక్కడికి వెళ్లడం ఇష్టం లేదండీ.. అవును ఆమెను పాతిపెట్టేందుకు కాస్తంత స్థలం అవసరంకూడా లేదంటూ ఢంకా భజాయించి మరీ చెప్పేది. ఎందుకంటే.. ఆమెకు కలకాలం సజీవంగా బ్రతికి ఉండాలన్న ఆశ ఎక్కువగా ఉండేది కాబట్టి..! విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా "మరణం లేని జీవితం" కోసం మూడ నమ్మకాల బారిన పడటం అత్యాశే అవుతుంది.

కానీ... మన ఆసియా సంపన్న మహిళగా ప్రసిద్ధి చెందిన 69 సంవత్సరాల నినా వాంగ్‌కు మాత్రం అది అత్యాశగా అనిపించలేదు. అందుకే... కలకాలం బ్రతికుండాలనుకున్న ఈమె ఓ చైనా మోసగాడి బారిన పడి ఏకంగా ఆస్థినంతా పోగొట్టుకుంది.

కలకాలం బ్రతికుండటం మాత్రం దేవుడెరుగుగానీ... అతడి గారడీ మాటలకు మోసపోయిన వాంగ్ మాత్రం గత సంవత్సరం క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. అత్యంత సంపన్నురాలైనప్పటికీ... ఆమె భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడి, పాపం ప్రాణాలు పోగొట్టుకుంది.

కథ అంతటితో ఆగితే ఫర్వాలేదు కానీ... అందరిలాగే శ్మశానానికి తరలిపోయిన వాంగ్... పోతూ పోతూ ఓ ఘనకార్యం కూడా చేసి వెళ్లింది. అదేటంటే... తనకు మరణం లేకుండా చేస్తానని నమ్మబలికిన చైనా ఫెంగ్ షూ గురువు టోనీ చెన్‌కు తన యావదాస్థి చెందేలా విల్లురాసిపెట్టి మరీ చనిపోయింది.

వాంగ్‌కు టోనీ చెన్ మాయమాటలు చెప్పి ఆస్థినంతా తన పేరుమీద రాయించుకున్నాడని ప్రపంచానికి వెల్లడిస్తూ... "నినా వాంగ్ సేవా సంస్థ"కు చెందిన లాయర్ జెఫ్రీ విల్లును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సైన్స్, టెక్నాలజీల్లాంటి అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజంలో కూడా మూడ నమ్మకాలనేవి మాత్రం బలీయంగా పాతుకుపోయాయి. ప్రతి మనిషికీ ఏదో ఒక ఆశ ఉంటుంది. ఒక ఆశ తీరగానే ఇంకోదానిపై ఆశ మరలుతుంది. తరువాత్తరువాత ఆ ఆశలకు అంతం అనేది లేకుండా పోతుంది. పూటకు తిండి లేనివాడు ఈ పూట తిండి దొరికితే చాలు అనుకుని ఊరుకోడు కదా, ఇంకోపూటకెలాగబ్బా అని మళ్ళీ ఆలోచిస్తాడు.

ఇక్కడ ఈ కథనంలోని మహిళ కూడా ఆసియాలోనే అత్యంత సంపన్నురాలు. దేనికీ లోటులేని జీవితం. ఇంకా ఎక్కువ సంపాదించాలన్న ఆశ లేని ఆమెకు, ఎక్కువకాలం బ్రతికుండాలన్న ఆశ మాత్రం కలిగింది. పూటకు తిండిలేనివాడు మరోపూట తిండికోసం ఆలోచించినట్లుగానే... ఈమెకు కూడా ఎప్పుడూ ప్రాణాలతో జీవించి ఉండాలని ఆశ కలగటంలో తప్పేముంది.

ఆశ కలగటంలో తప్పులేదు గానీ, వాస్తవానికి విరుద్ధంగా ఉండే ఆలోచన రావటమే తప్పు. మానవుడి ఆవిర్భావం నుంచి నేటిదాకా మరణాన్ని ఆపటం ఎవరి తరమూ కాలేదు. పుట్టిన ప్రతివారూ మరణించక తప్పదన్న నిజాన్ని గుర్తించని వాంగ్ మూర్ఖత్వంతో, మూడనమ్మకాలను నమ్మింది, ఆస్థిని అప్పజెప్పింది. అయినవారిని అనాథల్ని చేసేసింది.

Thursday, 18 November 2010

నువ్వెప్పుడూ చెబుతుంటావు....!!

 నువ్వెప్పుడూ చెబుతుంటావు
ఒంటిమీద దెబ్బపడితే
కాసేపట్లో మాయమవుతుందని

అదే...
మనసుకు గాయమైతే
అనుక్షణం వేధిస్తుందని..!

నువ్వలా చెబుతున్నప్పుడు
నాకస్సలు అర్థం కాలేదుగానీ...
పడితేగానీ తెలియదని
పెద్దలు ఊరకే చెప్పారా...!

పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్లు కారని
నిజం నిలకడమీదే తెలుస్తుందని
మనసుకు సర్ది చెప్పుకుంటున్నా..
పిచ్చిమనసు ఊరుకోనంటూందే...!

నిన్ను నిజంగా బాధపెట్టానో
లేదో తెలియదుగానీ
నేను మాత్రం నిజంగా గాయపడ్డా..!

నువ్వన్న మాటలు...
కాదు కాదు శూలాలు
గుండెనెవరో గుచ్చుతున్నట్లుగా
మనసునెవరో మెలిపెడుతున్నట్లుగా

ఒకప్పుడు నీ మాటలు...
మరబొమ్మకు సైతం ప్రాణం పోసేవి
వెలుగును చూడమనేవి
నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చేవి

అవే మాటలు ఈరోజు...
అధఃపాతాళానికి నెట్టేస్తూ...
దిగంతాల్లోకి తొక్కేస్తూ..
చీకట్లో చిందులేస్తూ...
వాస్తవంలోకి తీసుకొస్తూ...!

చీకటి...చీకటి...చీకటి
మనసు పొరల్లో మిగిలింది
లెక్కించ వీలులేనంతగా...!

చీకటి తరువాత వెలుగే కదా..
అందుకే...
ఈ ఆరాటం, పోరాటం...!

Tuesday, 16 November 2010

తక్కువా..? అలాగని ఎక్కువా..?!

ఎప్పట్లాగే ఆఫీసుకు ప్రయాణం. మైలాపూర్ కచేరీ రోడ్‌లో మా బస్సు వెళ్తోంది. కిటికీ పక్కగా కూర్చున్న నేను (ఏ విషయంపైనో ఏంటో) తెగ సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. ఇంతలో "కపాలీశ్వరన్ కోయిల్" స్టాఫింగ్ వచ్చింది. కాసేపు ఆలోచనల నుంచి బయటపడి, పక్కనే ఉన్న షాపులోకి నా దృష్టిని మరల్చాను.

అదో దేవుడు పటాలను తయారు చేసే చిన్న షాపు. అందులో ఒకతను తదేకంగా, శ్రద్ధగా తనపని తాను చేసుకు పోతున్నాడు. దేవుడి పోస్టర్‌కు సరిపోయేలా ఉన్న గాజు పలకలను కొయ్య ఫ్రేముకు అమర్చి, కాలితో తొక్కిపట్టి ఫ్రేము కట్టేస్తున్నాడతను. నేనలా చూస్తుండగానే బస్సు కదిలిపోయింది.

బస్సుతో పాటు నా ఆలోచనలు కూడా ఇందాక చూసిన విషయంపై వేగంగా పరుగెత్తసాగాయి. ఎంత విచిత్రం... పటాలను తయారు చేసే అతను కాలికింద తొక్కిపట్టి చేసిన దేవుడి పటాలను... మనమేమో చాలా పవిత్రంగా తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి, పూజలు, వ్రతాలు, నైవేధ్యాలు చేయడం.. అంటు, సొంటూ కలవకుండా చూడడం లాంటివన్నీ చేస్తున్నాం.

తననే కాలికింద తొక్కిపట్టి ఫ్రేములో బంధిస్తోన్న ఇతగాడిని ఆ దేవుడు ఏమీ చేయడా..? ఇంతకూ అతడు చేసింది తప్పా...? ఒప్పా..? అని ఆలోచించాను. అతను చేసినదాంట్లో తప్పేమీ లేదు కదా..! అనిపించింది. అతడు బ్రతకాలంటే, అతని జీవనాధారమైన ఆ పనిని చేయక తప్పదు. అతడి వృత్తి ధర్మాన్ని అతడు నిర్వర్తించాడు అంతే...!

వెనకటికి ఇలాంటిదే ఓ కథే ఉన్నట్లు కూడా నాకా సమయంలో గుర్తొచ్చింది. అదేంటంటే... కొయ్యలతో దేవుడి విగ్రహాలను, గుమ్మాలను తయారు చేసే శిల్పి ఒకతను ఉండేవాడట. అతను ఓ రోజు ఒక చెట్టు నుండి తీసిన కొయ్యలతో ఒక దేవుడి విగ్రహాన్ని, ఒక గుమ్మాన్ని తయారు చేశాడు.

ఈ రెండింటినీ ఒక ఊర్లో కడుతున్న గుడి కోసం తీసుకెళ్లారు. దేవుడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించి, గుమ్మాన్ని ప్రధాన ద్వారానికి అమర్చారు. ఆ విగ్రహానికి ప్రతిరోజూ పూజలు జరుపుతూ ఉండేవారట. ఇలా రోజులు గడుస్తుండగా... ఓ రోజు గుమ్మం తనను తయారు చేసిన శిల్పి దగ్గరకెళ్లి భోరున విలపించిందట.

అది చూసిన శిల్పి.. ఎందుకేడుస్తున్నావని ప్రశ్నించగా... "ఒకే చెట్టునుండి చేసిన నన్ను తొక్కుకుంటూ వెళ్తుంటే, విగ్రహానికి మాత్రం పూజలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం..? నన్ను కూడా దేవుడి విగ్రహంగా చేసి ఉండవచ్చు కదా...!" అని అందట ఆ గుమ్మం.

గుమ్మం చెప్పిన మాటలను ఓపిగ్గా విన్న ఆ శిల్పి... "ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నా వృత్తి ధర్మాన్ని మాత్రమే నేను నిర్వర్తించాను. అయినా దేవుడికంటే ముందుగా నిన్ను తాకి, నిన్ను దాటుకునే కదా అందరూ వెళ్ళేది. ఈ రకంగా కూడా నీకు పుణ్యం దక్కినట్లే కదా..." అంటూ సర్దిచెప్పాడట...!

నిజమే కదా... ఈ లోకంలో వేటికుండాల్సిన విలువ వాటికుంటుంది. దీని గురించి చెప్పుకోవాలంటే... ఈ మధ్య మా అక్కకు, వాళ్లబ్బాయికి జరిగిన సంభాషణ కూడా చెప్పాల్సిందే..! ఆరోజు మా అక్కా, వాళ్ళబ్బాయి అదే పనిగా వాదించుకుంటున్నారు. అప్పుడే వెళ్లిన నేను ఏమైందని అడగ్గా...! "వాడికెప్పుడూ వాళ్ళ నాన్నంటేనే ఇష్టం, నాపైన ఏమీలేదు, అందుకే ఎప్పుడూ గొడవపడుతుంటాడు" అంటూ ఫిర్యాదు చేసింది.

