Pages

Tuesday, 26 February 2013

ఆ ఇంట్లో జరిగింది ఇదీ....!!



మత్తుగా కమ్ముకుంటున్న నిద్రలా... చిక్కని చీకటి ఓ రాత్రిని ఆబగా ఆక్రమించుకుంటోంది. ఊరి చివర ఆ ఇంట్లో అందరూ నిదురమ్మ ఒడిలో హాయిగా సేదదీరుతున్నా... ఒకరు మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నారు.

కొన్నాళ్లుగా ఇంట్లో జరుగుతున్న తంతు గురించి విని పెద్దగా పట్టించుకోకపోగా.. పైగా తనివితీరా వేళాకోళం చేస్తూ నవ్విన సందర్భాల్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతున్నాడు. అరెరే... ఇన్నాళ్లుగా అక్క చెప్పినా వినలేదు, అమ్మ చెప్పినా వినలేదు.. కానీ పదే పదే జరుగుతున్న ఆ సంఘటనల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు.. అంటూ తనలో తానే తిట్టుకుంటున్నాడు. 

ఇంతలా బాధపడుతున్న శాల్తీ పేరు ఆనంద్. సీత తమ్ముడు. ఊరికి దగ్గర్లోని ఓ మోస్తరు టౌన్లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పల్లెటూరి వాతావరణంలో చిన్నప్పటినుంచీ పెరిగిన అందరిలాగే తను కూడా దెయ్యాలు, భూతాలంటే ఓ రకమైన భయాన్ని పెంచుకున్నాడు. తమ ఇంట్లో జరుగుతున్న వాటన్నింటికీ అవే కారణమని నమ్మాడు. అయితే అమ్మ పెద్ద పెద్ద భూతవైద్యుల దగ్గర ఎన్నో రకాల పూజలూ, మంత్రాలూ, తంత్రాలూ, యంత్రాలూ... ఎవేవో చేసినా.. మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదురవుతుండటంతో అది కారణం అయి ఉండక పోవచ్చు అనే అనుమానం బలపడసాగింది అతనికి.

కానీ ఆ అనుమానం తీర్చుకునేదెలా... పోనీ దెయ్యాలు, భూతాలు కారణం కాకపోతే... అమ్మ, అక్క ఎందుకలా బాధపడుతున్నారు. కుటుంబానికి కానివారు ఎవరైనా కక్ష పెంచుకుని ఇలా చేస్తున్నారేమో అనుకునేందుకు తమకు ఎవరూ శత్రువులు లేరే. మరి ఎందుకు, ఎవరు ఈ పని చేస్తున్నట్లు... ఎవరైనా మనుషులే ఈ పని చేస్తున్నారా లేక మరింకేదైనానా... బుర్ర నిండా ఒకటే ఆలోచనలు... ఆ రాత్రంతా అలాగే ఆలోచిస్తూ.. ఎప్పుడు నిద్రపట్టేసిందో ఏంటో... పొద్దున్నే వాళ్ల నాన్న తట్టి లేపేదాక లేవనేలేదు.

కంగారుగా లేచిన ఆనంద్.. "అమ్మ ఇవ్వాళ ఎలా ఉందో ఏంటో... నిద్రపోయిందో, లేక మళ్లీ ఏదైనా ఆకారం మీదపడి గొంతు నొక్కబోయిందో ఏంటో.. అనుకుంటూ వంటింట్లోకి పరిగెట్టాడు. అక్కడ ప్రశాంతంగా పనులు చేసుకుంటున్న తల్లిని చూడగానే.. హమ్మయ్యా రాత్రేం జరగలేదన్నమాట అనుకుంటూ..." ఉరుకులు పరుగులతో తయారై కాలేజికి వెళ్లిపోయాడు.

రాత్రి నిద్ర మేలుకున్న ఫలితమో, లేక ఆలోచనల అలజడో తెలీదుగానీ క్లాసు రూంలో సొమ్మసిల్లినట్లు పడిపోయిన ఆనంద్‌ని నీళ్లు చల్లి తట్టి లేపాడు అతని క్లోజ్ ఫ్రెండ్ నీరజ్. ఏంట్రా ఏమైంది.. రాత్రంతా మేలుకున్నావా ఏంటి..? వాడిపోయిన ఆనంద్ ముఖంలోకి చూస్తూ అడిగాడు. అదేం లేదురా.. చిన్న సమస్య అందుకే అన్నాడు. సరే.. క్లాస్‌కి టైం అయ్యింది, సర్ వచ్చేస్తారు.. క్లాస్ అవగానే మాట్లాడుకుందాం... నువ్వేం దిగులుపడకు అని ధైర్యంచెప్పి ఓదార్చాడు నీరజ్.

క్లాస్ అయిపోగానే ఇద్దరూ అలా నడుచుకుంటూ గ్రౌండ్‌లోకి చేరుకుని ఓ బెంచ్‌పై కూలబడ్డారు. ఇప్పుడు చెప్పురా ఏమైందో అంటూ మొదలెట్టాడు నీరజ్. వెంటనే... చిన్నప్పటినుంచి తన అక్కకి జరిగింది, ఇటీవలి కాలంలో అమ్మకి జరుగుతోంది.. అన్నీ ఒక్కొక్కటిగా విడమర్చి చెప్పాడు ఆనంద్. వీటన్నింటికీ కారణం దెయ్యాలు, భూతాలు కాదని తేలిపోతోందిరా.. కానీ కారణం ఏదో ఉంది.. అది కనుక్కోవాలి. ఎలాగో తెలీటం లేదు అని వాపోయాడు.

కాసేపు ఆలోచనల్లో పడిపోయిన నీరజ్.. ఒరేయ్ మా డాడీని అడుగుదామా.. ఒకవేళ ఆరోగ్యపరమైన కారణాలు ఏవైనా ఇందుకు కారణమేమో... ఓసారి అడిగితే తెలుస్తుంది కదా... అని అన్నాడు. అప్పటిదాకా అస్సలు ఆ ఆలోచనే లేని ఆనంద్‌కి అది సరైందిగానే అనిపించింది. ఓసారి అడిగితే ఏం పోతుంది.. అయితే ఇంటికెళ్దాం పదా అంటూ హడావుడిగా బయల్దేరదీశాడు.

మధ్యాహ్నంపూట కాస్తంత విశ్రాంతిగానే ఉండే నీరజ్ తండ్రి.. మమ్మల్ని చూడగానే ఏంటి ఈ టైంలో ఇలా వచ్చారన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు మమ్మల్ని. వెంటనే అందుకున్న నీరజ్.. డాడీ మావాడికి ఏదో హెల్త్ ప్రాబ్లెం అట.. మిమ్మల్ని వెంటనే కలవాలి అంటే ఇలా వచ్చాం అన్నాడు. అవునా... ఏం ఆనంద్.. ఏం బాలేదు ఒంట్లో అని అడిగాడు.

అంకుల్... అదీ.. అదీ... అంటూ మరేం మాట్లాడలేకపోతున్న ఆనంద్ పరిస్థితిని అర్థం చేసుకున్న నీరజ్ తండ్రి... మరేం ఫర్వాలేదు చెప్పు ఆనంద్ అన్న మాటలు కాస్తంత ధైర్యాన్నివ్వగా... నాకేం ప్రాబ్లెం లేదు అంకుల్... ఇంట్లోనే ప్రాబ్లెం అంతా.. అంటూ.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అలా వింటున్న డాక్టర్ గారి ముఖంలో రంగులు మారుతుండటం గమనించారు ఇద్దరు స్నేహితులు.

అంతా విన్న డాక్టర్... కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మెడికల్ పరిభాషలో మీరు చెబుతున్న సమస్యలకు చాలా చాలా కారణాలున్నాయండ్రా... అవన్నీ మీకు చెబితే అర్థం అవుతాయో లేదో అన్నాడు.

మేం మరీ చిన్నపిల్లలం కాదుగా డాడీ.. అర్థం చేసుకుంటాం చెప్పండి.. అన్నాడు నీరజ్. మీరు అర్థం చేసుకుంటే అంతకంటే ఇంకేం కావాలి. అయితే ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది చెప్పండి. పల్లెటూళ్లలో చిన్నప్పటినుంచీ ఓ రకమైన భయాలకు, భీతికి అలవాటుపడిన వాళ్లకి అర్థం చేయించటం, మార్చటం అంత తేలికైన పని కాదు కదా.. అంటూ నిట్టూర్చాడు డాక్టర్.

నిజమే అనుకోండి.. ముందు సమస్యకు కారణం తెలిస్తే.. మెల్లి మెల్లిగా అర్థం చేయించే ప్రయత్నం చేయవచ్చు కదా అంకుల్... చెప్పండి.. నా ప్రయత్నం నేను చేస్తాను... పదే పదే చెబుతుంటే.. ఏదో ఒక రోజు వినకపోరు... అర్థం చేసుకోకపోరు కదా... అన్నాడు ఆనంద్.

సరే ఆనంద్... తప్పకుండా చెబుతాను.. నువ్వు చెప్పిన సంఘటల గురించి వింటుంటే... "మీ అక్కకి, అమ్మకీ డెల్యూషనల్ పర్సెప్షన్( delusional perception) అనే మానసిక జబ్బుందేమో అనిపిస్తోంది. It is a false, fixed belief of a perception.. అంటే : ఒక తాడు కనిపిస్తే, వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఆ తాడుతో ఎవరో తమ గొంతు నులిమేస్తారనో, తమ కాళ్ళు చేతులు కట్టేస్తారనో అనే భయాలు మొదలౌతాయి. అలాంటివి ఏమీ జరగవని ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇది ఒక కారణం.

అలాగే... మామూలుగా రాత్రి పడుకున్న తర్వాత... ఆహారపుటలవాట్లను బట్టి కొందరికి కడుపులోని ఆమ్లాలు గొంతులోకి ఎగదన్నడం జరుగుతుంది. దీన్నే గాస్ట్రో ఇంటెస్టైనల్ రిఫ్లెక్స్ డిసీస్(G.E.R.D) అని అంటారు. గొంతు పట్టేసినట్లు అవడం, చాతీలో విపరీతమైన నొప్పి, కొన్నిసార్లు ఊపిరి తీసుకోలేకపోవడం ఇలాంటివి దాని లక్షణాలు. G.E.R.D పేషెంట్‌కి డెల్యూషనల్ పర్సెప్షన్ కూడా తోడైతే, మీ అక్కకి జరుగుతోంది చూడు అలా అవుతుందన్నమాట.

మరికొందరికి వాళ్ళకొచ్చే పీడ కలలు కూడా ఇలాంటివి రావడానికి కారణామౌతుంటాయి. ఇకపోతే మీ అక్కకిలాగే, మీ అమ్మకి కూడా ఇలాగే ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నించుకుంటే.. పైన చెప్పినట్లుగా పీడకలలు రావడం, కూతురు పడుతున్న బాధను తట్టుకోలేకపోడం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చు.

ఇంకొందరికి.. గాఢనిద్రలో ఉండగా, బాగా బిగదీసుకుపోయి పడుకోవటం మూలంగా.. రక్త ప్రసరణ సరిగా జరగదు. అలాంటి సమయాల్లో కూడా మీ అక్కకి జరిగినట్లుగా జరిగే అవకాశం ఉంది. అది పూర్తిగా ఓ మాసికమైన స్థితే తప్పిస్తే.. దానికి వ్యక్తులుగానీ, ఏ భూత, ప్రేత, పిశాచాలుగానీ కారణం కానే కాదు.

అర్థమవుతోందా.. లేదా... అన్నట్లు ప్రశ్నార్థకంగా ఆనంద్ ముఖంలోకి చూశాడు డాక్టర్. అమ్మో.. ఇన్ని కారణాలున్నాయా అన్నట్లు ముఖంపెట్టి... శ్రద్ధగా, జాగ్రత్తగా వింటున్న ఆనంద్‌ని చూడగానే నమ్మకం కుదిరిన అతను మళ్లీ చెప్పసాగాడు.

పైన చెప్పుకున్నవన్నీ వేటికవే విభిన్నమైన లక్షణాలు ఆనంద్. ఒకటే రోగమనీ, అదే కారణమని మనం నిర్ధారించలేము. వీటికి మానసికపరమైన కారణాలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. శ్వాస కోశ సంబంధ వ్యాధులున్న(sleep apnea) వారికి నిద్రలో మెదడుకి ఊపిరందక ఎవరో తమని చంపుతున్నారు అని అనిపించేదాకా వెళుతుంది. అయితే ఇది చాలా రేర్‌గా జరుగుతుంటుంది.

ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కారణాలు లేదా వ్యాధులు.. ఎక్కువగా మహిళలో కనిపించేవి. మహిళలకు మాత్రమే పరిమితమైన వ్యాధులు అని కూడా చెప్పవచ్చు. కుటుంబ నేపథ్యం, వాళ్ల వాళ్ల పరస్పర సంబంధాలు, కుటుంబంలో లేదా జీవితంలో అనుభవించిన స్వేచ్ఛా రాహిత్యం ఇత్యాధి కారణాలు కూడా ఇలాంటి వ్యాధులకు కారణం అయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా మహిళలు వెల్లకిలా పడుకున్నప్పుడే అలా అనిపిస్తుంది. ఆరాంగా కుర్చీలో పడుకుంటే అలా అనిపించే అవకాశం ఉండదు.. అంటూ చెబుతున్న మాటలకు అవునన్నట్లుగా.. అవును అంకుల్.. అక్క చెప్పేది.. కానీ మేమే ఎవరం పట్టించుకునేవాళ్లం కాదు అన్నాడు ఆనంద్. మీరు చెప్పేదే కరెక్ట్ అయితే.. మరి అమ్మ మాత్రం ఎలా పడుకున్నా అలాగే ఉంటోందని చెబుతోంది కదా అంకుల్ అంటూ కొనసాగించాడు.

