Pages

Wednesday, 28 December 2011

నువ్వు లేని ఊరు.. నీ మాటల్లేని ఇల్లు…!!



 పొద్దుట్నుంచీ వచ్చే ప్రతి బస్సునూ
అందులో రాబోయే తన మనిషినీ
రెండు కళ్లు వెతుకుతూనే ఉన్నాయి
నిమిషాలు, గంటలు గడుస్తున్నా
రావాల్సిన మనిషి రాలేదు
రెండు కళ్ల వెతుకులాట ఆగనూ లేదు

సూర్యుడు నడినెత్తికి వచ్చినా
మనిషి రాలేదు, చూపులు ఆగలేదు
ఎట్టకేలకు…
రావాల్సిన మనిషి బస్సు దిగ్గానే..
రెండు కళ్లూ తృప్తిగా, సంతోషంగా
అటువైపు పరుగులు తీశాయి

పొద్దుట్నుంచీ ఎదురు చూస్తున్నా..
ఇప్పుడా రావటం….?
ప్రశ్నించాయి ఆ కళ్లు

అదెంటీ.. నేను ముందే చెప్పానుగా
ఈ టైంకే వస్తానని
మరెందుకలా పొద్దుట్నుంచీ చూడటం
అవతలి కళ్ల ఎదురు ప్రశ్న..?

నీకేంటి అలాగే చెబుతావ్…
మా ఆరాటం మాదీ..
నా రక్తంలో రక్తం నన్ను
చూసేందుకు వస్తుంటే
తొందరగా చూడాలని ఉండదా మరి..?

తిరిగి ఊరెళ్తుంటే…
అప్పుడే వెళ్లాలా అంటూ
అవే కళ్లు మళ్లీ వేడుకోలు
తప్పదు మరి.. మళ్లీ వస్తాగా అంటే,
భారంగా వర్షిస్తూ ఆ కళ్ల వీడ్కోలు

చాలా సంవత్సరాలు ఇలాగే…

కానీ ఈరోజు..
నా కోసం ఎదురుచూసే
ఆ రెండు కళ్ల కోసం
రోజుల తరబడీ ఎదురుచూస్తున్నా
ఆ కళ్ల జాడ కనిపించటం లేదు

ఎదురుచూపులు, వీడ్కోళ్లతోనే
అలసిపోయిన ఆ కళ్లు…
శాశ్వత విశ్రాంతి కోసం
రక్తంలో రక్తాన్ని వదిలేసి
అందరాని దూరాలకు
ఆనందంగా వెళ్లిపోయాయి

ఇప్పుడు నా కోసం
వెతుకులాడే కళ్లు
ఎదురుచూసే ఆ మనిషి
వేడుకోల్లు, వీడ్కోళ్లు
ఏవీ ఏవీ లేనే లేవు…

కనిపించకుండా పోయిన ఆ కళ్లు
ఎవ్వరికీ, ఎప్పటికీ కనిపించవు
అయినా…
కనిపించే తన ప్రతిరూపమైన నాకు
ఎప్పుడూ చూపునిస్తూనే ఉంటాయి…..!!


(నవంబర్ 7, 2009న అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించిన మా “నాన్న”గారికి కన్నీటితో…..)

{ఈ పోస్టు November 20, 2009న నా మరో బ్లాగు http://blaagu.com/kaarunya/ లో రాశాను. అయితే అక్కడ బ్లాగు నిర్వహణ బాగలేక పోయిన కారణంగా ఆ బ్లాగును అప్‌డేట్ చేయడం ఆపేశాను. చాలాసార్లు ఆ సైట్ ఓపెన్ కావడం లేదు. అందుకనే అందులోని నా పోస్టులన్నింటినీ ఈ బ్లాగులోకి ఇప్పటికే తరలించేశాను. అయితే ఈ పోస్టు మాత్రం ఈ బ్లాగులోకి మార్చేశాననుకుని మర్చిపోయా. ఈరోజు ఎందుకో వెతుకుతుంటే కనిపించింది. నా పాత బ్లాగులో ఈ పోస్టును చదివిన మిత్రులెవరైనా ఉంటే, మళ్లీ ఇక్కడ ఉంచినందుకు ఏమీ అనుకోకండి. ఇప్పటిదాకా చదవనివాళ్లు మాత్రం తప్పక చదవగలరు}

Saturday, 24 December 2011

హ్యాపీ హ్యాపీ బర్త్ డే టు యూ "శైలబాల"

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న "వెన్నెల్లో గోదావరి" రచయిత్రి... మా ముద్దుల చెల్లాయి "శైలబాల"కు బ్లాగ్ మిత్రులందరి తరపునా ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


చెల్లెమ్మా... నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... ఇవిగో ఇవన్నీ నీ కోసమే... 
చైలూ... చైలూ... మేం కూడా నీకు విషెష్ చెప్పేస్తున్నాం... చలేనా....... :)




 

చైలూ...... నీ కోసం ఇవి కూడా చెచ్చాం..... ఎంజాయ్....... :) :)





Friday, 23 December 2011

రాయలసీమ "గుత్తొంకాయ"

 
{రెండేళ్ల క్రితం నేను పనిచేస్తుండే ఆఫీసులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల వారి మధ్య వంటకాలకు సంబంధించి ఓ చిన్న పోటీ జరిగింది. ఈ పోటీలో భాగంగా దాదాపు 16 రకాల వంటకాలను అన్ని భాషలవారు వండారు. బాగా వండిన వంటకాలకు ప్రైజులిచ్చారు.
 