దానికి మా వాడు చెప్పిన సమాధానం ఏంటంటే... "అమ్మా దేని విలువ దానికుంటుంది. ఒక పైసా నుంచి, ఐదు పైసల నుంచీ, లక్షల కోట్ల రూపాయల దాకా వేటి విలువ వాటిదే.. అలాగని పైసాకు, రూపాయికి విలువ లేకుండా పోతుందా... పైసా పైసా కలిస్తేనే కదా రూపాయి, వందలు, కోట్లు...! అలాగని ఏదీ ఎక్కువా కాదు, తక్కువా కాదు" అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చేశాడు.

కాబట్టి... నేను చూసిన పటాల తయారీ అతను, కథలో చెప్పినట్లుగా శిల్పి తయారు చేసిన గుమ్మం, దేవుడి విగ్రహం, మా అక్క కొడుకు లెక్చర్... ఇలా దేన్ని చూసినా.. వాటి సారాంశం మాత్రం ఒక్కటే... ఈ భూ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకైనా, ఏ ప్రాణికైనా వాటి విలువలు వాటికుంటాయి. ఏవీ తక్కువా కాదు, అలాగని ఎక్కువా కాదు...! కాదంటారా...?!!

Friday, 12 November 2010

కాస్త ఆలోచించరూ..? ప్లీజ్..!!

రోజూ నడిచే దారే అయినా ఏదో తేడాగా, చాలా అసౌకర్యంగా, దిగాలుగా ఉంది. నాకే అర్థం కావడం లేదు. ఎందుకలా ఉందో, ఆలోచించేందుకు నేను మరోలా ఉండాల్సి వచ్చింది. అయినా ఫర్వాలేదు, దీన్నేదో చేధించాల్సిందే అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను.

ఇంతలో కాలికి చల్లగా తగిలింది. హమ్మయ్య... గుర్తొచ్చేసింది, గుర్తొచ్చేసింది. ఇందాకటి నా అసౌకర్యానికి, దిగులుకు కారణమేంటో కనిపెట్టేశాను. దీన్ని కనిపెట్టేందుకు కుస్తీలేం పడలేదండీ... బురదలో నా కాళ్లు కూరుకుపోయేసరికి బాగా గుర్తొచ్చేసింది. వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండటం, రోడ్లన్నీ బురద శోభను సంతరించుకోవటమే ఇందాకటి దిగులు వెనుకనున్న ఓ గొప్ప కారణం.

అబ్బా... వర్షం, బురద గురించి ఈమె ఇంతగా బాధపడాలా... అనుకుంటున్నారు కదూ... నాకు తెలుసు. మీకేంటండీ ఎలాగైనా అనుకుంటారు. బాధలు పడుతుండేది మేమే కదా..! అసలే వర్షాలు పడక, నీటి కొరతతో నానా అవస్థలు పడుతుంటే... వర్షం వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా...? అంటూ తీసిపారేయకండి.

 అక్కడే ఉంది అసలు విషయమంతా... వర్షం వస్తే.. సంతోషపడనివారు ఎవరుంటారు చెప్పండి. నాకు కూడా వర్షం అంటే చాలా ఇష్టం... కానీ ఈ వర్షంలో, చాంతాడులా నిలిచిపోయిన ట్రాఫిక్‌లో ఆఫీసుకు వెళ్ళటమంటేనే కష్టం. ఈ గండాలను ఎలాగోలా దాటుకుని ఆఫీసుకు చేరుకునేటప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోయే వాహనదారులంటేనే పరమ చిరాకు.

వాళ్ల మానాన వాళ్లు వెళ్ళిపోతే.. మీకొచ్చిన కష్టమేంటి అంటారేమో... వాళ్లు అలా వెళ్తే నాకు మాత్రం చిరాకెందుకు వస్తుంది చెప్పండి. కానీ అలా జరగలేదే... ఈరోజు ఉదయం టైమయిపోయిందని, అసలే హడావిడిగా ఆఫీసుకు బయల్దేరి నడుస్తుంటే... పక్కగా ఓ వాహనం వెళ్లింది. రోడ్డునిండా నీళ్లే... కాస్తంత నెమ్మదిగా వెళ్తే వాళ్ల సొమ్మేం పోతుంది. ఒక్కసారిగా వేగంగా రావడం, నీళ్లన్నీ నాపైన పడటం జరిగిపోయింది.

అలాంటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. నా అదృష్టం కొద్దీ ఆ నీళ్లలో బురద అంతగా లేకపోవడం వల్ల కాసేపటికి ఎలాగోలా డ్రస్సు ఆరిపోయింది. అదే బురదనీళ్లయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అనుభవం నా ఒక్కదానికి మాత్రమే కాదు, మీలో చాలామందికి కలిగే ఉంటుందని అనుకుంటున్నాను.

వర్షాలప్పుడు నీళ్లలో వాహనాలను నడపటం వల్ల వచ్చే చిక్కులు కొన్నయితే... బస్సులో వెళ్తూ, వెళ్తూ రోడ్డుకు అటూ ఇటూ వెళ్లేవారిని పట్టించుకోకుండా, బస్సుల్లోంచి ఉమ్మటం లాంటివి మరికొన్ని.

ఈ మధ్యే నేనో పేపర్లో చదివానండి. పాపం ఓ కొత్త దంపతులు, కొత్త బట్టలు కట్టుకుని పవిత్రంగా గుడికెళ్లి అర్చన చేయించుకుని బైక్‌లో వస్తోంటే... బస్సులోంచి పాన్ పరాగ్ వేసుకున్న వ్యక్తి ఎవరో తుపుక్కున ఉమ్మేశాడట. పాపం నోట్లో ఎంత సేపటి నుండి ఉమ్మి ఉంచుకున్నాడో ఆ మహానుభావుడు... గాలిలో తేలుతూ ఉమ్మి పక్కనే ఉన్న ఆ కొత్త దంపతులను పావనం చేసేసిందట.

మీ జీవితంలో మరిచిపోలేని అనుభవాలను మాతో పంచుకోండి అనే శీర్షికలో ఆ కొత్త దంపతులు రాసిన పై విషయాన్ని చదవగానే నాకు చాలా బాధేసింది. పవిత్రంగా గుడికెళ్లి వస్తోన్న మాకు కాసేపట్లోనే ఆ పవిత్రత దూరమై, ఆ స్థానంలో ఉమ్మినవాడిపై అసహ్యం పుట్టుకొచ్చిందని రాశారు వారు.

వర్షాలప్పుడు వాహనాలు ఎగజిమ్మిన నీటితో పావనమైనవారు కొందరైతే, పైన చెప్పుకున్నట్లుగా బస్సుల్లోంచి ఉమ్మి పడి పావనమైనవారు మరికొందరు... ఇలా ఎందరో ఉన్నారు... కాబట్టి...

ప్రియమైన వాహనదారుల్లారా...! పాన్‌పరాగ్ లాంటివి ఉమ్మివేసే ప్రబుద్ధుల్లారా...! కాసేపు ఆలోచించండి. వేగంగా వెళ్తున్న మీరు కాసేపు మెల్లగా బండిని నడపటం వల్ల మీకొచ్చిన నష్టమేమీ లేదు. అలాగే పాన్‌పరాగ్ మహానుభావుల్లారా... కాస్త అటూ, ఇటూగా చూసి, ఎవరూ లేనప్పుడు ఉమ్మడం వల్ల మీకు కూడా నష్టం లేదు. మీరు ఇలా చేయడం వల్ల మాలాంటి వారికి వచ్చే నష్టాలు ఏమీ ఉండవు. అప్పుడందరం హ్యాపీగా ఉండొచ్చు. "అందరం హ్యాపీగా ఉన్నప్పుడే... ఆల్ హ్యాపీస్..." ఏమంటారు...?

Wednesday, 10 November 2010

సంతోషమంటే... స్వర్గం - మరి దుఃఖమంటే...?!

ఎందుకోగానీ.. ఈరోజు లేచింది మొదలు "మహా గణపతిం మనసా స్మరామీ" అనే పాట మరీ గుర్తుకొచ్చేస్తోంది. గుర్తుకు రావడమేంటి, పైకి కూడా పాడేస్తూ మరీ వంటపని మొదలెట్టాను. కూనిరాగాలు తీస్తూ, పాడిన ఆ పాటనే మళ్లీ మళ్లీ పాడుతూ (అందులోని రెండు లైన్లు తప్ప పాట పూర్తిగా నోటికి రాదు మరి...!) పనులన్నీ ముగించి, ఎప్పట్లాగే ఆఫీసుకు బయల్దేరాను.

ఆరోజు ఎందుకోగానీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. నా చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదంగా, హాయిగా అనిపిస్తోంది. ఇక్కడ "ఆ నలుగురు సినిమా"లో రాజేంద్రప్రసాద్‌కు యమభటులు చెప్పే ఒక డైలాగ్‌ను మీకు తప్పకుండా చెప్పాలి. అదేంటంటే... "నేనే గెలిచాను, నేనే గెలిచాను అంటూ రాజేంద్రప్రసాద్ సంతోషంగా యమభటుల వైపు చూడగానే వారు దేవతల్లాగా కనిపిస్తారు.

అది చూసి ఉలిక్కిపడ్డ రాజేంద్రప్రసాద్ అదేంటి మీరు యమభటులు కదా..! దేవతల్లాగా కనిపిస్తున్నారెందుకని ప్రశ్నిస్తాడు. నువ్వు ఇంతదాకా దుంఖంలో మునిగిపోయి ఉన్నావు కాబట్టి, మేము నీకు యమభటుల్లాగా కనిపించాము, ఇప్పుడు పట్టరాని సంతోషంతో ఉన్నావు కాబట్టి దేవతల్లాగా కనిపిస్తున్నాము. దుఃఖం అంటే నరకమని, సంతోషమంటే స్వర్గం అని వివరించి చెబుతారు వాళ్ళు".

ఆ కథనలా ఉంచితే... నేను ప్రతిరోజూ అదే దార్లో వెళ్తూ ఉన్నా కూడా ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప నాకు ఈరోజు ఉన్నంతటి ప్రశాంత వాతావరణం కనిపించలేదు. అంటే ప్రతిరోజూ ఏవో చికాకులు మనసును ఒక పట్టాన ఉండనీయక పోవడం వల్ల నేను ఈరోజు ఉన్నంత హాయిని రోజూ అనుభవించలేక పోతున్నానేమో...?!

సంతోషాన్ని, దు:ఖాన్ని అంత చక్కగా చెప్పిన ఆ సినిమాలోని సంభాషణ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కోసారి చాలా ఇన్‌స్పిరేషనల్‌గా కూడా అనిపిస్తుంటుంది. నా మనసులో ఏదేని దుఃఖం గూడుకట్టుకున్నప్పుడల్లా ఆ సినిమాలోని యమభటులు అలా కళ్లముందు నిలబడుతారంటే నమ్మండి. అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవతల్లా...!