గొంతు, శ్వాస కోశ సంబంధ వ్యాదులూ, చిన్నప్పటి భయాలూ, కొన్ని ఇతర కారణాలూ తప్ప.. ఇంకేం ఉండవు ఆనంద్. ఆ లక్షణాలు వయస్సుతో పాటు మారవచ్చు.. మారుతాయి కూడా... ముక్తాయింపుగా అన్నాడు డాక్టర్.

గొంతు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు... అంటే ఆస్త్మా, సైనస్, ట్రాన్సిల్స్ లాంటివన్నీ అవే కదా అంకుల్ అన్నాడు ఆత్రుతగా అడిగాడు ఆనంద్. అవును ఆనంద్ అవే. ఇవన్నీ మీవాళ్లకి ఉన్నాయా అని అడిగాడు. అవునంకుల్.. అక్కకి చిన్నప్పటినుంచీ సైనస్, ట్రాన్సిల్స్.. అమ్మకి ఆస్త్మా... ఊపిరి అందక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేది వింటుంటే.. ఈ కారణాల వల్లనే వాళ్లకి అలా అవుతోందని అనిపిస్తోంది.

నీరజ్ మీ దగ్గరికి తీసుకురావడం చాలా మంచి పనైంది అంకుల్. నిజంగా చాలా విషయాలు చెప్పారు. మేము కూడా తెలుసుకోవడం మంచిదే అయింది. లేకపోతే... చదువుకుంటున్న మేం కూడా దెయ్యాలు, భూతాలు అంటూ ఆ భ్రమలోనే బ్రతికేయాల్సి వచ్చేది. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్.. కృతజ్ఞతలు చెప్పాడు ఆనంద్. దానిదేముందిలే బాబూ... ఎలాగూ వచ్చారు.. లంచ్ టైం అయ్యింది కదా.. తినేసి ఒకేసారి క్లాస్‌కి వెళ్లండి అని.. కాసేపు నడుం వాల్చి మళ్లీ క్లినిక్‌కి వెళ్లాలి కదా అనుకుంటూ పక్క గదిలోకి వెళ్లిపోయాడు డాక్టర్.

మనసులోని పెద్ద భారం దిగగా.. తృప్తిగా భోంచేసిన ఆనంద్... మధ్యాహ్నం నుంచి నీరజ్‌తో కలిసి క్లాసులు ఉత్సాహంగా విన్నాడు. ఇద్దరూ కలిసి మిత్రులతో కాసేపు అల్లరి చేసారు. సాయంత్రం ఎవరి ఇళ్లకు వాళ్లు బయల్దేరారు. ఆనంద్ కూడా ఉత్సాహంగా ఇంటికి బయల్దేరాడు.

బయల్దేరాడేగానీ... దెయ్యాలు, భూతాలు అంటూ భయంతో బ్రతికేస్తున్న అక్కని, అమ్మని.. వాళ్లలాంటి మరికొందరికి ఈ విషయం అర్థం చేయించటం ఎలా.. ఎలా చేప్తే వింటారన్న ఆలోచనలు మాత్రం వీడలేదు. వెంటనే అర్థం చేసుకోలేకపోయినా.. మెల్లి మెల్లిగా అర్థం చేసుకుంటారనే ఆశ మాత్రం ఉంది. అది చాలదా వాళ్లని మార్చేందుకు... మార్చాలి అని మనసులో దృఢంగా అనుకుంటూ.. ధైర్యంగా ఇంట్లో అడుగుపెట్టాడు.

"అమ్మా.. ఎక్కడున్నావ్....?" అంటూ................

(మొదటి భాగంలో రాసిన కొన్ని సమస్యలకు, సందేహాలకు వైద్యపరంగా విలువైన సమాచారం, ఇతరత్రా సహాయం అందించిన ఫేస్‌బుక్ మిత్రులు డాక్టర్ వంశీధర్ రెడ్డి, మరియు మరికొందరు మిత్రులకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు)

Monday, 18 February 2013

ఆ ఇంట్లో ఏం జరుగుతోంది...?




ఊరికి చివరగా ఓ పూరిల్లు...

ఇంకా విద్యుత్తు వెలుగులు పలుకరించని ఆ ఇంట్లో కిరసనాయిలు బుడ్డీ.. వెన్నెల వెలుగులంత స్వచ్ఛంగా హాయిగా నవ్వుతోంది. అంతలోనే నల్లని మబ్బులతో వేళాకోళం ఆడుతున్న రాత్రమ్మకు నిద్రొచ్చింది. చిక్కటి చీకటితో చెలిమి చేసిన రాత్రమ్మకు తోడుగా ఒంటరి ఆ పూరిల్లూ మత్తుగా జోగేందుకు సిద్ధమైంది.

"అమ్మలూ... ఇటొచ్చి పడుకోవే.."

"వుహూ.. ఇయ్యాల నేను నీతో పడుకోను పో.." చిన్ని చాపను అమ్మకి కాస్త పక్కగా జరిపి (మరీ దూరంగా పడుకుంటే రాత్రి భయమేస్తేనో) బుల్లి దిండు వేసుకుని పేద్ద ఆరిందానిలా పడుకుంది సీత.

కూతురి గడుసుదనానికి విస్తుపోయిన తల్లి.. "నీ ఇష్టం అమ్మలూ.. మరి రాతిర్లో బయమేస్తే నా దగ్గరికి రాకూడదు అయితే" బెదిరిస్తే అయినా దగ్గరికి వస్తుందేమోనని ఆశతో అంది

"నాకేం భయమేయదు పో... నువ్ పడుకో" మూతి విరుస్తూ అటు తిరిగి పడుకుంది.

ఏంటీపిల్ల ఇయ్యాల ఇలా చేస్తోందని మనసులో అనుకుంటుండగానే.. అలసిన శరీరానికి ఆవులింతలు స్వాగతం చెప్పగానే ఎప్పుడు నిదరోయిందో తనకే తెలీదు.

మామూలుగా అయితే అమ్మ మెడచుట్టూ చేతులు వేసుకుని హాయిగా బజ్జునే సీత.. ఇవ్వాళ అమ్మకి కాస్త దూరంగా ఒంటరిగా పడుకుంది. పక్కన తమ్ముళ్లని కూడా పడుకోనీయలేదు. తనలో తానే ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంది.

ఇంతలోనే... వెల్లకిలా పడుకున్న సీతమీద ఎవరో ఎక్కి కూర్చుని, గొంతు నొక్కేస్తున్నారు. బెదిరిపోయిన సీత అమ్మా, అమ్మా అంటూ వెర్రిగా కేకలేస్తూ పిలిచింది. మీదనున్న బరువును తోసేందుకు ప్రయత్నించింది. ఏం చేసినా మీదనుంచి బరువు దిగితే కదా.. ఏం జరుగుతోందో తెలీక అలాగే పడిపోయింది.

తెల్లవారుజామున మెలకువ రావడంతో దూరంగా పడుకుని ఉన్న సీతని దగ్గరికి తీసుకునేందుకు తల్లి మీద చేయి వేయగానే... ఒళ్లంతా కాలిపోతోంది. అయ్యో నా తల్లీ... ఏమైందే నీకు అనుకుంటూ దగ్గరికి తీసుకోగానే వెక్కి వెక్కి ఏడుస్తోంది. తెల్లారేదాకా ఒళ్లో పడుకోబెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్తే.. ఏదో చూసి భయపడింది, మరేం ఫర్వాలేదంటూ డాక్టర్ జ్వరం తగ్గేందుకు మందులిచ్చి పంపాడు.

జ్వరం కాస్త తగ్గాక... ఏం తల్లీ రాత్రి ఏమైంది నీకు.. ఏం చూసి భయపడ్డావు అని మెల్లిగా అడిగింది తల్లి. "నీతో మాటాడను పోమ్మా... ఎవరో నామీద ఎక్కి గొంతు నొక్కేస్తుంటే... గట్టిగా అమ్మా అని అరిచాను, ఏడ్చాను.. నువ్వు రానేలేదు" వెక్కుతూ మాటాడింది సీత. 

"నీమీద ఎవరో ఎక్కి కూసున్నారా, నువ్వు గట్టిగా ఏడుస్తూ పిలిచావా.. లేదు తల్లీ.... నువ్వు అసలు పిలవలేదు.. నువ్వు పిలిస్తే నేను లేవనా..?"

"లేదు.. నేను పిలిచాను.. నువ్వే లేవలేదు" బుంగమూతితో వెక్కుతూనే మాటాడుతోంది సీత.

"పోన్లే అమ్మలూ.. నాకు వినిపించలేదేమో.. సరేలే ఇకపై నువ్వు ఒక్కదానివే పడుకోకు.. సరేనా...?" సముదాయించింది తల్లి.

"అమ్మో.. ఇకమీదట ఒక్కదాన్నేనా..... అమ్మలేకుండా పడుకోనే కూడదు..." మనసులో బలంగా అనుకుంది సీత.

సీత పెద్దయ్యేలోగా... పూరిల్లు కాస్తా చిన్నపాటి మూడు రూములుండే మిద్దె ఇల్లు అయ్యింది. అమ్మా,నాన్న ఓచోట, పిల్లలు మరోచోట పడుకోవడం అలవాటైంది. చిన్నప్పుడు ఒంటరిగా పడుకునేందుకు బయపడిన సీత పెద్దయ్యేకొద్దీ... ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకుంది. చిన్నప్పుడు జరిగిన సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగక పోవటంతో.. భయం పోయి ఒంటరిగానే పడుకునేది.

అలాంటిది మళ్లీ ఓరోజు రాత్రి... చిన్నప్పటిలాగే.. ఎవరో మీద ఎక్కి కూర్చుని బలంగా గొంతు నొక్కేస్తున్నారు... మాట పెగలటం లేదు... భయంతో బిక్కచచ్చి పోయింది. ఎంత పిలిచినా, అరచినా, ఏడ్చినా పక్కనే ఉన్న తమ్ముళ్లుగానీ, మరో రూంలో ఉన్న తల్లిదండ్రులుగానీ ఎవరూ రావటం లేదు... పెనుగులాడి పెనుగులాడి ఏడుస్తూ ఉండిపోయింది.

ఉదయాన్నే అమ్మ దగ్గర బావురుమంటూ జరిగిందంతా చెప్పింది సీత. అయినా అమ్మగానీ, తమ్ముళ్లుగానీ ఎవరూ నమ్మటం లేదు. అయినా మనింటికి ఎవరు వస్తారు సీతా... మేమందరం పక్కనే ఉంటే, నీమీద ఎక్కి కూర్చుని గొంతు నొక్కేస్తారా.. చిన్నప్పుడు భయపడినట్టే.. ఏదో చూసి భయపడ్డావులే... అని నచ్చజెప్పింది.. ఎంతచెప్పినా ఎవరూ నమ్మకపోయేసరికి కోపం ఎక్కువై ఏడుస్తూ వెళ్లిపోయింది.

పెళ్లయి అత్తారింటికెళ్లిన సీతకి మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవలేదు. దాంతో హాయిగా ఉండసాగింది. కానీ.. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లాలంటే మాత్రం.. తనని చంపేందుకు చూస్తున్న ఆ బరువైన ఆకారం గురించి తల్చుకుంటేనే వణుకు. అయినా ఎప్పుడో ఓసారి మాత్రమే అలా జరుగుతోంది.. ప్రతిసారీ కాదుకదా అని మనసుకి ధైర్యం చెప్పుకుని పుట్టింటికి వచ్చి వెళుతోంది.

ఓరోజు వేసవి ఉక్కబోతకి తట్టుకోలేక భర్తతో కలిసి మిద్దెపై పడుకుంది సీత. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుని హాయిగా నిద్రకుపక్రమించారు. ఇంతలో సీతకి మళ్లీ చిన్నప్పటి అనీజీ. మెల్లిగా బరువైన ఆకారం మీదకొస్తోంది. బలంగా గొంతు నొక్కుతోంది. ఊపిరి సలపనీయటం లేదు. అయినా పైకి లేచేందుకు ప్రయత్నిస్తోంది సీత. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. గట్టిగా భర్తని పిలిచింది, పక్కనే పడుకుని ఉన్నా భర్తని చేతితో తట్టి లేపేందుకు ఎంతగానో ట్రై చేస్తోంది కుదరటం లేదు. ఎప్పట్లా ఏమీ చేయలేక సొమ్మసిల్లి పడిపోయింది సీత.

తెల్లారిన తరువాత భర్తకి జరిగింది చెబితే.. పిచ్చిదానిలా చూశాడు.. నువ్వు నన్ను పిలిచావా.. ఎప్పుడు..? అంటూ వేళాకోళం చేశాడు. చిన్నప్పటినుంచీ చెబుతుంటే ఎవరూ నమ్మటం లేదు.. ఇప్పుడు మీరెందుకు నమ్ముతార్లే.. అని మనసులో అనుకుని భయం భయంగా కిందికి దిగింది సీత.

కుర్చీలో జారబడి ఎందుకు నాకే ఇలా జరుగుతోంది. పోనీ జరిగింది చెబితే ఎవరైనా నమ్ముతారా అంటే అదీ లేదు.. నేనే భయంతో అలా ఊహించుకుంటున్నానా, లేక నిజంగానే జరుగుతోందా..? మనసంతా ఒకటే ఆలోచనలు.... నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకోవటం ఎలా..? నా భ్రమా.. లేక నిజమా.? ఎలాగైనా సరే తెలుసుకోవాలి. మనసులో బలంగా అనుకుంది.

మరుసటి రోజు రాత్రి మేడమీదికి సీత అమ్మానాన్నలు తమ్ముళ్లు కూడా పడుకునేందుకు వచ్చారు. అందరూ కాసేపు కబుర్లలో పడిపోయి, వెన్నెల వెలుగులో, చల్లగాలికి హాయిగా నిద్రపోయారు.