అందులో తెలుగువారి తరపున నేను వండిన ఈ వంటకం 3వ బహుమతిని గెలుచుకుంది. ఈ వంటకానికి కాంబినేషన్‌గా గోంగూర పచ్చడి, గీ వెజిటబుల్ బిర్యానీ కూడా ఆ రోజు వండాను. పాత ఫైల్స్ అన్నీ వెతుకుతుంటే ఇదుగో ఇలా నా చేతికి దొరికేసింది ఇక ఆలస్యం ఎందుకు మరి సీమ గుత్తొంకాయను రుచి చూడండి మరి...!!}

కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు... 1 కేజీ
టొమోటో... పావు కేజీ
ఉల్లిపాయలు... 200 గ్రాములు
పచ్చిమిర్చి... 5
వెల్లుల్లి... 2 గడ్డలు
అల్లం... 100 గ్రాములు
వేరుశెనగ పప్పు... 100 గ్రాములు
ఎండుకొబ్బరి... అర చిప్ప
పట్ట, లవంగం... తగినంత
నువ్వుల నూనె... పావు కేజీ
కరివేపాకు... సరిపడా
కొత్తిమీర... సరిపడా
కారం... సరిపడా
ధనియాలపొడి... సరిపడా
పసుపుపొడి... సరిపడా
ఉప్పు... తగినంత
ఆవాలు, జీలకర్ర, మెంతులు... సరిపడా

తయారీ విధానం :
ముందుగా వంకాయలను ముందువైపు నుండి నాలుగు చీలికలుగా (కాయ విడిపోకుండా) కోసి ఉప్పునీటిలో వేసుకోవాలి. వేరుశెనగపప్పు, ఎండుకొబ్బరి, పట్ట, లవంగాలను ముందు మెత్తగా నూరుకుని, అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బుకున్న పదార్థానికి కారంపొడి, ధనియాలపొడి, పసుపుపొడి, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మసాలా ముద్దను కోసి ఉంచుకున్న వంకాయలలో బాగా కూరాలి. ఇలా మొత్తం కాయలకు మసాలాముద్దను పట్టించిన తరువాత పావు గంటసేపు ఊరనివ్వాలి.



 తరువాత బాణలిలో సరిపడా నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులతో పోపు పెట్టుకుని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు, రెండుగా కోసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత వంకాయలను వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న క్రమంలోనే వంకాలపై ముక్కలుగా కోసుకున్న టొమోటోలను వేసి ఆవిరిపైనే ఉడకనివ్వాలి.

కొద్దిసేపటి తరువాత తగినన్ని నీళ్ళను పోసి కూరను బాగా ఉడికించాలి. గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేలా, నూనె పైకి తేలేలా కూర ఉడికిన తరువాత దానికి చింతపండు రసం పోయాలి. ఆపై కూరను మెల్లిగా కలియదిప్పి కాసేపు అలాగే ఉంచి... తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డించాలి. ఇది చపాతీ, ఫ్రైడ్ రైస్, వేడి వేడి అన్నం, వెజిటబుల్ రైస్, నేతి అన్నం లాంటి వాటికి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

(అన్నట్టు ఇదివరకు నేను మీ అందరికీ చెప్పినట్లుగా ఈ వంటకం కూడా శైలూకే ప్రేమతో అంకితం.......)


ఆరోజు నేను వండిన గోంగూర పచ్చడి, గీ వెజిటబుల్ రైస్ సిత్రాలివిగో.....



Tuesday, 20 December 2011

మా బహుమతికో బహుమతి...!!

 
 
 కొంతమంది పరిచయమే ఓ బహుమతి
ఆ బహుమతి దక్కడమే ఓ వరం
దాన్ని నిలబెట్టుకోవడమే ఓ తపం
అలా చేస్తేనే అవుతుంది బ్రతుకు ధన్యం

కొన్ని పరిచయాలెప్పుడూ
కొంతదూరమే మనతో వస్తాయి
మరికొన్ని పరిచయాలు
నమ్మకం నిలుచున్నంతదాకా
మరికొన్ని జీవితం కడదాకా

మనతో కడదాకా నడిచొచ్చే
వాళ్లనెప్పుడూ నమ్మవచ్చు
వాళ్ల ప్రేమలో నిజాయితీని
వాళ్ల ఆదరణలో ఆర్ధ్రతను
వాళ్ల అభిమానంలోని అనురక్తిని
వాళ్ల ఓదార్పులో నిస్వార్థాన్ని
అన్నింటినీ ఆస్వాదించొచ్చు
 