ఇక ఈరోజు ఉదయం ప్రశాంతతలోకి మళ్లీ వస్తే... బస్సు వేగంగా కదుల్తోంది. వెస్ట్ మాంబళం, తంబైయార్ రోడ్‌ (మా ఆఫీస్ అక్కడే ఉంటుందిలెండి)కు వెళ్ళాలంటే.. ముందు దొరైస్వామి బ్రిడ్జ్ దాటి వెళ్లాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అసలే చాలా ఇరుగ్గా ఉండే ఆ రోడ్‌లో రెండువైపులా వాహనాలను వదలాలంటే, ట్రాఫిక్ పోలీసులు పాపం చాలా కుస్తీలే పడాల్సి ఉంటుంది.

ఆరోజు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మాకు ఎదురువైపు నుండి వచ్చే వాహనాలతో రోడ్ నిండిపోయి ఉంది. ఎదురుగా రావాల్సిన వాహనాలు వాటికి కేటాయించిన రోడ్డు సగం భాగంలో కాకుండా పూర్తిగా మా ఎదురుగా వచ్చి చేరాయి. అందులో ఆటోలు, బైక్‌లు ఎక్కువగా ఉన్నాయి.

కూర్చోడానికి సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కగా నిల్చున్నా. మా బస్సుకు ఎదురుగా వస్తోన్న వాహనాలను పరిశీలనగా చూస్తున్నాను. ఆటోలు, బైక్‌లు ఆ రకంగా ముందుకొచ్చి ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్నా, దగ్గర్లో ట్రాఫిక్ పోలీసుల ఆనవాళ్లే కనిపించటం లేదు. రెండువైపులా ట్రాఫిక్ స్తంభించి ఎటుచూసినా వాహనాలన్నీ బారులు తీరాయి.

మా బస్సు డ్రైవర్ స్కూటర్‌ వాలాలను, ఆటోవారిని తిట్టో, బ్రతిమాలుకునో బస్సును మెల్లగా ముందుకు కదిలిస్తున్నాడు. ఇంతలో ఎదురుగా వెనకనుండి వచ్చాడో బైక్‌వాలా... రావడం రావడం ఫాస్ట్‌గా వచ్చి సరాసరి మా బస్సును గుద్దేశాడు. బస్సు వేగంగా కదలటం లేదు కాబట్టి, అతడి అదృష్టం బాగుండి చిన్నపాటి దెబ్బలతో బైటపడ్డాడు. కిందపడిపోయిన అతడిని తిట్టి మరీ పక్కవాళ్లు లేపి, అతడి వస్తువులను అందించారు.

బైక్‌వాలా అలా రాంగ్ రూట్లో వచ్చినందుకు అందరూ తిట్టుకున్నా, పడిపోగానే అయ్యో...! అంటూ బాధపడ్డారు. నా పక్కనున్న మహిళలు కూడా పాపం ఆ అబ్బాయి, అయినా ఎందుకంత తొందర అంటూ మెల్లగానే చీవాట్లు పెడుతున్నారు. ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినా కూడా ట్రాఫిక్ పోలీసుల జాడ మాత్రం లేదు.

ఇంతలో నా పక్కనున్న మహిళలు అందుకున్నారు. ఇలా రాంగ్ రూట్‌లో వచ్చేవాళ్లు, వస్తూనే ఉంటారు, ట్రాఫిక్ ఆగిపోతూనే ఉంటుంది. పోలీసులు మాత్రం రారు అని ఒకామె అంటే... మరొకామె పాపం వాళ్ల బొజ్జల్ని కదిలించుకుంటూ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా..! అంటూ గట్టిగా నవ్వేసింది. వాళ్ళిద్దరి సంభాషణనంతా విన్న బస్సులో మిగిలిన వారందరూ కూడా వారికి జతకలిపారు.

హమ్మయ్య... కాసేపటి ముందు ఉన్న ప్రశాంత వాతావరణం ఇలా అయ్యిందేంటి అనుకుంటున్న నాకు ఆ ఇద్దరి మహిళల సంభాషణతో ప్రాణం లేచివచ్చినట్లైంది. వాళ్ళ నవ్వుల్తో జత కలుపుతూ నేనూ హాయిగా నవ్వుతూ, తలతిప్పి చూస్తే.. నిజంగానే ఓ లావాటి ట్రాఫిక్ కానిస్టేబుల్ తన పొట్టను ఊపుకుంటూ... ఆటోల, బైక్‌ల వారిపై కేకలేస్తూ వస్తున్నాడు. అది చూసిన బస్సులోని వారందరం మరోసారి పెద్దగా నవ్వేశాం...!

{గమనిక... ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను కించపరచటం నా ఉద్దేశ్యం కాదండి. జస్ట్ "సెన్సాఫ్ హ్యూమర్" కోణంలో చూస్తే మీరు కూడా తప్పకుండా నవ్వేస్తారు. వేలాది, లక్షలాది వాహనాలను అనునిత్యం సరైన దార్లో నడిపిస్తూ, నగర ట్రాఫిక్‌ను అదుపాజ్ఞల్లో పెట్టే ట్రాఫిక్ పోలీసులు లేకుండా, కాసేపు ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. అలాంటి వారి సేవలను కించపరచడం భావ్యం కాదు కదా...! జస్ట్ ఫర్ పన్... అంతే...!!}

Tuesday, 2 November 2010

వద్దమ్మా...! బాగుండదే..!!

నా చిన్నతనంలో ఐదేళ్లు ఉంటాయనుకుంటా...! వంద గడపలున్న మా ఊర్లో, ఒకరోజు ఏడుస్తూ పరుగులెడుతున్నాను. ముందు నేను, నా వెనకే మా అమ్మ.. ఆగవే తల్లీ..!! అంటూ కోపంగా వెంటబడుతోంది. నేనేమో ఆమెకు అందకుండా పరుగు తీస్తున్నాను.

ఎలాగోలా అమ్మ నన్ను పట్టుకునేసింది... ఊహూ.. నాకు వద్దమ్మా అంటూ ప్రాధేయపడుతున్నాను. "అది కాదే ఆడపిల్లకు అదుంటేనే అందం. లేకపోతే కోతిలాగా ఉంటావు" అంటూ గట్టిగా పట్టుకుంది. "అయినా ఫర్వాలేదు నాకొద్దు" అంటూ పెనుగులాడుతున్నాను. అమ్మ వినలేదు సరికదా, మా పిన్నమ్మను కూడా తోడు తీసుకుని పట్టుకుని... ఎలక ముల్లు (వెలగ చెట్టు ముల్లు)తో గట్టిగా కుట్టేసింది.

ఏం కుట్టేసిందబ్బా అనుకుంటున్నారా...! మరేం లేదండీ... మా అమ్మ నాకు ముక్కు కుట్టేసింది. "ఆడపిల్ల ముక్కుపుడక పెట్టుకుంటేనే చూసేందుకు అందంగా ఉంటుంది. లేకపోతే బాగుండదు" అని చెబుతూ.. అప్పట్లో మాఅమ్మ చాలా సార్లు నా ముక్కు కుట్టే ప్రయత్నాలు చేసి చేసీ... ఆరోజు ఎట్టకేలకు విజయం సాధించేసింది.

బాగా సలపరంగా ఉండటంతో ముక్కు పట్టుకుని... కుయ్యో... మొర్రో అంటూ అమ్మ వైపు కోపంగా, గుర్రుగా చూశాను. అమ్మ, మా పిన్నమ్మ మాత్రం అదేం పట్టించుకోకుండా నవ్వుతూ... ఎంత ముద్దొస్తున్నావే.! అంటూ ఇంటికి తీసుకెళ్లారు. మొదట కోప్పడినా, నొప్పిగా ఉంటుందేమో అని భయపడినా తరువాత చూడగా, చూడగా చాలా బాగుందనిపించింది.

కుట్టు గాయం ఆరిన తరువాత మా అమ్మమ్మ కొనిచ్చిన బంగారు ముక్కుపుడకను పెట్టుకున్న రోజున నా సంతోషం అంతా ఇంతా కాదు. ఆరోజు ముక్కు కుట్టద్దంటూ ఊరంతా పరుగులెత్తిన నేను, ముక్కుపుడకను పెట్టుకుని ఊరంతా కలియదిరిగి అందరికీ చూపించి మురిసిపోయిన విషయాలన్నీ ఇప్పుడు గుర్తొస్తే... భలే తమాషాగా ఉంటుంది.

నా ముక్కుపుడక సంగతిని కాసేపలా పక్కనబెడితే.... సాధారణంగా విదేశాలకు వెళ్ళి వచ్చిన భారతీయ స్త్రీలు (అందరూ కాదులేండి..), అక్కడి సంస్కృతిని బాగా వంటబట్టించుకుని, వంకర్లుబోతూ, మాతృభాషనే వచ్చీరానట్లు మాట్లాడే ఈరోజుల్లో... లండన్‌లో ఓ 13 ఏళ్ల అమ్మాయి ముక్కుపుడక పెట్టుకుని పాఠశాలకు వెళ్లేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట...!

ఆ వివరాల్లోకి వెళ్తే... భారతీయ సంప్రదాయంలో ఒక భాగంగా నిలిచిన ముక్కుపుడకను పెట్టుకుని స్కూలుకు వెళ్ళిన భారత సంతతికి చెందిన షన్నాన్ కన్నొల్లి అనే పదమూడేళ్ల చిన్నారిని స్కూలు యాజమాన్యం అడ్డగించింది. అంతేగాకుండా, ఇలా ముక్కుపుడక ధరించి రావటం స్కూలు నిబంధనలకు విరుద్ధమని, అది తీసేంతదాకా స్కూల్లోకి అడుగుపెట్టనిచ్చేది లేదంటూ ఆంక్షలు విధించింది.

దీంతో కన్నొల్లి స్కూలు యాజమాన్యంపై పోరాటానికి దిగగా, ఆమెకు బాసటగా బ్రిటన్‌లోని హిందూ కౌన్సిళ్ళన్నీ పూర్తి మద్ధతును, సహకారాన్ని అందించాయి. చివరకు ఈ విషయంలో సమతా మండలి కలగజేసుకోవడంతో ఎట్టకేలకు స్కూలు యాజమాన్యం దిగొచ్చింది. పాఠశాల పరిసరాల్లో ముక్కుపుడక ధరించవచ్చంటూ తన నిబంధనలను సడలించుకుంది.

భారతీయ సంప్రదాయాన్ని విదేశాల్లో సైతం కాపాడి, హిందూ సంప్రదాయానికి తలమానికగా నిలిచి, విజయం సాధించిన చిన్నారి కన్నొల్లికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం కదూ...!

ఈరోజుల్లో ఫ్యాషన్‌కు అలవాటు పడిన చాలామంది మహిళలు... ముక్కెర పెట్టుకునేందుకు కుట్టించుకున్న రంధ్రాలను సైతం పూడ్చేసుకుని అందంగా, ప్యాషన్‌గా కనిపించాలని తాపత్రయపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఎక్కడో విదేశాల్లో ఉంటూ కూడా భారత సంస్కృతి, సాంప్రదాయాలను వంటబట్టించుకున్న ఈ చిన్నారి పోరాటం... ఈనాటి ఫ్యాషన్ మహిళల కళ్లు తెరిపించాలని ఆశిద్దాం.