రాత్రిలా మళ్లీ అవుతుందేమోనని భయంతో బిగుసుకుపోయిన సీత, భర్తని గట్టిగా పట్టుకుని పడుకుంది.

ఎప్పట్లా తెల్లారింది. ఒక్కొక్కరే లేచి కూర్చున్నవాళ్లంతా... వాళ్లమ్మని చూసి బెదిరిపోయారు. ఒళ్లంతా చెమటలతో ఏడుస్తూ కూర్చుంది సీత తల్లి. అందరూ ఏమైంది అనేంతలోనే... "ఇంతమంది ఉన్నారు.. ఎవరో వచ్చి మీద కూర్చుని గొంతు నొక్కుతుంటే..... ఒక్కరైనా వచ్చారా.. ఎంత అరిచాను, ఏడిచాను..పెనుగులాడాను.. అమ్మో అమ్మో.. ఎంత బరువు... ఊపిరి ఆడనిస్తేగా..." ఏడుపులో గొంతు పూడుకుపోయిందామెకు.

ఇంతలో అందుకుంది సీత.. చిన్నప్పటినుంచీ చెబుతుంటే విన్నావా... నేనే ఏదో భయపడ్డానని చెబుతూ వచ్చావు.. ఇప్పుడేమంటావు..?! కోపంగా తల్లిని నిలదీసింది. నిజమేనే తల్లీ.. ఇప్పుడు కదా తెలుస్తోంది... ఇదంతా ఎవరో మనిషి చేశాడని అనుకోలేం.. ఏదో పీడ అనుకుంటా... మొన్ననే చిట్టిబండ దగ్గర కిరసనాయిలు పోసుకుని మొగుడూ పెళ్లాలు చచ్చారు కదా.. అసలే చివరిల్లు... గాలి రూపంలో మనల్ని పట్టుకున్నారో ఏమో... ఏడుస్తూనే చెప్పుకొచ్చిందామె.

ఎవరో మంత్రగాళ్లను తీసుకొచ్చి, మరుసటి రోజునుంచీ ఇంట్లో ఒకటే పూజలు... అందరికీ యంత్రాలు కట్టించింది... మంత్రించిన అక్షింతలను, నిమ్మకాయల్ని ఇంటిచుట్టూ చల్లింది.. భూత, ప్రేత, పిశాచాల నుంచి ఇంటికి రక్ష అంటూ.. రాగి రేకులపై ఏవో గీతలు గీసి దేవుడి గదిలో పెట్టించి... అమ్మ దగ్గర బాగా దండుకుని హాయిగా జారుకున్నారు మంత్రగాళ్లు.

"అమ్మో... చిన్నప్పటినుంచీ నేను బాధపడింది ఇంట్లోకి ఏదో పీడ జొరబడటంవల్లేనా.. ఇన్నాళ్లకైనా అమ్మకి తెలిసింది. లేకపోతే... తల్చుకుంటేనే భయమేస్తోంది... హమ్మయ్యా.. ఇంక ఎలాంటి బాధా ఉండదు" అనుకుంటూ ఆరోజు హాయిగా నిద్రపోయింది సీత.

ఆ రోజు నుంచి ఇంట్లో సీత తల్లితో సహా అందరూ హాయిగా నిద్రపోతున్నారు.. ఇంతలో ఓరోజు ఉదయాన్నే.. మళ్లీ ఒళ్లంతా చెమటలతో, జడుసుకున్న ముఖంతో ఏడుస్తూ... సీత తల్లి.....

..........
...........
..........

ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతోంది... సీత, సీత తల్లికి.. లేదా ఇంట్లో మరెవరికైనా... ఎందుకలా జరుగుతోంది..? అదంతా దెయ్యాలు, భూతాలు, గాలి పీడలు చేస్తున్న పనేనా...?!! మరింకేదైనా కారణం ఉందా..?! అసలు ఇలాంటి అనుభవాలు ఆ ఇంట్లో వాళ్లకి మాత్రమేనా... మరింకెవరికీ అలా జరగటం లేదా...?!


Monday, 4 February 2013

ఇల్లాలికి నా (ప్రేమ) లేఖ....!!


"మనసంతా నువ్వే" ముఖచిత్రం గ్రూపులో ప్రేమలేఖల పోటీకి గానూ.. నేను రాసిన లేఖ ఇదుగో... :-)

బుజ్జమ్మా....

ఓయ్ దొంగపిల్లా... బుజ్జమ్మా అనే పిలుపు చూడగానే ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నావు కదూ..? నాకు తెలుసులే... మన స్నేహం తొలినాళ్లలో నీ పేరు పెట్టి పిలిచేందుకే మహా ఇబ్బంది పడిపోయిన నేను.. మనం ఒక్కటైనాక ప్రేమగా బుజ్జీ, బుజ్జమ్మా అంటుంటే నీకెంత సంబరమో.. నీకు తెలీదుకానీ నాక్కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలా పిలుస్తుంటే... 

నువ్ ఊరెళ్లగానే....... ఫోన్లు, మెసేజ్‌లు, ఈ మెయిళ్లు ఇవన్నీ ఇప్పట్లో రొటీనే కదా.. కాస్త వెరైటీగా మనం అందరం ఎప్పుడో మర్చిపోయిన లెటర్లో అందంగా అల్లిన అక్షరాల మాలల్ని పేర్చి నీకు బహుమతిగా అందిస్తే.... ఓహ్.. ఊహే భేషుగ్గా ఉంది.. దాన్ని నిజం చేద్దామని పెన్నూ, పేపర్‌తో సిద్ధమై.. మెల్లిగా సిరాని అక్షరాల్లో ఒలికిస్తూ మెుదలెట్టిన నీ శ్రీవారి ప్రేమలేఖ ఇదుగో....

అన్నట్టు లేఖ అనగానే.. మన మొదటి ప్రేమలేఖ గుర్తొస్తోంది బుజ్జీ. ఎన్నో రోజులు చూపులతోనే యుద్ధం చేసీ చేసీ అలసి సొలసిపోయిన మనం.. ఆనంద్‌గాడి పెళ్లిలో నవ్వుతూ హాయ్ చెప్పుకుంటూ మాటలు కలిపినప్పటి దృశ్యం ఇంకా నా కళ్లముందే కదలాడుతోంది. మాట్లాడేందుకు ఎంత కష్టపడ్డాం.. అతి కష్టంమీద హాయ్ మాత్రమే చెప్పుకున్నాం కదా.. వాడి పెళ్లి అయ్యేంతదాకా పొడి పొడి మాటలు మనమధ్య దోబూచులాడినా.. వీడలేక వీడిపోతున్నప్పుడు మాత్రం లెటర్ రాస్తావుగా అని మాత్రం అనగలిగా. కళ్లతోనే సరేనంటూ కంటినిండా నీటితో నువ్వు వెళ్తుంటే, ప్రాణమే నను వీడి వెళ్తున్నంతగా ఎంతలా విలవిల్లాడాను.

అప్పటినుంచీ మొదలు ఎప్పుడు నీ లెటర్ వస్తుందా అని... రోజులు గడుస్తున్నా నీనుంచి సమాధానం లేదు. రోజూ నీటి పంపు దగ్గర, శీనుగాడి షాపు దగ్గర చూపులతో మాట్లాడుతున్నా, నీ లేఖ రాని దిగులు మాత్రం ఎంతగా ఉండిపోయిందో. నువ్వు మాత్రం ఏమీ తెలీనట్లు చిన్నగా నవ్వుతూ జారుకునేదానివి. నిజం చెప్పనా.. నీ నవ్వు చూస్తుంటే, నాకు మరేమీ అడగాలని అనిపించేది కాదు.

అలా రోజులు గడుస్తుంటే.. ఓ రోజున అంకుల్... అంకుల్..... అక్క ఇది నీకు ఇమ్మంది అంటూ చేతిలో పెట్టి తుర్రున జారుకుంది ఓ చిన్ని పిట్ట (హనీ). ప్రపంచాన్నే జయించినంత సంతోషంతో లేఖను విడదీసిన నాకు నోట మాట రాకపోయింది తెలుసా.. అంత తప్పు నేనేం చేశాను అంటావేమో తుంటరి పిల్లా... ఏం చేశావో నీకు తెలీదా... ఏం చేశాను అని అలా బుంగమూతి పెట్టమాకు... నేనే చెబుతాలే..

తెల్లని పేపర్‌పై చక్కగా "ఓం" రాసి.. దానికి పసుపూ, కుంకుమ అద్ది మరీ మొదలెట్టిన నీ భక్తికి మెచ్చి పరవశుడనై.. ఆ తరువాత ఏముందో అని ఆత్రుతగా వెతికే నా కళ్లకి... "ప్రియమైన నీకు" అంటూ ముత్యాల్లాంటి అక్షరాలు తప్ప ఎంత వెతికినా మరేం కనిపించదే. ప్రియమైన నీకు తరువాత నువ్వు ఇంకేమైనా రాస్తే కదా కనిపించటానికి... బుద్ధూ బుద్ధూ.....

అయినా సరే నీ మీద ఎంతగా ప్రేమ పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేను.. నువ్వు ఏమైనా రాస్తే కేవలం ఆ మాటలు మాత్రమే ఆ లేఖలో ఉండేవి. కానీ ఏమీ రాయకుండా నువ్వు అలా వదిలేసి ఖాళీగా పంపిన లేఖలో నేను ఎన్నింటిని నింపుకున్నానో... నువ్వే రాసినట్లుగా ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి చదువుకున్నానో..... ఇదుగో ఆ లేఖ ఇప్పుడు నా చేతిలో అలాగే భద్రంగా.. అదేంటో చిత్రం... ఆనాటి భావనే ఇప్పుడూ.. అక్షయపాత్ర లాంటి నీ ప్రేమని ఎంత ఆస్వాదించినా.. ఇంకా ఎంతో మిగిలే ఉందని అనిపిస్తుంటుంది.

బుజ్జీ... మన వూరి జాతరలో తొలిసారిగా నిన్ను పట్టు పరికిణీలో చూసినప్పటి నా ఫీలింగ్స్ నీకు ఆరోజు అర్థమైందో లేదోగానీ.. ఎందుకో ఇవాళ చెప్పాలనిపిస్తోందిరా... అచ్చ తెలుగు కుందనపు బొమ్మ అలా నడిచి వస్తున్నట్టు, బాపూ బొమ్మకి ప్రాణం వచ్చి ఇలా నా కళ్లముందు తిరుగాడుతోన్న ఫీలింగ్. "అబ్బా.. ఎంత ముద్దుగా" ఉందో ఎంత దాచుకుందామన్నా దాగని మాట పైకి రాగా... నా ఫ్రెండ్స్ అంతా నన్నెలా ఆడుకున్నారో తెలుసా... అయినా నేను అవేమీ పట్టించుకునే స్థితిలో ఉంటే కదా... నువ్వెటు వెళ్తే అటు నా చూపులు, నా మనసూ.. పైకి మాత్రం ఇదేమీ గమనించనట్టుగా బెట్టు చేస్తూ, నా స్థితికి లోలోపల నవ్వుకుంటూ ఓసారి... పాపం పిల్లాడు.. అనే జాలి చూపుల్తో మరోసారి.. నువ్వు విసిరిన చూపులకు ఫిదా అయిపోయా.

ఇంకోసారి.. సంక్రాంతి పండుగ అప్పుడు అనుకుంటా... నోట్లో వేలు పెడితే కొరకనంతగా ఉండే ఈ పిల్లేనా అని సందేహంలో పడేసేలా ఎంత అల్లరి చేశావే బుజ్జీ. ఇదిగో నవ్వమాకు.. నాకు తెలుసు నువ్వు సంక్రాంతి అనగానే పడిపడీ నవ్వుతుంటావని.. చాలు చాలు ఇక ఆపు.. ఏవేవో వ్యూహాలు రచించి, నా డొక్కు స్నేహితులకు ఎన్నెన్నో మామూళ్లు, డిమాండ్లు నెరవేర్చీ మా అమ్మమ్మ వాళ్లూరికి నిన్ను సంక్రాంతికి వచ్చేలా చేస్తే.. ఏమీ ఎరగనట్టుగా నీ స్నేహితుల కోతిమూకతో సహా ఎంట్రీ ఇచ్చి నన్ను ఎంతలా ఏడిపించావు.

పశువుల పండుగ రోజున ఊరిబయటకు పశువుల్ని తోలుకెళ్లి, కాటమరాజు దగ్గర పూజ చేసేటప్పుడు ఎంతలా ఆడుకున్నావే నాతో. ఎవరూ చూడకుండా నాకు కన్నుకొట్టడం, నేను తేరుకుని రెస్పాండ్ అయ్యేలోపు ఏమీ తెలీనట్టుగా అందరితో కబుర్లు చెబుతున్న నిన్ను చూస్తే.. అందరూ చూస్తుండగానే కన్ను కొట్టి చిలిపిగా నవ్వాలని అనిపించేది. ఏదయితే అదయిందని నేను ఆ ప్రయత్నంలో ఉండగానే వద్దు ప్లీజ్ అంటూ నీ వేడుకోలు... ఎంత ముచ్చటగా ఉండేదో... నిజంగా ఎంత అద్భుతమైన జ్ఞాపకాలు కదా అవి... ఎన్ని రోజులు గడిచినా ఆ జ్ఞాపకాలు మనసులో మెదలాడగానే... మన ప్రమేయం లేకుండా చిరునవ్వు పెదాలపై దోబూచులాడదూ...