కష్టాల్లో వెన్నుచూపకుండా
మీకు మేం తోడున్నాం అంటూ
మన గెలుపును తమ గెలుపుగా
ఓటమిని తమ ఓటమిగా
సంతోషాన్ని తమ సంతోషంగా
మన మనసుకు, మమతకు
అద్దంలో ప్రతిబింబంలా నిలిచే
వాళ్లను చూసి గర్వపడొచ్చు

{అలా మా "వాడు" అని గర్వంగా చెప్పుకునేలా.. భగవంతుడు ఇచ్చిన ఓ గొప్ప బహుమతిగా మాకు దక్కిన మా "చిన్నా" పుట్టిన రోజు (డిసెంబర్ 21) సందర్భంగా మీ అందరి దీవెనలూ, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ....}
- మీ కారుణ్య

Monday, 19 December 2011

మా 'ఇంట్లో' ఓ 'కాంచన'........!!


ఎందుకో ఈరోజు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు.. అటూ, ఇటూ పొర్లుతూ, నిద్రపోయేందుకు ట్రై చేస్తున్నా..

ఈలోగా... "పిన్నీ..." నిద్ర పట్టడం లేదు.. ఎవైనా కబుర్లు చెప్పమ్మా..." అంటూ మావాడు వచ్చి లేపాడు.

"ఏం కబుర్లు ఉన్నాయి నాన్నా... నేనయితే ఏవేవో ఆలోచిస్తున్నా, నిద్ర పట్టడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు, నీకెందుకు నిద్ర పట్టడం లేదు.." అని అడిగా

"నేనేమీ ఆలోచించటం లేదు. ఎందుకో మరి నిద్రయితే రావటం లేదు పిన్నీ"

అది సరే అమ్మా... ఏదైనా పాట పాడు అన్నాడు

"పాటా, ఇప్పుడా.. టైం ఎంతయిందో చూశావా.. అంటూ గోడ గడియారంవైపు చూపించా.." అప్పుడు టైం సరిగ్గా 12 గంటలవుతోంది.

"ఏం పాట పాడాలంటే టైం చూసుకోవాలా ఏంటి.. పాడమ్మా"

"12 గంటలప్పుడు దయ్యాలు తిరుగుతుంటాయని అంటుంటారు అంతే కదా...?! నాకేమీ భయం లేదులే.. నువ్వు పాడాల్సిందే పిన్నీ" అన్నాడు మొండిగా

చుట్టూ చీకటి, ఇంటిపక్కన కిటికీకి దగ్గర్లో రావిచెట్టు, దానిపైన రకరకాల పక్షులు చిన్నగా శబ్దం చేస్తున్నాయి. గబ్బిలాలు వేలాడుతూ అదో రకమైన సౌండ్ చేస్తున్నాయి. నిజంగా దయ్యాల సినిమాలో సీన్ లాగా ఉంది పరిస్థితి. ఆ టైంలో మావాడు పాట పాడమనడం. నాకైతే ఎంత వణుకు పుట్టిందో...

"పాటా, లేదూ ఏమీ లేదు పోయి పడుకో నాన్నా" అన్నా

"నువ్వు పాడాల్సిందే.. లేకపోతే కాంచనను పిలుస్తా"

అస్సలే కొన్ని రోజులుగా కాంచన సినిమా ఎఫెక్ట్ తో ఉన్నా. కాంచన సినిమా చూసినప్పటినుంచి ఎందుకో ఇంతకుముందెప్పుడూ లేనంత భయంతో వణికిపోతున్నానంటే నమ్మండి. సరిగ్గా కారణం తెలీదుగానీ.. ఇది నిజం.

అది పసిగట్టిన మావాడు.. మాటిమాటికీ కాంచనలాగా ముఖంపెట్టి, గొంతుమార్చి భయపెట్టడం.. నేను భయపడుతుంటే ఎంచక్కా నవ్వుతూ కూర్చుంటున్నాడు.

చివరికి తను చెప్పింది వినకపోతే కాంచనను పిలుస్తా అనేంతగా తయారైంది పరిస్థితి. ఇదుగో ఇప్పుడూ అలానే బెదిరిస్తున్నాడు.

నేను ఏదో పాట పాడబోయా...

"అమ్మా.. ఇప్పుడుగానీ నువ్వు నిను వీడని నీడను నేనే"
అని పాడుండాలి. నిజంగా బెదిరిపోయుంటానేమో...... అన్నాడు. నిజంగా అలా అనుకోగానే భలే నవ్వొచ్చేసింది. పడిపడీ నవ్వాం ఇద్దరం... మేం ఇంతలా నవ్వుతుంటే, కంప్యూటర్ మోనిటర్‌లోకి తదేకంగా చూస్తూ, ఏదో చదువుతున్న మా ఆయనను చూసి ఇంకాస్త నవ్వాం. అయినా ఆయన లోకం ఆయనది....