Monday, 1 November 2010

పాలు పొంగిపోతున్నాయి....!!

అవి... నేను ఇంటిపట్టునే ఉంటోన్న రోజులు... అయితే మిగతా రోజుల్లో ఉండరా ఏంటీ? అని అడగకండి. అంటే నేను ఏ ఉద్యోగమూ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నానండి అంతే...!!

అబ్బా...! ప్రారంభంలోనే విషయం పక్కదారి పడుతోందే..? పోన్లేండీ... అదలా వదిలేద్దాం.. ఇందాక చెప్పినట్లు నేను ఇంటిపట్టునే ఉంటోన్న రోజుల్లో టీవీ అంటే మహా పిచ్చి. అలాంటిలాంటి పిచ్చి కాదండి బాబూ... ఏ ఒక్క సీరియల్‌ (భాషా భేదాలు నాకసలే లేవు సుమా.. మరీ సీరియల్స్ విషయంలో...)ను కూడా వదలకుండా చూసేదాన్ని.

ఎంత పక్కా ప్రణాళికతో ఉండేదాన్నంటే... టీవీ సీరియల్స్ టైమింగ్స్‌ను బట్టి ఆయా పనులకు సమయాన్ని కేటాయించుకునేదాన్ని. చాలా బాగా నచ్చిన, మనసుకు హత్తుకునేలా ఉండే సీరియల్స్‌ను కళ్ళప్పగించి మరీ చూసేస్తుంటాన్లేండి. అలాంటి సమయంలో ఏ పనీ ముట్టుకునేది లేదు. కాస్త ఫర్వాలేదు అనుకునే సీరియల్స్ వచ్చేటప్పుడు మాత్రం వాటిని చూస్తూ మిగతా పనులు చేసుకునేదాన్ని.

ఆహా... ఈరోజు చూడకపోయినా ఫర్వాలేదు అనుకునే సీరియల్స్ టైమింగ్స్‌లో మాత్రం బయటపనులు చూసుకునేదాన్ని. కొన్ని ఛానెల్స్‌లో శని, ఆదివారాలు సీరియల్స్ తక్కువగా వచ్చే సమయంలో వారం మొత్తంలో చేయకుండా అట్టిపెట్టిన పనులను ముగించేయడం అలవాటుగా మారిపోయింది.

ఇంతకూ విషయానికి రాకుండా నా టీవీ సీరియల్స్ సోది చెప్పేస్తున్నాను. మీకు సోదిలాగా ఉందేమోగానీండి. నాకు మాత్రం రోజూ అలాగే గడిచిపోయేది మరి. మా ఆయన ఆఫీసుకు వెళ్ళి, మళ్ళీ తిరిగి వచ్చేదాకా నాకు అవే నేస్తాలు కాబట్టి వాటిమీద నాకు చాలా ప్రేమ (ఒక్కోసారి మా ఆయన్ని కూడా పట్టించుకోనంత) సుమా..!!

వందల ఎపిసోడ్లయినా ఆగని టీవీ సీరియల్స్ లాగే... రోజులలా గడుస్తున్నాయి. ఒకరోజు నాకిష్టమైన "చక్రవాకం" సీరియల్ వస్తోంది. అందులో ప్రధాన పాత్ర "ఇక్బాల్" చనిపోయే సన్నివేశం వస్తోంది. ఆ సీరియల్‌లో ఇష్టమైన ఆ పాత్ర చనిపోతుంటే ఓ వైపు గుండె తరుక్కుపోతోంది. కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. కళ్ళముందు టీవీ కూడా కనిపించలేనంతగా ఏడ్చేస్తున్నాను.

అంతగా ఏడుస్తున్నా... ఏదో మర్చిపోయానే అనుకుంటూ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే, టీవీ ముందు నుంచి మాత్రం కట్టుకదలలేదండి. అమ్మతోడు. ఇంతలో ఏదో మాడుతున్న కమురు వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి.

అయ్యో...! అంటూ ఒక్క పరుగున చేతిలో రిమోట్ ఏమాత్రం వదలకుండా మరీ... కిచెన్‌లోకి (గుర్తొచ్చేసింది లెండి) పరుగెత్తాను. చూస్తే ఏముందీ... స్టవ్ పైన పాలుపెట్టి మరిచిపోయాను. అవి పొంగిపోతున్నాయి. స్టవ్‌ను ఆపేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. సాధ్యం కావటం లేదు. పాలేమో పొంగిపోతున్నాయి.

అబ్బా... ఎంతసేపు సాగదీస్తారు. ఏముంది స్టవ్‌ను ఆపేసేందుకు కుదరటం లేదా...? స్టవ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్‌ను కుడివైపుకు తిప్పేస్తే సరిపోదా..! అంటారేమో...? అక్కడే ఉందండీ తిరకాసంతా...! నేను స్టవ్‌‌ను ఆపేసేందుకు కుస్తీలు పడుతున్నాను. ఓ వైపు టీవీలో సీరియల్ కాస్తా అయిపోతోంది. ఒకటే టెన్షన్. పాలు ఇంకా పొంగుతూనే ఉన్నాయి.

ఇదిగో ఇదేం బాగాలేదు.. ఇంతకీ ఏం చేశారో చెబుతారా.. లేదా..? అంటూ అలా కోపంగా చూడకండే... చెప్పేస్తున్నాను. టీవీ రిమోట్‌తో నేను స్టవ్‌ను ఆపడానికి ప్రయత్నిస్తున్నానండి. ఎంతసేపు రెడ్ బటన్ నొక్కినా స్టవ్ ఆగడం లేదు. ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. తిట్టుకుంటూ ఏమయ్యింది ఈ స్టవ్‌కు అనుకుంటూ రిమోట్ బటన్‌ను విపరీతంగా నొక్కేస్తున్నాను. పాలు పొంగి పొంగి స్టవ్ కాస్తా ఆగిపోయింది. హమ్మయ్య ఇప్పటికైనా ఈ రిమోట్ పనిచేసింది అనుకుని గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి మళ్ళీ "చక్రవాకం"లో లీనమయ్యాను.

సీరియల్‌లో ఇక్బాల్ చనిపోతాడా... లేదా...? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.. తరువాయి రేపు చూడండంటూ సీరియల్ ఆరోజుకు అయిపోయింది. మళ్ళీ ఇంకో సీరియల్‌ వచ్చే గ్యాప్‌లో కిచెన్లోకి రాగానే ఇందాకటి పాలు పొంగిన విషయం గుర్తుకొచ్చింది. ఊరికే పాకెట్ పాలు పోయాయి. రేపు పెరుగుకు ఏంచేయాలబ్బా... అనుకుంటూ స్టవ్ ఆపేందుకు నేను చేసిన ప్రయత్నం, స్టవ్ ఆరిపోయిన వైనం అన్నీ లీలగా మెదిలాయి.

అంతే ఇంట్లో ఒక్కదాన్నే పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం మొదలెట్టాను. ఎంత సీరియల్ పిచ్చైతే మాత్రం అంతలా ఇదైపోవాలా? ఇంత చోద్యం ఎక్కడైనా జరిగుంటుందా...? "గ్యాస్‌స్టౌవ్‌ను టీవీ రిమోట్‌తో ఆపటమా..." నా తింగరిపనికి నాకే పట్టరాని కోపం, ఆ తరువాత తెరలు తెరలుగా నవ్వు దోబూచులాడాయి.

ఆ రాత్రి మా ఆయన ఇంటికి రాగానే జరిగిన తంతునంతా వివరించి చెప్పేసరికి... విన్నంతసేపు విని నావైపు అదోలా చూసి పడి పడి నవ్వారు. అయినా నీకు బుర్ర అనేది ఉంటేగా...? ఆ టీవీ సీరియల్స్ అన్నీ ఈ పాటికి నీ బుర్రని కొంచెం కొంచెంగా తినేస్తున్నాయి. ఆ సీరియల్స్ చూసే నీకు ఆపాటి తెలివితేటలు ఉంటాయిలే...! అంటూ నవ్వుతూనే ఉన్నారు. నేను లోలోపల నవ్వుకుంటూనే బయటికి మాత్రం ఉడుక్కుంటూ మా ఆయనవైపు గుర్రుగా చూస్తుండిపోయాను.

ఆ తరువాత మా ఇంటికి తెలిసినవారు, బంధువులు, స్నేహితులు ఎవరొచ్చినా సరే... మా ఆయన మాత్రం నేను చేసిన తింగరిపనిని పొగిడి పొగిడి మరీ చెప్పేవారు. అప్పట్లో తానలా చెబుతుంటే నాకు చాలా కోపం వచ్చేది. అయితే ఇప్పుడు కూడా ఆరోజు సంఘటన గుర్తొస్తే మాత్రం నవ్వాపుకోలేను....!!

Friday, 29 October 2010

బ్యాక్ టు హోమ్...!

"అన్నీ మంచి శకునములే" అని మనసులో పాడుకుంటూ... కోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టాము. ఎంట్రన్స్‌లోనే ఓ లాయర్ ఏం కావాలమ్మా...! అంటూ ముందుకొచ్చాడు. ఫలానా సార్... అంటూ వివరాలు అవీ చెప్పేసరికి, నాతో రండని తీసుకెళ్లాడు.

కోర్టు ఇంకోవైపు ఎంట్రన్స్ వద్ద పాండీబజార్ పోలీస్ స్టేషన్ క్రైం డిపార్ట్‌మెంట్ పోలీసాయన ఉంటే.. అతడివద్దకు తీసుకెళ్లాడు ఆ లాయర్. వెళ్లగానే ఆ పోలీసాయనను చూస్తూ... అందరూ నాదగ్గరే బాగా ఇరుక్కుపోతారండీ అన్నాడు తమిళంలో. దానికో నవ్వు పారేసిన పోలీసాయన కేసు వివరాలను విని, లాయర్ చెప్పినట్లుగా చేయండమ్మా అన్నాడు.

అంటూనే... కాసేపలా పక్కకు వెళ్లి, మళ్లీ మా దగ్గరకు వచ్చారు. కెమెరా వాల్యూ ఎంత ఉంటుందని? ప్రశ్నించారు. మేము చాలా రోజులు క్రిందట కొన్నాము కాబట్టి, ఇప్పుడు 3 వేల రూపాయల విలువ చేస్తుందని చెప్పాము. ఇంతలో ఆ లాయర్ ఓస్ అంతేనా ఇంకేం అడుగుతాము.. అంటూ ఓ నిట్టూర్పు విడిచాడు. పోలీసాయన ఏదో పని ఉండి వెళ్తూ ఎలాగోలా చేయవయ్యా.. అని లాయర్‌కు చెప్పేసి వెళ్లిపోయాడు.

ఇంక ఆ లాయర్ ఫీజు విషయంలో మాతో బేరాలు మొదలెట్టాడు. ఓ రెండువేలు ఇస్తారా అని అన్నాడు. ఏంటి సార్..! మా కెమెరా 3 వేలు అయితే మీకు రెండువేలు ఇచ్చేయాలా..? ఏమైనా న్యాయంగా ఉందాండీ... అన్నాన్నేను. ఇంకేం చేయనమ్మా ఇంకా చాలా పనులు చేయాలి... మీకు కెమెరా ఊరికినే చేతికి రాదు కదా..! అన్నాడు.