అన్నీ సరేలే... నేను వద్దు వద్దంటున్నా... బలవంతంగా ఊరికి పంపించి.. ఇప్పుడేమో దేవిగారిని శాంతింపజేయాలనా... ఈ "ప్రేమలేఖ"... మీ ఎత్తులు ఫలించవిక... నే అలిగానంతే.. అని బుంగమూతి పెట్టమాకే తల్లీ... నీ అలకతో నా గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెడుతున్నాయి... ఇంకా విమానాల్లాంటివి పరిగెత్తించనీయకు... మా బుజ్జి కదూ, మా బంగారం కదూ...?! హమ్మయ్యా.. నవ్వావా.. థ్యాంక్సే బుచ్చీ...! 

పెళ్లయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ నన్ను వదిలివెళ్లని నీవు.. మొన్న కూడా ఇష్టంలేకుండానే వెళ్లావని నాకు తెలీదా ఏంటి. అయినా తప్పదురా.. ఇద్దరం ముగ్గురం అయ్యే రోజు దగ్గర్లోనే కదా... మన ప్రేమకు ప్రతిరూపాన్ని జాగ్రత్తగా ఈ లోకంలోకి తీసుకొచ్చేందుకు నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన అమ్మ ఒడికంటే పదిలమైన గుడి ఏముంటుంది మన పాపాయికి... అందుకే నా బుజ్జి శ్రీమతిని మా అత్తమ్మతో పంపించానట. అర్థం చేసుంటారు కదండీ బుజ్జులు..

అయినా నీ దిగులంతా నాకు తెలుసులెండి శ్రీమతిగారు.. నేను ఒంటరిగా ఉంటానని, నా అవసరాలు ఎవరు చూస్తారని తమరి దిగులు. అయినా నేను ఒంటరినని ఎవరన్నారు నీతో. నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటుంటే నేను ఒంటరినెలా అవుతానే పిచ్చీ... రోజూ బలవంతం చేసి, బుజ్జగించి మరీ తినిపించే నా బుజ్జమ్మ లేకపోయినా, నువ్వే దగ్గరుండి అన్ని పనులూ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ... ఎంత చక్కగా పనులన్నీ చేసేసుకుంటున్నానో తెలుసా...? నువ్వు చూస్తే.. ఎంతగా మెచ్చుకుంటావో...

నువ్వు గుర్తు వచ్చినప్పుడు నీ చీరని చుట్టుకుని పడుకుంటే.. అదేంటో చిత్రం.. అచ్చం నీ పక్కనే పడుకుని ఎంచక్కా కబుర్లు చెబుతున్నట్లు.. నేను చెప్పే కబుర్లను వింటూ మిలమిలా మెరుస్తూ, అటూ ఇటూ కదలాడే నీ మీనాల్లాంటి కళ్లని చూస్తున్నట్లు అనిపిస్తోంది.. ఎన్నెన్ని కబుర్లో.. చెప్పి, చెప్పీ ఎప్పుడో అలసిపోయి నిదురబోయిన నేను.. ఉదయాన్నే కళ్లు తెరిచి చూసేసరికి నీ ఒడిలో (నీ చీరలో ముఖం దాచుకుని) హాయిగా బజ్జోనుంటాను. ఇంట్లో నువ్వున్నప్పుడు ఎలా కబుర్లు చెబుతుంటానో అలా కబుర్లు చెప్పుకుంటూనే పనులన్నీ చకచకా కానించి, ఆఫీసుకు పరుగులెడుతున్నాను. చూశావా.. ఎంత బుద్ధిమంతుడో నీ శ్రీవారు... "అబ్బా చాల్లేద్దూ... మావారికి దిష్టి తగులుతుంది" అంటున్నావు కదా.. నాకు తెలుసు బుజ్జీ.

ఇంత రాత్రి గడుస్తున్నా... నాకు ఇంకా ఇంకా రాయాలని అనిపిస్తోంది బుజ్జమ్మా. ఎన్ని జ్ఞాపకాలో, మరెన్ని అనుభూతులో కదా.. నేనేమీ బుచ్చమ్మను కాను బ్లాంక్ లెటర్ పంపేందుకు..  అయ్యగారు మాంచి మూడ్‌లో ఉన్నారు.. ఎన్ని పేజీలైనా అలవోకగా ఇట్టే రాసేయగలరు. ఈ లేఖ ఎవరైనా చదివితే ఎలా అని భయపడే ప్రేమికుడి స్టేజ్ దాటిపోయి అయ్యగారు శ్రీవారి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి.. ఎవరికీ భయపడే పనేలేదు. నువ్వీ లేఖ చదువుకున్నా ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. మొగుడూ పెళ్లాలు వాళ్ల ఇష్టం అని మన పెద్దాళ్లు ముసిముసిగా నవ్వుకుంటూ బయటపడతారు. కానీ.. లేఖ ఇంతకంటే ఎక్కువ రాయాలంటే కష్టంగా ఉంది.

అదేంటి పెళ్లానికి ప్రేమలేఖ రాయటం కష్టమా... అని మళ్లీ అలకపాన్పు ఎక్కబాకండి శ్రీమతిగారూ... అంతా మీ మంచికేనండి. మీరు నా లేఖను చదువుతూ.. ఎమోషనల్ అవుతూ ఇలా రాత్రంతా మేలుకుంటే, నీ పొట్టలో హాయిగా బజ్జున్న బుజ్జోడి నిద్ర పాడుచేసినట్లు అవుతుంది కదా... అంతేకాకుండా నా బుజ్జమ్మకు మాత్రం రెస్ట్ అవసరం లేదా.. అందుకే కూసింత స్వార్థంతో ఇప్పటికిలా లేఖను ముగించేస్తున్నాను. బుంగమూతి బుజ్జమ్మా... అర్థం చేసుకుంటావుగా..

అయినా నువ్వు నా బుజ్జమ్మవుగా.. ఎప్పుడో అర్థం చేసుకుని అప్పుడే పడుకునేశావా.. అమ్మో... ఎంతైనా బుజ్జమ్మ, బుజ్జమ్మే.... లవ్ యూ బుజ్జీ.. హాయిగా బజ్జో తల్లీ....!!

(ఇదుగో మీరందరూ నా బుజ్జికి దిష్టి పెట్టమాకండి... హాయిగా దీవించేసేయండి... )


Tuesday, 22 January 2013

నా జీవితపు శిల్పీ...!!!



నా శరీరంలోని ఒక్కో అంగానికి
సరికొత్త నిర్మాణాన్ని..
భిన్నమైన కదలికల్ని ఇచ్చిన
నా జీవితపు శిల్పీ...

మర్చిపోయి ఇచ్చావో
చూసేందుకు బాగుండదని మలిచావో
పొరపాటున కళ్లను చెక్కావు
కానీ అవి...
నువ్వు చూపే ప్రపంచాన్నే చూడాలి
ఆ ప్రపంచం అంతా నువ్వై ఉండాలి

నా జీవితపు శిల్పీ...
నీ చేతుల్లో రూపుదిద్దుకున్న
కదిలే శిల్పంలా
నీ కనుసన్నల్లో మసలుకుంటే చాలా..?
మరి నా మనసు మాట..?
ఇదెక్కడి విచిత్రం...
శిల్పానికి మనసెందుకేంటి?
చెప్పినట్టల్లా వింటే చాలదా..?!

నా జీవితపు శిల్పీ...
కళ్లను ఇచ్చావు..
చూపునూ ఇచ్చావు.. కానీ
నువ్వు చూపిందే ప్రపంచమన్నావు
మనసు వద్దే వద్దన్నావు
నోటి రూపం నువ్వు దిద్దిందేగా
అయినా మాటలెందుకులే
ఆడించే తలనిచ్చావుగా

అదేంటో...
అమ్మ ఒళ్లోంచి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు
నేను అందరిలాంటి మనిషినే
నా చూపులోనూ, మాటలోనూ
నవ్వులోనూ, నడకలోనూ.. స్వేచ్ఛ
అమ్మంత స్వచ్ఛమైన ప్రేమ
అంతే స్వచ్ఛంగా దొరికేది

నమ్మి నీ వెంట పంపినప్పుడు కూడా
నేను మనసున్న మనిషినే..
ఎప్పుడు మార్చబడ్డానో
ఎప్పుడు మార్చుకున్నావో
నువ్వు శిల్పివయ్యావు
నువ్వు చెప్పినట్టల్లా ఆడే
శిల్పాన్ని నేనయ్యాను

కళ్లుండీ చూడలేనితనం
చెవులుండీ వినలేనితనం
నోరుండీ మాట్లాడలేనితనం
మనసుండీ లేని తనం
ఇదీ ఒక జీవితమేనా...???


Tuesday, 15 January 2013

నువ్వు వదిలేసి వెళ్లినా...!!




మా ప్రేమ కుటీరం అంతా
నా మనసుకు మల్లే
ఖాళీ.. ఖాళీ.. ఖాళీ..

ఈసురోమని ఎంత తిరిగినా
కాళ్లకి భారమేగానీ...
మనసు భారం ఎంతకూ తగ్గదేం...?

నువ్వు వదిలేసి వెళ్లిన వాలుకుర్చీలా
నీ చేతిని వీడి ఒంటరిదైన నా వాల్జెడ

నువ్వు వదిలేసి వెళ్లిన ఊయల చప్పుడులా
తీపి గుర్తుల గుండె చప్పుడు

నువ్వు వదిలేసి వెళ్లిన రాత్రిలా
చిక్కటి చీకటి ఆవరించిన నా మనసు

నువ్వు వదిలేసి వెళ్లిన కలల్లా
కన్నుల్లో కన్నీటి సునామీల అలజడి

నువ్వు వదిలేసి వెళ్లిన నీ గుండెబొమ్మలా
కంటిచెమ్మ చిత్రించిన నీ "నా" రూపం

నువ్వు వదిలేసి వెళ్లిన అడుగుల్లా
ఒంటరి పక్షినై ఒడ్డుకు చేరిన వైనం

ఇన్ని గుర్తొస్తుంటే...

మనసు భారం.. తులాభారమై..
ఎద లయలో ఊగిసలాడుతుంటే
జ్ఞాపకాలు తులసీ దళాలై...
సేదదీర్చి.. "నిను నా" చెంత చేర్చేనా...!??


Wednesday, 9 January 2013

నేనిలా... ఎలా...?!!



వాడిపోయిన పువ్వులా
మూగబోయిన మురళిలా
వేకువరాని చీకటిలా
నువ్వు లేని నేనిలా... ఎలా..?

మనసు లేని రాయిలా
గుండె బొమ్మ ఉందెలా
ముసురుకమ్మిన మబ్బులా
నీ ప్రేమ లేని నేనిలా.. ఎలా..?

కంటి చెమ్మ ఊరడించి
బుగ్గల దోసిలి నింపితే
సందె కాంతి ఎరుపెక్కదా
నువ్వు రాని నేనిలా.. ఎలా..?

కంటి భాషకు కరుణించి
మనసు భాషను మన్నించి
చేతి భాషకు పులకించి
పరుగులెత్తావ్ నువ్విలా...
పరవశించాను ప్రేమలా...

ఉన్నాను.. నేనిలా..
నువ్వున్న నేనులా... ఇలా...!!!

Thursday, 27 December 2012

అప్పదాసూ... మా నాన్నా...!!




శ్రీరమణగారి "మిథునం"... "మన అమ్మానాన్నల కథ"....... ఈ మాటలు ఎంత అక్షర సత్యాలో కదా....

మిథునం కథ మాత్రమేనా... కథ అనుకుని అక్కడే ఆగిపోగలమా ఎవరైనా దాన్ని చదివితే... చదివాక అసలు స్థిరంగా ఉండగలమా... కొన్నాళ్లకైనా మామూలు మనుషులం కాగలమా... ఎప్పటికైనా మిథునంనిగానీ, అప్పదాసు, బుచ్చిలక్ష్మిలను గానీ మర్చిపోగలమా...?!

ఎప్పటికీ మర్చిపోలేం.. ఎందుకంటే అది కథ కాదు.. మన అమ్మా నాన్నల జీవితం. మనం అమ్మానాన్నలుగా జీవించబోయే జీవితం. అందుకే అది మన జీవితాల్లో అంత గాఢంగా పెనవేసుకుపోయే "కథానుబంధం" అయింది. మన అమ్మానాన్నలు ఇలా ఉండేవారేమో అని, మనం అమ్మానాన్నలం అయ్యాక ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకోని "మిథునం" ప్రేమికులు ఉండరేమో.

మిథునంతో కళ్లు కలిపితే... కళ్లల్లో అమ్మానాన్నల జీవితం స్వచ్ఛంగా సాక్షాత్కారం అవుతుంది. అప్పదాసు, బుచ్చిలక్ష్మి కబుర్ల లోగిళ్లోకి అడుగుపెట్టినట్లుగా మన అమ్మానాన్నల జీవితపు కుటీరంలోకి తెలీకుండా అడుగులు వేసేస్తాం. అలా చిన్నతనం నుంచీ, ఇప్పటిదాకా అమ్మానాన్నలతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ.. ఒక్కో జ్ఞాపకాన్ని ఏరుకుంటూ పోతే...

సంతోషాలు, ఆనందాలు అనే ఎన్నో వజ్రాలు, రత్నాలూ దొరకవచ్చు... కష్టాలు, కడగండ్లు అనే రాళ్లూ, రప్పలూ దొరకనూవచ్చు. వాటితో, వాళ్లతో పెనవేసుకున్నదే కదా మన జీవితం... అందుకే ప్రతిదీ అపురూపమే.

నా వరకు నేను... మిథునం చదువుతున్నంతసేపు, చదవటం ఆపేసి ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు బుచ్చి లక్ష్మిలో అమ్మను, అప్పదాసులో నాన్నని చూడకుండా ఉండలేకపోయా. నిజ్జంగా ఎన్నెన్ని సారూప్యాలో వాళ్లకీ, వీళ్లకీ. అందుకే వాళ్లు హాయిగా నవ్వుతుంటే నేనూ గలగలమంటూ జతకలిపాను, బాధపడుతుంటే విలవిలలాడిపోయాను, ఉడుక్కుంటుంటే మురిసిపోయాను.. జీవితం కాసి వడబోసిన వాళ్ల అనుభవాల మాటల్ని వింటూ భవిష్యత్తుకు సన్నద్ధమయ్యే సిపాయినయ్యాను..