"అరే నిన్ను భయపెట్టే ఛాన్స్ మిస్సయిపోయింది కదా చిన్నా" అంటూ మళ్లీ నవ్వా.

అలా, అలా కబుర్లు.... మరణం.. మరణం తరువాత జీవితం... పైకి టాపిక్ మారింది

"అది సరేగానీ... పిన్నీ చనిపోయిన తరువాత జీవితం ఉంటుందా...?"

"ఏమో..? నాకు తెలీదు...?"

"ఉంటుంది. స్వర్గం, నరకం కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. అదే మరణం తరువాతి జీవితం..." చెప్పుకుంటూ పోతున్నాడు

"నిజమా...?"

"అవును. కోర్కెలు తీరక అర్ధాంతరంగా మరణించినవాళ్లు ఇక్కడే భూలోకంలో మనతోపాటే తిరుగుతుంటారట. వాళ్లు అనుకున్నది జరగ్గానే, వెంటనే ఈ లోకం విడిచి వెళ్తారట" అంటున్న చిన్నాతో..

"అవును నిన్న రాత్రి నేను సినిమా చూస్తూ, నిన్ను పిలిచాను చూడు. సేమ్ ఇదే టాపిక్ తెలుసా..?"

"అవునా...? వెరీగుడ్ పిన్నీ... ఇప్పుడు నేను నీకు విషయాన్ని బాగా అర్థం చేయించవచ్చు
సో.. పిన్నీ... ఇప్పుడు నేను చెప్పొచ్చేదేమిటంటే.."

"అలా స్వర్గానికీ, లేదా నరకానికీ వెళ్లని వాళ్లంతా మనతోపాటు ఇక్కడే ఉంటుంటారన్నమాట..!"

"నిజ్జంగా.. నిజమా... అయితే..?!" నోరెళ్లబెట్టి అడుగుతున్నా..

నాలో ఆశ్చర్యంతో కూడిన భయాన్ని పసిగట్టిన మావాడు "అవును... ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే.. మన ప్రక్కనే కూర్చుని వింటుండవచ్చు. నిద్రపోతుంటే పక్కనే పడుకోవచ్చు. తింటున్నప్పుడు అవికూడా మనకు కంపెనీ ఇస్తుండవచ్చు. నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు.. ఇలా ప్రతి పనిలోనూ అవి కూడా ఉండి ఉండవచ్చు...." చెప్పుకుంటూ పోతున్నాడు

నిజం చెప్పొద్దూ... నాలో సన్నగా వణుకు ప్రారంభమైంది

దాన్ని కప్పిపుచ్చుకుంటూ "అయినా రాత్రిపూట ఇలాంటి విషయాలా చెప్పేది. ఇంకెలా నిద్రొస్తుంది" అన్నా కోపంగా

"నిజం ఎప్పుడు చెప్పినా ఒకటే పిన్నీ... నువ్వు ఇలా భయం దాచుకుంటూ, కోపం నటిస్తుంటే పక్కనే ఉండే దయ్యాలు చూస్తూ, నవ్వుకుంటూ ఉంటాయి. వాటిముందు నువ్వు చులకన అయిపోవద్దు... ధైర్యంగా ఉండాలి. సరేనా...?!" అంటూ అప్పటిదాకా అణచిపెట్టుకున్న నవ్వును ఇక ఆపుకోలేక పడి పడీ నవ్వాడు.


"నువ్వలా భయపడుతుంటే..
ఇంకొన్ని నిజాలు చెప్పాలనిపిస్తోంది పిన్నీ..."

నేనూ నవ్వేందుకు ట్రై చేస్తూ... "ఇంతకంటే ఇంకా నిజాలున్నాయా..?! వూ.. కానివ్వు..."

"ముఖ్యంగా.. పగలంతా మనకు కేటాయించిన దెయ్యాలు.. మన ఇంటిని రాత్రిపూట వాడుకుంటాయి. అలా అవి వాడుకుంటున్నప్పుడు మనం మధ్యలో ఎంటరయితే భలే చిరాకుపడతాయి తెలుసా...?!"


"ఏంటీ... మన ఇంటిని వాడుకుంటాయా...?"

 

"అవును.. ఇందులో వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే... నువ్వు రాత్రిపూట నిద్ర మత్తులో బాత్రూంకు (నిద్ర మధ్యలో బాత్రూంకి వెళుతూ చాలాసార్లు కాళ్లకి ఏదో ఒకటి తగులుకుని పడటం బాగా అలవాటు. అది చూసి చాలాసార్లు ఇంట్లోవాళ్లు నన్ను వెక్కిరిస్తుంటారు. దాన్ని మావాడు ఇలా గుర్తుచేసి ఆటపట్టిస్తున్నాడన్నమాట :) ) వెళుతుంటావు కదా... అప్పటికే అవి పాపం క్యూలో ఉంటాయి. అది తెలీనీ నువ్వు వాటన్నింటికంటే ముందుకెళతావు. అది చూసిన ఆ దెయ్యాలు నీపై కక్ష కడతాయిలే ఉండు..." నవ్వుతూ చెబుతున్నాడు

"అవునా...?! ఇది మరీ దారుణం.. మన ఇంటి బాత్రూం వాడుకునేందుకు అవి పోటీపడతాయా..?"