ఆ లాయర్ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో.. మా అబ్బాయి ఫ్రెండుకు ఫోన్ చేయమని చెప్పగా అతడు అందుబాటులో లేడు. ఇంకేం చేయాలబ్బా...! అనుకుంటుండగా మా కొలీగ్ ఒకరు గుర్తొచ్చాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పగా... అయ్యో..! ముందే నాకు చెప్పి ఉంటే నేను చూసుకుందును కదా..! అన్నారు. సరే ఓ పది నిమిషాలు ఆగి ఫోన్ చేయండి నేను ఏమైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తానని చెప్పారు.

ఓ పావుగంట తరువాత ఫోన్ చేయగా... ఆయన తన లాయర్ ఫ్రెండు ద్వారా ఆ కోర్టులోనే ఉన్న మరో సీనియర్ లాయర్ వివరాలు, ఫోన్ నెంబరు ఇచ్చి ఆయన వద్దకు వెళ్ళమన్నారు. ఇందాకటి లాయర్‌కు మాకు తెలిసినవారు ఉన్నారండీ... మీ సహాయానికి కృతజ్ఞతలంటూ సెలవు తీసుకున్నాము.

ఆ సీనియర్ లాయర్‌ను కలువగా... ఆయన తెలుగు తెలిసిన తన జూనియర్ లాయర్‌ను పిలిచి కేసు వివరాలు చెప్పి ప్రొసీడ్ కమ్మని చెప్పి పంపించారు. సార్... ఇంక మా కెమెరాను తీసుకెళ్లిపోవచ్చా... అని అడిగాను ఆ తెలుగు లాయర్‌ను. అంత ఈజీగా ఎలా తీసుకెళ్తారమ్మా...! ఇంకా చాలా పనులున్నాయని అన్నారు. అప్పుడుగానీ మాకు తెలియదు మా కెమెరా మా చేతికి రావాలంటే ఇంకా మూడు, నాలుగు రోజులు పడుతుందని...

సరేనండీ... ఇప్పుడేం చేయాలి మళ్లీ నేనే అడిగాను. మొదటగా పిటీషన్ ఒకటి తయారు చేయించాలి. ఈ పిటీషన్‌ను జడ్జి కూర్చోకముందే పొద్దుటిపూటే పెట్టేయాలి. ఇప్పుడు ఒంటిగంట అవుతోంది కాబట్టి ఇంక రేపు పొద్దున్నే వేయాలి. ఈరోజేం చేయలేం అన్నాడాయన. ఎంతో ఆశగా కెమెరాను తీసుకెళ్లొచ్చు అనుకుంటుంటే మళ్లీ రేపు కూడా రావాలా...? బాగా నీరసపడిపోయాను.

పిటీషన్ తయారీ పనులు గట్రా.. అన్నీ పూర్తి చేసుకుని రేపు పొద్దుటే వస్తామని చెప్పి లాయర్‌కు చెప్పి కోర్టునుండి బయటపడ్డాము. మరుసటిరోజు కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరై... పిటీషన్‌ వేసింది తానేనని, కెమెరా నాదేనని చెప్పాను. సరేనమ్మా..! ఇప్పుడు మీరు ఇంటికెళ్లిపోయి మూడు రోజుల తరువాత రండి... ఆరోజు కెమెరాను మీవెంట తీసుకెళ్లచ్చు అన్నాడు లాయర్.

మూడురోజుల తరువాత మళ్లీ కోర్టుకెళ్లి జడ్జిముందు హాజరవగా.. ఆయన కెమెరాను నాకు హ్యాండోవర్ చేయమంటూ ఆర్డర్స్ పాస్ చేశారు. హమ్మయ్య... అనుకుంటుండగా కాసేపు కూర్చొండి ఇదో వస్తానంటూ బయటికెళ్లి తిరిగొచ్చాడు లాయర్. మీ ఆర్డర్ టైప్ చేసినందుకు, రికార్డ్స్ వెతికిపెట్టినందుకుగానూ వాళ్లు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఓ రెండొందలు ఇవ్వండని అడిగారు.

అన్ని ఖర్చులకుగానూ ఆయనకు అప్పటికే డబ్బులు ముట్టజెప్పేశాను. మళ్లీ ఆయనలా అడిగేసరికి బిత్తరపోయాను. అదేంటండీ అప్పుడే డబ్బులిచ్చేశాను కదా..! మళ్లీ అడిగితే నేనెక్కడికి పోను అన్నాను. ఆయనలాగే ఉండిపోయేసరికి మావాడు పక్కకు పిలిచి మనం ఇవ్వకపోతే ఇంకాసేపు లేటవుతుంది, ఎందుకొచ్చిన గొడవ ఇచ్చేద్దామని చెప్పాడు. నేను సరేనన్నాను.

డబ్బు ఇవ్వగానే ఆయన ఎవరిదగ్గరకో పోయి, అన్నీ పేపర్లను రెడీ చేయించి పైన ఉండే ప్రాపర్టీ రూంకు తీసుకెళ్లాడు. అక్కడ వివరాలన్నింటినీ రికార్డు చేసే ఆయన... చివర్లో డబ్బు డిమాండ్ చేయగా మా లాయర్ నావైపు చూయించాడు. ఏమ్మా మాకు రాసినందుకుగానూ ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్నాడు. మొదట ఇవ్వనని బయటికి వచ్చేశాను.

అతను ఊరుకుంటాడా..? బయటికి నాదగ్గరికి వచ్చి నేనిప్పుడు జడ్జి దగ్గరకు సంతకం చేయించేందుకు వెళ్లాలి. అతను సంతకం చేస్తేనే మీకు కెమెరా ఇవ్వగలను అని గొణుగుతూ పక్కన నిల్చున్నాడు. నేను ఉండేకొద్దీ లేటవుతుందని చేసేదేం లేక అతనికి కొంత డబ్బు ఇవ్వగానే అతనెళ్లి సంతకం చేయించుకొచ్చి నన్ను లోపలికి పిలిచి కెమెరాను అప్పజెప్పాడు.

కెమెరాను నా చేతికి తీసుకుని ప్రాపర్టీ రూం క్లర్క్‌కు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి సంతోషంగా మా అబ్బాయి చేతికి కెమెరాను అందించాను. గబగబా కెమెరాను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న సెల్స్ వేసి చూస్తే... మంచి కండీషన్లోనే ఉంది. సార్ మనకు చాలా సాయం చేశారంటూ వెంటనే మావాడు లాయర్‌ను ఓ ఫోటో తీశాడు. లాయర్‌కు, సీనియర్‌ లాయర్‌కు థ్యాంక్స్ చెప్పి కోర్టు నుండి బయటపడ్డాము.

ఇదండీ నేను పోగొట్టుకుని ఎట్టకేలకు సాధించుకున్న మా బుల్లి కెమెరా కథ. పోగొట్టుకుని ఎలాగైనా తెచ్చేసుకున్నారు కదా...! అయినా మూడు, నాలుగు రోజులు ఆ కథను ఆపకుండా రాసేయాలా..? అనుకుంటున్నారా..?! మీకు చదివేందుకే అంత ఇబ్బందిగా ఉంటే... దాదాపు ఓ ఐదారు నెలలపాటు నేను పడ్డ కష్టం ఎలా ఉంటుందో ఆలోచించండి.

ఇంతకూ నేను పోగొట్టుకున్న కెమెరా... మేం కొన్నప్పటి ధర 10 వేల రూపాయలు కాగా... నేను దాన్ని తిరిగీ దక్కించుకునేందుకు మరో 2 వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వచ్చింది.

అయినా నేను ఈ కథ ద్వారా చెప్పదలచింది మాత్రం ఒక్కటే...! బయటికి వెళ్లేటప్పుడు మన వస్తువులపట్ల తగినంత జాగరూకతతో లేనట్లయితే... చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వస్తువును పోగొట్టుకున్నట్లయితే తిరిగీ దానికోసం ప్రయత్నించకండి.. ఒకవేళ ప్రయత్నిస్తే.. మేం ఎదుర్కొన్న కష్టాలు మీకూ తప్పవు.

(సమాప్తం)

Thursday, 28 October 2010

కొండను తవ్వి....!!

"కొండను తవ్వి ఎలుకను పట్టిన" చందంగా మారిపోయిందండి నా పరిస్థితి. ప్రతిరోజూ... మా ఆయన చెత్తకుప్పలా పేర్చి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డుల కవర్ల భండాగారాన్నంతా తవ్విపోయడమే పనిగా పెట్టుకున్నాను. (మరేం లేదు... మా ఆయన ఆ కెమెరాను క్రెడిట్ కార్డుతో కొన్నారులేండీ..!) వీటిల్లోనయినా కనీసం ఆ బిల్లు ఒరిజినల్ కాకపోయినా, డూప్లికేట్ కాపీ అయిన దొరుకుతుందన్న ఆశ నన్ను అంతపని చేయిస్తోంది మరి...!

కెమెరా సంగతి పక్కకుపోయి, కెమెరా బిల్లు సంపాదించటానికి పడరాని పాట్లు (వెతకడం) పడాల్సి వస్తోంది. ఇదేం ఖర్మరా బాబూ..! అనుకోని రోజు లేదంటే నమ్మండి. స్నేహితులు, కొలీగ్స్‌, బంధువులు అందరూ... ఇలా చేయండి, అలా చేయండి అంటూ సలహాలిస్తున్నారుగానీ... బిల్లు మాత్రం కనిపించే దారే లేకుండా పోయింది.

ఓ రోజు లంచ్ టైంలో మా కొలిగ్ ఒకతను "ఏంటండీ కెమెరా కోర్టు నుండి తెచ్చేసుకున్నారా..? బిల్లు కనిపించిందా..?" అంటూ కుశలప్రశ్నలు వేశాడు. "మూలిగే నక్కపై తాటికాయ పడటం" అంటే ఏంటో అర్థమైంది అతని ప్రశ్ననుండి నాకు. లేదండీ బిల్లు కనిపించలేదు అన్నాను. ఆరోజు మీరు కొన్న క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ అయినా వెతికి పట్టుకుంటే... డూప్లికేట్ బిల్లు సంపాదించవచ్చు అని అన్నాడతను.

ఇంకో సీనియర్ కొలిగ్ ఇంకొకరు మా చర్చలో కల్పించుకుంటూ.. దీని కోసం ఎందుకింత టెన్షన్ పడుతున్నారు. "ఇండెమ్నినిటీ" బాండ్ వేశారంటే... మీదగ్గర బిల్లు లేకపోయినా కెమెరాను తెచ్చేసుకోవచ్చు అన్నాడు. ఎలాగ సార్...? అన్నాను ఆశగా...

మరేం లేదమ్మా..! ఇండెమ్నినిటీ బాండ్ అంటే... "ఈ వస్తువును భవిష్యత్తులో తమదే అంటూ ఎవరైనా క్లెయిమ్ చేసినట్లైతే దానికి నేను బాధ్యత వహిస్తాను" అని అర్థం... అంటూ వివరంగా చెప్పాడు. నేను సరేనండీ... అలాగే చేస్తాను... థ్యాంక్స్ అంటూ తలాడించేసి వచ్చేశాను.