బుచ్చిలక్ష్మమ్మలా మా అమ్మ వయసులో అంత పెద్ద కాకపోయినా...... బుచ్చమ్మను చూసినట్లే ఉంటుంది. ఛామనచాయ ముఖంతో, ఆ ముఖంలో ఓ మెరుపుతో, శాంతానికి మారుపేరులా కనిపించేది. నాన్న కూడా అప్పదాసులా పెద్ద వయసువారు కాకపోయినా.... ఆయనకేం తీసిపోరు అన్నట్లుగా ఉండేవారు. తిండిపట్ల యావ ఉన్నా... రోజూ తను తినే భోజనాన్ని ఇద్దరికైనా పంచిపెట్టనిదే తినేవారు కాదు. పైగా అమ్మకోసం తన పళ్లెంలో కాస్తయినా అలాగే ఉంచేవారు.

ఓరోజు... ఎందుకలా ఎప్పుడూ ప్లేటులో అలా ఉంచుతావు నాన్నా... అంటే.. "మీ అమ్మ తిక్కది రా... ఎప్పుడూ అందరి కడుపూ నిండిందా అని చూస్తుందేగానీ, తన కడుపు గురించి పట్టించుకోదు. నేనూ పట్టించుకోకపోతే ఎలా...?!" అన్నాడు నాన్న. ఆహా.. అలాగా.. అనేసి ఊరుకున్నా. చిన్న వయసులో అంతకంటే ఇంకెలా స్పందించాలో తెలీలేదు. ఇదుగో ఇవ్వాళ "మిథునం" చూస్తుంటే (చదువుతుంటే) ఇలాంటివి గుర్తొస్తున్నాయి. కళ్లను తడిపేస్తున్నాయి, గుండెలో చెమ్మని బయటికి తెస్తున్నాయి.

"దోర జామకాయను అప్పదాసు నమిలి గుజ్జును పళ్లూడిపోయిన బుచ్చమ్మకు ఇస్తే ఆమె చప్పరిస్తూ జామ రుచిని ఆస్వాదిస్తుంటే..." "సత్సంగత్యే నిస్సంగత్వం - మంచితోడూ మంచినీడా" అనుకుంటూ విశ్రాంతిగా బావికి చేరగిలబడిన అప్పదాసు... ఈ వాక్యాలు చదువుతుంటే ఎంత తృప్తిగా అనిపించిందో.. "మంచితోడూ, మంచినీడా..." ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు కదా... ఏ కొందరికో ఆ భాగ్యం దక్కుతుందేమో..

చిన్నతనంలోనే దంపతులైన అమ్మానాన్నల్ని వేరుకాపురం పేరుతో నాన్నమ్మ పక్కనబెడితే.. వంట కూడా చేతగాని అమ్మకి, నెలల పాపనైన నాకూ.. అన్నీ తానై అమ్మలా చూసుకున్న నాన్న... అప్పదాసులా కళ్లముందు కదలాడగా.. కళ్లు నిండిపోయాయి. పళ్లూడిపోయిన భార్యకి గుజ్జును నమిలి ఇచ్చిన అప్పదాసును... పగలంతా కూలిపనులు చేసి, వంట సరుకులతో ఇంటికొచ్చి అలసిన శరీరంతోనే వంటచేసి అమ్మకి తినిపించిన తనే ఓ అమ్మలా మారిపోయిన నాన్న గురించి తల్చుకుంటే..."మంచితోడూ, మంచినీడా" మాటలు ఎంత అక్షర సత్యాలో కదా అనిపించింది.

బుచ్చమ్మ, అప్పదాసుల ఇంట్లో అంత పెద్ద పెరడు లేకపోయినా.. మా ఇంట్లోనూ ఒకప్పుడు బోలెడన్ని మొక్కలుండేవి. ప్రతివాటితోనూ అమ్మా, నాన్నకి అనుబంధం ఉండేది. మొక్కలతోపాటు కోళ్లు, కుక్కలు, పిల్లులు ఇంట్లో ఉండేవి. వాటికి ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తుండేవాడు నాన్న. అప్పటి మొక్కలు, పెంపుడు జంతువులు అన్నీ పోగా.. ఇప్పటికి మిగిలుంది ఒకే ఒక్క కొబ్బరి చెట్టు మాత్రమే.

బుచ్చమ్మను అప్పదాసు ఉడికించినట్లుగా నాన్న అమ్మని భలేగా ఉడికించేవారు. నాన్నతో కలిసి అమ్మను మేం కూడా ఏడిపించేవాళ్లం. కానీ కాసేపట్లోనే అమ్మ మాతో జతకలిసి హాయిగా, స్వచ్ఛంగా నవ్వేసేది. అమ్మ కూడా తక్కువేం తినలేదు. నాన్నని బాగా ఆటపట్టించేది అచ్చం బుచ్చమ్మలా... మీకంటే ముందు వచ్చిన ఉజ్జోగస్తుల సంబంధం చేసుకునుంటే ఈ కష్టాలేం లేకుండా బ్రతికేద్దును. మిమ్మల్ని చేసుకుని ఓ నగా, నట్రా అంటూ మూతి వంకర్లు తిప్పుతూ మాట్లాడుతుంటే... నాకంటే బాగా చూసుకునేటోళ్లు ఎవరే అంటూ నవ్విసేవారు నాన్న.

బుచ్చమ్మ, అప్పదాసుల్లా...... అమ్మ ఎక్కడికెళ్లినా ఆమెతోపాటు నాన్న ఉండాల్సిందే. నాన్న లేకుండా అమ్మ కూడా ఎక్కడికీ వెళ్లేది కాదు. ఒకవేళ వెళ్లినా ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేయాల్సిందే. చిన్నప్పుడు ఊర్లో హరికథలు, బుర్రకథలు, వీథి నాటకాలు లాంటివి జరుగుతుంటే.. అమ్మా, నాన్న చక్కగా తయారై... చాపలు, నీళ్ల చెంబులతో హాజరైపోయేవాళ్లు. ఇక పిల్లలైన మామాట సరేసరి. అమ్మా, నాన్న కథలో ఎంతగా లీనమయ్యేవారంటే.. కథను బట్టి నవ్వేవాళ్లు, ఏడ్చేవాళ్లు, బాధపడేవాళ్లు... అప్పుడు చిన్నవాళ్లం కదా.. మాకేమీ అర్థమయ్యేది కాదు.. ఇప్పుడు "మిథునం" పుణ్యమా అని.. వాళ్ల అమాయకత్వం, స్వచ్ఛమైన వాళ్ల అనుభూతుల్ని ఇలా ఏరుకుంటూ పోగుచేసుకుంటున్నా.

ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని జ్ఞాపకాలు.. అనుభూతులు.. మరపురానివి.. మాసిపోనివి...



కానీ.. అప్పదాసుకూ.. మా నాన్నకీ ఓ గొప్ప సారూప్యం ఏంటంటే...

అప్పదాసులా నాన్న ముందుగానే వెళ్లిపోయారు.... బుచ్చమ్మలాంటి మా అమ్మను వదిలి ఆయన వెళ్లిపోయారు. దాసు లేని బుచ్చమ్మలా అమ్మ జీవితపు సముద్రాన్ని జ్ఞాపకాల నావతో ఇప్పటికీ ఈదుతూనే ఉంది.

"చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం, నే వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు. అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములూ, కందట్లూ, పొంగరాలూ ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే పిచ్చి వెర్రి కోరిక లెవరు తీరుస్తారు? కొడుకా, కోడలా, మనవడా, దేవుడా?" అంటూ బుచ్చమ్మలా అనలేదు కానీ...

"నేనుండగానే ఈ జీవుడ్ని తీసుకెళ్లు తండ్రీ... ఆయన లేకపోయినా నేను ఉండగలను, పిల్లల్ని చూసుకోగలనేమోగానీ... నేను లేకుండా ఆయన ఉండటం, పిల్లల్ని చూసుకోవడం కల్లో మాటే.. చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోతారు..." ఇద్దర్లో ఎవరో ఒకరు పోవాల్సి వస్తే.. ముందు ఆయన్ని, ఆ తరువాతే నన్ను తీసుకెళ్లు అంటూ గొణుక్కుంటుండటం చాలాసార్లు విన్నాను నేను. అప్పట్లో అర్థం కాలేదు.. కానీ ఇప్పుడు బుచ్చమ్మ కోణంలోంచి చూస్తే.. అమ్మలా ఎంతమంది బుచ్చమ్మలున్నారో ఈ లోకంలో కదా అనిపించగానే దుఃఖం ఆగలేదు.

ఒక్కటి మాత్రం నిజం.....

"ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చని చెట్లలో చూసుకోవడం నేర్పించాడు... కాసే ప్రతి చెట్టులోనూ ఆయన్ని చూసుకోగలను... లక్కా బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని వత్తి ఎన్నాళ్లుంటుంది. నా విస్తళ్లు అయిపోగానే నేనూ..." బుచ్చిలక్ష్మి ఎక్కిళ్ల శబ్దంలా....

నేను లేకుండా ఆయన బ్రతకలేరని అనుకుందేగానీ... ఆయన లేని తాను కూడా బ్రతకటం కష్టమే అని అమ్మకి మాత్రమే తెలుసు. లేచింది మొదలు, నిద్రపోయేదాకా తోడునీడగా కదలాడే ఆ మనిషి లేకుండా జీవితం గడపటం అంత సులభం కాదని కొన్నాళ్లకే అర్థమైందేమో ఆమెకి... ఈ మధ్య చాలా సార్లు అంది నాతో.. మీ నాన్నతోపాటు నేనూ పోవాల్సిందని. ఎందుకలా అంటావు. నీకు మేమంతా లేమా అని అంటే.. ఎందరున్నా.. మీ నాన్నతో సమానమవుతారా చెప్పు.. అంటూ అమ్మ ఎక్కిళ్ల శబ్దం.....

అంటే...

"బంగారం లేని లక్కముద్దలా, ప్రమిద లేని ఒత్తిలా, తన విస్తళ్లు అయిపోయేందుకు అమ్మ కూడా బుచ్చమ్మలా ఎదురుచూస్తోందా..." అనుకోగానే కళ్లు మసకబారి ఇక అక్షరాలు ముందుకు సాగలేదు.....

"మరి బతుకంటే అదేరా బడుద్ధాయ్......." బుచ్చమ్మ మాటలు మాత్రం చెవుల్లో మార్మోగుతున్నాయి...



Monday, 24 December 2012

"ప్రియబాంధవి" శైలూకి... "ఆత్మబంధువు"కి...


నిన్న పుట్టినరోజు జరుపుకున్న "నాన్న" ప్రియపుత్రిక, మా చిన్నారి చెల్లాయి, "వెన్నెల్లో గోదావరి" రచయిత్రి కల్లూరి శైలబాలకి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...



అతి తక్కువ కాలంలోనే మా జీవితంలో భాగమైపోయిన ఓ "ఆత్మబంధువు", నేను ప్రేమగా పిలుచుకునే "పరి"కి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు...



మీరు ఇద్దరూ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే...

ఇన్నాళ్లూ డిసెంబర్ 23, 24 చాలా సాధారణంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. ప్రియమైన ఈ ఇద్దరు ఆప్తులు పుట్టినరోజులు ఈ తేదీలలోనే రావటం వల్ల ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుల్లా అవి మారిపోయాయి...


నెట్‌కి అందుబాటులో లేని కారణంగా నిన్ననే పోస్ట్ చేయాల్సిన ఈ శుభాకాంక్షలు ఓ రోజు ఆలస్యంగా ఇలా పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఓ రోజు ఆలస్యమైనా సరే బ్లాగ్ మిత్రులందరూ.. మీ అభినందనలను, ఆశీస్సులను ఈ చిన్నారులకు (పెద్దవాళ్లే అయినా నా మనసులో వీళ్లు చిన్నారులే) అందించాలని కోరుకుంటున్నాను... అందిస్తారు కదూ..?!

మా ఇద్దరు చిన్నారులతోపాటు.. నిన్న, ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 



Friday, 21 December 2012

ఆత్మీయ కానుక...!!



కొన్ని ఉదయాలు ఎంత ప్రత్యేకమో...

నువ్వు మాకు తారసపడింది మొదలు
ఎన్ని ఉదయపు జ్ఞాపకాలో..

అప్పుడే ఈ ప్రపంచానికి పరిచయమైన చిన్నారిలా
మా మనసు లోగిళ్లలోకి అడుగుపెట్టావు
మా ప్రపంచంలో నువ్ ఇష్టంగా ఇమిడిపోతే
ఆప్యాయమై అక్కున చేర్చుకున్నాం
అదో ఆత్మీయ ఉదయపు జ్ఞాపకం...!

అది మొదలూ...
ప్రతి క్షణమూ అద్భుతమే...
ప్రతి రోజూ ఆనందపు హరివిల్లులే
ప్రతి ఉదయమూ శుభోదయమే
ప్రతి ఉదయమూ ఓ తీపి జ్ఞాపకమే...!!

కొన్ని ఉదయాలు నీ అల్లర్ల కలబోతలైతే
మరికొన్ని నీ అలకలకు కులుకులైతే
ఇంకొన్ని నీ ప్రేమలో తడిసిముద్దైతే
చాలా చాలా ఉదయాలు మేమే నువ్వైపోతే..!!