"అవును... మన జనాభాలాగే, వాటి జనాభా కూడా ఎక్కువే కదా.. అలాంటప్పుడు ప్రతి ఇంట్లోనూ అవి ఉన్నా, మనలాగా ఇద్దరు ముగ్గురు ఉండరు. చాలామందే ఉంటారు. అలాంటప్పుడు ఇంత చిన్న ఇల్లు సరిపోదు కాబట్టి, అవి వంతులవారీగా పనులు చేసుకుంటుంటాయేమో.......?!"


అదంతా నిజంగా జరుగుతున్నట్టు చెప్పుకుపోతున్నాడు మావాడు.

నాకైతే నిజమో, అబద్ధమో తెలీని పరిస్థితి...

అది నిజమే.. కళ్లముందు జరుగుతుందన్నంతగా వర్ణించి, వర్ణించి చెబుతూ, నవ్వుతూ.. నన్ను పరిశీలిస్తున్నాడు

ఆశ్చర్యమూ, నిజమేనేమోనన్న ఖంగారూ, అదో రకంగా ముఖంపెట్టి నవ్వాలో, కోపగించుకోవాలో తెలీని స్థితిలో ఉన్న నన్ను భయపెట్టడం తేలికేనని అర్థమైంది వాడికి. అయితే పాపం భయపడుతోంది. మరీ ఎక్కువగా భయపెడితే ఎక్కడ జ్వరం వస్తుందేమో అనుకున్నాడో ఏంటో.. ఆ రోజుకి అలా వదిలేశాడన్నమాట.

"సో... ఈ దయ్యాల జీవితం గురించి మరోసారి వివరంగా చర్చించుకుందాం పిన్నీ... ఇప్పుడు నాకు భలే నిద్రొస్తోంది.. నేను వెళ్లి పడుకోకపోతే, నా బెడ్‌ను అవి ఆక్రమించేస్తాయి.
వెళ్తాను... బాబాయ్ ఇక చదివింది చాలు, వచ్చి పడుకోండి" అన్నాడు నవ్వుతూనే....

నేను తనవైపు గుర్రుగా చూస్తుంటే... "పిచ్చి పిన్నీ..... నేనేదో నిన్ను ఆటపట్టించాలని చెబితే నువ్వు నిజమే అనుకుని నమ్మేస్తున్నావా ఏంటి...? ఏం భయపడకు.. అస్సలు దెయ్యాలు లేవు.. ఒకవేళ నాకు కనిపిస్తే అప్పుడు చెబుతాలే...! హాయిగా నిద్రపో..." అన్నాడు.


"ఏంటి దయ్యాలు నీకు కనిపిస్తేనా....?!
"

"అయ్యో... జోక్ చేశానమ్మా... నాకు కనిపించటం ఏంటి.. అసలు అవుంటే కదా...?!"


 "అదీ.. అలారా దారికి... ఇంకోసారి ఎప్పుడైనా నిద్ర రాలేదు.. ఏవైనా మాట్లాడు అని నా దగ్గరికి రా చెబుతా నీ సంగతి...?" అంటూ బెదిరించా

"అమ్మా... తల్లీ... వదిలేయ్... లేకపోతే......"

"లేకపోతే....?" రెట్టించాను

"ఆ.. ఏం లేదు.. గుడ్ నైట్ పిన్నీ, బాబాయ్..." అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు.

లేకపోతే... అని ఆగిపోయిన చిన్నా... దెయ్యాల్ని పిలుస్తా అనబోయి... మళ్లీ భయపెట్టడం ఎందుకని ఆగిపోయాడని నాకు తెలుసు.

తను చెప్పింది నిజం కాదని తెలిసినా...... మనసులో ఏదో మూల ఒక డౌట్... అలా ఆలోచిస్తూనే నిద్రపోయా...

మరుసటి రోజు అందరూ పనులకు వెళ్లిపోయిన తరువాత.. అసలు పగలు టైంలోనే నాకు ఆ దయ్యాలు నా పక్కనే ఉన్నాయేమో అనిపించేది. బాత్రూంకి వెళితే, నా ముందు క్యూ ఏమైనా ఉందా అని పరిశీలనగా చూస్తూ వెళ్లడం... వంట గిన్నెల్లో వండినది ఏమైనా ఖాళీ అయ్యిందేమో చూడటం...... కుర్చీల్లో ఎవరైనా కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుందేమోనని చూడటం... గ్లాసులో నీళ్లు వంపినవి అలానే ఉన్నాయా, కొంచె ఖాళీ అయ్యాయేమోనని పరిశీలించటం....
లాంటివి నాకు తెలీకుండానే జరిగిపోయాయి.

నిజం చెప్పొద్దూ....... ఇప్పుడు కూడా నేను ఇదంతా రాస్తుంటే అవి నా పక్కన కూర్చుని చదువుతున్నాయేమో అనిపిస్తోంది...