ఇండెమ్నిటీ బాండ్ సంగతలా ఉంచితే.. ఒరిజినల్ బిల్ కోసం నా వేటను మాత్రం ఆపలేదు... అలా వెతుకులాటలోనే మరికొన్ని నెలలు గడిచాయి. "ఓరి దేవుడా.. ఇలాగైతే నాకిష్టమైన కెమెరా నాకు దక్కేలా లేదు. ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సరే కోర్టుకెళ్లాలి. అక్కడికెళితే ఏంచేయాలో లాయరే చెబుతాడు" అంటూ ఓ నిర్ణయానికి వచ్చేశాను.

ఓ రోజు లీవుపెట్టేసి... సాయంకాలం ఇంటికెళ్లాను. ఆశ చావక చివరిసారిగా... ఓసారి వెతికి చూద్దాం అనుకుంటూ... ఎక్కడో మంచం కింద దాచిపెట్టిన మరికొన్ని కాగితాల గుట్టను కదిలించాను. చాలా సీరియస్‌గా బిల్లుకోసం వెతికేస్తున్నాం. ఎక్కడా దాని ఆనవాళ్లు కనిపించడం లేదు.

పట్టువదలని విక్రమార్కుల్లాగా... మా ప్రయత్నం ఆపలేదు... ఇంతలో అమ్మా...! దొరికేసింది అంటూ ఓ పెద్ద కేక పెట్టాడు మావాడు. హమ్మయ్యా..! ఇప్పటికైనా దొరికింది కదూ...! అంటూ చూస్తే... అది బిల్లుకాదు... క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్. అందులో కెమెరా కొన్న తేదీ స్పష్టంగా ఉంది... ఇదైనా సరే దొరికింది అనుకుని మనసుకు సర్దిచెప్పుకున్నాము. మరుసటి రోజు కోర్టుకెళ్లాలి కాబట్టి త్వరగా తినేసి పడుకున్నాము.

ఆరోజు గురువారం... కోర్టుకెళ్లాలి కాబట్టి త్వరత్వరగా రెడీ అవుతున్నాము. ఇంతలో ఏదో అవసరమొచ్చి బీరువా లాకర్‌లో చెయ్యి పెడితే కొన్ని బిల్లులు చేతికి తగిలాయి. ఏంటో చూద్దామనుకుని విప్పి చూద్దును కదా...! సంతోషంతో నాకు నోటమాట రాలేదు. నేను దేనికోసమైతే నెలల తరబడీ వెతుకుతున్నానో... అదేనండీ డిజిటల్ కెమెరా ఒరిజినల్ బిల్లే అది.

మావారికి, అబ్బాయికి చూయిస్తే... మావాడు నాకు రెండు చేతులెత్తి నమస్కరించేశాడు. మా ఆయనైతే నావైపు గుర్రుగా చూశాడు. నీ మతిమరపువల్ల ఎన్నిరోజులు, ఎంతగా కష్టపడ్డాము, ఎంతలా వెతికాము, ఎన్ని తిప్పలు.. అంటూ నాకు బాగా అక్షింతలు పడ్డాయి. వాళ్లెంతలా మాట్లాడుతున్నా... మౌనంగా నవ్వుతూ ఉండిపోయాను (బిల్లు దొరికిన సంతోషం కాబోలు...!)

హమ్మయ్య...! శకునం బాగానే ఉంది. బిల్లు దొరికేసింది కాబట్టి కెమెరాను ఈరోజు ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనుకుంటూ ఉత్సాహంగా కోర్టుకు బయలుదేరాము....!! ..............

Wednesday, 27 October 2010

అసలు చిక్కల్లా దాంతోనే...!

కెమెరా దొరికిందన్న మాటేగానీ... ఇల్లు చేరే మార్గం కనిపించడం లేదు. క్రితం ఆర్టికల్‌లో రాసినట్లుగా ఏ రోజుకారోజు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ రాకపోతుందా...! అని ఎదురుచూపులే మిగులుతున్నాయి.

ఫోన్ రాకపోతే పోయింది మనం ఒక్కసారి వెళ్లి అడిగివద్దాం అంటాను నేను. ఉండమ్మా మనం తొందరపడితే వాళ్లు కోపగించుకుంటారేమో అంటాడు మావాడు. అదిసరేగానీ మీ కొలీగ్‌ను సలహా అడిగిచూడు. అతనెలా చెబితే అలా చేద్దాం అన్నాను.

మీకు చెప్పనేలేదు కదూ...! మేము పోలీస్ స్టేషన్లో కంప్లైయింట్ ఇవ్వడానికి ముందు మావాడి కొలీగ్ సలహా తీసుకున్నాము. మా కోసం స్టేషన్‌కు కూడా వచ్చాడు. తమిళ పత్రికారంగంలో పనిచేసినవాడు కాబట్టి కాస్తంత ఇన్‌ఫ్లుయన్స్ ఉంటుందని, పోలీసులు ఆమ్యామ్యాలు అడగకుండా ఉంటారని తన సాయం తీసుకున్నాము.

మరుసటిరోజు మావాడు తన కొలీగ్‌ను అడిగితే... నాకొక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు, అతడినడిగి సలహా తీసుకుని మీకు ఏ విషయం చెబుతానని అన్నాడు. అన్నాడేగానీ ఆ ఊసే మర్చిపోయాడు. అలా రోజులు గడిచిపోసాగాయి. మళ్లీ ఓరోజు గట్టిగా అడిగితే సాయంత్రానికల్లా ఏ విషయం చెబుతానని అన్నాడు. చెప్పలేదు సరికదా... ఆ మర్నాడు తన ఫ్రెండ్ ఊర్లో లేడని చెప్పాడతను.

ఇక లాభం లేదనుకుని మేమే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాము. ఫలాన అని వివరాలు చెప్పిన తరువాత అక్కడి యస్సై మీ కేసు తీర్పు అయిపోయింది. మీ కెమెరా సైదాపేట కోర్టు ప్రాపర్టీ రూంలో ఉంది. మీరు వెళ్లి రికవర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అదేంటి సార్ కేసు ఎప్పుడో అయిపోతే మాకు ఇంతవరకూ చెప్పనేలేదు. ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నారు కదా...! అని అడిగాను.
నిజమేనమ్మా...! ఇక్కడ చాలామంది లీవ్‌లో ఉన్నారు. మీ కేసును డీల్ చేసినవారు కూడా లీవ్‌లో ఉన్నారు. దాంతో మీకు "ఇన్‌టైంలో ఇన్‌ఫాం చేయలేకపోయాము" అన్నాడు. సర్లే అనుకుని కోర్టుకెళ్లిన తరువాత ఎలా ప్రొసీడ్ అవ్వాలో వివరంగా చెప్పమని రిక్వైస్ట్ చేశాను.

ఆయన కేసు వివరాలన్నింటినీ ఓ పేపర్లో రాసిచ్చి, ఓ లాయర్‌ను సంప్రదించమని చెప్పాడు. అంతేగాకుండా... కెమెరా మీదేనన్న ఆధారాలు, ఒరిజినల్ బిల్స్ గట్రా ఉన్నాయా...! అంటూ ఆరా తీశాడాయన. కెమెరాలో ఫోటోలు ఉన్నాయి కదండీ.. అంతకు మించిన ఆధారాలేం కావాలి అన్నాను నేను. "అవి సరిపోవమ్మా.. కోర్టులో జడ్జి ఒరిజినల్ బిల్స్‌ను తప్పకుండా అడుగుతారు. కాబట్టి మీరు బిల్స్ పట్టుకుని వెళితే పని సులువవుతుంది" అని చావుకబురు చల్లగా చెప్పాడు ఆ యస్సై.

అలాగే.. వస్తాం సార్... థ్యాంక్స్...! అంటూ స్టేషన్ నుంచి బయటపడ్డాం. దార్లో ఒకటే ఆలోచన ఒరిజినల్ బిల్ కనిపించకుండా పోయి చాలా రోజులైంది. బిల్ లేకుండా కోర్టుకెళితే కెమెరాను ఇవ్వరు కదా...! ఇప్పుడేం చేయాలి... ఇంట్లో ముఖ్యమైనవాటిని ఎప్పుడూ దాచిపెట్టే చోటునే అది ఖచ్చితంగా ఉండి ఉంటుందని అనిపించింది. వెళ్లగానే ఆ పని చేయాలనుకుంటూ ఇంటికెళ్లాను.

అలా అనుకున్నానే గానీ... కాసేపట్లోనే నా ఆశలు నీరుగారిపోయాయి. ఎందుకంటే.. నేను అనుకున్న చోట అది దొరకలేదు సరికదా..! ఎక్కడ ఉందో అంతుబట్టకుండా పోయింది. అయితే నా సిక్త్ సెన్స్ మాత్రం బిల్ పోలేదు.. ఇంట్లోనే ఉంది అని చెబుతూనే ఉంది.

ఇక ఆ రోజు నుంచి కెమెరా సంగతటుంచి... కెమెరాను కొన్న ఒరిజినల్ బిల్ కోసం మా వేట మొదలైంది.... ఇంట్లో వెతకని చోటంటూ లేదు... వెతుకుతూనే ఉన్నాము... బిల్లు దొరకలేదు... కెమెరా కోసం నా ఆశా చావనూలేదు....!!!

(సశేషం...)

Tuesday, 26 October 2010

ఆరోజు ఏం జరిగిందంటే...!!

ఆరోజు ఊరినుంచి మా అమ్మావాళ్లు వస్తున్నారు. ఈ ఊర్లోనే మా పెద్దమ్మవాళ్లు కూడా ఉండటంతో ముందుగా వాళ్లదగ్గరకు వెళ్లి ఆ తరువాత మాదగ్గరికి వస్తామని చెప్పింది అమ్మ. వాళ్లొస్తున్నారని నేను ముందుగా లీవ్ కూడా పెట్టేశాను.

అమ్మ చెప్పినట్లుగానే ముందుగా పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ ఓరోజు ఉండి, ఆ తరువాత మా ఇంటికి వచ్చింది. అమ్మతో పాటు అక్క, పిల్లలు కూడా రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. సాయంత్రం షాపింగ్‌కెళ్లి ఆ తరువాత బీచ్‌కెళ్దామని అమ్మ చెప్పడంతో సరేనని నేను, మా అబ్బాయి, అక్క, పిల్లలు, అమ్మ అందరం బయలుదేరాం.

టీనగర్‌లోని రంగనాథన్ స్ట్రీట్‌లో ఉన్న జయచంద్రన్ టెక్ట్స్‌టైల్స్ కెళ్లి అక్కడ అమ్మకు, అక్కకు బట్టలు కొన్నాం. ఆ తరువాత అదే బజార్లో ఉన్న షాపులన్నింట్లో చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కుంటూ ముందుకెళ్లాము. ఇంతలో పిల్లలకు మంచి డ్రస్సులు ఎక్కడ దొరుకుతాయని అక్క అడగటంతో.. శరవణా స్టోర్స్ అయితే బెస్ట్ అని చెప్పాను.