ఉదయరాగపు ఆలాపనలా నీ సంతోషం
వేసవి మండుటెండలా నీ కోపం
సేదదీర్చే చిరుగాలిలా నీ స్నేహం
ఆసరా ఇచ్చే భుజమై నీ ఓదార్పు
నేనున్నానంటూ నిలిచే నీ ఆప్యాయత
ఎన్నో.. ఎన్నెన్నో... ఉదయాలు ఇలాగే..
ఇప్పటికీ.. ఎప్పటికీ..

అందుకే.. కొన్ని ఉదయాలు చాలా ప్రత్యేకం..!!

(ఆనందపు, ఆత్మీయపు శుభోదయాలతో మా జీవితంలో రంగులు నింపిన మా కంటి వెలుగు పుట్టిన రోజు ఇవ్వాళ.. నాన్నా...! నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలనీ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ చిన్ని కానుక)



Wednesday, 12 December 2012

వెన్నెల పూదోటలో "సిరి"



ఆఫీస్‌కు బయల్దేరిన మా ఆయనకు బాల్కనీలోంచి టాటా చెప్పేసి... హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ లోనికి వచ్చా.. ఒకటే హడావిడి మనిషి.. చేయాల్సిన పనులు కాస్త ఆలస్యం అయినా క్యారియర్‌పై అలిగేసి వెళ్తుంటారు మావారు అప్పడప్పుడూ  ఆరోజు పనులేమీ ఆలస్యం కాలేదు. అన్నీ సక్రమంగానే ఉండటంతో ప్రశాంతంగానే ఆఫీసుకి బయల్దేరారు. ఆ సంతోషంలో కాబోలు హమ్మయ్యా అనిపించింది.. 

బెడ్రూంలో, హాల్లో చిందర వందరగా పడి ఉన్న వస్తువుల్ని సర్దుతుంటే.. ఎక్కడినుంచో ఫోన్ రింగవుతున్న సౌండ్. అది మావారి ఫోన్ రింగ్ టోన్. కానీ ఆయన బయల్దేరేసారు కదా.. పక్కింటోళ్లదేమోనని నేను పట్టించుకోలేదు. కానీ ఫోన్ రింగవుతూనే ఉంది తీరా చూస్తే.. పేపర్ల కిందన మావారి ఫోన్.. అయ్యో.. ఈయన ఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారే.. ఇక నా పని గోవిందా అనుకున్నా.. 

చందమామ పిల్లల పత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న మావారికి చందమామ అభిమానులు, పాఠకులు, రచయితలు.. ఇలా ఎవరెవరో ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఉన్నారంటే మా చెవులు చిల్లులు పడాల్సిందే.. ఒకటే ఫోన్లే ఫోన్లు. ఇవ్వాళేమో ఆ ఫోన్ మర్చిపోయారు. ఫోన్ స్విచ్ఛాప్ చేయాలో, కాల్స్ అటెండ్ చేయాలో అర్థంకాని స్థితి....

ఫోన్ మళ్లీ మళ్లీ రింగవుతుంటే.. అది కూడా ఒకే నంబర్‌నుంచి.. పాపం ఎంత అవసరమో ఏంటో... ఫోన్ అటెండ్ చేసి విషయం చెప్పేస్తే సరిపోతుందని నిర్ణయించుకుని... "హలో.." అనగానే అవతలి నుంచి కూడా "హలో" అంటూ ఓ అమ్మాయి గొంతు.

"రాజు సర్" అనే మాట తననుంచి వచ్చిందో లేదో.. ఆ తరువాత తనకి ఛాన్స్ ఇవ్వకుండా... "అవర్ ఆఫీస్ కెలంబిటార్.. ఫోన్ వీట్‌లియే మరందటు పోయిటార్.. అవరోడ ఆఫీస్ నంబర్ వుంగలుక్కు తెరింజా.. అంద నంబర్‌కు కాల్ పన్నుంగ (ఆయన ఆఫీసుకు బయల్దేరేసారు. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్లిపోయారు... మీకు ఆయన ఆఫీస్ నంబర్ తెలిస్తే, ఆ నంబర్‌కు కాల్ చేయండి)" అంటూ గడగడా తమిళంలో మాట్లాడేసాను.

నా మాటల్ని చాలా ఓపికగా విన్న ఆ అమ్మాయి.. నమస్తే శోభగారు.. బాగున్నారా. రాజుగారి ద్వారా మీగురించి నాకు తెలుసు అంటూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడింది. నాకు షాక్.. అయ్యో.. తను ఏ భాషలో మాట్లాడుతోందో కూడా పట్టించుకోకుండా నా పాటికి నేను వాగేశానే అని నన్ను నేను కోపగించుకుంటూ.. కాసేపట్లో సర్దుకుని.. నవ్వుతూ.. అయ్యో మీరు తెలుగువారా.. నేను అదేమీ పట్టించుకోకుండా మాట్లాడేశాను.. సారీ మా.. అన్నా.

ఫర్వాలేదులెండి.. అంటూ తన గురించి, తను ఎందుకు కాల్ చేసింది చెప్పుకొచ్చింది. అలా నిమిషాలు కాస్త గంటకు దగ్గరపడ్డాయి. నిజంగా అప్పుడే పరిచయం అయిన వారితో అంతసేపు మాట్లాడటం అదే తొలిసారి నాకు. తను నా గురించి మావారి ద్వారా విందేమోగానీ, తనగురించి నాకు ఏమాత్రం తెలీదు. అయినా కూడా ఆ అమ్మాయి పరిచయం లేనిదిలా అనిపించలేదు. తను మాట్లాడుతుంటే బాగా తెలిసిన అమ్మాయి, ఓ పక్కింటమ్మాయి మాట్లాడినట్లు అనిపించిదేగానీ కొత్తగా అనిపించలేదు. ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ అడ్రస్సులు ఇచ్చిపుచ్చుకుని బై చెప్పుకున్నాం ఆ రోజుకి.

ఇలా మొదలైన మా స్నేహం.. మూడు ఫోన్లు, ఆరు మెసేజీలుగా వర్ధిల్లుతోంది ఇప్పటికీ... ఎప్పటికీ కూడానూ.. 

ఆ రోజు మావారు ఫోన్ మార్చిపోయిన సంగతి ఆఫీసుకెళ్లాక గుర్తుకుతెచ్చుకుని ఆఫీస్ ఫోన్ నుంచి కాల్ చేసి తనకి ఇప్పటిదాకా ఎవైనా కాల్స్ వచ్చాయా అని ఎంక్వైరీ చేసి, ఎవరైనా చేస్తే ఆఫీసు నంబరు ఇవ్వమని చెప్పారు. సో.. ఆ రోజంతా తన కాల్స్ అటెండ్ అవటం, నంబర్ ఇవ్వడంతోనే గడిచిపోయింది.

రాత్రి ఆయన ఇంటికి వచ్చాక... పొద్దున కాల్ చేసిన అమ్మాయి గురించి చెప్పాను. అలాగా అంటూ తన పనిలో మునిగిపోయిన ఆయన్ని కదిలించా.. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి వివరాలు చెప్పమని. కాస్త పనుంది తర్వాత చెబుతాలే అని ఆయన అంటే, అదేం కుదరదు ఇప్పుడే చెప్పమని పట్టుబట్టి తన గురించి కనుక్కున్నా...

ఆ అమ్మాయి పేరు శిరీష. అందరూ సిరి అంటుంటారు. తన వృత్తి డాక్టర్, ప్రవృతి రచయిత. రచయిత అనే మాట దగ్గరే ఆగిపోతే తన గురించిన మిగతా టాలెంట్స్ అన్నీ మరుగున పడిపోతాయి అనుకున్నారేమో ఆయన.. అలా చెప్పుకుంటూ పోయారు.

చాలా చిన్న వయసు. ఇంత చిన్న వయసులోనే ఆమె ఎంత టాలెంటెడ్ తెలుసా... కథలు, నవలలు, కవితలు, పాటలు రాస్తుంది, పాడుతుంది.. డ్యాన్సులు చేస్తుంది, మంచి మంచి సందేశాలతో షార్ట్ ఫిల్ములు తీస్తుంది.. ఇంటిపని, వంటపని ఇలా ఒకటేమిటి.. మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. తన గురించి వింటుంటే చాలా ముచ్చటేస్తుంది అన్నారు.

నిజం కదా.. అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను నేను. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి పట్టుంది. తెలుగు అంటే కూడా ప్రాణం తనకి.. నవలలు, కవితలు, కథలు కూడా ఈ భాషల్లో చాలా సులభంగా రాసేస్తుంటుంది. ఇప్పటిదాకా తను ఓ వెయ్యి కవితలు దాకా రాసిందట. అయితే ఏవో కొన్ని తప్పిస్తే ప్రచురణకు పంపినవి చాలా తక్కువట. కొన్ని కవితలు, కథలు పత్రికల్లో వచ్చాయట. చందమామకు కూడా కొన్ని కథలు రాసి పంపింది... చెప్పుకుంటూ పోతున్నారు ఆయన. నిజంగా చాలా గ్రేట్ కదా ఈ అమ్మాయి అని మనసులోనే అనుకుంటూ వింటూ కూర్చున్నా.

అది సరేగానీ.. ఇవ్వాళ తనెందుకు ఫోన్ చేసింది అని అడిగాను మావారిని. ఓస్.. అదా.. తను చిన్న పిల్లల కోసం కొన్ని కథలు రాసింది. ఆ కథలన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా అచ్చు వేయించే పనిలో బిజీగా ఉంది. ఆ పుస్తకానికి ముఖ చిత్రం కోసం శంకర్ (చందమామ కథలకు తన బొమ్మలతో ప్రాణం తెప్పించే తెలుగుజాతి గర్వపడే చిత్రకారుడు) గారిని సంప్రదించింది. అందుకు ఆయన సరేనన్నారు. తన పని ఎంతవరకూ వచ్చిందో కనుక్కునేందుకు తను ఫోన్ చేసిందిలే అన్నారు.

ఇక ఆ రోజునుంచి ఆ అమ్మాయికి తీరిక దొరికినా, నాకు తీరిక దొరికినా ఫోన్లు, మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు... నేను అండి అని మాట్లాడుతుంటే వారించే, మీ కంటే చిన్నదాన్ని కాబట్టి పేరుతో పిలవండని పట్టుబట్టి మరీ పేరుతో పిలిపించేసుకుంది. తనతో ఎప్పుడు మాట్లాడుతున్నా అస్సలు టైం తెలిసేది కాదు.. (ఇప్పుడు కూడా) చిన్న వయసులోనే ఎంత పరిణతో.. ప్రతి విషయంపైనా స్పష్టమైన ఆలోచన, తనదైన ముద్ర ఉంటుంది. ఎవరినైనా సరే తన లోకంలోకి లాక్కెళ్లిపోయేలా ఉంటాయి తన మాటలు, ఆలోచనలు, భావాలు.

తనతో మాట్లాడుతున్నంతసేపు ఎంతలా ఆశ్చర్యపోతుంటానో నేను. అసలు ఒక మనిషి ఇన్ని పనులు చేయటం ఎలా అని ఆశ్చర్యం. అదే అడిగేస్తే.. ఎంత హాయిగా నవ్వేస్తుందో.. తన మాటలాగే, తన నవ్వు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో చెప్పలేను. 

లేచింది మొదలు నిద్రపోయేదాకా ఏమేం చేస్తుంటుందో తెలిసాక నోరెళ్లబెట్టేశాను నిజంగానే ఓరోజు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా నిద్ర లేవగానే ఇంటిముందు కళ్లాపిజల్లి ముగ్గు వేయటం దగ్గర్నించి, ఇంటిపనులు, వంటపనులు, పూజ అన్నీ ముగించుకుని బయటపడి, క్లినిక్‌లో కేసులకు అటెండ్ అయి.. మధ్యలో మళ్లీ ఏవైనా పనులుంటే వాటిని చూసుకుని (డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్స్ వగైరాలు) సాయంత్రం ఇంటికి చేరుకున్నాక మళ్లీ ఇంటిపనులు అన్నీ ముగించి ఏ అర్థరాత్రికిగానో నిద్రపోదట. అందరూ తినేసి పడుకున్నాక తను కూర్చుని చదవటం, రాయటం లాంటి పనులు చేసుకుంటుందట.

ఏంటి నువ్వు... అలా చేస్తే ఎలా.. నిద్ర సరిపోదు కదా.. ఎందుకు అంతసేపు మేల్కోవడం అని ఓరోజు కోప్పడితే.. ఇన్నిపనులు చేయాలంటే టైం సరిపోవటం లేదు ఏం చేయను అని నవ్వేసింది. నాకు ఖాళీగా ఉండటం అంటే చిరాకు. ఏదో ఒక పని చేయకుండా ఏరోజైనా వృధాగా గడిచిపోతే చాలా బాధగా ఉంటుంది నాకు. అందుకే సాధ్యమైనంతవరకు అస్సలు ఖాళీగా ఉండను చెప్పుకుపోతోంది... నిజమేకదా అని... వింటూ ఉండటం నాకూ అలవాటే.

ఇన్నిపనులు చేస్తూ వంట కూడా నువ్వే చేయటం ఎందుకు, ఇంట్లోవాళ్లను చేయమనొచ్చుగా అంటే... వంట చేసాక, ఇంట్లోని అందరూ కూర్చుని హాయిగా తింటుంటే, చూడ్డానికి నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. అందుకే ఆ సంతోషం కోసం... ఓపిక ఉన్నా, లేకపోయినా వంట నేనే చేసేస్తుంటా అంటుంది ఎప్పట్లా నవ్వుతూ...