"ఇన్నాళ్లూ కాంచన ఎఫెక్ట్.. ఇప్పుడేమో ఇంట్లో దెయ్యాల ఎఫెక్ట్..." ఏంటో మరీ ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతే ఎలా చెప్పు తల్లీ..... అంటూ నా మనసు కూడా నన్ను చూసి నవ్వుకుంటోంది మా అబ్బాయిలా....
LOL

Wednesday, 23 November 2011

రెండేళ్లు గడిచిపోయాయి... ఇంకా ఎన్నేళ్లో ఇలా...!!



"నువ్వు ఓ జ్ఞాపకానివా?
కాదు
నిజానివి...
జ్ఞాపకాలతో ఊపిరి పోస్తున్నావు
అందుకే నువ్వు నిజానివి"

ఈ మధ్య మావూరికి బస్‌లో వెళ్తుంటే అప్రయత్నంగా నా కళ్లు ఓ చోటికి పరిగెత్తాయి. కనురెప్ప పాటులో ఆ చోటు కళ్లముందు నుంచి దూరమైంది. కానీ నా ఆలోచనలు మాత్రం ఎక్కడికో వెళ్లిపోయాయి. ఎందుకంటే మా నాన్న మాకు దూరమైంది ఇందాక చూసిన ఆ చోటు నుంచే. అందుకే అప్పటినుంచీ ఆ చోటును చూస్తే తట్టుకోలేనని ఆ దార్లో వెళ్తున్న ప్రతిసారీ కళ్లుమూసుకుని కూర్చొనేదాన్ని. అయితే ఈసారి మాత్రం అనుకోకుండా చూసేశాను.

అంతే.. నాన్న హాస్పిటల్‌‌లో చేరటం.. బాగా మాట్లాడుతూ ఉన్న మనిషికి వెంటిలేటర్లు పెట్టడం.. ఆపై మాట పడిపోవడం... స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అటూ, ఇటూ తీసుకెళ్లటం... లాంటివన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తొచ్చి పిచ్చిగా ఏడ్చేశాను. ఆ మాయదారి హాస్పిటల్ మా ఆయన్ని తీసుకెళ్లిపోయిందంటూ అమ్మ రోదించటం గుర్తొచ్చి, కళ్లు అలా వర్షిస్తూనే ఉన్నాయి. నాన్నగారి 2వ వర్ధంతి (నవంబర్ 7) జరిపేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరగటం యాదృచ్ఛికం.

నాన్న దూరమై అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ రెండేళ్లు ఎంత భారంగా గడిచాయో... ఇంకా ఎన్నేళ్లు ఇలా గడపాలోనని ఒకటే ఆవేదన. ఈ రెండేళ్లలో నాన్న ఉన్నప్పటి పరిస్థితికీ, ఆయన లేనప్పటి పరిస్థితికీ చాలా స్పష్టమైన తేడా. బాధలోను, సంతోషంలోను, కష్ట సుఖాల్లోనూ.. ఇలా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా చాలా వెలితి. నాన్న లేరన్న వెలితి. ఆయనే ఉంటే.. ఇలా చేసేవారు, అలా చేసేవారు.. అనని రోజు లేదు.


ముఖ్యంగా అమ్మ ముఖంలో ఎప్పుడూ వెలితే. పిల్లల్లోనే మా ఆయన్ని చూసుకుని రోజులు గడిపేస్తున్నానని ఆమె మా బంధువులతో చెబుతున్నప్పటికీ తన ముఖంలో నాన్న లేని వెలితి. అది ఎప్పటికీ తీరేది కాదు.. అది ఆమెకూ, మాకూ అందరికీ తెలిసిందే. అయినా నాన్నకోసం, ఆయన ప్రేమ కోసం మా జీవితాల్లో తపన ఆగదు.

నాన్న రెండో వర్ధంతి రోజున తన సమాధి వద్దకు వెళ్తున్నప్పుడు ఒకాయన మాకు ఎదురుపడ్డాడు. ఆయనెవరో నాకు సరిగా గుర్తులేదు. కానీ మా అమ్మ, చిన్నాన్న, నానమ్మ గుర్తుపట్టి పలుకరించారు. ఆయన చాలా సంతోషంగా బదులిచ్చాడు. "అదిసరేగానీ ఏంటి అందరూ పూజ సామగ్రి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు. గుడికా..?" అని అడిగాడు. గుడికి కాదు, మావారి సమాధి వద్దకు వెళ్తున్నామని అమ్మ చెప్పింది. అంతే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆ మధ్య వయస్సు ఆయన అంతే పొగిలి పొగిలి ఏడ్చాడు. "నిజమా..? అన్న చనిపోయాడా..? ఇన్నాళ్లూ కనిపించకపోతే ఆయన అంగడి దగ్గర లేనప్పుడే నేను అక్కడికి వెళ్తున్నానేమో.. ఎప్పుడైనా ఇంటికెళ్లి పలుకరించి రావాలని అనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందా.. అంటూ ఒకటే ఏడుపు".