రంగనాథన్ స్ట్రీట్ నుంచి మెల్లగా నడుచుకుంటూ పనగల్ పార్క్ శరవణా స్టోర్స్‌కు వెళ్ళాము. అక్కడ అప్పటికే కొన్న వస్తువుల కవర్లన్నింటికీ టోకెన్లు వేయించి, అక్కడే పెట్టేసి లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాం. చిన్నపిల్లల డ్రస్సులు ఎన్నో అంతస్తులో దొరుకుతాయో కనుక్కుని, అక్కడికి వెళ్లాము.

మా బుడిగమ్మకు గౌన్లు, బబ్లూకు ప్యాంట్లూ, షర్టులూ అంటూ ఓ మూడు నాలుగు జతల బట్టలు కొనేశాం. పిల్లలకు నైట్ డ్రస్సులు కావాలని అక్క అనడంతో ఆ ఫ్లోర్‌లోనే మరో వైపుకు వెళ్లాం. ఇంతలో ఏదో డిజిటల్ కెమెరాకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పదే పదే వినిపిస్తోంది... డిజిటల్ కెమెరా అనగానే నేను వెంటనే నా హ్యాండ్‌బ్యాగును తడుముకున్నాను. (షాపింగ్‌కు వెళ్ళి, అలాగే బీచ్‌కు కూడా వెళ్లాలని అనుకున్నాం కాబట్టి, నా బ్యాగులో నేను డిజిటల్ కెమెరాను తీసుకెళ్లాను). నాది నా దగ్గరే ఉంది కదా..! ఏదోలే అనుకుంటూ ఉండిపోయాను.

మళ్ళీ మళ్లీ అదే అనౌన్స్‌మెంట్... ఎవరైనా పోగొట్టుకున్నట్లయితే కింది ప్లోర్‌కు రమ్మని దాని సారాంశం. ఏదో కెమెరా అంటున్నార్రా..? అంటూ నా బ్యాగ్ తీయబోయేసరికి... ఆ.. ఎవరో అక్కడ ఫోటోలు తీశారటలేమ్మా...! అందుకే అలా చెబుతున్నారు... మనం కాదుకదా...! అని మా అబ్బాయి అనడంతో నేను ఊరకుండిపోయాను. మళ్లీ షాపింగ్‌లో మునిగిపోయాము.

అక్కడే బాగా లేటవడంతో ఇక బీచ్ ప్రోగ్రాం‌ను క్యాన్సిల్ చేసేసి ఇంటికి వెళ్లి, వండుకుని తినేసి ప్రశాంతంగా పడుకుండిపోయాము. మరుసటిరోజు ఆఫీసుకు బయలుదేరబోతుంటే... అమ్మా బ్యాగులో కెమెరా ఎందుకు? తీసి ఇంట్లో పెట్టేసేయ్ అన్నాడు మావాడు.

అవును కదా...! అనుకుంటూ హ్యాండ్‌బ్యాగు ఓపెన్ చేశాను. అంతే... ఒక్కసారిగా షాక్ తిన్నాను... కంగారుగా బ్యాగులోని వస్తువులన్నింటినీ తీసి కిందపడేశాను. బ్యాగు మొత్తాన్ని విదిలించాను. ఇంకేముంది కెమెరా పోయిందంటూ కుప్పగూలిపోయాను.


నా కంగారును చూసిన అందరూ ఏమైంది అంటూ నా దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. డిజిటల్ కెమెరా పోయింది? బ్యాగులో కనిపించటం లేదు అన్నాను. ఇంతలో అమ్మ... "ఒకటా, రెండా పదివేల రూపాయలు వద్దంటే పోసి కొన్నారు. ఇప్పుడు పోయిందే" అంటూ బాధపడుతూ కూర్చుంది.

మా ఆయన ఏమంటాడో అని నాకైతే నోటమాటరాలేదు. ఏం చేయాలి? ఎక్కడ వెతకాలి అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాను. అప్పుడే క్రితం రోజు శరవణా స్టోర్స్ అనౌన్స్‌మెంట్ గుర్తొచ్చింది. డౌట్ లేదు. అది ఖచ్చితంగా మాదే అయి ఉంటుందని వెంటనే శరవణా స్టోర్స్ ఫోన్ నెంబర్ వెతకమని మా అబ్బాయికి చెప్పాను.

ఆ స్టోర్స్ కవర్‌పైనుండే నెంబర్‌ను తీసుకుని వెంటనే మావాడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అవునా సార్..! మేము నిన్ననే చాలాసేపు అనౌన్స్ చేశాము మీరే రాలేదు. సరే మా మేనేజర్‌ను కలవండి ఆయన మిగిలిన విషయాలు చెబుతాడని ఫోన్ పెట్టేశాడు.

నేనూ, మా అబ్బాయి గబాగబా ఆటో పట్టుకుని శరవణా స్టోర్స్‌కు పరుగులు తీశాము. అక్కడి మేనేజర్‌ను కలిసి విషయం చెప్పగానే... ఆయన నన్ను, నా హ్యాండ్‌బ్యాగును గుర్తుపట్టాడు. (ఆ కెమెరాలో ఉన్న మా ఫ్యామిలీ ఫోటోలను ఆయన చూశాడు). మీ కెమెరా ఉంది ఎక్కడికీ పోలేదు అని ఆయన అనడంతో కాస్తంత కుదుటపడ్డాము.

"మీరు పైకెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్లారు. మీ పక్కనే ఓ లేడీ పిక్ పాకెటర్ కూడా లిఫ్ట్‌లోకి వచ్చి నిల్చుంది. మెల్లగా మీ హ్యాండ్‌బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి కెమెరాను కొట్టేసింది. మీ కెమెరా స్లిమ్‌గా ఉండటంతో డబ్బు కట్ట అనుకుని పొరపాటుడిందామె. పాపం ఈ దొంగగారికి మా స్టాఫ్ తననే వెంబడిస్తున్నారని, మా సీసీ కెమెరాల్లో క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారని తెలియక మాకు పట్టుబడిపోయింది." జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు మేనేజర్.

వాళ్లు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి... "ఎలాగైతేనేం మా కెమెరా మాకు దొరికింది. ఇవ్వండి సార్...! మాకు ఆఫీకు టైం అవుతోంది. అసలే ఫర్మీషన్ అడిగి వచ్చాము" అన్నాను నేను. కెమెరా ఇక్కడెక్కడుందమ్మా...! మేము నిన్నరాత్రే పాండీబజార్ పోలీస్‌స్టేషన్లో.. దొంగను, కెమెరాను అప్పగించేశాం. మీరు అక్కడికి మాతో పాటు వచ్చి కంప్లెయింట్ రాసివ్వాలని చెప్పాడతను.

ఇక చేసేదేంలేక తిరిగీ ఆఫీసుకు ఫోన్ చేసి ఫర్మీషన్ అడిగి పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాము. అక్కడి ఎస్సైను కలిసి జరిగిందంతా చెప్పి మా కెమెరాను ఇవ్వమని అడిగా. అది అలా కుదరదమ్మా...! దొంగ దొరికింది కాబట్టి.. దొంగను, ఈ వస్తువును మేము కోర్టుకు హ్యాండోవర్ చేయాలి అన్నాడు.

మళ్లీ అతనే.. మీరు జరిగిందంతా చెబుతూ కంప్లెయింట్ రాసివ్వండి.. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మీ ఫోన్ నెంబర్‌ అడ్రస్సును కూడా ఇచ్చివెళ్లండి... తరువాత మేము కబురు చేస్తాము. ఆపై మీరు కోర్టుకెళ్లి, పిటీషన్ వేసి మీ వస్తువును మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు.

అయ్యో..! ఇంత తతంగముందా... అనుకుంటూ కంప్లైయింట్ రాసిచ్చేసి ఆఫీసుకెళ్లిపోయాను. ఆతరువాత చాలారోజుల దాకా ఈరోజుగానీ, రేపుగానీ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాను... రోజులు నెలలైనాయి... ఫోన్ మాత్రం రాలేదు....!! మా కెమెరా మీద నాకు ఆశ కూడా చావలేదు....!!!


(సశేషం...)

Tuesday, 12 October 2010

టీవీ స్విచ్.. తాత చేతికర్ర...!

ఆఫీసు నుంచి పని ముగించుకుని ఈసురోమంటూ ఇంటికి బయల్దేరాను. ఆఫీసు దాటి కాస్తంత దూరం వెళ్లగానే నేను ఎక్కాల్సిన యం12సి బస్సు కాస్తా నన్ను దాటుకుని ముందుకు పరుగులు తీసింది. చేసేదేం లేక బస్టాప్‌దాకా నడచి అక్కడ 12జి బస్సు పట్టుకుని ఎలాగోలా ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరగానే మా పింకీ ఎదురొచ్చి బాగా అలసిపోయావా..?! అంటూ నా బ్యాగ్ అందుకుని తాగడానికి నీళ్లిచ్చింది. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ...! పింకీ మా అక్క కూతురు. కొన్ని రోజులు మాతో ఉండేందుకు వచ్చింది. వరుసకు నాకు కూతురైనప్పటికీ దానికీ, నాకూ ఓ నాలుగేళ్ల తేడా మాత్రమే ఉంటుంది.

లెక్కలేనన్ని కబుర్లూ, చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ చాలా సరదాగా ఉంటాం మేమిద్దరం. దాని కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటూ ఉంటుంది. ఏదేని సమస్యలొచ్చినప్పుడు నన్ను సలహా కూడా అడుగుతూ ఉంటుంది. నేను కూడా పెద్ద ఆరిందాన్నిలా తోచిన సలహా ఇచ్చేస్తుంటాను.

ఆరోజు ఓ చిన్న విషయంపైకి మా ఇద్దరి చర్చ మళ్లింది (పర్సనల్ కాబట్టి వివరాలు మాత్రం చెప్పలేను). ఆ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. ముందు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడటం లేదు. ఈ విషయంలో ఇప్పటికే నువ్వు చాలా సార్లు మాట తప్పావు కాబట్టి నిన్ను నమ్మను. నామీద ఒట్టేసి చెబితేగానీ ఈసారి నమ్మేది లేదు అంటూ ఓ చిన్నపాటి క్లాస్ పీకడం మొదలెట్టాను పింకీకి.

పాపం అది బిక్కమొహం వేసి... నీకూ, మా అన్నకూ ఎప్పుడూ ఇదే భయం. చెబితే వినరు, నమ్మరు. "అమ్మా...! అసలు దాన్నెప్పుడూ నమ్మవద్దంటూ" వాడెప్పుడూ అమ్మకు చెబుతుంటాడు కూడా...! మీకెందుకంత సందేహం. నేను మంచి అమ్మాయిని కదా..! ఈసారి మాట తప్పనులే అంటూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది పింకీ.

కానీ నేను మాత్రం నా బెట్టు వీడలేదు సరికదా... మరింత కోపంగా బుంగమూతితో కూర్చున్నాను. సీరియస్ వాతావరణాన్ని ఎలాగైనా సరే చల్లబర్చాలనుకున్న పింకీ...

పిన్నీ పిన్నీ...! ఓసారి నువ్వు ఇంట్లో లేనప్పుడు జరిగిన ఓ విషయాన్ని చెప్పనా..?! అంటూ మొదలెట్టింది. ఏంటబ్బా..! అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. అది చూసిన పింకీ ఇంకాస్త ఉత్సాహంగా... ఆరోజు ఇంట్లో నాకూ, అక్కకూ, అన్నకూ ఓ పెద్ద గొడవైంది...... అంటూ ఆగింది.