ముఖ్యంగా మీతో చెప్పాల్సిందొకటి ఉంది. తను ఈ మధ్య చూపులేని అంధ విద్యార్థులు కొంతమందికి తనే డ్యాన్స్ కంపోజ్ చేసి, దగ్గరుండి ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయించి చిల్డ్రన్స్ డే సందర్భంగా గవర్నరు గారు పాల్గొన్న ఓ ప్రోగ్రాంలో వారిచే ప్రదర్శన ఇప్పించింది. ఈ పిల్లల డ్యాన్స్ ఆ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచిందని.. ఆ పిల్లల తల్లిదండ్రులు తనని చుట్టుముట్టి ఇప్పటిదాకా తమ పిల్లలకు ఏం ఇంట్రెస్ట్ ఉందో కూడా తెల్సుకోలేకపోయామంటూ కంటతడి పెట్టారని తను చెప్పినప్పుడు నా మనసంతా ఆమే నిండిపోయింది. నిజంగా చూపు సరిగా ఉండి చెబితే నేర్చుకోలేని పిల్లల్ని చాలామందినే చూస్తుంటాం. అలాంటిది ఏ మాత్రం చూపులేని పిల్లలకి డ్యాన్స్ నేర్పించటం అంటే మాటలు కాదు కదా.. అలాంటిది ఆమె సాధించింది. అది కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా (డబ్బు రూపంలో). రోజూ తన సొంత ఖర్చులతోనే గంటన్నర దూరం ప్రయాణించి పిల్లలకోసమే వెళ్లి, వాళ్లను సంతోషపెట్టేందుకే తను అలా చేసింది.

పసిపిల్లలు అంటే ప్రాణం ఇచ్చే ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడంతా చిన్నపిల్లలేనట. సిరి ఏదో మాయ చేసేస్తోంది అందుకే ఎవరిదగ్గరికీ రాని పిల్లలూ కూడా ఒక్క క్షణంలో తనకి దగ్గరైపోతుంటారని తన ఫ్రెండ్స్ అంతా కుళ్లుకుంటుంటారని నవ్వుతూ చెబుతుంటుంది. నాక్కూడా సహజంగా పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పగానే.. ఇక ఇద్దరం పిల్లల గురించిన కబుర్లే, కబుర్లు... నిజం చెప్పాలంటే, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లు ఎవరైనా సరే.. ఇలాంటి కూతురు, ఇలాంటి అక్క, ఇలాంటి స్నేహితురాలు, ఇలాంటి పక్కింటమ్మాయి ఉండాలని ఎవరైనా కోరుకునేంత మంచి మనసున్న మనిషి సిరి.

ఇంకా ఒకరినొకరం చూసుకోలేదుగానీ... సాహిత్యం గురించిన కబుర్లుతోపాటు చదివిన రచనలు, చదవాల్సినవి.. ఇతర పరిచయాలు, స్నేహాలు, చదువుకున్న రోజులు, చిన్ననాటి జ్ఞాపకాలు... ఒకరినుంచి ఒకరు నేర్చుకోవాల్సినవి, తెల్సుకోవాల్సినవి.... ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో కలబోసుకుంటూ స్వచ్ఛమైన స్నేహపు మధురిమలతో సాగుతోంది మా ప్రయాణం...

తన గురించి చెప్పాల్సింది చాలానే ఉంది. ఇంతకుమించి చెబితే నేనేదో గొప్ప కోసం చెప్పుకుంటున్నానని అనుకుంటారు కాబోలు. అయితే ఒక్కటి మాత్రం నిజ్జం. ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్ మాత్రమే చెబుతున్నా... ఇందులో అతిశయోక్తికి ఏ మాత్రం చోటు లేదు. తనతో స్నేహం చేస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.

ఇంతకీ.. సిరి గురించి మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ మధ్యనే తను రాసిన పుస్తకాలు మూడు అచ్చయ్యాయి. వాటిని మన బ్లాగ్లోకంలోని మిత్రులందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా మీ ముందుకు వచ్చాను... వీటిలో ఒకటి శంకర్ గారు ముఖచిత్రం వేసి ఇచ్చిన పుస్తకం "వెన్నెల పూదోట" (పిల్లల కథలు), రెండోది "ఎ గిఫ్ట్ కాల్డ్ లైఫ్" (ఇది పిల్లలకీ, పెద్దలకీ ఎవరికైనా పనికివచ్చేదే), మూడోది "ది లాస్ట్ మీల్ ఎట్ సాగరిక" (నవల).. చివరి రెండూ పేర్లు ఇంగ్లీషులో ఉన్నా.. తెలుగు పుస్తకాలే.. 



                       

ఈ పుస్తకాలు మూడూ.. విశాలాంధ్ర బుక్‌ హౌస్, ప్రజాశక్తి బుక్‌ హౌస్, నవోదయ బుక్ హౌస్, శశిరామ్ పబ్లికేషన్స్‌ లలో దొరుకుతున్నాయి. ఆసక్తి కలిగిన బ్లాగు మిత్రులు ఈ వర్ధమాన రచయిత్రి రచనలను చదివి ప్రోత్సహించి మీ అభినందనలను, ఆశీస్సులను అందించాలని కోరుకుంటూ.. మీ కారుణ్య.


Friday, 7 December 2012

నువ్వెప్పుడూ ఇంతే...!!!



నువ్వెప్పుడూ ఇంతే..

అమ్మ గుర్తొచ్చింది అనేంతలోనే..
అమ్మవై లాలిస్తుంటావు
నాన్న.. మాట పెదాల్ని తాకకముందే
నాన్నవై నడిపిస్తుంటావు

దిగులుకొండ నేనెక్కి కూర్చుంటే
ఆసరా నిచ్చెనై గుండెల్లో పొదువుకుంటావు
సంబరం అంబరమై నే తుళ్లిపడుతుంటే
ఇంద్రధనుస్సువై పులకరిస్తుంటావు
బుంగమూతితో వయ్యారాలు పోతుంటే
వెచ్చని ముద్దువై నుదుటిపై నర్తిస్తావు

నా కబుర్ల సెలయేటి ప్రవాహానికి
నిశ్శబ్ద సంగీతమై తోడు వస్తుంటావు
అనురాగం ఆనందమై అల్లరి చేస్తుంటే
చక్కిలిగింతల చెలికాడివై మురిసిపోతావు
అపార్థమనే ఆవగింజ మొలకెత్తేలోగానే
నమ్మకం అనే మర్రివిత్తును నాటేస్తుంటావు
ఇద్దరం ముగ్గురమై ముద్దుల మూటలైతే
చంటిపిల్లాడల్లే బోసినవ్వువై విరబూస్తావు

నువ్వెప్పుడూ ఇంతే...

అంతులేని ప్రేమని నీకిచ్చేయాలని
అనుకునేంతలోనే...
అంతకు రెట్టింపు ప్రేమని
ముద్దుగా మూటగట్టి
బహుమతిగా ఇచ్చేస్తుంటావు
అందుకేనేమో..
ఇప్పుడు నా జీవితం అంతా
రంగులమయం... హరివిల్లుల లోకం...
ఈ రంగులన్నీ చిత్రించేది మాత్రం నీ రూపాన్నే....!!


("మనసులోని మౌనరాగం" బ్లాగర్ "ప్రియ"గారు రాసిన ఓ పోస్టుకి స్పందనే ఈ కవిత)



Wednesday, 5 December 2012

ఎవరా లాలస..? ఏంటా కథ..?!!



"అది కాదే అమ్ములూ.. నా బంగారు కదూ... నే చెప్పేది కాస్త వినవే.."

"వూహూ నే వినను గాక వినను.. అయినా అన్నీ తెలిసి కూడా నిన్ను కట్టేసుకున్నాను చూడూ... నన్ను అనాలి"

"అన్నీ తెలుసా.. ఏం తెలుసు నీకు.. నువ్వు అంటున్నది నిజం కాదు.. ఒట్టి భ్రమ మాత్రమే.. నన్ను నమ్మవే అమ్ములూ..."

"ఎలా నమ్మాలి నిన్ను.. ఇలా నిద్రలో కూడా కలవరిస్తూ ఆ పేరును జపం చేస్తుంటే..."

"హవ్వా... నిద్రలోనా... నేనా... కలవరించానా... అందుకని నువ్వు దాన్ని గుర్తు పెట్టుకుని.. నాతో ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నావా.. ఇదేమైనా న్యాయమా తల్లీ..."

"ఎందుకు న్యాయం కాదు.. తమరు మాత్రం కలల్లో కూడా మర్చిపోలేని ఆ పేరుతో జపం చేస్తుంటే.. నేను చూసీ చూడనట్లూ, వినీ విననట్లూ పోవాలా..."

"ఇదెక్కడి గోలే... నేను ఏ పేరును కలవరించాను తల్లీ..."

"అదే తమరి గొప్పతనం.. అది కూడా నా నోటినుంచే వినాలనా... నాకెందుకు అంత భాగ్యం.. మీరే గుర్తు తెచ్చుకోండి"

వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ.. బలవంతపు నిగ్రహంతో "ఏం గుర్తులేదు మొర్రో అంటే వినకుండా.. పదే పదే విసిగిస్తావేంటి అమ్ములూ" అంటే..

"అన్నిసార్లు కలవరించి ఇప్పుడు గుర్తు లేదు అంటే మేం నమ్మాలా..."

ఓసి నీ యంకమ్మా... "ఏం కలవరించానో చెప్పమంటే చెప్పకుండా ఈ సాధింపు ఏంటే... ఇదే చివరాఖరు.. ఇక చెప్పకపోయావా.. ఇంకెప్పుడూ అడగను... నువ్వేమైనా మాట్లాడుకో నే బదులివ్వా" బెదిరిస్తే అయినా దార్లోకి వస్తుందని ప్రయత్నం..

అయినా వింటేగా...

"ఓసోస్... ఈ బెదిరింపులకు నే భయపడా... ముందు ఎవరా శాల్తీ చెప్పండి.."

ఇక లాభం లేదనుకుని మౌన వ్రతం ట్యాగ్‌ వేసేసుకుని కామ్‌గా ఉండిపోయా

ఊరుకుంటుందా... మౌనం అర్థాంగీకారం అనుకుందో ఏమో...

నా నుంచి నిజం రాబట్టేందుకు అలిగింది, అరిచింది, కోప్పడింది, బెదిరించింది, ఏడ్చింది, వెటకరించింది నా అమ్ములు.. ఏం చేసినా నే చెబితేగా...

అయినా ఏమైనా ఉంటేగా చెప్పేందుకు... నిజ్జంగా ఒట్టు అండి ఏమీ లేదు.. అసలు నేను నిద్రలో ఏం కలవరించానో కూడా గుర్తు లేదు నాకు..

ఏముందీ.. ఇక ఆ రోజు నుంచీ నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది.

లేచింది మొదలు, నిద్రపోయేదాకా రంగు రంగుల సీతాకోకలు ఇంట్లో తిరుగాడినట్లుగా ఎన్ని కబుర్లూ, ఎంత సందడి, ఎన్ని ముద్దులు, మరెన్నో మురిపాలు, అలకలు, అల్లర్లు........ ఇలా ఉండేది నా అమ్ములుకు నామీద సందేహం రానంతదాకా...

నామీద అనుమానం ఎప్పుడైతే వచ్చిందో అప్పట్నించీ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ లాగా అయిపోయింది నా పరిస్థితి.

అప్పట్లో నిద్రలేచేటప్పుడు ఓ వెచ్చని బిగికౌగిలి ముద్దుతో రోజుకి స్వాగతం .. ఇప్పుడు నామీద కోపంతో భగభగ మండిపోయే నా అమ్ములూ సూర్యోదయానికి ముందే ఎర్రటి ఎండను తన ముఖంలోకి తీసుకొచ్చి మరీ రోజును స్వాగతిస్తోంది

నిజంగా ఆడోళ్లు కోపంలో కూడా చాలా అందంగా ఉంటారు. అందుకు నా అమ్ములూనే సాక్ష్యం. ఎంత ముద్దొస్తోందనీ. తను నన్ను కోపంగా నిద్ర లేపినా ఎర్రబడ్డ ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తనివితీరా ముద్దాడాలని ఎంత ఆశగా ఉందో... అయినా రాక్షసి.. తాకనిస్తేగా...

ప్రాణం ఉస్సూరుమనగా.. బేలగా నిద్ర లేవడం ఈ కొద్ది రోజుల్లో అలవాటైంది. కానీ ఇదెంత నరకంగా ఉందో చెప్పలేను.

ఈ పిల్లకి నామీద కోపం రాకముందు.. సారీ సారీ అనుమానం రాకముందు... కాఫీ తాగుతూ, పేపర్ ముందేసుకుని.. వార్తల్ని ఆమె విన్నా, వినకపోయినా.. దేశ రాజకీయాల దగ్గర్నించీ, ప్రాంతీయ ప్రారబ్దాల దాకా... ఒకటేమిటి అన్నీ చెప్పుకుపోతుండే నా నసని ఎంత ప్రేమగా భరించేదో... ఆహా, అలాగా, ఇలాగా అంటూ ఏ మాత్రం విసుక్కోకుండా హాయిగా నవ్వేసేది నా అమ్ములు..

ఇప్పుడు కాఫీ ఎంత చేదుగా ఉందో.. అమ్ములు పక్కన లేకుండా పేపర్ చదవాలా... తను వినకుండా నేనేం చదవను.. నాకేం ఒద్దు పో... పేపర్ పైనా, కాఫీ పైనా అలిగేసా.. ఓరకంట గమనిస్తూ ఏమీ ఎరగనట్టు వెళ్తోంది నా రాక్షసి.. నా అలక చూసైనా కరుగుతుందనుకుంటే ఊహూ.. ఒట్టి రాతిగుండె. కరిగితేగా...