నాన్న పోయి రెండు సంవత్సరాల తరువాత కూడా తన కోసం ఏడ్చే మనుషులను సంపాదించుకున్న నాన్న మంచితనానికి లోలోపలే ఎంతగానో సంతోషించాను. నిజం చెప్పాలంటే మొదటి వర్ధంతి రోజున ఉన్న దుఃఖం ఇప్పుడు మాలో లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే ఇంకిపోయాయా అన్నట్టుగా మా కళ్లల్లో కన్నీటికి కొరత. అయినా భరించలేని బాధ మాత్రం ఉంటుంది. ఆయన లేరన్న నిజం ఎప్పుడూ గుండెల్ని పిండేస్తుంటుంది.
కానీ ఇన్నాళ్ల తరువాత కూడా ఆయన కోసం కళ్లనీళ్లు పెట్టుకునేవారు ఉన్నారని మాకు అప్పుడే తెలిసింది.

ఆ రోజు రాత్రే అమ్మతో నేను ఎవరమ్మా ఆయన నాన్న కోసం అంతలా ఏడ్చాడని అడిగితే.. వేరే ఊరికి చెందిన అతను మనకు బంధువేమీ కాదని, కేవలం పూల అంగడి దగ్గరకు పూలు కొనేందుకు వస్తుంటాడని అమ్మ చెప్పింది. ఆయనే కాదు, అంగడి దగ్గరకు చాలామంది వస్తుంటారనీ వాళ్లకు మీ నాన్న పోయిన సంగతే తెలియదని, ఇప్పటికీ నమ్మనే నమ్మరని.. ఆయన ఇంటి దగ్గర ఉండి ఉంటాడులే నువ్వు అబద్ధం చెబుతున్నావని నాతో వాదిస్తుంటారని అమ్మ చెప్పింది.

ఎవరైనా తెలిసినవాళ్లు పోయారంటే, అయ్యో.. అని బాధపడటం సహజం. కానీ ఏడుస్తున్నామంటే, వారితో మనకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని తెలుపుతుంది. మనుషులను సంపాదించుకోవటం, వారి మనసులను గెల్చుకోవటం నాన్నకున్న గొప్ప గుణం. అందుకేనేమో తనంటే అభిమానించేవారినే కాదు, ఏడ్చే వారిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆయనలా,, తన పిల్లలమైన మేము మా కోసం ఏడ్చే, మేము లేరని బాధపడే నలుగురినైనా సంపాదించుకోగలమా..? అనే సందేహం చాలాసార్లు వస్తుంటుంది నాకు.

నాన్న 2వ వర్థంతి రోజున... "మనకు ఉన్నంతలో పదిమందికి సాయం చేయాలని, అన్నార్తులను ఆదుకోవాలని ఎప్పుడూ చెప్పే ఆయన కోరిక మేరకు....." ఆ రోజున అన్నదానం చేశాం. రోజంతా ఆయన జ్ఞాపకాలతోనే గడిపేశాం. ఆయన మాతో కలిసి తీయించుకున్న ఫొటోలను డీవీడీగా రూపొందించి ఆ ఫొటోలను చూస్తూ, మధ్య మధ్యలో అమ్మ, నానమ్మ ఆయన గురించి చెప్పిన కబుర్లతో.. తీపి, చేదు జ్ఞాపకాలతో రోజును వెల్లదీశాం.


పిల్లలమైన మాకు కన్నీళ్లు ఇంకిపోయినా, అమ్మ కళ్లల్లో మాత్రం ఆ కన్నీటి పొర ఎప్పటికీ చెరగదని మాకు ఆ రోజే ఇంకా స్పష్టంగా అర్థమైంది. ఆయన గురించి తల్చుకుంటే చాలు ఆమె కళ్లు వర్షిస్తూనే ఉంటాయి. ఏడుస్తూనే జ్ఞాపకాలను చెప్పుకుంటూ వెళ్లేది.

అలాంటి జ్ఞాపకమే ఒకటి... "మాకు పెళ్లయిన కొత్తలో కూలిపనులు చేసి మీ నాన్న కూడబెట్టిన డబ్బుతో ఓ రేడియో కొన్నాం. అప్పట్లో రేడియో కొనటం అంటే చాలా గొప్ప. రేడియో కొన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఖాళీగా ఉన్నప్పుడే కాదు, కూలి పనులకు వెళ్లేటప్పుడు కూడా దాన్ని వెంట తీసుకెళ్లి పాటల్ని వినేవాళ్లం. పాటలు రాని టైంలో మిగతా ఏ ప్రోగ్రాములు వచ్చినా వినేవాళ్లం.


ముఖ్యంగా మీ నాన్నకు వార్తలంటే చాలా ఆసక్తి. వార్తలు వస్తున్న సమయంలో ఏమైనా చిన్న శబ్దం చేసినా సరే, భలే కోపగించుకునేవారు. ఓసారి వార్తలు వస్తున్న టైంలో గమనించకుండా ఏదో మాట్లాడినందుకు కొట్టేశారు కూడా. అందుకే వార్తలు వస్తున్నాయంటే నేను దూరంగా జరిగిపోతా.