"ఏంటో..." అన్నట్లుగా మొహం పెట్టాను నేను. ఏదో చిన్న విషయం దగ్గర మొదలైన గొడవ టీవీ దగ్గర ఆగిపోయింది అని చెప్పింది. "టీవీదగ్గరా...?" అని అడిగాను. అవును.. "మాటా మాటా పెరిగి నేను అసలు ఇకపై టీవీ స్విచ్ ముట్టుకునేదే లేదని తెగేసి చెప్పేశాను" అంది పింకీ.

"సర్లే..! గొడవపడైనా మంచిపని చేశావు. అలాగైనా బుద్ధిగా చదువుకుంటావు కదా..!" అన్నాను. "అమ్మా....! ఆశ, దోశె, అప్పడం, వడా...! అలాగేం జరగలేదు తెలుసా..?!" అంటూ అల్లరిగా చెప్పడం ఆపింది పింకీ.

"ఇంకేం జరిగిందే...!" అన్నాను ఆసక్తిగా... "గొడవ జరిగిన ఓ రెండు మూడు రోజులు ఇంట్లో అంతా సర్దుకుంది. అందరం ఒకరితో ఒకరం మాట్లాడేసుకుంటున్నాం... అయినా నేను టీవీ స్విచ్ ముట్టుకోనని చెప్పేశాను కాబట్టి ఆ గండం నుంచి కూడా ఎలాగైనా సరే బయటపడాలి కదా...! అని ఆలోచించాను.." చెప్పుకుపోతోంది పింకీ.

"టీవీ స్విచ్ చేతితో కదా ముట్టుకోకూడదు. ఇలా ఎందుకు చేయకూడదని ఆలోచించాను. అటకపైనుండే తాత చేతికర్రను తీసి టీవీ స్విచ్ ఆన్ చేయడం మొదలెట్టాను" చెప్పడం ఆపి నావైపు చూసింది పింకీ... అసలే గుర్రుగా ఉన్న నేను అది చెప్పిన మాట విని నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వేశాను.

నాతో జతకలిపిన పింకీ కూడా నవ్వుతూ... "ఆరోజు ఇంట్లో కూడా అందరూ ఇలాగే నవ్వారు పిన్నీ..." అంటూ నా మెడ చుట్టూ చేతులేసి, చక్కిలిగింతలు పెట్టేసి... మా ఇంటిని నవ్వులతో నింపేసింది ఆ అల్లరి అమ్మాయి.

Saturday, 9 October 2010

ఓ వర్షం కురిసిన రాత్రి....!

ఈరోజు ఎలాగైనా సరే బీచ్‌కు వెళ్ళాల్సిందే అనుకుంటూ...(అలా చాలా రోజులుగా అనుకోవడమేగానీ వెళ్లింది లేదు) ఆఫీసులో పని ముగించుకుని త్వరగా బయటపడ్డాం. నేనూ, మా అబ్బాయి, మావాడి ఫ్రెండ్ కలిసి బీచ్‌కు వెళ్దామనుకున్నాం. బస్‌స్టాప్‌లో ఎంతసేపు వెయిట్ చేసినా బస్‌ రాలేదు. మా వాడి ఫ్రెండ్‌కు ఇంకో ఫ్రెండ్ జతకలవడంతో సినిమాకు తుర్రుమన్నాడు. (వాడెప్పుడూ అంతే..!) ఇంకేముంది... ఎప్పట్లాగే ఆరోజు కూడా బీచ్‌కెళ్లే ప్రోగ్రామ్ అటకెక్కేసింది.

ఓ గంటసేపటి తరువాత బస్ రావడంతో బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాం. టీవీ పెట్టుకుని ఏదైనా ఓ మంచి ప్రోగ్రామ్ అయినా చూసేద్దాం అనుకుంటే... కేబుల్ కూడా సరిగా రావడం లేదు. ఇంక చేసేదేంలేక వీసీడీ ఆన్ చేసి హిందీ పాటలు పెట్టుకుని మిగతా పనుల్లో మునిగిపోయాను.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కేబుల్ రాకపోయినా, బీచ్‌కెళ్లకపోయినా మా అబ్బాయికి దిగులేం లేదండీ... ఎందుకంటే వాడికి ఇంట్లో కంప్యూటర్.. అందులో ఓ క్రికెట్ గేమ్ ఉంటే చాలు. ఆ గేమ్ ఆడుతూ అలా గంటలు గంటలు గడిపేస్తాడు. కాబట్టి... ఆరోజు వాడేం బాధపడలేదు సరికదా... క్రికెట్‌లో లీనమైపోయాడు.
వంట పూర్తిచేసి, మా ఆయన కోసం ఎదురుచూస్తుంటే... ఆయన రాలేదుగానీ ఫోన్ మాత్రం వచ్చింది. అందులో ఆయనే... నేను రావడం లేటవుతుంది. మా ఫ్రెండ్స్ ఇంటికెళుతున్నాను. మీరిద్దరూ తినేసి పడుకోండి అని చెప్పాడు. మరుసటిరోజు ఆదివారం, మా అబ్బాయి ఓ ఫంక్షన్‌కు వెళ్ళాల్సి ఉండటంతో.. త్వరగా తినేసి పడుకున్నాం.

మరుసటిరోజు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి, అబ్బాయిని ఫంక్షన్‌కు పంపేశా, మా ఆయన కూడా జర్నలిస్టుల సంఘం మీటింగ్ ఉందంటూ వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కదాన్నే... పని మాత్రం బోలెడు. వంట, ఇల్లు చక్కబెట్టుకోవడం, వారం రోజుల బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ ఓ వైపు పిలుస్తుంటే... నిద్రాదేవి కూడా నన్ను ఊరికే ఆవరించేస్తోంది.

ఏమైతే అయిందని వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి ఆన్‌చేసి, పడుకున్నాను. బాగా నిద్రపట్టేసింది. అలారం మోగుతున్నా నేను మాత్రం లేవలేకపోయాను. ఎలాగోలా లేచి వంటపూర్తి చేసేసరికి మా ఆయన, అబ్బాయి వచ్చేశారు. ఇద్దరికీ భోజనాలు వడ్డించి మళ్లీ పనిలో మునిగిపోయాను.

ఇక సాయంత్రం టీ టైం‌లో అమ్మా.. బీచ్‌కెళ్దామా..?! అని అడిగాడు మావాడు. మా ఆయన నేను రాను, సెలూన్‌కెళ్లాలి.. మీరిద్దరూ వెళ్లి వచ్చేయండి అన్నాడు. అంతకుముందే కరెంట్ పోవడంతో బట్టల పని ఆగిపోయింది, పిండి రుబ్బాలి, గలేబులు మార్చాలి... ఇవన్నీ పక్కనబెడితే అబ్బాయి ఆశగా అడుగుతున్నాడు. వాడికోసమైనా వెళ్లాల్సిందే అనుకుంటూ బయలుదేరాను.

హమ్మయ్య...! చాలా రోజుల నుంచీ బీచ్‌కెళ్లాలన్న కోరిక ఆరోజు తీరిపోయింది. సముద్రంలో వెన్నెల వెలుగులో పెద్ద పెద్ద అలలు స్పష్టంగా, అందంగా కనిపిస్తున్నాయి. ఏవేవో కబుర్లు చెప్పుకుని, కాల్చిన మొక్కజొన్న కండె చెరిసగం తినేసి ఇంటికొచ్చేశాం.

మిగిలిపోయిన పనులను పూర్తిచేసే కార్యక్రమంలో నేను... ఓ ఇంగ్లీషు అనువాదపు సినిమాను చూస్తూ అందులో మునిగిపోయిన అబ్బా, కొడుకులిద్దరూ... ఈలోపు నేనున్నానంటూ జోరున పెద్ద వర్షం. బెడ్‌రూంలో కిటికీలు వర్షపు గాలికి ఊరికే కొట్టుకుంటుండటంతో వేసేందుకు వెళ్లాడు మా ఆయన.

ఎంతసేపటికి ఆ రూం నుంచి ఆయన బయటకు రావడం లేదేంటబ్బా అనుకుంటూ నేనూ మా అబ్బాయి వెళ్ళాము. ఏముంది చక్కగా ఆ రూంలో లైట్ ఆపివేసి కిటికీలోంచి బయట ఏపుగా పెరిగిన మునగచెట్టు నుంచి ఆకులు, కాయలు అందినకాడికల్లా తెంపుతూ కూర్చున్నాడాయన.

(మామూలు రోజుల్లో మునగచెట్టు కిటికీకి పక్కగా ఉన్నప్పటికీ అందేది కాదు. ఆరోజు జోరున వర్షం, హోరుగాలికి అది ఊగుతూ బాగా చేతికి అందింది. అలా మా ఆయన చేతికి అది దొరికిపోయింది... పాపం...!!)

అదలా ఉంచితే... తనకు తోడుకు కొడుకును కూడా పిలిచాడు మా ఆయన. నేను రానని వాడంటే... వస్తావా రావా అంటూ కోప్పడటంతో వాడూ వెళ్లి సాయం చేశాడు. మొత్తానికి కాస్తంత ఆకు, మునక్కాయలు కోసేసి గబగబా కిటికీలు వేసేసి వచ్చేశారు. బయట పదిరూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా... ఇలాంటి పని ఎందుకని నేను కోప్పడ్డాను.

దొంగతనం చేసి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది తెలుసా..? అయినా నువ్వు పల్లెటూర్లో పుట్టి పెరిగుంటే కదా.. తెలిసేందుకు అని నన్నే మా ఆయన ఎగతాళి చేశాడు. ఇంతలో మావాడు ఊరుకుంటాడా..? అమ్మా... ఆయన పల్లెలో పుట్టాడు కాబట్టి ఇలాంటివన్నీ బాగా అలవాటేలే...! అంటూ నవ్వుతూ సెటైర్ వేశాడు. నాకు నవ్వాగలేదు... మొదట గుర్రుగా చూసినా మా ఆయన కూడా నవ్వుతూ మాతో జతకలిపాడు.

Friday, 8 October 2010

నా హృదయాంతరాళాల్లో...!



నా హృదయాంతరాళాల్లో...
ఓ స్థానం ఎప్పుడూ నిండుగా ఉంటుంది
అది నాకు మాత్రమే తెలుసు
ఎందుకంటే, ఆ స్థానం.......
ప్రేమతో నిండిపోయింది
నా కుటుంబంతో నిండిపోయింది

నేను ఎక్కడికెళ్ళినా, ఎక్కడ ఉన్నా...
ఎవరెంత దూరంలో ఉన్నా....
ఆ ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది
అది నా బాధ్యతను గుర్తు చేస్తుంది

ఆ ప్రేమ నన్ను ఎప్పుడూ....
సంతోషంగా ఉంచుతుంది
బ్రతుకుమీద ఆశను కల్పిస్తుంది
మా కోసం నువ్వు కావాలంటూ...
నన్నెప్పుడూ బ్రతికిస్తుంటుంది.....!