ఇలా ఒకటేమిటి అన్ని పనుల్లోనూ సహాయ నిరాకరణ చేసేస్తోంది నా శ్రీమతి ఉరఫ్ అమ్ములు (నేను ముద్దుగా ఇలానే పిల్చుకుంటా). ఏం చేయను నిస్సహాయుడిని. తనకి అర్థం చేయించే, నమ్మించే తెలివితేటలు లేనివాడను. ఏమీ లేని దానికి ఏదైనా ఉంది అని ఒప్పుకుని దోషిగా నిలబడటం ఏంటో నాకు అర్థం కావటం లేదు.

అమ్ములూ.. అమ్ములూ.. నన్ను ఇలా అనాధను చేయకే.. నేనేం తప్పు చేయలేదే.. నా మాట వినవే.. నా బంగారు కదూ... అని ఎన్నిసార్లు బ్రతిమలాడినా.. తను మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది. నేను దాస్తున్నదేంటో చెప్పాల్సిందేనని. ఒట్టు ఏమీ లేదంటే నమ్మేదెవరు.

రోజులు ఇలా దొర్లుతున్నాయి..

ఓ రోజున ఉరుములు, మెరుపుల్లేని వర్షంలా ఊడిపడ్డారు మా అమ్మానాన్న.. అసలే పల్లెటూరి మాలోకాలు. మేం ఉన్న పరిస్థితి చూస్తే, ఎక్కడ నొచ్చుకుంటారో, కథను ఎక్కడ పెద్దగా చేస్తారో అని ఒకటే ఖంగారు నాకు.

అయినా వాళ్లకు అదేమీ తెలీకుండా జాగ్రత్తపడ్డాను. ఎప్పట్లా అమ్ములుతో ప్రేమగా ఉండేందుకు ట్రై చేశా. తను కూడా ఏమనుకుందో ఏంటో అమ్మావాళ్ల ముందు బాగానే ఉండసాగింది. ఆరోజు రాత్రి పడకగదిలో.. అమ్మావాళ్లకి విషయం తెలీకుండా మానేజ్ చేసినందుకు అమ్ములుకి థ్యాంక్స్ చెప్పాను.

"తమరి థ్యాంక్స్ మాకేం అక్కర్లే.. వాళ్లు నాకు అత్తామామలు.. అమ్మా నాన్నలతో సమానం. వాళ్లు బాధపడితే నాక్కూడా బాధగానే ఉంటుంది. అందుకే ఇలా..." అంది


అమ్ములుకు నా తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ.. తన మాటల్లో వ్యక్తమైన తీరు చూసి చాలా ముచ్చటేసింది. మనసులోనే తనకి థ్యాంక్స్ చెప్పుకున్నా.. ముద్దులాడేసా.. (థ్యాంక్సే ఒప్పుకోనిది.. ముద్దు ఒప్పుకుంటుందా).

కొన్నాళ్లుండి అమ్మావాళ్లు మళ్లీ ఊరెళ్లిపోయారు. వాళ్లకి ఏమీ తెలియకుండానే తిరుగు ప్రయాణం అయినందుకు హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నా...

ఏ ముద్దూ ముచ్చటా లేకుండా రోజులు అలా నిర్లిప్తంగా దొర్లుతున్నాయి.

దేవిగారూ.. కోపాన్ని, బెట్టును వదిలేట్టు లేరు.. ఏం చేయాలో తెలీని స్థితిలో నేను...

ఇక ఇలా కాదు అనుకుందో ఏమో.. ఓ రోజు ఆఫీసు నుంచి రాగానే.. నన్ను లాగి సోఫాలో కూర్చోబెట్టి.. "ఇదుగో ఆ పేరు ఏంటో నేను చెబుతా.. అది ఎవరో, నువ్వు నిద్రలో ఎందుకు కలవరించావో చెబుతావా?" కొద్దిగా రాజీ ధోరణితో అడిగింది అమ్ములు.

అయ్యగారికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. అసలే ఏం కలవరించానో గుర్తు లేని నాకు, ఆ పేరేంటో చెబితే అయినా గుర్తొస్తుందేమోనని నేనూ ఎదురుచూస్తున్నా.. ఇన్నాళ్లకి కావాల్సింది కాళ్లకి అడ్డంపడ్డట్టుగా చెబుతానంది. రాజీకి మార్గం కుదురుతోందన్న ఉత్సాహంలో..

"తప్పకుండా చెబుతా అమ్ములూ... చెప్పు చెప్పు..." తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా గిల్లాను..

"ఇదుగో ఇలా చేస్తే నే ఊరుకోను.. దూరంగా కూర్చో.. ఇప్పుడు చెప్పు... ఎవరు తను..?"

"అమ్మా తల్లీ.. నీకో దండం.. ఆ తను ఎవరో చెబుతాగానీ.. ముందు ఆ పేరు చెప్పు.."

"లాలస..."

"లాలసా..." ముఖంలో క్షణకాలం రంగులు మారిపోయాయి నాలో...

నాలో రంగులు మారటం చూసి నా భార్యామణి కన్ఫర్మ్ చేసేసుకుంటున్న దశలో... ఒక్కసారిగా పగలబడి నవ్వా.. నిజంగా అంత నవ్వు వచ్చింది నాకు.. ఇందుకోసమా ఈ పిచ్చిది నన్ను ఇన్నాళ్లుగా ఏడిపిస్తోంది అనుకుంటే నాకు కడుపు పగిలిపోయేంతగా నవ్వు..

సోఫాలో దొర్లి దొర్లి నవ్వుతున్నా... అమ్ములుకి ఓ వైపు కోపం, మరోవైపు అయోమయం...

నవ్వి, నవ్వి ఓపిక లేక తననే చూస్తూ ఉంటే.. ఉడుక్కుంటూ... ఇక చాలు ఇప్పుడైనా చెబుతావా లేదా... కోపంగా అడిగింది

"దేవీగారూ.. శాంతి... శాంతి.... ఓహ్.. శాంతి ఎవరు అని మళ్లీ అడగకే తల్లీ.. నీకు దండం పెడతానే.. శాంతి అంటే శాంతంగా విను అని అర్థం సరేనా.."

లాలస ఎవరంటే... లాలస.... లాలస... ఏదో ఆలోచిస్తున్నట్లు పెద్దగా ఫోజు పెట్టా.. (అక్కడేమీ లేదు)

"ఊరికే విసిగించకు.. చెప్పు ప్లీజ్..." కోపం, వేడుకోలు రెండూ కలగలిపిన మాటలా తను.. చూస్తే చాలా జాలేసింది.. పోన్లే ఇక ఏడిపించింది చాలనుకుని...

లాలస.. నేను కాలేజీ చదివే రోజుల్లో మా పక్కింట్లో ఉండేది.

తన సందేహం నిజమేనేమో అనుకుంటూ అమ్ములు నోట్లోంచి "కాలేజీ రోజుల్లోనా....?" అనే మాట

అవును కాలేజీ రోజుల్లోనే.. రోజూ నన్ను చూసి నవ్వేది.. నేను కూడా నవ్వేవాడిని.. వాళ్ల నాన్నమ్మ లేని టైం చూసి దగ్గరికి వెళ్లి ముద్దులాడేవాడిని కూడా.. వాళ్ల నాన్నమ్మ అంటే నాకు పడదు అందుకనే ఆవిడ లేని టైంలో వెళ్లేవాడిని.

ఛీ... ముద్దులాడేవాడివా.. ఎంత సిగ్గులేకుండా నాకే చెబుతున్నావు చూడు... ముఖం కందగడ్డలా మారిపోయింది అమ్ములుకి.

"సిగ్గు ఎందుకు అమ్ములూ.. తను ఎంత ముద్దుగా ఉండేదో.. ముట్టుకుంటే కందిపోయేంత తెలుపు. తను నవ్వితే ఎంత బాగుండేదో తెలుసా.." ఇంకాస్త ఉడికించాను.

"అవున్లే అన్నీ తెగించారు కాబట్టే.. ఇలా నాతోనే ప్రేమ కబుర్లు అన్నీ కట్టగట్టుకుని చెబుతున్నారు.. అంతేలే.. ఇవన్నీ తెలీని మా అమ్మానాన్నలు నీకు ఇచ్చి నా గొంతు కోశారు"

"అవునా.. అదేం లేదు అమ్ములూ.. నేను బంగారం.. ఏ తప్పూ చేయలేదు.. కేవలం లాలసను చూసి నవ్వేవాడిని, ముద్దులాడేవాడిని.. ఓసారి ఎత్తుకున్నాననుకో.. అంతేగానీ నేనేం చేయలేదు.. ఒట్టు..." వస్తున్న నవ్వును ఆపుకుంటూ బదులిచ్చా.

"తప్పు చేయలేదా.. నవ్వడం, ముద్దులాడటం, ఎత్తుకోవడం" ఇవన్నీ ఏంటి...? దుఃఖం తన్నుకొస్తుంటే.. గొంతు జీరబోయింది తనకి.. (తన పరిస్థితి చూస్తే ఇక నిజం దాచకూడదని అనిపించింది. సరే చెప్పేద్దా అనుకునేంతలో..)

మళ్లీ తనే... "అలాంటప్పుడు తననే పెళ్లి చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకుని నా జీవితం ఇలా చేశారు.." ఇంకో మాట మాట్లాడితే భోరున ఏడ్చేలా ఉంది తన పరిస్థితి. అలాగని నేను ఏమీ మాట్లాడక పోయినా ఊరుకునేలా లేదు.

"నేను కూడా అదే అనుకున్నా అమ్ములూ.. ఆఖరుకు వాళ్ల నాన్నమ్మ నాకు నచ్చకపోయినా వెళ్లి అడిగాను లాలసను నాకు ఇచ్చి పెళ్లి చేయమని.. వాళ్లెవరూ వినలేదు.. పైగా నన్నే తిట్టారు. తెలుసా..?" కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెప్పా

"అన్నారా.. అనుకున్నా... తమరు ఆ పని కూడా చేసి ఉంటారని.. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. తననే పెళ్లి చేసుకోండి. నే వెళ్తున్నా..." అంటూ ఏడుస్తూ.. సూట్ కేస్ సర్దేందుకు బయల్దేరింది నా కోమలి.

అయ్యో.. తను వెళ్లిందంటే నీ పని అంతేరా రామ్.. నా అంతరాత్మ నన్ను హెచ్చరించగా... ఇక తనని ఏడిపించింది చాలనుకుని.. నేనూ బెడ్‌రూంలోకి దూరా..

ముక్కు చీదుకుంటూ బట్టలు సర్దుకుంటోంది నా భార్యామణి.

ప్రేమగా దగ్గరికి తీసుకోబోయా. విసిరి కొట్టింది. మళ్లీ వెళ్లా.. మళ్లీ అలానే చేసింది.. చివరికి ఇలా కాదని బలవంతంగా గట్టిగా హత్తుకున్నా... ఏమనుకుందో ఏమో కామ్‌గా ఉండిపోయింది.

"ఓసి పిచ్చి అమ్ములూ... లాలసను పెళ్లి చేసుకోవాలంటే... ఇంకో 15 ఏళ్లకు పైగానే ఆగాలే.." అన్నా



"15 ఏళ్లా..."

"అవును. తనకి ఇప్పుడు ఓ ఆరేళ్లుంటాయేమో. పక్కింట్లో ఉండే రామాయమ్మగారి మనవరాలు లాలస. చాలా ముద్దుగా ఉండేది. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ రామాయమ్మ మనవరాల్ని తాకనిచ్చేది కాదు. చివరికి ఓసారి లాలసను పెళ్లి చేసేసుకుంటా ఇచ్చేయండి అని కూడా అడిగాను. ఓరి భడవా.. ఏంటా మాటలు అంటూ చీవాట్లు పెట్టింది తెలుసా..?!" అంటూ అమ్ములుకి కంప్లైంట్ చేశా.

"వింటోంది.. కలో.. నిజమో.. తెలీని స్థితిలో అమ్ములు.."

"నిజం అమ్ములూ... నీకో విషయం తెలుసా... మనకి కూడా అలాంటి పాప పుడితే ఎంత బాగుంటుందో.. ఈ విషయం నేను చాలాసార్లు మనసులో అనుకున్నా. అదే అలా కలవరింతలో బయటికి వచ్చిందేమో..?!"

"విషయం అర్థమవగానే.. అమ్ములును చూడాలి.. ఆ కళ్లల్లో సంతోషం.. నేను ఎప్పటికీ తన వాడినే అన్న ఆనందం.. అయ్యో మాటల్లో చెప్పలేను. తన ముఖంలో అప్పుడు కనిపించిన భావాలను ఫ్రేమ్ చేయటం అస్సలు సాధ్యం కాదు.. అన్ని రకాల భావాలు ఒక్కసారిగా తనలో...."

అంతే అల్లుకుపోయింది తను.. తరువాత తను చేసింది.. నేను లాలస గురించి చెప్పింది తల్చుకుని పడి పడీ నవ్వింది.. ఇందాక బాధతో కన్నీళ్లు కార్చిన నా అమ్ములు కళ్లు.. ఇప్పుడు నవ్వి నవ్వి ఆనందబాష్పాలతో నిండిపోయాయి...

అలా నవ్వి నవ్వి అలసిపోయి.. చెప్పలేనంత నమ్మకంతో నాగుండెలపై వాలిపోయి, కలతల్లేని నిద్రలోకి హాయిగా జారుకుంది.

తన అనుమానం అనుమానమేగానీ, నిజం కాదనీ అర్థం చేయించటంతో నాక్కూడా ఎక్కడలేని ప్రశాంతత ఆవహించినట్లు అనిపించింది.

నా గుండెలపై హాయిగా బజ్జున్న అమ్ములు తలను నిమురుతూ... ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు...!!!

(అనుమానం అంటూ రాకూడదు.. ఒకవేళ వచ్చినా దాన్ని మొగ్గలోనే తుంచేయాలి. అలా చేసినప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. _ ఈ కథనం కూడా సరదాగా రాసిందే, ఎవరినీ ఉద్దేశించి కాదని మనవి.. )