రేడియోలో పాటలు వస్తుంటే భలే ఉత్సాహంగా వింటూ, పాడేవారు ఆయన. నాటికలు, జానపద గేయాలు ఇలా ఒకటేమిటి అన్నీ ఆసక్తిగా వినేవాళ్లం. ఇలా ఒకరోజు ఆయన నన్ను 'రేడియో కడపలో పెట్టు'. అని అన్నాడు. రేడియో వినటమేగానీ అందులో ఏయే స్టేషన్లు ఉంటాయో నాకు తెలీదు. అలాంటిది కడపలో పెట్టు అనే సరికి రేడియో తీసుకొచ్చి సరిగ్గా ఇంటిగడపలో పెట్టేశాను. (మావూరి యాసలో గడపను, కడప అని కూడా అనేవాళ్లు..).


అది చూసి మీ నాన్న పడి పడీ నవ్వారు. నాకు అర్థంకాక ఉడుక్కుంటుంటే రేడియోను కడప స్టేషన్‌లో పెట్టమని చెబితే, నువ్వేంటి గడపమాను మీద తెచ్చి పెట్టావు అని ఫకఫకా నవ్వుతూ చెప్పారు. ఆ స్టేషన్ల గోల నాకు అర్థం కాక నేను కూడా నవ్వాను" అంటూ అమ్మ సంతోషం, బాధ కలగలసిన గొంతుతో చెబుతుంటే కళ్లార్పకుండా ఆమెనే చూస్తూ, మేం పుట్టకముందు అమ్మా, నాన్న ఎలా ఉండేవాళ్లో ఊహించుకుంటూ ఎంతగా మురిసిపోయామో.... ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలో ఆమెకు.... మాక్కూడా...

ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమేనా..? ఇవి మా జీవితాలు.. అమ్మా, నాన్నలతో పెనవేసుకున్న తిరిగిరాని అనుభూతులు.

నాన్నా...!! నువ్వు దూరమై రెండేళ్లు కాదు... మరెంతకాలం గడిచినా... మేము ఉన్నంతవరకూ నువ్వూ మాతోనే జీవించి ఉంటావు. మేము లేకపోతేనే నువ్వూ మాయమయ్యేది.. దూరమయ్యేది.. మేమున్నంతవరకూ నువ్వు మృత్యుంజయుడవు. నీ చల్లని ఆశీర్వాదాలు ఉన్నంతవరకూ మేమూ చిరంజీవులమే...!!


(నాన్నగారి మొదటి వర్థంతి జ్ఞాపకాల కోసం ఇక్కడ చూడండి)

[2009 నవంబర్ 7వ తేదీన మాకు దూరమైన నాన్న గారి 2వ వర్థంతి సందర్భంగా ఆ రోజునే ఒక పోస్టు పెట్టాలని అనుకున్నా. కానీ ఇంటర్నెట్ ప్రాబ్లెంవల్ల కుదరలేదు. ఆ తరువాత వర్థంతి కార్యక్రమాల కోసం మావూరు వెళ్లటంవలన ఇప్పటిదాకా కుదరలేదు. అందుకే కాస్త ఆలస్యంగా పోస్టు చేయాల్సి వచ్చింది].

Tuesday, 11 October 2011

Monday, 26 September 2011

నా కలలన్నీ వెచ్చనివే...... కానీ....?!


నా కల
తిరిగిరాని బాల్యం కోసం
అమ్మమ్మ చెప్పే కథల కోసం
తాతయ్య తెచ్చే మిఠాయిల కోసం
పంట కాలువల్లో… యేటినీళ్ళలో
అమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసం
తమ్ముళ్లతో చేసిన అల్లరి కోసం
నాన్న చెంపపై ఇచ్చిన గుర్తుల కోసం
అదే చెంపపై ఇచ్చిన ముద్దుల కోసం

అమ్మ ముఖంలో నవ్వు కోసం

నా కల
తుపాకులు లేని రాజ్యం కోసం
యాసిడ్ దాడుల్లేని రోజు కోసం
నిజమైన రాజకీయాల కోసం
ప్రశాంతంగా బ్రతికే జనాల కోసం
ఎళ్లవేళలా పరితపించే శాంతి కోసం

నా కల
స్వార్థం లేని మనుషుల కోసం
కల్మషం లేని నవ్వుల కోసం
ఎల్లలు లేని సంతోషం కోసం
బతుకంతా పెనవేసే స్నేహం కోసం
చివరిదాకా అంటిపెట్టుకునే ప్రేమ కోసం

నా కలలు
వెచ్చనివే… కానీ తడిగా ఉంటాయి
ఊహలే… కానీ సృజనాత్మకమైనవి
జ్ఞాపకాలే… కానీ ఉల్లాసాన్నిస్తాయి
సాధారణమైనవే… కానీ ఆలోచింపజేస్తాయి